ఇద్దరూ ఇద్దరే..!
హైదరాబాద్: దేశ రాజకీయాల్లో ఆ ఇద్దరిదీ చెరగని ముద్ర. వ్యక్తిత్వం, పాలనదక్షతలోనూ తమదైన శైలిలో ముందుకు సాగారు. సమకాలిన రాజకీయాల్లో మార్గదర్శకులుగా నిలిచారు. చివరకు మరణంలోనూ వారిద్దరూ ఒకే తీరుగా సాగిపోయారు. వారే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ‘పురచ్చితలైవవీ’ జయలలిత. వీరిద్దరి వ్యక్తిత్వంలోనూ, పాలనలోనూ ఎన్నో సారూప్యాలు ఉన్నాయి. అనుకున్నది సాధించే వరకు మడమతిప్పని నైజం, నమ్మినదాని కోసం ఎందాకైనా వెళ్లడానికి సిద్దపడే తత్వం వీరిద్దరి సొంతం.
తమిళనాడు అసెంబ్లీలో తనకు అవమానం జరిగినప్పడు... ముఖ్యమంత్రి అయ్యాకే శాసనసభలో మళ్లీలో అడుగుపెడతానని శపథం చేసి నిలుపుకున్నారు జయలలిత. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని వైఎస్సార్ కడదాకా అమలు చేసి మాటమీద నిలబడ్డారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వైఎస్సార్, జయలలిత ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, 108, 104 సేవలు, పావలా వడ్డీకే రుణాలు, 2 రూపాయలకే కిలో బియ్యం పథకాలతో మహానేత జనం గుండెచప్పుడుగా మారారు. ‘అమ్మ’ పేరుతో జయలలిత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి పేదల పాలిట దేవతగా నిలిచారు.
ఇరుగుపొరుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్, జయ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. 2004లో సీఎం పదవిని చేపట్టిన వైఎస్సార్ ను జయలలిత ప్రత్యేకంగా అభినందించారు. 2005, సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగిన ఎన్‌ఐసీ సమావేశంలో పాల్గొన్న ఇరువురు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై వీరిద్దరూ సామరస్యపూర్వక ధోరణిలో ముందుకు సాగారు. రెండో పర్యాయం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే వీరిద్దరూ కన్నుమూయడం గమనార్హం.