ప్రక్షాళన షురూ..
మురుగునీటి పైపులైన్ల ప్రక్షాళనకు రంగం సిద్ధం..
జూన్10లోగా పనులు పూర్తిచేయాలని ఎండీ దానకిశోర్ ఆదేశం..
16 డివిజన్లకు రూ.2.31 కోట్లు కేటాయింపు..
సిటీబ్యూరో: గ్రేటర్‌లో చిన్నపాటి వర్షానికే ఉప్పొంగుతున్న మురుగునీటి పైపులైన్లు, మ్యాన్‌హోళ్ల ప్రక్షాళనకు ఎట్టకేలకు జలమండలి నడుం బిగించింది. మహానగర పరిధిలోని సుమారు ఐదు వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మురుగునీటి పైపులైన్లలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడికను జూన్ 10లోగా యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఎండీ దానకిశోర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ప్రీమాన్‌సూన్ యాక్షన్ ప్లాన్‌ను సోమవారం ఖరారు చేశారు. పనులు చేపట్టేందుకుగాను 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో రూ.2.31 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నిర్వహణ డివిజన్ల వారీగా చీఫ్ జనరల్ మేనేజర్లు తమకు కేటాయించిన బడ్జెట్ మేరకు పనులను గుర్తించి ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు.
చేపట్టాల్సిన పనులు ఇవే..
లోతట్టు ప్రాంతాలు, తరచూ నీటమునిగే ప్రాంతాలు, మురుగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు, మురుగునీటి పైపులైన్ల పూడికను తొలగించాలి. పనులు చేపట్టాల్సిన ప్రాంతాలను తక్షణం గుర్తించి, కార్యాచరణ సిద్ధంచేయాలి. పనుల ప్రారంభానికి ముందు స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల అనుమతి తీసుకోవాలి. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో జీఎంలు,సీజీఎంలు పర్యటించి ఫోటోలు తీసి సీడీల రూపంలో బిల్లులతో సహా బోర్డుకు సమర్పించాలి. ఎయిర్‌టెక్ యంత్రాల సాయంతో పూడిక తొలగించాలి.
{పతి స్టోరేజి రిజర్వాయర్ వద్ద అవసరమైన మేరకు క్లోరినేషన్ ప్లాంట్లును జూన్1 లోగా ఏర్పాటు చేయాలి. 600 ఎంఎం డయా వ్యాసార్థం దాటిన మురుగునీటి మ్యాన్‌హోళ్లపై సేఫ్టీగ్రిల్స్ ఏర్పాటు చేయాలి. 29 అత్యవసర బృందాలకు అవసరమైన యంత్రసామాగ్రిని సమకూర్చాలి. ఒక్కో బృందంలో పదిమంది సభ్యులుండాలి. వారికి అవసరమైన వాహనం సమకూర్చాలి. జూన్-ఆగస్టు మధ్యకాలంలో అత్యవసర బృందాలు మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో రంగంలోకి దిగి పనులు చేపట్టాలి.
జూన్-ఆగస్టు మధ్యకాలంలో ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్‌కు అందిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి. ఫిర్యాదుల స్వీకరణకు షిఫ్టులవారీగా సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఒక డీజీఎం ఈ సెల్‌ను పర్యవేక్షించాలి. సెంట్రల్ స్టోర్ డివిజన్ నుంచి 29 అత్యవసర బృందాలకు అవసరమైన సాధనాసంపత్తి,యంత్రాలను సమకూర్చాలి.