Pipelines
-
యూరియా ఉత్పత్తి ‘గండం’ దాటేనా?
ఫెర్టిలైజర్‌సిటీ (రామగుండం): స్వదేశీతో పాటు విదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థాపించిన రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తికి తరచూ అంతరాయం కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.6,350 కోట్లు వెచ్చించి కర్మాగారం నిర్మించారు. ఇందుకోసం ఇటలీ, డెన్మార్క్ నుంచి ఆధునిక యంత్ర,సామగ్రి తెప్పించారు. రోజుకి 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఆర్ఎఫ్సీఎల్ నిర్మించారు. 2023 డిసెంబర్ 31 నాటికి 8,19,344.70 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. ఇక్కడి యూరియాకు జాతీయస్థాయిలో మంచి డిమాండ్ ఉంది. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ రామగుండంలోని ఈ ప్లాంట్‌ను పర్యవేక్షిస్తుంది. పైప్లైన్లలో లీకేజీలతో ఉత్పత్తికి బ్రేక్ స్టీమ్ ఆధారంగానే ఇక్కడ యూరియా ఉత్పత్తి అవుతోంది. అయితే స్టీమ్ పైప్‌లైన్ లోపాలతో ప్రతీమూడు నెలలకోసారి ప్లాంట్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. సామర్థ్యానికి మించి పైపుల్లో స్టీమ్(ఆవిరి) సరఫరా కావడంతో తరచూ పైపులైన్లలో లీకేజీలు ఏర్పడి, యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది. గతేడాది నవంబర్ 15న ఇలాంటి సమస్య తలెత్తితే.. సుమా రు 15 రోజులపాటు మరమ్మతులు చేసి ప్లాంట్‌ను పునరుద్ధరించారు. ప్లాంట్ ప్రారంభమైన కాసేపటికే మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో మరో మూడురోజుల పాటు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. నవంబర్ 25న ఉత్పత్తి పునఃప్రారంభమై యూరియా, అమ్మోనియా ఉత్పత్తి సాఫీగానే సాగింది. కానీ, ఈనెల 9న హీట్ స్టీమ్ పైప్‌లైన్‌లో మళ్లీ సమస్య తలెత్తింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్లాంట్ షట్‌డౌన్ చేశారు. ఈనెల 24లోగా పనులు పూర్తిచేసి యూరియా ఉత్పత్తి పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో గ్యాస్ ఆధారంగా నడిచే రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లి మిటెడ్ కర్మాగారం నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానం వినియోగించిన విషయం తెలిసిందే. ఇటలీ, డెన్మార్క్‌నుంచి తెచ్చిన యంత్ర, సామగ్రి గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో మరమ్మతులు, నిర్వహణ భారమంతా కర్మాగారంపైనే పడుతోంది. ప్లాంట్‌పై ఒత్తిడి మన రాష్ట్రంతోపాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రల్లో యూరియాకు డిమాండ్ పెరగడంతో రామగుండం ప్లాంట్‌లో నిరంతరంగా ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్లాంట్‌లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరడం, డిమాండ్‌కు సరిపడా యూరియా ఉత్పిత్తి చేయలేకపోవడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోందన్న వాదన వినపడుతోంది. -
గాడి తప్పిన ‘గ్యాస్’!
సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) సరఫరా చేయాలనే ప్రభుత్వం లక్ష్యం నీరుగారింది. ప్రాజెక్టు అమలు బాధ్యతలను నెత్తినెత్తుకున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ గ్యాస్ పంపిణీలో చేతులెత్తేసింది. ప్రాజెక్టును ప్రారంభించి పన్నెండేళ్లయినా 28% పనులు కూడా పూర్తికాకపోవడంతో పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ ఇప్పట్లో అందడం కలగానే కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అనాలోచిత నిర్ణయాలు, అంతర్గత కుమ్ములాటల ఫలితంగా ఈ ప్రాజెక్టు మొదటి విడత తొలి అయిదేళ్ల లక్ష్యమే ఇప్పటివరకు పూర్తి కాకపోగా, కాలపరిమితి పొడిగింపుతో అంచనా వ్యయం తడిసిమోపెడవుతోంది. ఏపీ, తెలంగాణలోని హైదరాబాద్, విజయవాడ, కాకినాడ నగరాల్లో గత పన్నెండేళ్లలో 2,44,469 గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వగా, 209 వాణిజ్య కనెక్షన్లు, 47 పరిశ్రమలకు ఇండస్ట్రీ గ్యాస్ కనెక్షన్లను జారీ చేసినట్లు బీజీఎల్ వార్షిక నివేదిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక సీఎన్జీ పురోగతిని పరిశీలిస్తే.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) పరిధిలో 116, ఆర్టీసీ పరిధిలో 6, ఎంఎస్ అండ్ కోకో పరిధిలో 4 సీఎన్జీ స్టేషన్లు వాహనాలకు వాయువును సరఫరా చేస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సీఎన్జీతో నడిచే వాహనాల్లో కార్లు 30,894, ఆటోలు 38,367, బస్సులు 1,092 ఉన్నట్లు లెక్కలు స్పష్టం చేసున్నాయి. మొక్కుబడిగా విస్తరణ.. ►నగర శివారులోని శామీర్‌పేట్‌లో మదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన బీజీఎల్.. 2011 నవంబర్ 21న సిటీ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. తొలి అయిదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా వాహనాలకు సీఎన్జీ గ్యాస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తొలుత మదర్‌స్టేషన్ సమీపంలోని నల్సార్ వర్సిటీ క్యాంపస్‌లోని 30 ఫ్లాట్లకు పీఎన్జీ కనెక్షన్లు జారీ చేసింది. అనంతరం మేడ్చల్‌లో సుమారు 410 కుటుంబాలకూ పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చింది. ►ఇప్పటికే కనెక్షన్లు పొందిన వినియోగదారులకు సైతం పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసేందుకు బీజీఎల్ ఆపసోపాలు పడుతోంది. 20 ఏళ్లలో రూ.3,166 కోట్ల అంచనా వ్యయంతో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించాలని బీజీఎల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు తొలి దశలో పైప్‌లైన్ పనులు పూర్తి చేసేందుకు సుమారు రూ.733 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. పనులు గాడిలో పడకపోవడంతో కాలపరిమితి పొడిగింపునకు బీజీఎల్ సంస్థ మొగ్గు చూపుతోంది. మరోవైపు గ్రిడ్ నుంచి తగినంత గ్యాస్ సరఫరా లేక, ప్రతిపాదిత పైప్‌లైన్ మార్గంలో క్లియరెన్సుల జారీలో జాప్యం కూడా ప్రాజెక్టుపై ప్రభావం చూపుతోంది. సీఎన్జీ కూడా అంతంతే ►హైదరాబాద్‌లో పూర్తి స్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం ముందుకు సాగడం లేదు. శామీర్‌పేట్ మదర్ స్టేషన్ ఏర్పాటు చేసి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ కొంతకాలంగా గ్యాస్ కొరతతో గ్రిడ్ నుంచి స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేక పోతోంది. పన్నెండేళ్ల క్రితం గ్రేటర్లో ప్రజా రవాణాకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలకు సగటున రోజుకు 7,62,500 కిలోల (1.067 ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరమని బీజేఎల్ అంచనా వేసింది. ►తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ పంపిణీ చేస్తామని ప్రకటించింది. కానీ కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసినా ప్రస్తుతం ఈ సంఖ్య 135కు పడిపోయింది. దీంతో 215 సీఎన్జీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక నగరంలో ఏర్పాటు చేసిన సీఎన్జీ స్టేషన్ల ద్వారా కూడా గ్యాస్ సరఫరా అంతంత మాత్రంగా మారింది. ప్రతిరోజూ డిమాండ్‌కు తగినట్లు సీఎన్జీ సరఫరా కావడం లేదని డీలర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్మార్ట్ గ్యాస్ నగరం.. ఆమడదూరం.. ►ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాతో స్మార్ట్ గ్యాస్ నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలనే లక్ష్యం కూడా అమడ దూరంగా తయారైంది. 2010లో ప్రారంభమైన భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ల పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. ముందుగా 200 కిలోమీటర్ విస్తరించి నగరంలో లక్ష కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ పుష్కర కాలమైనా కనెక్షన్ల సంఖ్య 43వేలకు దాటలేదు. నగరంలో పాముల కాలువ నుంచి ప్రారంభమైన గ్యాస్ పైపు ప్రధాన లైన్ పనులు ఆంతంత మాత్రంగా మారాయి. ►పైప్లైన్లు వేయటానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించినా.. పనులు మాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఇక సీఎన్జీ పరిస్థితి కూడా మరింత అధ్వానంగా తయారైంది. ఇప్పటివరకు సీఎన్జీ వాహనాల సంఖ్య 25,923 కూడా దాటలేదు. ►కాకినాడలో సైతం బీజేఎల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ మొదటి విడతగా 93 వేల గృహాలకు వంటగ్యాస్ సరఫరాకు మదర్ స్టేషన్ ఏర్పాటు చేసినా గృహోపయోగ కనెక్షన్ల సంఖ్య 58 వేలు దాటలేదు. వివిధ ప్రాంతాలకు పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో విపరీతమైన జాప్యం, మరోవైపు వరుస అడ్డంకులు ఈ పరిస్థితికి దారితీసినట్లు తెలుస్తోంది. వాహనాలకు వాయువు అందించే సీఎన్జీ స్టేషన్ల సంఖ్య డజను కూడా దాటకపోగా.. సీఎన్జీ వాహనాల సంఖ్య 1,728 మాత్రమే ఉంది. -
బ్యాంకు మాజీ ఉన్నతాధికారి కృషి.. పైపులైన్ల పంట!
వ్యవసాయంపై ఉన్న మమకారం ఆయనను తిరిగి సొంతూరికి తీసుకొచ్చింది. పదెకరాల నల్లరేగడి భూమిని సాగు చేసుకుంటూ తమ ఊళ్లో విశ్రాంత జీవితం గడుపుదామని ఆయన నిర్ణయించుకొని ఉండకపోతే.. సాగు నీరు లేక అల్లాడుతున్న ఆ ఊరు పొలాల్లో హంద్రీ నీవా కాలువ నీరు జల జలా పారేదే కాదు. రాజకీయాలకు అతీతంగా రైతులను కూడగట్టి పట్టుదలతో ఆయన సాధించిన వరుస విజయాల గురించి విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరమూ వచ్చేది కాదు! ఆయన పేరు సూగూరు వెంకటేశ్వరరెడ్డి. రైతు బిడ్డ. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లెపల్లి ఆయన స్వగ్రామం. వ్యవసాయంలో బీఎస్సీ పట్టా తీసుకున్న ఆయన భారతీయ స్టేట్ బ్యాంక్‌లో వ్యవసాయ క్షేత్ర అధికారిగా ఉద్యోగంలో చేరారు. 35 ఏళ్ల తర్వాత 2018లో ఏజీఎంగా ఉద్యోగ విరమణ చేసి.. సొంతూళ్లో సేద్యం చేస్తూ వ్యవసాయానికి జవసత్వాలు చేకూర్చుతున్నారు. ? ఉమ్మడిగా భూగర్భ పైపులైన్లు మల్లెపల్లి గ్రామానికి 2.5 కి. మీ. దూరం నుంచి హంద్రీ నీవా – సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువ వెళ్తుంది. వర్షాలు కురిస్తే కాలువలో ఏడాది పొడవుగా నీళ్లు పారుతుంటాయి. కానీ, గ్రామ పొలాలకు ఈ నీరు పారదు. వెంకటేశ్వరరెడ్డి పైపులైను గురించి ఆలోచించారు. గ్రామ రాజకీయాలను, రైతుల్లో అనైక్యతను అధిగమించి 30 మంది రైతులను ఏకం చేశారు. భూగర్భ పైపులైను నిర్మించి డీజిల్ పంపుల ద్వారా కాలువ నీటిని పొలాల్లో పారించారు. మీటరు లోతులో, 5–6 అడుగుల వెడల్పున ఉమ్మడిగా కందకం తవ్వి.. రైతులు ఎవరికి వారు తమ పీవీసీ పైపులను ఈ కందకంలో పక్క పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి డీజిల్ ఇంజన్లను వాళ్లే ఏర్పాటు చేసుకొని, ఎవరికి కావాల్సినప్పుడు నీటిని వారు తోడుకుంటున్నారు. ఫామ్ పాండ్స్‌లో నీటిని నిల్వ చేసుకొని డ్రిప్‌లో, స్ప్రింక్లర్ల ద్వారా పొదుపుగా వాడుకుంటున్నారు. ఈ స్కీము అమలయ్యేనా? అన్న అనుమానంతో తొలుత ఏ ఇతర రైతులూ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు. వెంకటేశ్వరరెడ్డి పట్టుదలతో తనే రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టి, పైపులైను నిర్మించి నీటిని పొలాలకు పారించారు. సొంత పూచీకత్తుపై ప్రతి రైతు పేరిట రూ. లక్ష బ్యాంకు రుణం ఏర్పాటు చేయించి.. తాను పెట్టుబడి పెట్టిన సొమ్ము 4 నెలల తర్వాత తిరిగి తీసుకున్నానని ఆయన తెలిపారు. ఆ విధంగా తమ గ్రామ పొలాల్లో ఆరుతడి పంటలకు రక్షక తడులు ఇవ్వడానికి నీటి భద్రత చేకూరిందని వెంకటేశ్వరరెడ్డి సంబరంగా చెబుతుంటారు. ఆ తర్వాత గ్రామంలో ఇతర రైతులు కూడా అనుసరించారు. సుమారు వంద మంది రైతులు దశల వారీగా మరో 8 భూగర్భ పైపులైన్ స్కీముల ద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత కల్పించుకున్నారని ఆయన తెలిపారు. వెంకటేశ్వరరెడ్డి పాడి గేదెల ఫారం ఎకరానికి రూ. 5–6 వేల ఖర్చు రేగడి నేలలు కావటాన మూడు నాలుగు వారాలు వర్షం మొహం చాటేసినప్పుడు పంటలను రైతులు కాలువ నీటితో రక్షక తడులు అందించి రక్షించుకుంటున్నారు. ఖరీఫ్ కాలంలో వర్షాభావ పరిస్థితులను బట్టి 1–2 సార్లు, రబీలో 2–3 సార్లు నీటిని సొంత ఖర్చుతో తోడుకుంటున్నారు. ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ. 5–6 వేల వరకు డీజిల్ ఖర్చవుతున్నదని వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. కొందరు రైతులు వేసవిలో కూరగాయలను సైతం మూడో పంటగా సాగు చేసుకొని మంచి ఆదాయం గడిస్తున్నారు. నీటి భద్రత వల్ల భూముల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. పత్తి, వేరుశనగ తదితర పంటల సాగుతో రైతుల ఆదాయం పెరిగింది. భూమి విలువ పెరగడంతో పాటు కౌళ్లు రెట్టింపయ్యాయి. 25 ఎకరాల దేవాలయ భూములకు పైపులైను ద్వారా కాలువ నీటిని తెప్పించేందుకు సొంత డబ్బు రూ. 5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి 4 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మల్లెపల్లె ప్రాథమిక పాఠశాల, అల్లుగుండు ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ ట్యాంకులు విరాళంగా ఇచ్చారు. సంఘటితమైతే రైతులకు మేలు జరుగుతుందని నమ్మే వెంకటేశ్వరరెడ్డి ‘నాగలి రైతు ఉత్పత్తిదారుల సంఘం’ను ఏర్పాటు చేశారు వెంకటేశ్వరరెడ్డి. ప్రస్తుతం ఇందులో 40 మంది రైతులు ఉన్నారు. రైతు బంధు వెంకటేశ్వరరెడ్డి రుణం తీర్చుకోవటం కోసమే ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు! పైపులైన్ నీటితో సాగవుతున్న వేరుశనగ రాజకీయాలకు అతీతంగా కృషి దేశానికి అన్నం పెట్టే రైతులు సంతోషంగా ఉండాలనేది నా లక్ష్యం. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని రైతులను రాజకీయాలకు అతీతంగా ఒక్కతాటిపై తెచ్చాం. హంద్రీ నీవా కాలువ నీటిని అందించే పైపులైను స్కీమును అమలు చేశాం. ఎంతో కష్టపడ్డాం. ఒకప్పడు ఏటా ఒక పంట పండటమే కష్టంగా ఉంది. నేడు అనేక మంది 2 పంటలు సాగు చేస్తున్నారు. కొందరు మూడు పంటలు కూడా వేసుకుంటున్నారు. తర్వాత మరో 8 పైపులైను స్కీములు ఏర్పాటయ్యాయి. తద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత చేకూరింది. రాజకీయాలకు అతీతంగా నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. దీంతో బాధ్యత పెరిగింది. – సూగూరు వెంకటేశ్వరరెడ్డి (98660 09889), మాజీ బ్యాంకు ఉన్నతాధికారి, రైతు, సర్పంచ్, మల్లెపల్లి, కర్నూలు జిల్లా -
2,465 కోట్లతో కాళేశ్వరం ‘పైప్‌లైన్’ టెండర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ–21లో ప్రయోగాత్మ కంగా చేపడుతున్న పైప్‌లైన్ వ్యవస్థకు ఎట్టకే లకు టెండర్ పడింది. పెండింగ్‌లో ఉన్న ఈ పనులకు ఈ అక్టోబర్‌లో నీటి పారుదల శాఖ అనుమతులివ్వగా, ప్రస్తుతం టెండర్లు పిలి చారు. మొత్తంగా రూ. 2,465 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించారు. టెండ ర్లు వేసేందుకు ఈ నెల 29 వరకు గడువు విధించారు. ఈ కాళేశ్వరం ప్యాకేజీ–21ని గతంలో రూ.1,143.78 కోట్లతో 1.70 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా చేపట్టారు. ఇందులో లక్ష ఎకరాలకు నీరివ్వాలంటే 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుంది. గరిష్టంగా భూ సేకరణకే రూ. 320 కోట్లు అవసరమవు తోంది. అదే పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అయితే భూసేకరణ అవసరం ఉండదని, నీటి వృథాను నివారించవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం పైప్‌లైన్ వ్యవస్థకు ఓకే చేప్పింది. పైప్‌లైన్‌తో మరో లక్ష ఎకరాలకు నీరు పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అదనంగా మరో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని నీటి పారుదల శాఖ తేల్చింది. ఈ మేరకు ఆయ కట్టు లేకపోవడంతో కొండం చెరువు, మంచి ప్ప చెరువును కలిపి 3.5 టీఎంసీల రిజర్వా యర్‌ను నిర్మించి అదనంగా లక్ష ఎకరాలకు నీరందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాటు చేసే పైప్‌లైన్ వ్యవస్థకు రూ. 2,248 కోట్లు ఖర్చవుతుండగా, ఇక 3.50 టీఎంసీల రిజర్వాయర్‌కు మరో రూ. 375 కోట్లు కలిపి రూ. 2,623 కోట్లకు అక్టోబర్‌లో ఆమోదం తెలిపారు. ఇందులో వ్యాట్, ఇతర ట్యాక్స్ లను తొలగించిన అనంతరం కేవలం పనుల విలువను రూ. 2,465 కోట్లుగా తేల్చారు. -
శివార్లకు జలసిరులు..
► జలమే జీవం.. తీరనున్న దాహం.. ►90 రోజుల్లో రికార్డు స్థాయిలో 1100 కి.మీ మార్గంలో పైప్లైన్లు ►వందలాది కాలనీలకు తీరనున్న దాహార్తి.. ►శరవేగంగా 56 భారీ స్టోరేజ్ రిజర్వాయర్ల నిర్మాణం.. సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా తాగునీరులేక అల్లాడిన గ్రేటర్ శివార్లలో జలసిరులతో దాహార్తి సమూలంగా తీరనుంది. హడ్కో నిధులతో జలమండలి చేపట్టిన తాగునీటి పథకం పనులు రికార్డు స్థాయిలో విజయవంతమవడంతో ఆయా ప్రాంతాలకు మహర్దశ పట్టనుంది. పలు మున్సిపల్సర్కిళ్ల పరిధిలో కేవలం 90 రోజుల వ్యవధిలో 1100 కిలోమీటర్లకు పైగా పైపులైన్లు ఏర్పాటుచేయడం విశేషం. దీనికి అదనంగా ఈ ఏడాది జూన్‌లోగా మరో 900 కి.మీ మార్గంలో పైపులైన్లు...56 భారీ స్టోరేజి రిజర్వాయర్లను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తుండడంతో లక్షలాదిమంది దాహార్తి తీరనుంది. గతంలో పదిరోజులుగా నల్లా నీరు రాక ..గొంతెండిన శివారువాసులకు ఇక నుంచి రోజూ నీళ్లిచ్చేందుకు జలమండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రుతుపవనాలు కరుణిస్తే జూలై మాసం నుంచి ఆయా ప్రాంతాలకు రోజూ నీళ్లివ్వనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నాయి. గ్రేటర్‌తోపాటు ఔటర్‌రింగ్‌రోడ్డుకు లోపలున్న 190 గ్రామాలు,నగరపంచాయతీల దాహార్తిని సైతం సమూలంగా తీర్చేందుకు బృహత్తర ప్రణాళికను త్వరలో అమలుచేయనున్నట్లు వెల్లడించాయి. సుమారు రూ.628 కోట్ల అంచనా వ్యయంతో ఆయా గ్రామాల పరిధిలో 1685 కి.మీ మార్గంలో పైపులైన్లు...398 ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించనుండడం విశేషం. వందేళ్ల తాగునీటి అవసరాలకు భారీ రిజర్వాయర్... మరో వందేళ్లవరకు మహానగరానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ.7770 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వసామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్‌కు అవసరమైన అటవీ ,ప్రైవేటు భూములను ఆరునెలల్లోగా సేకరించే అంశంపై రెవెన్యూ,జలమండలి యంత్రాంగం దృష్టిసారించింది. ఈ రిజర్వాయర్‌కు ప్రధానంగా కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించి నింపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి సాంకేతిక అంశాలు, డిజైన్లు, డ్రాయింగ్స్, పైప్‌లైన్స్, నీటిశుద్ధికేంద్రాలు, శుద్ధిచేసిన నీటిని ఘన్పూర్ రిజర్వాయర్‌కు తరలించే పైప్లైన్ల ఏర్పాటు.. తదితర అంశాలను వ్యాప్కోస్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఔటర్ లోపలి గ్రామాల దాహార్తి తీరనుందిలా.. ఔటర్‌రింగ్ రోడ్డులోపలున్న 190 పంచాయతీలు, నగరపాలక సంస్థల పరిధిలో త్వరలో రూ.628 కోట్ల అంచనా వ్యయంతో తాగునీటి పథకం పనులు చేపట్టనున్నారు. ఆయా గ్రామాల్లో 398 ఓవర్ హెడ్‌ట్యాంకులను 34,700 కిలోలీటర్ల(3.47 కోట్ల లీటర్లు) నీటి నిల్వ సామర్థ్యం తో నిర్మించనున్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకుల నుంచి 1685 కిలోమీటర్ల మేర నీటి సరఫరా పైపులైన్లు ఏర్పాటు చేసి ఆయా పంచాయతీల పరిధిలోని వేలాది కాలనీలు, బస్తీలకు నీటిసరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే శివారు ప్రాంతాల్లో సుమారు 25 లక్షలమంది దాహార్తి తీరే అవకాశం ఉంది. కాగా ఇటీవల ఔటర్‌కు లోపలున్న గ్రామాలకు నీటిసరఫరా బాధ్యతలను ప్రభుత్వం గ్రామీణ నీటిసరఫరా విభాగం నుంచి బదలాయించి జలమండలి అప్పజెప్పిన విషయం విదితమే. దాహార్తి తీర్చడం, సమస్యల పరిష్కారమే ధ్యేయం గ్రేటర్‌తోపాటు ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న గ్రామపంచాయతీల దాహార్తిని సమూలంగా తీర్చేందుకు ప్రభుత్వం పలు బృహత్తర మంచినీటి పథకాలను అమలుచేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నాం. భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం. వినియోగదారుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం జలమండలి అమలు చేస్తున్న సాంకేతిక ప్రయోగం, సామాజిక మాధ్యమాల వినియోగం సత్ఫలితాన్నిస్తోంది. అరకొర నీటిసరఫరా...ఉప్పొంగుతున్న మురుగు సమస్యలు...కలుషిత జలాలు.. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు గత ఐదు నెలలుగా సామాజిక మాధ్యమాలు, సాంకేతిక విధానాల ద్వారా స్వీకరిస్తున్న ఫిర్యాదులను గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తుండడం విశేషం. గ్రేటర్ సిటిజన్లు అమితంగా ఇష్టపడే ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తుండడంతో వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఆయా మాధ్యమాల ద్వారా అందుతున్న ఫిర్యాదులు..వాటిని జలమండలి పరిష్కరించిన తీరు ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
పేలిన నిర్లక్ష్యం
పైపులైన్ పేలుడుతో మరోసారి బయటపడిన వైనం చమురుతో నిండిపోయిన రోడ్లు, బోదెలు గొల్లపాలెం గ్రామంలో ఘటన శిథిల లైన్లు.. నాసిరకం పనుల వల్లే..! ముడి చమురు సరఫరాకు కీలకమైన పైపులైన్లు అవి. వాటిని ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నాయి. నాసిరకమైన పైపులు కావడంతో తరచూ పగిలిపోతున్నాయన్న ఆరోపణలూ లేకపోలేదు. కేవలం మరమ్మతులతో సరిపుచ్చుతున్న ఓఎన్జీసీ.. వాటిని పటిష్టపరచడంలో నిర్లక్ష్యం చూపుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. – మలికిపురం మలికిపురం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో మంగళవారం సంభ వించిన పైపులై¯ŒS పేలుడుతో ఓఎన్జీసీ నిర్లక్ష్యం, నాసిరకం లైన్ల ఉదంతం మరోసారి బయటపడింది. గ్రామంలోని కరవాక సరిహద్దులో కేడబ్ల్యూఏఏ బావి నుంచి తూర్పుపాలెం జీసీఎస్‌కు క్రూడాయిల్ సరఫరా చేస్తున్న ఈ పైపులై¯ŒS ఉదయం 7.30కు భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు తీవ్రతకు రోడ్డుపై గోతులు పడ్డాయి. క్రూడాయిల్ ఎగసి సరుగుడు చెట్లపై పడడంతో అవి విరిగిపోయాయి. రోడ్లు, సరుగుడు తోటల్లోని బోదెలు చమురుతో నిండిపోయాయి. నాసిరకం వల్లే.. సుమారు పదేళ్ల క్రితమే ఈ పైపులైన్లు వేసినట్టు చెబుతున్నారు. అప్పట్లో నాసిరకంగా వేయడం వల్ల అవి తరచూ పేలిపోతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారు గంటకు పైగా చమురు ఎగసిపడిందని చెప్పారు. ఎట్టకేలకు జీసీఎస్ సిబ్బంది బావి వద్దకు చేరుకుని.. చమురు సరఫరా నిలిపివేయడంతో ఎగసిపడడం తగ్గుముఖం పట్టింది. తోటలకు తీవ్ర నష్టం సుమారు 25 ఎకరాలకు పైగా సరుగుడు తోటలు చనిపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర తీరంలోని ప్రధాన రహదారి పైనే ఈ ప్రమాదం జరిగింది. పేలుడు జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ వెళ్లకపోవడం, రైతులు కూడా ఇంకా పొలాల్లోకి రాకపోవడంతో పెను ముప్పు తప్పింది. సముద్ర తీరంలో సుమారు 50కి పైగా చమురు బావులు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పైపులను మార్చకపోవడం, మరమ్మతుల్లో ఓఎన్జీసీ పూర్తి నిర్లక్ష్యధోరణి అవలంబించడం వల్లే ఈ ప్రమాదాలకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
మురుగు ముప్పు తప్పాలంటే..
పైపులైన్లు మారిస్తేనే ‘సాగర్’ శుద్ధి కూకట్పల్లి, సికింద్రాబాద్ నాలా పైపులైన్ మారిస్తేనే ప్రయోజనం అప్పటివరకు హుస్సేన్‌సాగర్‌లోకి యథేచ్ఛగా మురుగు ప్రవాహం రూ.376.13 కోట్ల ఆర్థిక సహాయం కోరుతూ కేంద్రానికి వినతి సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌కు మురుగు, పారిశ్రామిక వ్యర్థజలాల నుంచి విముక్తికి కూకట్పల్లి, సికింద్రాబాద్ నాలా పైపులైన్ మారిస్తేనే ప్రయోజనమని జలమండలి పరిశీలనలో తేలింది. ఈ నాలకు సంబంధించిన కె అండ్ ఎస్ మెరుున్(కూకట్పల్లి, సికింద్రాబాద్ మెరుున్)ను 18.25 కిలోమీటర్ల మేర తక్షణం మార్చి కొత్త పైపులైన్ వేస్తేనే ప్రయోజనమని తేల్చింది. ఇందుకు రూ.261 కోట్లు అంచనా వ్యయం అవుతుందని నిర్ణరుుంచింది. లేనిపక్షంలో సాగర్‌కు మురుగు ముప్పు తప్పదని భావిస్తోంది. దీంతోపాటు నగరంలో ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న పైపులైన్లు, భవనాలు, మ్యాన్‌హోళ్లను పునరుద్ధరించేందుకు మొత్తంగా రూ.376.13 కోట్ల మేర నిధులు అవసరమని.. ఈ మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందజేయాలని ఇటీవల నగరానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందానికి నివేదించింది. ఇదీ పరిస్థితి.. కూకట్పల్లి, బాలానగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి రోజువారీగా సుమారు 450 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు వెలువడుతారుు. ఈ జలాలు కె అండ్ ఎస్ మెరుున్ ద్వారా హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న మారియెట్ హోటల్ వరకు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్ ద్వారా మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి మూసీలోకి వదిలిపెడుతున్నారు. ఈ పైపులైన్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో సర్ప్లస్ నాలా నుంచి నిత్యం పారిశ్రామిక వ్యర్థజలాలు హుస్సేన్‌సాగర్‌లోకి చేరుతుండడంతో సాగర్‌కు మురుగు నుంచి విముక్తి లభించడంలేదు. మరోవైపు అమీర్‌పేట్ దివ్యశక్తి అపార్ట్మెంట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్న ‘ఏ’ మెరుున్ భారీ మురుగునీటి పైపులైన్ కూడా ఇటీవలి భారీ వర్షాలకు ఎన్టీఆర్ గార్డెన్ వద్ద దెబ్బతినడంతో ఈ పైపులైన్ ద్వారా పారే మురుగు నీటిని కూడా సాగర్‌లోకి మళ్లిస్తున్నట్లు తెలిసింది. దీంతో సాగర్‌కు కష్టాలు తప్పడంలేదు. ఈనేపథ్యంలో కెఅండ్‌ఎస్ మెరుున్ పైపులైన్‌తోపాటు ఏ మెరుున్ పైపులైన్లను మార్చేందుకు ఆర్థిక సహాయం అందజేయాలని జలమండలి కేంద్ర బృందానికి సమర్పించిన నివేదికలో కోరింది. -
2న పలు ప్రాంతాలకు కృష్ణా నీళ్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ రింగ్‌మెయిన్–1 పైపులైన్లకు నిర్వహణపరమైన మరమ్మతుల కారణంగా..ఆగస్టు 2న(మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి.. మరుసటి రోజు బుధవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు పలు ప్రాంతాలకు కృష్ణా జలాల సరఫరా నిలిచిపోనుంది. బాలాపూర్, రాజీవ్ గృహకల్ప,అల్మాస్‌గూడా, ఏఆర్‌సీఐ, మైలార్‌దేవ్‌పల్లి, మదుబన్, పీడీపీ, రాజేంద్రనగర్, హైదర్గూడా, కిషన్‌భాగ్, సులేమాన్‌నగర్, నందిముసలాయ్‌గూడా, అత్తాపూర్, ఆళ్లబండ రిజర్వాయర్, రెడ్‌హిల్స్,సెక్రటేరియట్, మెహిదీపట్నం, కాకతీయనగర్, విజయ్‌నగర్‌కాలనీ, మసాబ్‌ట్యాంక్, కార్వాన్, షేక్‌పేట్, టోలిచౌకి, లంగర్‌హౌజ్, ప్రశాసన్‌నగర్, జర్నలిస్ట్‌కాలనీ, ఫిల్‌్మనగర్, ఫిల్మ్‌నగర్ స్లమ్స్, రోడ్‌నెం.45, ఎస్పీఆర్హిల్స్, ఎన్‌ఆర్‌ఆర్‌పురం, శ్రీరాంనగర్, కార్మికనగర్, లింగంపల్లి, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, లింగంపల్లి, హఫీజ్‌పేట్, చందానగర్, ఆర్సీపురం, మియాపూర్, కెపిహెచ్బి, ఇందు ప్రాజెక్ట్స్, మలేషియా టౌన్షిప్, బోరబండ రిజర్వాయర్, గాయత్రీనగర్, అల్లాపూర్, రామారావునగర్ ప్రాంతాలకు సరఫరా ఉండదని జలమండలి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి -
ప్రక్షాళన షురూ..
మురుగునీటి పైపులైన్ల ప్రక్షాళనకు రంగం సిద్ధం.. జూన్10లోగా పనులు పూర్తిచేయాలని ఎండీ దానకిశోర్ ఆదేశం.. 16 డివిజన్లకు రూ.2.31 కోట్లు కేటాయింపు.. సిటీబ్యూరో: గ్రేటర్లో చిన్నపాటి వర్షానికే ఉప్పొంగుతున్న మురుగునీటి పైపులైన్లు, మ్యాన్‌హోళ్ల ప్రక్షాళనకు ఎట్టకేలకు జలమండలి నడుం బిగించింది. మహానగర పరిధిలోని సుమారు ఐదు వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మురుగునీటి పైపులైన్లలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడికను జూన్ 10లోగా యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఎండీ దానకిశోర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ప్రీమాన్సూన్ యాక్షన్ ప్లాన్‌ను సోమవారం ఖరారు చేశారు. పనులు చేపట్టేందుకుగాను 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో రూ.2.31 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నిర్వహణ డివిజన్ల వారీగా చీఫ్ జనరల్ మేనేజర్లు తమకు కేటాయించిన బడ్జెట్ మేరకు పనులను గుర్తించి ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. చేపట్టాల్సిన పనులు ఇవే.. లోతట్టు ప్రాంతాలు, తరచూ నీటమునిగే ప్రాంతాలు, మురుగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు, మురుగునీటి పైపులైన్ల పూడికను తొలగించాలి. పనులు చేపట్టాల్సిన ప్రాంతాలను తక్షణం గుర్తించి, కార్యాచరణ సిద్ధంచేయాలి. పనుల ప్రారంభానికి ముందు స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల అనుమతి తీసుకోవాలి. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో జీఎంలు,సీజీఎంలు పర్యటించి ఫోటోలు తీసి సీడీల రూపంలో బిల్లులతో సహా బోర్డుకు సమర్పించాలి. ఎయిర్‌టెక్ యంత్రాల సాయంతో పూడిక తొలగించాలి. {పతి స్టోరేజి రిజర్వాయర్ వద్ద అవసరమైన మేరకు క్లోరినేషన్ ప్లాంట్లును జూన్1 లోగా ఏర్పాటు చేయాలి. 600 ఎంఎం డయా వ్యాసార్థం దాటిన మురుగునీటి మ్యాన్‌హోళ్లపై సేఫ్టీగ్రిల్స్ ఏర్పాటు చేయాలి. 29 అత్యవసర బృందాలకు అవసరమైన యంత్రసామాగ్రిని సమకూర్చాలి. ఒక్కో బృందంలో పదిమంది సభ్యులుండాలి. వారికి అవసరమైన వాహనం సమకూర్చాలి. జూన్-ఆగస్టు మధ్యకాలంలో అత్యవసర బృందాలు మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో రంగంలోకి దిగి పనులు చేపట్టాలి. జూన్-ఆగస్టు మధ్యకాలంలో ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్‌కు అందిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి. ఫిర్యాదుల స్వీకరణకు షిఫ్టులవారీగా సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఒక డీజీఎం ఈ సెల్‌ను పర్యవేక్షించాలి. సెంట్రల్ స్టోర్ డివిజన్ నుంచి 29 అత్యవసర బృందాలకు అవసరమైన సాధనాసంపత్తి,యంత్రాలను సమకూర్చాలి. -
'కాళేశ్వరం'లో పైప్లైన్లు
* పిల్ల కాల్వల వ్యవస్థకు బదులుగా ఏర్పాటుకు సర్కారు నిర్ణయం * భూసేకరణను తగ్గించడం, నీటి వృథాను అరికట్టడమే లక్ష్యం * పైప్‌లైన్ వల్ల నిర్మాణ వ్యయం కూడా బాగా తగ్గే అవకాశం * పైలట్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21లో అమలు * టీఎంసీ నీటిని కాల్వలతో 10 వేల ఎకరాలకు ఇవ్వొచ్చన్న అధికారులు * పైప్‌లైన్‌తో అయితే అదేనీరు 20 వేల ఎకరాలకు సరిపోతుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్ భూసేకరణ సమస్యను తప్పించడం, నీటి వృథాను అరికట్టడమే లక్ష్యంగా.. కాల్వలకు బదులు పైప్లైన్లతో సాగునీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పిల్ల కాల్వల వ్యవస్థ (డిస్ట్రిబ్యూటరీలు)ను పైప్లైన్ల ద్వారానే ఏర్పాటు చేయనుంది. కాల్వలతో పోలిస్తే పైప్‌లైన్ నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అవకాశంతోపాటు నీటి వృథా తగ్గే అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని తొలుత పైలట్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21లో అమలు చేయనున్నారు. దీనికి సీఎం కేసీఆర్ ఇప్పటికే ఓకే చెప్పగా... పనులు మొదలు పెట్టేందుకు కాంట్రాక్టు సంస్థ సిద్ధమవుతోంది. విస్తృత ప్రయోజనం: నిజానికి కాల్వల నిర్మాణానికి ఖర్చు ఎకరాకు రూ.25వేల వరకు ఉంటే... పైప్‌లైన్ వ్యవస్థకు రూ.23,500 వరకే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక కాల్వల ద్వారా ఒక టీఎంసీ నీటిని 10వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉండగా... పైప్‌లైన్‌తో 20వేల ఎకరాలకు అందజేయవచ్చని పేర్కొంటున్నారు. దీంతోపాటు పైప్‌లైన్ నిర్మాణానికి భూసేకరణ అవసరం తక్కువగా ఉంటుందని, అన్ని ప్రాంతాలకు సమానమైన నీటిని పంపిణీ చేసే అవకాశముంటుందని చెబుతున్నారు. నిర్వహణ ఖర్చు సైతం భారీగా తగ్గుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఇప్పటికే ఇలా పైప్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్న ఓంకారేశ్వర డ్యామ్‌ను మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు ఇంజనీర్ల బృందం పరిశీలించి... ఈ విధానం అమలుకు ఓకే చెప్పింది. పాలమూరు, డిండి, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలో ఈ పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో లక్ష్యంగా ఉన్న 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే... పిల్ల కాల్వల నిర్మాణానికే 1.5 లక్షల ఎకరాల భూమి అవసరం. దీనికి రూ.7,500కోట్ల దాకా ఖర్చవుతుంది. అదే పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అయితే రూ.6వేల కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ప్రయోజనాల దృష్ట్యానే పైప్‌లైన్ వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్యాకేజీ–21లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. రూ.1,143 కోట్ల విలువైన ఈ ప్యాకేజీలో 1.70 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. సాధారణంగా పిల్ల కాల్వల నిర్మాణం కోసం ప్రతి లక్ష ఎకరాలకు 4 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్యాకేజీ–21 కోసం సుమారు 7వేల ఎకరాలు అవసరం అవుతుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం అక్కడ ఎకరానికి రూ.7లక్షల నుంచి రూ.8లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే కాల్వల కోసం భూసేకరణకే రూ.320కోట్లు అవసరం. అదే పైప్‌లైన్ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తారు. తద్వారా పైన యథావిధిగా వ్యవసాయం చేసుకునే అవకాశముంది. ఇక కాల్వల ద్వారా నీటి వృథా దాదాపు 30శాతం వరకు ఉండగా... పైప్‌లైన్‌తో వృథా అతి తక్కువ. దీంతోపాటు పైప్‌లైన్‌తో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. నిర్ణీత ఆయకట్టులో రెండో పంటకు సైతం నీరు అందించవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
పైపులైన్లకు కన్నం: భారీగా డీజిల్ చోరీ
నల్లగొండ: నల్లగొండ జిల్లా బీబీ నగర్ సమీపంలో పైపులైన్ల నుంచి డీజిల్ చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే హెచ్‌పీసీఎల్, ఐఓసీ కంపెనీల పైపులైన్లకు బీబీ నగర్ సమీపంలోని పడమటి సోమవారం దగ్గర కన్నంపెట్టి రోజూ మూడు నుంచి నాలుగు ట్యాంకర్ల మేర కొల్లగొడుతున్నారు. ఈ డీజిల్‌ను నగరంలోని పెట్రోల్ బంకుల్లో అక్రమంగా విక్రయిస్తున్నారు. డీజిల్ చోరీపై అనుమానంతో చమురు కంపెనీల ప్రతినిధులు పోలీసులతో కలసి సోమవారం దాడి చేయగా ముఠా వ్యవహారం రట్టయింది. ముంబైకి చెందిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీకి ఉపయోగించే పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. -
దాహం.. దాహం!
అప్పుడే మొదలైన తాగునీటి కష్టాలు పట్టణ వాసులకు కలుషిత నీరే గతి కాలం చెల్లిన పైపులైన్లు.. లీకేజీలు మురుగు కాల్వల్లో కలిసి.. నీరు కలుషితం అవసరం ఎక్కువ.. సరఫరా తక్కువ తప్పు పట్టిన పైపులైన్లు కొన్నిచోట్ల.. మురుగు కాల్వల్లోంచి వెళ్లే లైన్లు మరికొన్ని చోట్ల.. తాగునీటిని కలుషితం చేస్తున్నాయి.. ఇంకా చెప్పాలంటే పురుగులమయం చేస్తుంటే.. చాలా ప్రాంతాల్లో గంట, ముప్పావుగంట సరఫరా అవుతున్న నీరు ప్రజల గొంతు తడపలేకపోతోంది. కొండవాలు, శివారు ప్రాంతాల్లో నిత్యం నీటిగండమే. విశాఖ మహానగరంలోనే ఈ పరిస్థితి ఉంటే.. జిల్లాలోని భీమిలి, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి పట్టాణాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నర్సీపట్నంలో అయితే రోజు విడిచి రోజు నీరు అందిస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే దాహంతో అల్లాడిపోతున్న పట్టణ ప్రజల కష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ‘సాక్షి’ అందిస్తున్న సమగ్ర కథనం.. విశాఖపట్నం: జిల్లా జనాభా 44 లక్షలు కాగా.. ఇందులో సగానికి పైగా జనాభా విశాఖ మహానగరం(జీవీఎంసీ), నర్సీపట్నం, యలమంచలి మున్సిపాలిటీల్లోనే ఉంటున్నారు. జీవీఎంసీ జనాభా 22.50 లక్షల పైమాటే. నగరంలో తాగునీటి డిమాండ్ రోజుకు 85 మిలియన్ల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 68 మిలియన్ల గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. నగర పరిధిలో పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన ప్రాజెక్టుల్లో ఏలేరు ప్రధానమైనది. ఆ తర్వాత రైవాడ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి, గంభీరం, గోస్తని, ముడసర్లోవ రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో నీటినిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయి. ఏలేరు నుంచి 130 ఎంజీడీల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం 60 ఎంజీడీలు మాత్రమే విశాఖకు చేరుతోంది. దిగువ మధ్యతరగతి, సామాన్య, నిరుపేదలు పూర్తిగా కుళాయిల నుంచి వచ్చే ఈ బురద నీటినే తాగుతుంటే.. ఎగువ మధ్య తరగతి.. ఉన్నతవర్గాల వారు ఆర్వో ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసే వాటర్ టిన్లపై ఆధారపడుతున్నారు. జిల్లాలోని పట్టణాల వారీగా పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రతిపాదనలకే పరిమితం ఏలేరు పైపులైన్ల పనులకు రూ.1905 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అనకాపల్లి నీటి సరఫరా వ్యవస్థను రూ.85 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదన ఉంది. వేసవి నీటి నిల్వ ట్యాంకులు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద 170 ఎంజీడీల నీటిని నిల్వ ఉంచొచ్చు. పాతపైపులైన్లను మార్చాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. ఏటా నీటి ట్యాంకర్లు, పంపింగ్ మోటార్లు, పైపులైన్ల మరమ్మతుల కోసం రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నా శాశ్వత పరిష్కారం దిశగా అడుగు పడడం లేదు. నర్సీపట్నం.. రోజు విడిచి రోజు నర్సీపట్నంలో రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రెండు రోజులకోసారి ఇస్తున్నారు. ఇస్తున్న నీరు రంగు మారడంతో పాటు కుళాయిల నుంచి పురుగులు వస్తుండడంతో గుడ్డకట్టి నీటిని పట్టుకుంటున్నారు. పలు చోట్ల కుళాయిలకు హెడ్లు లేక నీరు వృథా అవుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డుల్లో 60 వేల మంది జనాభా ఉంది. రోజుకు సగటున మనిషికి 80 లీటర్ల నీటిని అందించాల్సి ఉంది. ప్రస్తుతం 45 లీటర్ల నీటిని అందిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవంగా 30 లీటర్ల కంటే తక్కువే ఇస్తున్నారు. దుగ్గాడ వద్ద వరహా నదిలో పంపుహౌస్ ఏర్పాటు చేసినా పెరిగిన జనాభా అవసరాలకు తగిన విధంగా తాగునీరు సరఫరా చేయటం లేదు. మరోవైపు కాలం చెల్లిన పైపులైన్లకు ఎక్కడికక్కడ లీకేజీలు ఏర్పడి తాగునీరు వృథా అవుతోంది. నిత్యం మరమ్మతులు చేసినప్పటికీ లీకేజీలను అరికట్టలేకపోతున్నారు. పైపులైన్లు మురుగు కాల్వల్లో ఉండటం వల్ల లీకేజీల ద్వారా తాగునీరు కలుషిత మవుతోంది. యలమంచిలి.. బోప్‌వెల్స్ నీరే గతి యలమంచలి పట్టణ శివారువాసులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రాంనగర్, వేణుగోపాలస్వామి గుడి ప్రాంతం, పాతవీధి, కాశీవాని వీధిలకు పూర్తి స్థాయిలో రక్షిత నీరు అందించేందుకు రూ.76 కోట్లతో డీపీఆర్‌కు పంపించారు. లక్ష జనాభా ఉన్న మున్సిపాల్టీలకే మంజూరు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఈ ప్రాజెక్టుపై ఆశలు ఆవిరైపోయాయి. ప్రస్తుతం ఎస్.రాయవరం మండలం సోమిదేవిపల్లి వద్ద వరహా నదిపై ఏర్పాటుచేసిన బోర్‌వెల్స్ పథకం ద్వారా యలమంచలి పట్టణానికి నీటి సరఫరా జరుగుతోంది. రోజుకు ఉదయం ఆరు నుంచి ఏడుగంటల వరకుమాత్రం ఇస్తారు. వాటర్ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. -
నేడు ఆలస్యంగా నీటి సరఫరా
సిటీబ్యూరో: పైప్లైన్ల మరమ్మతుల కారణంగా గురువారం వివిధ ప్రాంతాలకు ఆలస్యంగా, అరకొరగా నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ప్రకటించింది. హఫీజ్‌పేట్ పరిధిలోని తారానగర్ సాయి మారుతి, నవతా ట్రాన్స్పోర్ట్ లేన్, తుల్జా భవాని లేన్, శంకర్ నగర్, వేముకుంట, భిక్షపతి నగర్, గౌతంనగర్, చందానగర్ సెక్షన్, ఆర్.సి.పురం పరిధిలోని ఎస్.ఎన్ కాలనీ, సాయి కాలనీ, బాంబే కాలనీ, బీడీఎల్ కాలనీ, అశోక్నగర్లకు అరకొరగా, ఆలస్యంగా నీరు సరఫరా అవుతుందని తెలిపింది. -
పగిలిన కృష్ణా పైప్ లైన్
బాలాపూర్ చౌరస్తాలో ఉన్న కృష్ణా పైప్‌లైన్ ఫేజ్-2 రింగ్‌మెన్ వన్ జాయింట్ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగి పేలిపోడంతో ప్రధాన రహదారిపై నీరు ఏరులై పారింది. ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. రహదారి పై ప్రయాణిస్తున్నవాహనాలు.. నీటి ఉధృతికి కొట్టుకు పోయాయి. చుట్టుపక్కల దుకాణాలు నీట మునిగాయి. కాగా.. వత్తిడి కారణంగానే బాలాపూర్ చౌరస్తాలో కృష్ణా ఫేజ్ 2 పైప్ లైన్ పగిలి పోయిందని.. జలమండలి అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు సాహెబ్‌నగర్‌కు అనుసంధానంగా ఉన్న ప్రధాన కంట్రోల్వాల్ను ఆపివేశామని.. అయితే అప్పటికే పైప్గుండా సరఫరా అవుతున్న నీరు లీక్కావడంతో ఈఘటన చోటు చేసుకుందన్నారు. కంట్రోల్ వాల్వ్ ఆపడంతో బాలాపూర్, బార్కాస్ సబ్డివిజన్లకు నీటిసరఫరాలో అంతరాయం ఉంటుందని వివరించారు. పైప్ లైన్ నుంచి భారీగా నీరు రావడంతో.. రహదారిపై రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. ట్రాఫిక్ పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. -
నేడు నీళ్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడో దశ పైపులైన్లకు గుర్రంగూడ వద్ద ఏర్పడిన భారీ లీకేజీలకు మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 20న (ఆదివారం) నగరంలోని వివిధ ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఎల్బీనగర్, కాప్రా, ఉప్పల్, మల్కాజిగిరి, అల్వాల్ మున్సిపల్ ప్రాంతాల్లోని అన్ని కాలనీలకు నీటి సరఫరా పూర్తిగా కానీ పాక్షికంగా కానీ నిలిచిపోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ‘డయల్ యువర్ ఎండీ’కి ఫిర్యాదులు జలమండలి కార్యాలయంలో నిర్వహించిన మీట్ అండ్ డయల్ యువర్ ఎమ్డీ కార్యక్రమానికి 34 ఫిర్యాదులు అందాయి. కలుషిత జలాలు, అరకొర మంచినీటి సరఫరాపై వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. 22న మరికొన్ని ప్రాంతాలకు... సాహెబ్‌నగర్-మైలార్‌దేవ్‌పల్లి మార్గంలో పైపులైన్ లీకేజీలకు మరమ్మతుల కారణంగా ఈ నెల 22న ఉదయం 6 నుంచి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు అల్మాస్గూడ రాజీవ్ గృహకల్ప, బాలాపూర్ ఏఆర్‌సీఐ, బాబా నగర్, పిసల్ బండ, రైసత్నగర్, మోయిన్‌బాగ్, ఫతేషా నగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, మిధాని, డీఆర్డీఎల్, ఆర్సీఐ, సీఆర్పీఎఫ్, ఉప్పుగూడ, సాయిబాబా నగర్, శివాజీ నగర్, లలితాబాగ్, జీఎంనగర్ ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. -
రెండు విడతలుగా వాటర్‌గ్రిడ్
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తొలుత కృష్ణా బేసిన్‌కు ప్రాధాన్యం 11 సెగ్మెంట్లకు వ్యాప్కోస్ లైన్ క్లియర్ వారంలోగా తొలి విడత టెండర్లు రూ.15,633 కోట్లతో 4 జిల్లాల్లో పైప్లైన్లు టెండర్ నిబంధనలకు సీఎం ఆమోదం హైదరాబాద్: ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ (వాటర్‌గ్రిడ్)ను రెండు దశల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 11 సెగ్మెంట్లలో పైపులైన్ల నిర్మాణం చేపట్టనుంది. రెండో విడతలో గోదావరి బేసిన్ నుంచి నీటిని సరఫరా చేసే జిల్లాల్లో పనులు మొదలుపెట్టనుంది. రెండో విడత ప్యాకేజీలను 22 సెగ్మెంట్లుగా విభజించింది. తొలి దశకు సంబంధించిన ప్రాజెక్టు అంచనాలను వ్యాప్కోస్ (వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్) పూర్తి చేసింది. సెగ్మెంట్లవారీగా ప్రాజెక్టు అంచనాలను పరిశీలించిన వ్యాప్కోస్ ప్రతినిధులు తాము రూపొందించిన నివేదికలను మంగళవారం ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో వారంలోగా పైప్లైన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు పంచాయతీరాజ్‌శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అది రూపొందించిన నిబంధనలకు సీఎం కేసీఆర్ మంగళవారం ఆమోదం తెలిపారు. తొలి దశలోని నాలుగు జిల్లాల్లో రూ.15,633 కోట్లతో పైప్లైన్ల ఏర్పాటుకు వచ్చే బుధవారంలోగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. తర్వాత మరో 15 రోజుల్లోగా రెండో విడత పైప్లైన్ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తోంది. టెండ ర్లు పిలిచేందుకు వీలుగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులను 26 ప్యాకేజీలుగా విభజించింది. వాటి అంచనాలను ఖరారు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పైప్‌లైన్ ఏర్పాటులో కీలకమైన భూ సేకరణ ప్రక్రియను ‘రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్’ చట్టం ద్వారా పూర్తిచేయాలని భావిస్తోంది. మొత్తం 33 సెగ్మెంట్లలో సుమారు 1.25 లక్షల కిలోమీటర్ల మేర పైప్లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకవసరమైన సుమారు 6,000 ఎకరాల పైప్లైన్ల మార్గంలో 2,000 ఎకరాలను రైతుల నుంచి సేకరించాల్సి వస్తుందని అంచనా. పైప్‌లైన్ వెళ్తున్నందున పంట నష్టం పరిహారాన్నే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటర్‌గ్రిడ్‌కు భారీగా పైపులు అవసరమైనందున సరఫరా సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లు పెట్టాలన్న నిబంధనను సడలించి దాన్ని కాంట్రాక్టర్ల ఇష్టానికే వదిలేసింది. రైట్ ఆఫ్ వే చట్టమంటే... గ్రామ పంచాయతీలు, పట్టణాలు, పరిశ్రమలకు మంచినీరు అందించే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని వినియోగించుకునే హక్కు కోసం ప్రభుత్వం రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం పైప్లైన్లకు సేకరించిన భూమిలో చెట్లు నాటకూడదు, నిర్మాణాలు చేయకూడదు, బావులు, జలాశయాలు తవ ్వకూడదు. సాధారణ సాగుకు మాత్రం ఆంక్షలుండవు. పైప్లైన్లకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగిస్తే జైలుశిక్ష విధిస్తారు. -
చుక్క చుక్కకూ లెక్క!
ఇంటింటికీ నల్లా కనెక్షన్.. మీటర్ పట్టణ ‘వాటర్ గ్రిడ్’లో భాగంగా ప్రతిపాదనలు 24 గంటల సరఫరాపై ‘నియంత్రణ’కే పట్టణ ‘గ్రిడ్’ పనులకు రూ. 3,038 కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్‌గ్రిడ్ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌తోపాటు మీటర్‌ను సైతం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటి వినియోగంపై నియంత్రణ కోసం మీటర్లు బిగించాల్సిందేనని భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్ పనుల కోసం రూ. 3,038 కోట్ల అంచనా వ్యయంతో ‘ప్రజారోగ్య ఇం జనీరింగ్ విభాగం’ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. నీటి శుద్ధీకరణ ప్లాంట్లు, ప్రధాన పైప్లైన్లు, సర్వీసు రిజర్వాయర్లు, అంతర్గత సరఫరా వ్యవస్థ, ఇళ్లకు నల్లా కనెక్షన్లు, మీటర్ల కోసం ఈ మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. నల్లా మీటర్ల కొనుగోలుకే రూ. 170.32 కోట్ల నిధులు కావాలని ఈ ప్రతిపాదనల్లో కోరింది. నీటి వృథాను అరికట్టడం, వినియోగం ఆధారంగా నీటి బిల్లులు వసూలు చేసేందుకు మీటర్లు తప్పనిసరి అని అధికారులు పేర్కొంటున్నారు. రూ. 3 వేల కోట్లతో పట్టణ ‘గ్రిడ్’ హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాల పరిధిలో ఉన్న 67 నగరాలు, పట్టణ ప్రాంతాలకు ‘వాటర్ గ్రిడ్’ కింద నీటి సరఫరా కోసం రూ.3,038 కోట్ల అంచనా వ్యయంతో వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉందని ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం తేల్చింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మూడు వేర్వేరు రకాల పనులను ప్రతిపాదించింది. అందుబాటులో సరిపడ నీళ్లున్నా.. సరఫరా వ్యవస్థ (డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్) లేక చాలా ప్రాంతాలకు నీటి సరఫరా జరగట్లేదు. ఈ నేపథ్యం లో 10 పట్టణాల్లో నీటి సరఫరా పనుల కోసం రూ.657.43 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. నీటి సరఫరా నియమావళి ప్రకారం పట్టణ ప్రాం తాల్లో రోజూ ప్రతి వ్యక్తికి 135 లీటర్ల సరఫరాకు స్థానికంగా సరిపడ నీటి లభ్యత లేదు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న 24 పట్టణాల్లో రూ.717.51 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలతోపాటు కొన్ని పాత మున్సిపాలిటీల్లో ముడి నీటి సరఫరా మెయిన్ పైప్లైన్లు, నీటి శుద్ధీకరణ వ్యవస్థ, ఓవర్ హెడ్ ట్యాంకులు, సరఫరా వ్యవస్థ అందుబాటులో లేవు. రాష్ట్రంలోని 33 పట్టణాల్లో ఈ పనులకు రూ.1662.67 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. భవిష్యత్తు జనాభా అవసరాలకు.. వాటర్ గ్రిడ్ పథకం కింద 2050 నాటికి పెరగనున్న జనాభ అవసరాలను తీర్చేలా రాష్ట్రంలో నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధిపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా పట్టణ నీటి సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు మరో రూ. 2,276.09 కోట్లు అవసరమని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం సర్కారుకు సమర్పించిన నివేదికలో తెలిపింది. -
అట్టర్ ఫ్లాప్
మచిలీపట్నం : ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన 100 రోజుల ప్రణాళిక నిధుల లేమితో కొట్టుమిట్టాడింది. పంచాయతీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం పనులు చేయడానికి అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో కాగితాలపై తప్ప క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా జరగకపోవటం గమనార్హం. మొక్కలు నాటమన్నారు.. ఒక్కటీ ఇవ్వలేదు! మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచించినా ఒక్క పంచాయతీకి కూడా మొక్కలు ఇవ్వలేదని ఆయా పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు చెబుతున్నారు. మొక్కలు కావాలని ఇండెంట్ పెట్టినా ఇంతవరకు రాలేదని వారు తెలిపారు. మేజర్ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేసేందుకు కార్మికులతో పాటు ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. మైనర్ పంచాయతీల్లో ఈ వెసులుబాటు లేకపోవటంతో పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులు జరగలేదు. మైనర్ పంచాయతీల్లో డ్రెయిన్లలో పూడికతీత నామమాత్రంగానే జరిగింది. నిధులు లేకుండా పనులు ఎలా... పంచాయతీల్లో వంద రోజుల ప్రణాళిక అమలుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులుృవిడుదల చేయకపోవటంతో ఒక్క పనీ జరగలేదు. చేతిపంపులు, కుళాయిలు, పైప్లైన్లు నూరుశాతం మరమ్మతులు చేయాలని చెప్పినా నిధుల లేమి కారణంగా ఈ పనులు చేయలేదు. కంప్యూటర్లకు సంబంధించి పరికరాలు కొనుగోలు చేయాలని సూచించినా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవటంతో ఆ ప్రయత్నమే జరగలేదు. పంచాయతీల్లోని రోడ్లకు మరమ్మతులు చేయాల్సి వస్తే ఆయా నివేదికలను పంపాలని ప్రభుత్వం కోరింది. పంచాయతీల నుంచి నివేదికలు వెళ్లినా నిధులు విడుదల కాకపోవటంతో మరమ్మతులు జరగలేదు. అన్ని పంచాయతీల్లో వీధి లైట్లను నూరుశాతం వెలిగించాలనే నిబంధన విధించినప్పటికీ నిధుల కొరత కారణంగా అరకొరగా ఈ పనులు చేసి చేతులు దులుపుకున్నారు. డంపింగ్ యార్డులు లేని మైనర్ పంచాయతీల్లో 10 సెంట్ల భూమి, మేజర్ పంచాయతీల్లో అర ఎకరం భూమి రెవెన్యూ అధికారుల ద్వారా కేటాయిస్తామని ప్రకటించారు. దీంతో పంచాయతీల నుంచి డంపింగ్ యార్డుల కోసం వినతులు ప్రభుత్వానికి వెళ్లాయి. రెవెన్యూ అధికారులు ఈ అంశంపై దృష్టిసారించకపోవటంతో డంపింగ్ యార్డులకు భూమి కేటాయింపు అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దోమల నివారణకు బెటైక్స్, ఎబేట్, టెక్నికల్ మలాథియాన్ వంటివి పిచికారీ చేయాల్సి ఉంది. పంచాయతీల్లో ఉన్న కొద్దిపాటి నిల్వలను పిచికారీ చేసినట్లు చూపి ఈ కార్యక్రమాన్ని నామమాత్రంగానే చేశారు. మరుగుదొడ్లకు ఇసుక కొరత... ఇసుక కొరత కారణంగా ఏ పంచాయతీలోనూ మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఒక్కొక్క మరుగుదొడ్డికి రూ.9,900 మంజూరు చేస్తామని ప్రకటించింది. ఆచరణలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చవుతోంది. అదనపు ఖర్చు చేసి మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. వంద రోజుల ప్రణాళికను సక్రమంగా అమలు చేయాలని సర్పంచులు, అధికారులు చొరవ చూపినా నిధుల కొరతతో పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. 15 రోజులకే ముగిసిన ఆన్లైన్ నివేదికల ప్రక్రియ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఆయా అంశాలపై దృష్టి సారించాలని సూచించిన ప్రభుత్వం ఆయా పంచాయతీల్లో ప్రతిరోజూ చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఆన్లైన్లో నివేదిక పంపాలని నిబంధన విధించింది. మూడు, నాలుగు పంచాయతీలకు కంప్యూటర్ ఆపరేటర్‌ను కేటాయించటంతో 12 నుంచి 15 రోజుల పాటు ఈవోపీఆర్డీల పర్యవేక్షణలో నివేదికలు పంపి అనంతరం ఈ ప్రక్రియను నిలిపివేశారు. జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైన అనంతరం ఈ నివేదికలను పంపే అంశంపై పట్టించుకునేవారే కరువయ్యారు. వంద రోజుల ప్రణాళిక ముఖ్యాంశాలివీ... - పారిశుద్ధ్యం - డ్రెయిన్లలో పూడికతీత - మొక్కలు నాటడం - వీధి లైట్లు వంద శాతం వెలిగించటం - చేతిపంపులు, పబ్లిక్ కుళాయి మరమ్మతులు - తాగునీటి పైప్లైన్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో నూతన పైపులు వేయటం - పంచాయతీ కార్యాలయాల్లోని కంప్యూటర్లకు అవసరమైన సామగ్రి కొనుగోలు - రోడ్ల మరమ్మతులు - డంపింగ్ యార్డుల కోసం స్థలసేకరణ - దోమల నివారణకు మందుల పిచికారీ - మరుగుదొడ్ల నిర్మాణం -
‘జూరాల’.. నీరెలా?
గద్వాల : గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని 184 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన జూరాల భారీ తాగునీటి పథకం అడుగడుగునా లీకేజీలమయంగా మారింది. ట్రయల్న్‌న్రు దాటి పనులు ముందుకు సాగ డం లేదు. దీంతో పాతపైపుల స్థానంలో కొ త్త పైపులు వేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ ఉ న్నతాధికారులు కిందిస్థాయి ఉద్యోగులతో సర్వే చేయించారు. పైప్లైన్ల మార్పునకు రూ.85కోట్లు అవసరమవుతుందని అంచనావేసి ప్రభుత్వానికి నివేదించారు. జూరా ల రిజర్వాయర్ నుంచి డివిజన్లోని ప్రతీ గ్రామానికి తాగునీళ్లను అందించాలనేల క్ష్యంతో వైఎస్ ప్రభుత్వం 2005లో దాదాపు రూ.110 కోట్ల అం చనావ్యయంతో చేపట్టిన ఈ భారీతాగునీటి పథకానికి రూ.35కోట్లు కేటాయించింది. ఈ పథకం కేవలం రెండేళ్లలో పూర్తయి ప్రజల దాహార్తిని తీర్చాల్సి ఉంది. కానీ కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించడంలో ఆలస్యం చేసింది. రెండేళ్ల తర్వాత పనులను ప్రారంభించగా, మొద టి విడత నిధులు సరిపోక అదనపు ని ధుల కోసం పనులు మళ్లీ ఆగాయి. 2012 ఆగస్టులో పనులు పూర్తిచేసి ఫిల్టర్‌బెడ్స్ నుంచి మొదటిదశలో కొండగట్టు వరకు ట్రయల్‌ర న్ నిర్వహించారు. చివరికి ప్రధానలైన్ అ డుగడుగునా లీకేజీలు ఏర్పడటంతో ఈ ప థకాన్ని ప్రారంభించకుండానే వాయిదా వేశాయి. నిధులిస్తేనే నీళ్లు! ప్రధాన పంపుహౌస్ నుంచి 4.5 కి.మీ దూ రంలో ఉన్న కొండగట్టుపై నిర్మించిన ట్యాంకు వరకు లీకేజీలమయమైన పైపుల ను తొలగించి వాటిస్థానంలో డీఐ పైపుల ను ఏర్పాటుచేశారు. దీంతో సమస్య పరిష్కారమైందని కొండగట్టు నుంచి డిస్ట్రిబ్యూషన్ లైన్లో నీటి విడుదలను 2013 ఆగస్టులో ప్రారంభించగా మళ్లీ లీకేజీలు మొదలయ్యాయి. పైప్లైన్ల సామర్థ్యాన్ని తనిఖీచేసి అవసరమైన చోట పై పులను మార్చాలని అధికారులు నిర్ణయించారు. గత రెండురోజుల పైప్లైన్ల లో నీటి ఒత్తిడిని పరిశీలిస్తున్నారు. మొదటిదశలో 31 గ్రామాలకు తాగునీటిని అం దించాలని చేసిన ప్రయత్నాలు లీకేజీలతో నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ టెస్ట్న్ల్రు నిర్వహించకుండానే పనులను వదిలేశా రు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు లీకేజీలకు కారణమైన పైపులను తొలగించి కొత్తలైన్లకు సర్వే చేయించారు. 184 గ్రామాలకు తాగునీళ్లను అందించే పథకం సిద్ధమై పైప్లైన్ల కారణంగా నిలి చిపోయి.. వృథాగా మారిన విషయాన్ని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంత్రి కే. తారకరామారావు దృష్టికి తీసుకెళ్లారు. ఇంతటి భారీ పథకానికి పైప్లైన్లను మా ర్చి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అం దించేందుకు మంత్రి సుముఖత వ్యక్తంచేసినట్లు మాజీ ఎంపీ మందా జగన్నాథం తెలిపారు. దీంతో ఇప్పటికే పైప్లైన్లు వే యడానికి ఖర్చయిన దాదాపు రూ.50 నుంచి రూ.60 కోట్లు మట్టిపాలైనట్లయింది. -
వరద గూ(గో)డు
తుంగభద్ర ఉగ్రరూపం ఇప్పటికీ గుర్తే. ఆ దృశ్యాలు చెరిగిపోని చేదు జ్ఞాపకాలు. తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడొస్తుంది. ఊరూవాడా కొట్టుకుపోగా.. కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబాలు కోకొల్లలు. ప్రాణమైతే మిగిలింది కానీ.. ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేందుకు పడిన కష్టం అంతాఇంతా కాదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదిగో.. ఇదిగో అంటూ సరిపెట్టింది. అత్తెసరు సాయంతో మూతి పొడిచింది. గూడు పేరిట.. మొండి గోడలతో సరిపెట్టింది. ఆ నిర్లక్ష్యం ఇప్పటికీ వరద బాధితులను వెక్కిరిస్తోంది. కర్నూలు(రూరల్): ఐదేళ్లు గడిచినా వరద బాధితులకు గూడు కరువైంది. నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. నిర్మాణంలోని ఇళ్లను పూర్తి చేస్తామని.. తక్కినవి బాధితులే కట్టుకుంటే పరిహారం ఇస్తామనే హామీతో బాధ్యత నుంచి తప్పుకుంది. 2009లో వరదలు బీభత్సం సృష్టించగా.. ఆరు నెలల్లోపు బాధితులందరికీ పునరావాసం కల్పిస్తామని నమ్మబలికిన నేతలు ఆ తర్వాత మొహం చాటేశారు. ఇప్పుడిక కొత్త ప్రభుత్వం చుట్టూ వీరి ఆశల ‘పందిరి’ అల్లుకుంటోంది. కర్నూలు మండల పరిధిలోని సుంకేసుల, జి.శింగవరం, నిడ్జూరు, మునగాలపాడు, మామిదాలపాడు గ్రామాలను వరదలు తుడిచిపెట్టేశాయి. సుంకేసుల గ్రామంలో పునరావాస కాలనీలో 576 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 100 పూర్తి కాగా.. మిగతా ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. కాలనీలో మంచినీటి పైపులైన్లు, అంతర్గత రోడ్ల ఊసే కరువైంది. జి.శింగవరంలో 1039 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా 692 పూర్తయ్యాయి. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంతర్గత రోడ్లు నిర్మించకపోవడం.. వీధి లైట్లు.. పైపులైన్లు ఏర్పాటు చేయకపోవడంతో వరద బాధితుల్లో ఇళ్లలో కాపురం ఉండేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అంతర్గత రోడ్లకు రూ.80 లక్షలు మంజూరైనా పనులు చేపట్టకపోవడం గమనార్హం. నిడ్జూరుకు 966 ఇళ్లు మంజూరు కాగా 654 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 200 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా.. మిగతా ఇళ్లకు సంబంధించి ఇప్పటికీ భూ సేకరణ కూడా చేపట్టకపోవడం వరద బాధితుల దుస్థితికి నిదర్శనం. ఇక్కడా పైపులైన్లు, అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని గాలికొదిలేశారు. మామిదాలపాడులో 459 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా 2011లో ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, అప్పటి కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ భూమి పూజ చేశారు. ఆ తర్వాత 22 ఇళ్లకు మాత్రమే పునాది పడినా ఇప్పటికీ నిర్మాణం ఒక్క అడుగు కూడా కదలకపోవడం నేతల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. పైకప్పు ఏసినారంతే.. సెంటు భూమి లేదు. కూలికి పోతేనే పూట గడిచేది. 2009లో వచ్చిన వరదల్లో ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన తడికెలతో తాత్కాలికంగా గుడిసె వేసుకున్నాం. వానలకు అది కూడ కూలిపాయ. ఇప్పుడు చెట్ల కింద బతుకుతున్నాం. ఐదుగురు కూతుళ్ల పెండ్లిళ్లు సేయనీక శానా కష్టపడిన. ఇల్లు కట్టిస్తామని సెప్పిన సారోల్లు పైకప్పు ఏసి వదిలేసినారు. సిమెంట్ సేయలేదు. పేదలంటే అందరికీ లోకువే. కాలనీల ఉండలేకపోతున్నాం.- ఉసేనమ్మ, నిడ్జూరు ఇళ్ల మధ్య కంప సెట్లు వరదల్లో కట్టుబట్టలతో మిగిలినం. అప్పులు సేసి ఏసుకున్న రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నాం. ఇద్దరు కొడుకులున్నారు. కూలి పనికి పోతేనే పూట గడుస్తాది. మాలెక్కటోల్లకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తాదంటే సంతోషించిన. పనులైతే మొదలు పెట్టినారు కానీ సరిగ జరుగుతలేవు. కరెంటు, నీళ్లు, రోడ్లు లేక రేత్రిల్లు శానా ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్ల మధ్య కంప సెట్లు పెరిగినాయి. యా సారూ మా బాధలు పట్టించుకోల్యా. మా బతుకులింతే.- మల్లికార్జునయ్య, జి.శింగవరం -
పానీ పట్టు యుద్ధం!
పరిశుభ్రతపై అనుమానమే.. నగర పాలక సంస్థ సరఫరా చేసే నీరు కలుషితమై వస్తోంది. నీటిలో నల్లటి నలకలు, పాచి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈద్గామిట్ట, తూకుమానుమిట్ట, శ్రీనివాసపురం, జ్ఞానమ్మతోట, కామాక్షినగర్ ప్రాంతాల్లో నీరు ఎర్రగా ఉండి వాసన వస్తోంది. నీరు కూడా దుర్వాసన కూడా వస్తున్నాయని స్థానికులు తెలిపారు. అదేవిధంగా మన్సూర్‌నగర్, వాకర్స్‌రోడ్డు ప్రాంతాల్లో పైప్లైన్లకు లీకులున్నాయి. లీకుల ద్వారా వ్యర్ధాలన్నీ పైప్లైన్లలోకి చేరుతున్నాయి.కోటమిట్ట ప్రాంతంలో పదిహేను రోజులుగా నీరు నల్లగా వస్తోంది. సుమారు అరగంట పాటు నల్లగా వ చ్చి తర్వాత మామూలుగా వస్తాయని స్థానికులు తెలిపారు. సీఆర్పీ డొంకలో కుళాయిల్లో కలుషిత నీరు వస్తోంది. దీంతో కుళాయిలకు వస్త్రాన్ని చుట్టేసి నీటిని పట్టుకుంటున్నారు. అప్రమత్తంగా లేకపోతే బిందెల్లోకి అపరిశుభ్రమైన నీరు రావడం ఖాయం. హరనాథపురం ప్రాంతంలో కూడా తాగునీరు కలుషితమవుతోంది. పైప్లైన్లలో వ్యర్థాలు కొట్టుకుని వస్తున్నాయి. స్కవర్‌వాల్వ్‌లు తిప్పకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటున్నట్లు సమాచారం. రెండు రోజులకోసారి స్కవర్‌వాల్వ్‌లు తిప్పుతుంటే వ్యర్ధాలన్నీ బయటకు కొట్టుకుపోయి పైప్లైన్లన్నీ శుభ్రమవుతుంటాయి. స్కవర్‌వాల్వ్‌ల గురించి పట్టించుకోకపోవడంతో కలుషిత నీరు వస్తున్నట్లు తెలిసింది. నెల్లూరు(అర్బన్), న్యూస్‌లైన్: నగరంలో జనరల్ కుళాయి కనెక్షన్లు 24,538, బీపీఎల్ కుళాయి కనెక్షన్లు 9759, మీటర్ కనెక్షన్లు 637, ఓవైటీ 3446 కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలి. అయితే అనేక ప్రాంతాల్లో తాగునీరు సక్రమంగా సరఫరా కావడంలేదు. నీరు 20నిమిషాల కన్నా ఎక్కువగా కుళాయిల నుంచి రావు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలో ఉన్న బోర్లు, క్యాన్లను కొనుగోలు చేసి నీటిని ఉపయోగించుకుంటున్నారు. అయితే పెన్నకు అవతల ప్రాంతాలైన వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డి కాలనీ ప్రాంతాలకు తాగునీటి ఎద్దడి ముంచుకొచ్చింది. ఆ ప్రాంతంలో బోర్లు, బావులు ఎండిపోవడంతో ప్రజలకు మున్సిపాలిటీ సరఫరా చేసే నీరే దిక్కవుతోంది. అయితే ఇక్కడ కుళాయిల్లో రెండు, మూడురోజులకోసారి కూడా నీరు రావడంలేదు. నగర పాలక సంస్థ ఈ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తోంది. ఈ నీరు అందరికీ చేరడంలేదు. కండబలమున్న వారి ఇళ్ల వద్దే ట్యాంకరు నిలుపుతున్నారు. దీంతో అందరికీ సక్రమంగా నీరు అందడంలేదు. కొన్ని ప్రాంతాలకు అసలు ట్యాంకర్లు కూడా పోవడంలేదు. ఉదాహరణకు సీపీఎం కార్యాలయం వెనుక ఉన్న కింది ప్రాంతానికి నీరే చేరడంలేదు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న పేదలు కుళాయి నీటి మీదనే ఆధారపడి ఉన్నారు. ఈ నీరు రెండు, మూడురోజులకు కూడా రావు. వచ్చినా ఐదారు బిందెలు పట్టేసరికి ఆగిపోతాయి. ఇక వీరి బాధలు వర్ణనాతీతం. బిందెలు తీసుకుని రైల్వేట్రాక్ అవతల వైపునకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. రైల్వేట్రాక్ అవతల వైపు నుంచి నీరు తెచ్చుకోవడం వీరికి ప్రాణాంతకమవుతోంది. ఇస్లాంపేట ప్రాంతంలో నీటికోసం ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆటోల్లో డ్రమ్ములు, క్యాన్లు వేసుకుని ఇనమడుగు సెంటరుకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. తమకు నీటి నిల్వలు తగ్గిపోతాయని, ఇక్కడికి రావద్దంటూ ఆ ప్రాంత వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఇస్లాంపేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి నీరు సరఫరా చేసేందుకు మూడు ట్యాంకర్లు కేటాయించారు. అయితే ఆ నీరు సరిపోవడంలేదు. ప్రజలు ఒక్కసారిగా వచ్చి బిందెలుతో ట్యాంకరు చుట్టూ మూగుతుండటంతో సిబ్బందికి ఇబ్బందులు తప్పడంలేదు. ఈ క్రమంలో తరచూ వివాదాలు రేగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పబ్లిక్‌హెల్త్ విభాగం పైప్‌లైన్ పనుల్లో జాప్యం ఈ ప్రాంత వాసులకు శాపంలా మారింది. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో పైప్లైన్లకు చిన్నచిన్న మరమ్మతులు చేస్తే నీటికోసం ఇక్కట్లు తగ్గుతాయి. అయితే అధికారులు దీనిపై దృష్టి సారించడంలేదు. మరోవైపు నగరంలోని పలు ట్యాంకుల్లో పైకప్పులు ధ్వంసమయ్యాయి. దీంతో కోతులు స్వైర విహారం చేస్తూ నీటిని కలుషితం చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.