న్యూఢిల్లీ: సహజ వాయువు రేట్లను ఏకంగా 40 శాతం పెంచుతూ చమురు శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో యూనిట్ (ఎంబీటీయూ) రేటు రికార్డు స్థాయిలో 6.1 డాలర్ల నుంచి 8.57 డాలర్లకు చేరింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచుతూ చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఆదేశాలు జారీ చేసింది.
ఫలితంగా వాహనాల్లో ఉపయోగించే సీఎన్‌జీ, వంట అవసరాల కోసం పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే పీఎన్‌జీ రేట్లకు రెక్కలు రానున్నాయి. ధరల పెంపు సామాన్యుడిపై ప్రభావం చూపనుంది. గ్యాస్‌ను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఎరువులు, విద్యుత్ తయారీ వ్యయాల భారం కూడా పెరగనున్నాయి. సాధారణంగా గ్యాస్ రేట్లను ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న) సమీక్షిస్తుంది.
అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లకు అనుగుణంగా నిర్దిష్ట ఫార్ములా ప్రకారం సవరిస్తుంది. మరోవైపు, ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశాలు ఉన్నందున రేట్ల ఫార్ములాను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యంలో కేంద్రం కమిటీ వేసింది. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికే నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.
చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్!
Comments
Please login to add a commentAdd a comment