మచిలీపట్నం : ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన 100 రోజుల ప్రణాళిక నిధుల లేమితో కొట్టుమిట్టాడింది. పంచాయతీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం పనులు చేయడానికి అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో కాగితాలపై తప్ప క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా జరగకపోవటం గమనార్హం.
మొక్కలు నాటమన్నారు.. ఒక్కటీ ఇవ్వలేదు!
మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచించినా ఒక్క పంచాయతీకి కూడా మొక్కలు ఇవ్వలేదని ఆయా పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు చెబుతున్నారు. మొక్కలు కావాలని ఇండెంట్ పెట్టినా ఇంతవరకు రాలేదని వారు తెలిపారు. మేజర్ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేసేందుకు కార్మికులతో పాటు ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. మైనర్ పంచాయతీల్లో ఈ వెసులుబాటు లేకపోవటంతో పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులు జరగలేదు. మైనర్ పంచాయతీల్లో డ్రెయిన్లలో పూడికతీత నామమాత్రంగానే జరిగింది.
నిధులు లేకుండా పనులు ఎలా...
పంచాయతీల్లో వంద రోజుల ప్రణాళిక అమలుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులుృవిడుదల చేయకపోవటంతో ఒక్క పనీ జరగలేదు. చేతిపంపులు, కుళాయిలు, పైప్‌లైన్లు నూరుశాతం మరమ్మతులు చేయాలని చెప్పినా నిధుల లేమి కారణంగా ఈ పనులు చేయలేదు. కంప్యూటర్లకు సంబంధించి పరికరాలు కొనుగోలు చేయాలని సూచించినా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవటంతో ఆ ప్రయత్నమే జరగలేదు. పంచాయతీల్లోని రోడ్లకు మరమ్మతులు చేయాల్సి వస్తే ఆయా నివేదికలను పంపాలని ప్రభుత్వం కోరింది. పంచాయతీల నుంచి నివేదికలు వెళ్లినా నిధులు విడుదల కాకపోవటంతో మరమ్మతులు జరగలేదు.
అన్ని పంచాయతీల్లో వీధి లైట్లను నూరుశాతం వెలిగించాలనే నిబంధన విధించినప్పటికీ నిధుల కొరత కారణంగా అరకొరగా ఈ పనులు చేసి చేతులు దులుపుకున్నారు. డంపింగ్ యార్డులు లేని మైనర్ పంచాయతీల్లో 10 సెంట్ల భూమి, మేజర్ పంచాయతీల్లో అర ఎకరం భూమి రెవెన్యూ అధికారుల ద్వారా కేటాయిస్తామని ప్రకటించారు. దీంతో పంచాయతీల నుంచి డంపింగ్ యార్డుల కోసం వినతులు ప్రభుత్వానికి వెళ్లాయి. రెవెన్యూ అధికారులు ఈ అంశంపై దృష్టిసారించకపోవటంతో డంపింగ్ యార్డులకు భూమి కేటాయింపు అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దోమల నివారణకు బెటైక్స్, ఎబేట్, టెక్నికల్ మలాథియాన్ వంటివి పిచికారీ చేయాల్సి ఉంది. పంచాయతీల్లో ఉన్న కొద్దిపాటి నిల్వలను పిచికారీ చేసినట్లు చూపి ఈ కార్యక్రమాన్ని నామమాత్రంగానే చేశారు.
మరుగుదొడ్లకు ఇసుక కొరత...
ఇసుక కొరత కారణంగా ఏ పంచాయతీలోనూ మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఒక్కొక్క మరుగుదొడ్డికి రూ.9,900 మంజూరు చేస్తామని ప్రకటించింది. ఆచరణలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చవుతోంది. అదనపు ఖర్చు చేసి మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. వంద రోజుల ప్రణాళికను సక్రమంగా అమలు చేయాలని సర్పంచులు, అధికారులు చొరవ చూపినా నిధుల కొరతతో పనులు చేయలేని పరిస్థితి నెలకొంది.
15 రోజులకే ముగిసిన ఆన్‌లైన్ నివేదికల ప్రక్రియ
వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఆయా అంశాలపై దృష్టి సారించాలని సూచించిన ప్రభుత్వం ఆయా పంచాయతీల్లో ప్రతిరోజూ చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఆన్‌లైన్‌లో నివేదిక పంపాలని నిబంధన విధించింది. మూడు, నాలుగు పంచాయతీలకు కంప్యూటర్ ఆపరేటర్‌ను కేటాయించటంతో 12 నుంచి 15 రోజుల పాటు ఈవోపీఆర్డీల పర్యవేక్షణలో నివేదికలు పంపి అనంతరం ఈ ప్రక్రియను నిలిపివేశారు. జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైన అనంతరం ఈ నివేదికలను పంపే అంశంపై పట్టించుకునేవారే కరువయ్యారు.
వంద రోజుల ప్రణాళిక ముఖ్యాంశాలివీ...
- పారిశుద్ధ్యం
- డ్రెయిన్లలో పూడికతీత
- మొక్కలు నాటడం
- వీధి లైట్లు వంద శాతం వెలిగించటం
- చేతిపంపులు, పబ్లిక్ కుళాయి మరమ్మతులు
- తాగునీటి పైప్‌లైన్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో నూతన పైపులు వేయటం
- పంచాయతీ కార్యాలయాల్లోని కంప్యూటర్లకు అవసరమైన సామగ్రి కొనుగోలు
- రోడ్ల మరమ్మతులు
- డంపింగ్ యార్డుల కోసం స్థలసేకరణ
- దోమల నివారణకు మందుల పిచికారీ
- మరుగుదొడ్ల నిర్మాణం
అట్టర్ ఫ్లాప్
Published Tue, Nov 18 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement