‘ఆత్మగౌరవం’ దక్కలేదు..! | Not finilzed the awards self-respect | Sakshi
Sakshi News home page

‘ఆత్మగౌరవం’ దక్కలేదు..!

Published Sun, Sep 27 2015 2:58 AM | Last Updated on Sat, Jul 7 2018 2:48 PM

‘ఆత్మగౌరవం’ దక్కలేదు..! - Sakshi

‘ఆత్మగౌరవం’ దక్కలేదు..!

- దరఖాస్తులందుకుని ఏడు నెలలు
- అతీగతీలేని పురస్కారాలు
సాక్షి, విశాఖపట్నం :
వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన వారికి ‘ఆత్మగౌరవ’ పురస్కారాలు దక్కడం లేదు. అర్హులను ఎంపిక చేసి వారికి ప్రదానం చేయడానికి ప్రభుత్వానికి తీరిక దొరకడం లేదు. సాహిత్యం, లలితకళలు, వైజ్ఞానిక, సామాజిక, క్రీడా, ఇంజినీరింగ్ రంగాల్లో విశేష కృషి చేసిన ఆరుగురికి ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తుంది. ఈ పురస్కారం కింద రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రాన్ని ఇస్తుంది. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ప్రతిభా రాజీవ్ పురస్కారం’ పేరిట వీరికి ఏటా అవార్డులను అందజేశారు. వైఎస్ మరణానంతరం వీటికి గ్రహణం పట్టింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిభా రాజీవ్ పురస్కారం పేరును ‘తెలుగు ఆత్మగౌరవ పురస్కారం’గా మార్చేసింది.
 
ఏడు నెలలు గడుస్తున్నా...
ఈ ఏడాది 2011, 2012, 2013 సంవత్సరాలకు తెలుగు ఆత్మగౌరవ పురస్కారాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిబ్రవరి 28లోగా వాటిని సమర్పించు కోవడానికి గడువిచ్చింది. తగినన్ని దరఖాస్తులు రాకపోవడంతో మరో వారం రోజులు గడువు పొడిగించింది. ఇలా విశాఖ జిల్లా నుంచి ఆయా రంగాల్లో సేవలందించిన సుమారు 80 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించేందుకు ప్రభుత్వం సమాచార శాఖ కమిషనర్, అదనపు డెరైక్టర్, ఇద్దరు ప్రాంతీయ సమాచార ఇంజినీర్లతో ఓ సబ్‌కమిటీని నియమించింది. ఈ సబ్ కమిటీ అర్హులను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపుతుంది.

కానీ ఆయా రంగాల్లో లబ్ధప్రతిష్టులైన వారు దరఖాస్తు చేసుకుని ఏడు నెలలు గడుస్తున్నా ఎవరిని ఎంపిక చేశారో, ఎప్పుడు పురస్కారాలిస్తారో, అసలు ఇస్తారో? ఇవ్వరో కూడా ప్రభుత్వం తేల్చలేదు. దీనిపై స్పష్టతనిచ్చే వారూ లేరు. గతంలో ఈ పురస్కారాలను ఉగాది, దసరా, రాష్ట్ర అవతరణ దినోత్సవాల  వేళ హైదరాబాద్‌లో ప్రదానం చేసేవారు. ఈ పురస్కారాలకు ఎంపికైన వారికి ముందుగా సమాచారం ఇచ్చేవారు. నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధాని (అమరావతి)కి శంకుస్థాపన జరిగే అక్టోబర్ 22 నాడైనా తమకు తెలుగు ఆత్మగౌరవ పురస్కారాలు అందజేస్తారన్న గంపడాశతో వీరు ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement