నాడు వైఎస్... నేడు జయ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాల్లో సారూప్యతలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ రెండో పర్యాయం ముఖ్యమంత్రులుగా ఉండగానే కన్నుమూశారు. రెండోసారి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే వీరిద్దరూ తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయదుందుభి మోగించడంతో మే 23న జయలలిత వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళనాడులో వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఘనత సాధించారు. ఐదు నెలలు గడవక ముందే అనారోగ్యం బారిన పడి 'అమ్మ' శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. మొత్తం ఐదుసార్లు ఆమె సీఎం పీఠాన్ని అధిష్టించారు.
2009 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మే 20న సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదానికి గురై హఠాన్మరణం పాలయ్యారు. సీఎం పదవిని చేపట్టి నాలుగు నెలలు గడవక ముందే మహానేత కన్నుమూశారు.