ప్రభుత్వ భవనాల నుంచి వసూలుకాని పన్ను
పేరుకుపోతున్న బకాయి రూ.43.77కోట్లు
వసూలు మాతరం కాదంటున్న అధికారులు
ఆర్థిక సంక్షోభంలో పురపాలక సంఘాలు
చిత్తూరు: ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరించే మున్సిపాలిటీ అధికారులు.. ప్రభుత్వశాఖల నుంచి బకాయిలు వసూలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓ ఏడాది పన్ను కట్టలేకపోతే ప్రజల ఇంటి ముందు దండోరా వేయించడం, కొళాయి కనెక్షన్ తీసి ముక్కు పిండి వసూలు చేసే మున్సిపల్ అధికారులు సర్కారు చెల్లించాల్సిన పన్నులు ఏళ్ల తరబడి పెం డింగ్‌లో ఉన్నా చేష్టలుడిగి చూస్తున్నారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలతో అధికారులకు పెద్ద పని లేకుండా పోయింది. వీటికి భవన యజమానులు పక్కాగా పన్నులు చెల్లిస్తున్నారు. కాబట్టి దర్జాగా వసూలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ భవనాలైతే.. బకాయిల వసూలుకు చుక్కలు కనబడుతున్నాయి. ప్రభుత్వం నుంచి నామమాత్రంగా వస్తున్న నిధులతో మున్సిపాలిటీలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. సిబ్బందికి వేతనాలు చెల్లించడమే గగనంగా మారిం ది. జిల్లావ్యాప్తంగా తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ భవనాల అద్దె సుమారు రూ.26 కోట్లు వసూలు కా వాల్సి ఉంది. దా దాపుఅన్ని శాఖలు అంతో ఇంతో బకాయిలు ఉన్నాయి. టీటీడీ అయి తే శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసంల పన్ను రూ. 17 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ అతిథి గృహాల్లో ఉండాలంటే రూ.200 నుంచి రూ.1000 వరకు భక్తుల నుం చి వసూలు చేస్తున్నారు. అయినా తిరుపతి కార్పొరేషన్‌కు పన్ను కట్టడానికి టీటీడీకి చేతులు రావడం లేదు.
దండిగా ఆదాయం ఉన్నా...
ప్రభుత్వానికి వివిధ రూపాల్లో దండిగా ఆదాయం ఉన్నా ప్రభుత్వ భవనాల పన్నులు మాత్రం సక్రమంగా చెల్లించడం లేదు. వివిధ పురపాల సంఘాల నుంచి పన్ను బకాయిలు రూ.25.47 కోట్లు ఉంటే తిరుపతి కార్పొరేషన్‌కు టీటీడీ చెల్లించాల్సిన బకాయిలు మాత్రమే రూ.17 కోట్లుగా ఉంది. మిగతా పురపాలక సంఘాల్లో వాటి స్థాయిని బట్టి భారీగానే బకాయిలు ఉన్నాయి. అధికారులు పలుమార్లు కమిషనర్లతో మాట్లాడినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వ శాఖలకు అనేక రకాలుగా నిధులు వస్తున్నాయి. వాటినంన్నిటినీ అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పనుల పేరుతో దిగమింగుతున్నారు. అంతే తప్ప పన్నుల చెల్లింపులో కార్యాచరణ శూన్యం. టీటీడీకి వచ్చే ఆదాయాన్ని గమనిస్తే ఒక్కరోజుకు సుమారు రూ.3 కోట్లు వస్తుంది. వీటిని అనేక ధార్మిక పనులకు ఖర్చు చేయడం సరైన పనే. అయితే ఇంత ఆదాయం వస్తున్నా చిన్నపాటి మొత్తం చెల్లించకుండా మొండికేయడం విమర్శలకు దారితీస్తోంది. మున్సిపాలిటీలు వీధిదీపాల విద్యుత్ బిల్లులు నిధుల కొరతతో చెల్లించలేకపోతుండటంతో ఆ రెండు శాఖల మధ్య వివాదం రాజు కుంటోంది. ‘మీరు పన్ను చెల్లిస్తే విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని చెప్పడం.. వారు ససేమీరా అంటుండంతో రగడ రాజుకుంటోంది.
టీటీడీ చెల్లించాల్సింది రూ.33 కోట్లు..
తిరుపతి కార్పొరేషన్‌కు వడ్డీతో కలిపి సుమారు.33 కోట్ల ఆస్తి పన్నును టీటీడీ చెల్లించాలి. ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి మాధవం, విష్ణునివాసం, శ్రీనివాసానికి పన్నులు చెల్లించబోమని టీటీడీ కోర్టుకు వెళ్లింది. భక్తులకు ఉచితంగా వసతి కల్పించలేదు కాబట్టి కచ్చితంగా పన్నులు చెల్లించాల్సిందేనని తిరుపతి కార్పొరేషన్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.