నగర శివారు పోచారంలో ఉన్న బీజీఎల్ స్టేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) సరఫరా చేయాలనే ప్రభుత్వం లక్ష్యం నీరుగారింది. ప్రాజెక్టు అమలు బాధ్యతలను నెత్తినెత్తుకున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ గ్యాస్ పంపిణీలో చేతులెత్తేసింది. ప్రాజెక్టును ప్రారంభించి పన్నెండేళ్లయినా 28% పనులు కూడా పూర్తికాకపోవడంతో పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ ఇప్పట్లో అందడం కలగానే కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అనాలోచిత నిర్ణయాలు, అంతర్గత కుమ్ములాటల ఫలితంగా ఈ ప్రాజెక్టు మొదటి విడత తొలి అయిదేళ్ల లక్ష్యమే ఇప్పటివరకు పూర్తి కాకపోగా, కాలపరిమితి పొడిగింపుతో అంచనా వ్యయం తడిసిమోపెడవుతోంది.
ఏపీ, తెలంగాణలోని హైదరాబాద్, విజయవాడ, కాకినాడ నగరాల్లో గత పన్నెండేళ్లలో 2,44,469 గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వగా, 209 వాణిజ్య కనెక్షన్లు, 47 పరిశ్రమలకు ఇండస్ట్రీ గ్యాస్ కనెక్షన్లను జారీ చేసినట్లు బీజీఎల్ వార్షిక నివేదిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక సీఎన్‌జీ పురోగతిని పరిశీలిస్తే.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) పరిధిలో 116, ఆర్టీసీ పరిధిలో 6, ఎంఎస్ అండ్ కోకో పరిధిలో 4 సీఎన్జీ స్టేషన్లు వాహనాలకు వాయువును సరఫరా చేస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సీఎన్జీతో నడిచే వాహనాల్లో కార్లు 30,894, ఆటోలు 38,367, బస్సులు 1,092 ఉన్నట్లు లెక్కలు స్పష్టం చేసున్నాయి.
మొక్కుబడిగా విస్తరణ..
►నగర శివారులోని శామీర్‌పేట్‌లో మదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన బీజీఎల్.. 2011 నవంబర్ 21న సిటీ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. తొలి అయిదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా వాహనాలకు సీఎన్‌జీ గ్యాస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తొలుత మదర్‌స్టేషన్ సమీపంలోని నల్సార్ వర్సిటీ క్యాంపస్‌లోని 30 ఫ్లాట్‌లకు పీఎన్‌జీ కనెక్షన్లు జారీ చేసింది. అనంతరం మేడ్చల్‌లో సుమారు 410 కుటుంబాలకూ పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చింది.
►ఇప్పటికే కనెక్షన్లు పొందిన వినియోగదారులకు సైతం పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసేందుకు బీజీఎల్ ఆపసోపాలు పడుతోంది. 20 ఏళ్లలో రూ.3,166 కోట్ల అంచనా వ్యయంతో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించాలని బీజీఎల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు తొలి దశలో పైప్‌లైన్ పనులు పూర్తి చేసేందుకు సుమారు రూ.733 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. పనులు గాడిలో పడకపోవడంతో కాలపరిమితి పొడిగింపునకు బీజీఎల్ సంస్థ మొగ్గు చూపుతోంది. మరోవైపు గ్రిడ్ నుంచి తగినంత గ్యాస్ సరఫరా లేక, ప్రతిపాదిత పైప్‌లైన్ మార్గంలో క్లియరెన్సుల జారీలో జాప్యం కూడా ప్రాజెక్టుపై ప్రభావం చూపుతోంది.
సీఎన్‌జీ కూడా అంతంతే
►హైదరాబాద్‌లో పూర్తి స్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం ముందుకు సాగడం లేదు. శామీర్‌పేట్ మదర్ స్టేషన్ ఏర్పాటు చేసి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ కొంతకాలంగా గ్యాస్ కొరతతో గ్రిడ్ నుంచి స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేక పోతోంది. పన్నెండేళ్ల క్రితం గ్రేటర్‌లో ప్రజా రవాణాకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలకు సగటున రోజుకు 7,62,500 కిలోల (1.067 ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరమని బీజేఎల్ అంచనా వేసింది.
►తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ పంపిణీ చేస్తామని ప్రకటించింది. కానీ కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసినా ప్రస్తుతం ఈ సంఖ్య 135కు పడిపోయింది. దీంతో 215 సీఎన్జీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక నగరంలో ఏర్పాటు చేసిన సీఎన్జీ స్టేషన్ల ద్వారా కూడా గ్యాస్ సరఫరా అంతంత మాత్రంగా మారింది. ప్రతిరోజూ డిమాండ్‌కు తగినట్లు సీఎన్జీ సరఫరా కావడం లేదని డీలర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
స్మార్ట్ గ్యాస్ నగరం.. ఆమడదూరం..
►ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాతో స్మార్ట్ గ్యాస్ నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలనే లక్ష్యం కూడా అమడ దూరంగా తయారైంది. 2010లో ప్రారంభమైన భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ల పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. ముందుగా 200 కిలోమీటర్ విస్తరించి నగరంలో లక్ష కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ పుష్కర కాలమైనా కనెక్షన్ల సంఖ్య 43వేలకు దాటలేదు. నగరంలో పాముల కాలువ నుంచి ప్రారంభమైన గ్యాస్ పైపు ప్రధాన లైన్ పనులు ఆంతంత మాత్రంగా మారాయి.
►పైప్‌లైన్లు వేయటానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించినా.. పనులు మాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఇక సీఎన్జీ పరిస్థితి కూడా మరింత అధ్వానంగా తయారైంది. ఇప్పటివరకు సీఎన్జీ వాహనాల సంఖ్య 25,923 కూడా దాటలేదు.
►కాకినాడలో సైతం బీజేఎల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ మొదటి విడతగా 93 వేల గృహాలకు వంటగ్యాస్ సరఫరాకు మదర్ స్టేషన్ ఏర్పాటు చేసినా గృహోపయోగ కనెక్షన్ల సంఖ్య 58 వేలు దాటలేదు. వివిధ ప్రాంతాలకు పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో విపరీతమైన జాప్యం, మరోవైపు వరుస అడ్డంకులు ఈ పరిస్థితికి దారితీసినట్లు తెలుస్తోంది. వాహనాలకు వాయువు అందించే సీఎన్జీ స్టేషన్ల సంఖ్య డజను కూడా దాటకపోగా.. సీఎన్జీ వాహనాల సంఖ్య 1,728 మాత్రమే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment