Cleansing
-
రాజకీయ నిరుద్యోగుల అడ్డాగా టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రాజకీయ నిరుద్యోగులకు అడ్డాగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కనీస అర్హతలు లేని వ్యక్తులను కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించడంతో కమిషన్ పనితీరు అస్తవ్యస్తమైందని మండిపడ్డారు. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అల్లకల్లోలంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ అభ్యర్థుల ఆధ్వర్యంలో జరిగిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్‌లతో కలసి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరి, కమిషన్ తీరుపై విరుచుకుపడ్డారు. సీఎం కుటుంబానికి అవి ఏటీఎంలు... మంత్రి కేటీఆర్‌కు టీఎస్పీఎస్సీ, సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు, ఎమ్మెల్సీ కవితకు సింగరేణి సంస్థలు ఏటీఎంలుగా మారాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కార్యాలయంలో పనిచేసే వ్యక్తుల బంధువులే టీఎస్పీఎస్సీ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారని.. వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్ష విషయంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పబట్టినా ఇప్పటికీ బోర్డును రద్దు చేయకుండా మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో 30 లక్షల మంది నిరుద్యోగులతోపాటు వారి తల్లిదండ్రులు కలిపి మొత్తం 90 లక్షల మంది ఓటు ద్వారా కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఏటా జనవరిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, టీఎస్పీఎస్సీ తీరును నిరసిస్తూ ఈ నెల 14న సడక్ బంద్ (రహదారుల దిగ్బంధం) చేపట్టాలని పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ‘సిట్’ నివేదిక వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కొత్త బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కోదండరాం పిలుపు మేరకు రహదారుల దిగ్బందానికి టీపీసీసీ పూర్తి మద్దతు ప్రకటించింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ వినాయక్‌రావు పాల్గొనగా నిరుద్యోగులు శివానంద స్వామి, మహేష్, మిత్రదేవి అధ్యక్షత వహించారు. -
ప్రజా రవాణా.. భద్రతకేదీ ఠికాణా
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ 30వ భద్రతా వారోత్సవాలు ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాలం చెల్లిన బస్సులను పక్కనబెట్టనంత వరకు ఈ ఉత్సవాల వల్ల ప్రయోజనం లేదని కార్మికులు, కార్మికసంఘాల నుంచి విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో తక్షణం పక్కనబెట్టాల్సిన బస్సులు 4,549. అంటే ఇవి 12 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగాయి. ఇపుడు మన బస్సులు ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి ప్రమాదానికి గురవుతాయో చెప్పలేని దుస్థితిలో ఉన్నాయి. ముందుగా ఆర్టీసీని ప్రక్షాళన జరపకుండా ఇలాంటి భద్రతా వారోత్సవాలు ఎన్ని జరిపితే ఏం లాభమని కార్మిక యూనియన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతీరోజు 40 లక్షల మందికిపైగా ప్రజలు ప్రమాదకరంగా కాలంచెల్లిన బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకుంటారా? లేదా అన్నది చర్చానీయాంశంగా మారింది. తెల్ల ఏనుగులపైనే ఆసక్తి.. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సుల సంఖ్య 1,095గా ఉంది. తుక్కు దశకు చేరిన బస్సుల స్థానంలో ప్రధానంగా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు నడిచే బస్సులు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఆర్టీసీలో అంతగా లేదు. కేవలం సంస్థకు భారంగా పరిణమించే తెల్ల ఏనుగుల్లాంటి ఏసీ బస్సులపైనే అమితాసక్తిని ప్రదర్శిస్తోంది. ►ఇదే క్రమంలో 2017లో దాదాపుగా రూ.20 కోట్లు వెచ్చించి వజ్ర బస్సులు కొనుగోలు చేశారు. వీటి ఆక్యుపెన్సీ రేషియో కేవలం 58కి పరిమితమైంది. చాలారూట్లలో ఈ బస్సులు సగం కూడా నిండటం లేదు. ►సెప్టెంబర్ 5వ తేదీన దాదాపుగా రూ.100 కోట్లు పెట్టి ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకుంది. వీటిలో తొలివిడగా 40 ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. ఇవి త్వరలోనే రోడ్డుకెక్కనున్నాయి. ఇలాంటి చర్యలను ఆహ్వానించినా.. ఇవి అందరికీ అందుబాటులోకి ఉండవన్న విషయం మరవకూడదు. ఇతర సంస్థలంటేనే మమకారమా..? రాష్ట్రంలో అతిపెద్ద ప్రజారవాణ సంస్థగా ఉన్న ఆర్టీసీకి ఎలాంటి అదనపు కేటాయింపులు చేయడం లేదు. ఈ సంస్థకు చేయకపోగా.. పోలీసు శాఖకు దాదాపుగా రూ.800 కోట్లు ఇచ్చి దాదాపుగా 3000 వాహనాల కొనుగోలుకు సహకరించింది. హైద రాబాద్‌లో పరుగులు తీస్తున్న మెట్రోకు ఏకంగా రూ.14 వేల కోట్లు వరకు వెచ్చించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక.. 1,400 బస్సులు మినహాయించి కొత్తగా కొనుగోలు చేసింది ఏమీ లేదు. ఇందులో ఎక్స్‌ప్రెస్, సూపర్ డీలక్స్ తదితరాలు ఉన్నాయి. కనీసం బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా పూర్తిగా కేటాయించడం లేదు. ఆర్టీఏ తనిఖీలు ఉండవా? ఆర్టీసీ బస్సుల తనిఖీ అంటేనే ఆర్టీఏ అధికారులు అస్సలు పట్టించుకోరు. పోనీ, పట్టించుకుని తనిఖీలు చేపడితే.. వెంటనే ఫోన్లు చేసి వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు వస్తాయని ఆర్టీఏ ఉన్నతాధికారులు అంటున్నారు. అందుకే, నిబంధనలకు విరుద్ధంగా కాలంచెల్లిన బస్సులు పరిమితికి మించి రోడ్డుపై తిరుగుతున్నా కళ్లప్పగించి చూడటం మినహా వారేం చేయలేని దుస్థితి. సాంకేతికంగా ఈ బస్సులను నడిపించేందుకు ఏమాత్రం అర్హత లేదు. అయినా వీటిల్లో జనాలను కుక్కి ఆర్టీసీ పంపుతోంది.గతేడాది సెప్టెంబరు 11న 65 మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న కొండగట్టు దుర్ఘటనే ఇందుకు చక్కని ఉదాహరణ.ఆక్యుపెన్సీ రేషియో పడిపోతే.. డ్రైవర్లు కండక్టర్లపై ఒత్తిడి తెచ్చి మరీ పెంచుకుంటోంది. అంతే తప్ప ప్రజల రక్షణ కోసం.. జిల్లాలు గ్రామీణ బస్సుల్లో కొత్త బస్సులు వేయాలన్న దిశగా చర్యలు లేక పోవడం విమర్శలకు ఆస్కారమిస్తోంది. ఇదీ బస్సుల దుస్థితి.. ఆర్టీసీలో మొత్తం బస్సులు 10,500 కుపైగా రోజువారీ ప్రయాణికులు 97,00,000 ఒకరోజు ఆదాయం దాదాపు రూ.12,00,00,000 (రూ.12కోట్లు) సంస్థలో కాలంచెల్లిన బస్సులు 4,549. ఈ బస్సుల్లో ఒకరోజు ప్రయాణం చేసేవారు 40,00,000కిపైగా -
విద్యా రంగంలో ప్రక్షాళన!
కడప ఎడ్యుకేషన్:విద్యా రంగంలో ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. విద్యారంగ ప్రగతి సాధనతోపాటు విద్యార్థులకు సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వృథా ఖర్చులను తగ్గించి నిధులు కొరత అధిగమించాలన్న లక్ష్యంతో మూడు శాఖలుగా ఉన్న సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక అభియాన్ (ఆర్ఎంఎస్), స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) పథకాలను ఒకే గొడుకు కిందకు తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి కార్యాచరణను కూడా మొదలు పెట్టినట్లు చర్చ సాగుతుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ కార్యక్రమాన్ని ఈ నెలాఖరుకల్లా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పాఠశాలలను బలోపేతం చేసేందుకే.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేం దుకు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటి వరకూ సర్వశిక్ష అభియాన్ ద్వారా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించేవారు. 9,10 తరగతుల విద్యార్థులకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ప్రాజెక్టు ద్వారా పథకాలను అమలు చేసేవారు. ఇలాగే విద్యార్థులకు, టీచర్లకు నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ౖట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)శాఖ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ మూడుశాఖలను కలిపి ఒకేశాఖగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నిధులతోపాటు సమయం ఆదా.. గతంలో సర్వశిక్ష అభియాన్ ద్వారా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు శిక్షణలు ఇచ్చేవారు. అలాగే 9,10 తరగతులకు రాష్ట్రీయ శిక్షా అభియాన్ వారు శిక్షణలు ఇచ్చేవారు. ఇలా చేయడం ద్వారా నిధుల ఖర్చుతోపాటు సమయం కూడా వృథా అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఈ రెండింటిని ఎస్సీఈఆర్టీ పర్యవేక్షించేది. ఇలా చేయడం ద్వారా నిధులు ఖర్చుతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు చర్చ సాగుతోంది. దీంతో అన్నింటిని ఒకే గొడుకు కిందకు తెచ్చి ఉన్న సిబ్బందిని క్రమబద్ధీకరించి అన్నింటికి కలిపి ఒక ఉన్నతస్థాయి అధికారితో పర్యవేక్షణను పెంచి సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించినట్లు సమాచారం. దీనిని అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని కూడా నియమించినట్లు తెలిసింది. జీఓ రాలేదు సర్వశిక్ష అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ, ఎస్సీఈఆర్టీలను ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికైతే జీఓ రాలేదు. ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. – పొన్నతోట శైలజ, సర్వశిక్షఅభియాన్ ప్రాజెక్టు అధికారి -
ఐటీఐల ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల ప్రక్షాళన మొదలైంది. అరకొర వసతులు, అత్తెసరు బోధనా సిబ్బందితో నెట్టుకొస్తున్న వాటిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ఫిర్యాదుల ఆధారంగా ప్రైవేటు ఐటీఐల్లో తనిఖీలు నిర్వహించేవారు. తాజాగా రాష్ట్రంలోని ప్రతి ప్రైవేటు ఐటీఐని పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని కార్మిక, ఉపాధి కల్పన శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి జిల్లాకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రైవేటు ఐటీఐల్లోని మౌలిక వసతులు, మిషనరీ, బోధనాసిబ్బంది వంటి అంశాలను ప్రాధాన్యతాక్రమంలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 291 పారిశ్రామిక శిక్షణ సంస్థలున్నాయి. వీటిల్లో 65 ప్రభుత్వ, 226 ప్రైవేటు ఐటీఐలున్నాయి. నిర్వహణలోపాలు, వనతుల కొరత, మిషనరీ లేకుండా తరగతులు నిర్వహిస్తున్న 12 ఐటీఐలపై ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో ఉమ్మడి నల్లగొండలో 6, ఉమ్మడి వరంగల్‌లో ఆరింటిని తనిఖీ చేసిన అధికారులు వాటి అనుమతులు రద్దు చేయాలని కేంద్రానికి సిఫారసు చేశారు. నివేదికలు పరిశీలించిన కేంద్ర కార్మిక శిక్షణ ఉపాధి కల్పన శాఖ డైరెక్టర్ జనరల్ వరంగల్ పరిధిలోని 6 ఐటీఐల అనుమతులు రద్దు చేశారు. నల్లగొండ జిల్లా పరిధిలోని 6 ఐటీఐల అనుమతులు సైతం రద్దయ్యే అవకాశం ఉందని రాష్ట్ర కార్మిక శిక్షణ, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కేవై నాయక్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ప్రక్షాళన ఫలించేనా!
భీమవరం : డెల్టా కేంద్రమైన భీమవరం పట్టణం, పరిసర గ్రామాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన పనులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో చేపడుతుందా.. ఆ డ్రెయిన్‌ను కాలుష్య కాసారంగా మార్చేసిన ప్రజాప్రతినిధులు, బడాబాబుల ఒత్తిడికి తలొగ్గకుండా పారదర్శకంగా పనులు చేస్తారా లేక తూతూమంత్రంగా కానిచ్చేసి చేతులు దులిపేసుకుంటారా.. ఇలాంటి అనుమానాలెన్నో డెల్టా వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ పనులను నిలిపివేయాలంటూ మూడేళ్లుగా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో యనమదుర్రు డ్రెయిన్ పక్షాళన అంశం తెరపైకి వచ్చింది. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం పూర్తయితే యనమదుర్రు డ్రెయిన్ మాదిరిగానే గొంతేరు డ్రెయిన్ కూడా కాలుష్య కాసారంగా మారి ప్రజా జీవనానికి ముప్పు తెస్తుందనే ఆందోళన వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భీమవరంలోని విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కీలకంగా ఉంటాయా లేదా అనేది చర్చనీయాంశమైంది. పర్యావరణానికి.. ప్రజారోగ్యానికి సవాల్ డెల్టాలోని ప్రధాన డ్రెయిన్లు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి పెనుసవాల్ విసురుతున్నాయి. ఇప్పటికే యనమదుర్రు డ్రెయిన్ కాలుష్య కాసారం కాగా.. గొంతేరు డ్రెయిన్ సైతం రొయ్యల చెరువుల నుంచి రసాయనాలు,, మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్ వ్యర్థాలు చేరటం వల్ల కలుషితమైంది. ఈ పరిస్థితుల్లో తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయితే గొంతేరు డ్రెయిన్ యనమదుర్రు డ్రెయిన్‌ను తలదన్నేలా కలుషితమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. డెల్టాకు తాగు, సాగునీటిని అందించిన యనమదుర్రు కాలువలోకి తణుకు ప్రాంతం నుంచి మొదలుకొని భీమవరం వరకు పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలు, చెత్త కలుస్తుండటంతో కాలువ డ్రెయిన్‌గా రూపాం తరం చెందింది. ఒకప్పుడు యనమదుర్రులో గోదావరి నదిని తలదన్నే విధంగా మత్స్య సంపద ఉండేది. ఎక్కడికక్కడ వలకట్లు, గరికట్లు ఉండేవి. దిగువ గ్రామాలకు జలరవాణా వ్యవస్థ ఉండేది. ఇందులోకి విష రసాయనాలు, కాలుష్యం పెద్దఎత్తున చేరడంతో యనమదుర్రు కాలువ హైదరాబాద్‌లోని మూసీ నదిని తలపిస్తోంది. మత్స్య సంపద పూర్తిగా కనుమరుగైంది. కాలుష్య నియంత్రణ చట్టం ఉన్నా అమలులో చిత్తశుద్ధి కరువైంది. తణుకు, వేండ్ర ప్రాంతాల్లోని పరిశ్రమలు.. వాటికి దిగువన గొల్లలకోడేరు తదితర ప్రాంతాల్లో వెలసిన ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి నిత్యం టన్నులకొద్దీ కాలుష్యం యనమదుర్రు డ్రెయిన్‌లోకి చేరుతోంది. పరిశ్రమలు కామన్ ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)లను ఏర్పాటు చేసుకుని వ్యర్థ, మురుగు జలాలను శుద్ధిచేసిన అనంతరం బయటకు విడుదల చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా నేరుగా యనమదుర్రు డ్రెయిన్‌లోకి వదిలేస్తున్నారు. భీమవరం పట్టణ, పరిసర ప్రాంతాల్లో యనమదుర్రు డ్రెయిన్ గట్టు వెంబడి ప్రయాణించాలంటే ముక్కు మూసుకోవాలి్సన దుస్థితి ఉంది. డ్రెయిన్ గట్ల వెంబడి నివసించే వారంతా అనారోగ్యం బారిన పడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఆక్రమణలకు అంతేలేదు ఎంతో విశాలమైన యనమదుర్రు గట్లు ఆక్రమణల కారణంగా డ్రెయిన్ కుచించుకుపోయింది. డ్రెయిన్ గట్ల వెంబడి కొందరు పక్కా భవనాలు నిర్మించుకోగా.. మరికొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో ఒక ఆక్వా ప్లాంట్ డ్రెయిన్ గట్టు వెంబడి ఎకరాలకొద్దీ ఆక్రమించి రొయ్యల ప్రాసెసింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భీమవరం–గరగపర్రు ప్రధాన రహదారి పక్కనే ఈ ఆక్రమణ కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆక్రమణదారులు ప్రజాప్రతినిధుల అండతో అధికారులకు ముడుపులు ముట్టచెప్పి తమకు అడ్డులేకుండా చూసుకుంటున్నారు. డ్రెయిన్‌ను ఆక్రమించుకుంటున్న, కాలుష్య కాసారంగా చేస్తున్న వారిలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ పరిస్థితుల నడుమ డ్రెయిన్ ప్రక్షాళన అంశంపై మంగళవారం భీమవరంలో నిర్వహించే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారిం ది. వేండ్రలోని డెల్టా పేపర్ మిల్లు కాలుష్యం యనమదుర్రు డ్రెయిన్‌లో కలుస్తోంది. ఇది నరసాపురం ఎంపీ గోకరాజు గంగారాజు అధీనంలో ఉంది. పలు ఆక్వా ప్లాంట్ల యజమానులు కూడా టీడీపీ నేతలకు వెన్నుదన్నుగా ఉన్నవారే. ఈ నేపథ్యంలో సమావేశం కానున్న ప్రజాప్రతినిధుల స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. -
సాగర్..డేంజర్
హుస్సేన్ సాగర్‌లో మరింత పెరిగిన కాలుష్యం పీసీబీ తాజా పరిశీలనలో వెల్లడి రూ.310 కోట్లు ఖర్చు చేసినా ఫలితం నిల్ తాజాగా నిధులు లేవని ప్రక్షాళన పనులకు ఫుల్స్టాప్ జలాశయంలో ఆక్సిజన్ స్థాయి సున్నాగా నమోదు సిటీబ్యూరో: చారిత్రక హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనను సర్కారు విభాగాలు అటకెక్కించడంతో రోజురోజుకూ జలాశయం గరళాన్ని తలపిస్తోంది. సాగర గర్భంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఘన వ్యర్థాలను తొలగించకపోవడం, కూకట్పల్లి నాలా నుంచి వచ్చి చేరుతున్న పారిశ్రామిక వ్యర్థ రసాయనాలతో జలాశయం రోజురోజుకూ మురుగుకూపంగా మారుతోంది. సాగర్ జలాల్లో ఆక్సిజన్ స్థాయి సున్నాగా నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. గతంలో జైకా బ్యాంకు మంజూరుచేసిన రూ.310 కోట్ల నిధులను మహానగరాభివృద్ధి సంస్థ గతేడాది జూలై నాటికే హారతి కర్పూరంలా ఖర్చుచేసింది. తాజాగా నిధుల లేమిని సాకుగా చూపి ప్రక్షాళన విషయంలో హెచ్ఎండీఏ చేతులెత్తేయడంతో జలాశయంలో హానికారక బ్యాక్టీరియా వృద్ధిచెందుతుందని..నీటి నాణ్యత దెబ్బతింటోందని కాలుష్యనియంత్రణమండలి తాజా పరిశీలనలో తేలింది. రాబోయే వేసవిలో నీటిమట్టాలు మరింత తగ్గి హానికారక రసాయనాల కారణంగా జలాశయం నీటి నుంచి విపరీతమైన దుర్గంధం వెలువడే ప్రమాదం పొంచిఉన్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గరళసాగరం ఇలా... 2016 సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి కూకట్పల్లి, బుల్కాపూర్ తదితర నాలాల నుంచి భారీగా వరద నీరు చేరింది. ఈ వరదనీటిలో బల్క్, డ్రగ్ ఫార్మా కంపెనీలు విడుదలచేసిన హానికారక రసాయనాలున్నాయి. జలాశయం అడుగున సుమారు 40 లక్షల టన్నుల ఘన, రసాయన వ్యర్థాలు గుట్టలా పోగుపడినట్లు అంచనావేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 5 లక్షల టన్నులే తొలగించారు. మిగతాది సాగరగర్భంలో పేరుకుపోవడంతో గరళం నుంచి విముక్తి లభించడంలేదు. అమీర్‌పేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్న ఏ మెయిన్ మురుగు పైప్‌లైన్‌కు ఎన్టీఆర్గార్డెన్ వద్ద గండి పడడంతో తాజాగా ఈమురుగునీరంతా హుస్సేన్‌సాగర్‌లో చేరుతోంది. మురుగునీటిలోని పాథోజెన్స్, హానికారక రసాయనాలతో కలిసి యుట్రిఫికేషన్ చర్య జరిగి ఇ.కోలి, సూడోమోనాస్, సెఫైలోకోకస్, ఎర్గినోసా, షిగెల్లా, సాల్మొనెల్లా, క్విబెల్లా వంటి హానికారక బ్యాక్టీరియా జాతులు వృద్ధిచెందుతున్నాయి.ఈ బ్యాక్టీరియాకు యాంటీబయాటిక్స్ నిరోధకత కూడా అధికమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మురుగు కారణంగా జలాశయంలో డెంగ్యూ, మలేరియాకు కారణమయ్యే దోమల సంతతి వృద్ధి చెందుతోంది. ఈ పరిణామం సమీప ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జలాశయంలో వృక్ష, జంతుజాలం మనుగడకు అవసరమైన ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గింది.జలాశయంలో భారీగా ఫైటోప్లాంక్టన్, ఆల్గే, గుర్రపుడెక్క తదితరాల ఉధృతి భారీగా పెరిగింది.నీటిలో హైడ్రోజన్సల్ఫైడ్ తీవ్రత క్రమంగా పెరిగి రాబోయే వేసవిలో నీటి నుంచి దుర్గంధం భారీగా వెలువడే ప్రమాదం పొంచిఉంది.ఈ జలాశయం పరిసరాల్లో ఎక్కువసేపు గడిపితే కళ్ల మంటలు, దురద, కళ్లలో ఏర్రటి జీరలు ఏర్పడడం తథ్యమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. జలాశయం నుంచి వెలువడే గాలి కారణంగా శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏటా గణేశ్ నిమజ్జనంతో జలాశయంలోకి సుమారు 30 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 40 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగరంలో కలుస్తున్నాయి. జలాశయం నీటిలో బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) తాజాగా ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఇది 35 నుంచి 40 పీపీఎం మించరాదు. సాగర్ నీటిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడీ) 200 పీపీఎంకు మించడం గమనార్హం. సాధారణంగా ఇది 80–100 పీపీఎం మించదు. జలాశయం నీటిలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోయింది. ఇది ప్రతి లీటరు నీటిలో ’సున్న’గా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. -
గోదావరి ప్రక్షాళనకు నిధులివ్వాలి
బోట్‌క్లబ్ (కాకినాడ) : దక్షిణగంగగా పేరుగాంచిన గోదావరి నది ప్రక్షాళనకు కేంద్రం నిధులు కేటాయించాలని కాకినాడ ఎంపీ, టీడీపీ లోక్‌సభ పక్షనేత తోట నరసింహం కోరారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ ఏర్పాటు చేసి పవిత్ర గంగానది ప్రక్షాళనకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో గోదావరిపాటు కృష్ణానది ప్రక్షాళనకు కూడా కేంద్రం నిధులు కేటాయించి పవిత్రతను కాపాడాలని కోరారు. మహారాష్ట్ర నాసిక్ వద్ద పుట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా సుమారు 1,465 కిలోమీటర్లు ప్రవహిస్తున్న గోదావరి నేడు.. నదీ జలాల కాలుష్యంతో పాటు డ్రైనేజీ వ్యర్థాలను ఇష్టానుసారంగా నదిలోకి వదలడం వల్ల చెత్తాచెదారం, మురుగునీరుతో నిండిపోయిందన్నారు. గత ఏడాది జరిగిన పుష్కరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి ప్రక్షాళనకు నిధులు కేటాయించినా సరిపోలేదన్నారు. -
విస్తరణా? ప్రక్షాళనా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు ముహుర్తం దాదాపు ఖరారైంది. మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని వినిపిస్తున్నా... పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయబోతున్నారని పార్టీవర్గాలంటున్నాయి. అక్టోబర్ ఒకటి లేదా తొమ్మిదిన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులుంటాయని టీడీపీ వర్గాలు, అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో తన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక్కరికే చోటు కల్పిస్తారని కొందరంటుంటే, అధికారం చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి ప్రక్షాళన ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర కేబినెట్లో 26 మందికి చోటు కల్పించవచ్చు. ప్రస్తుతం మంత్రివర్గంలో 20 మంది మాత్రమే ఉన్నారు. మరో ఆరుగురు కొత్త వారికి అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రివర్గంలోని కనీసం అరడజను మందిని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే కొత్తగా డజను మందికి స్థానం కల్పించవచ్చు. భారీ సంఖ్యలో ఆశావహులు... కొద్ది రోజులుగా లోకేష్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రికి ప్రాధాన్యతను త గ్గించే అవకాశం ఉంది. ఈ జిల్లాల నుంచి ఒకరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారని సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె. కళా వెంకట్రావు, గౌతు శ్యామసుందర శివాజీ, కె. అప్పల్నాయుడు, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీలు కావలి ప్రతిభా భారతి, జి. సంధ్యారాణి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎస్టీ, మైనారిటీ కోటాల్లో ముడియం శ్రీనివాస్, ఎంఏ షరీఫ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు తోట త్రిమూర్తులు, పితాని సత్యనారాయణ కూడా రేసులో ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు మంత్రులపై వేటు పడే అవకాశాలున్నట్లు వినిపిస్తోంది. ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ పేర్లను మంత్రివర్గంలో చోటుకై లోకేష్ ఇప్పటికే ప్రతిపాదించగా అనంతపురం జిల్లాలో పరిటాల సునీతకు ఇబ్బందులు కలిగించే ఎవ్వరికీ మంత్రివర్గంలో చోటు కల్పించొద్దని బాలకృష్ణ చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిల్లో ఒకరికి ఛాన్స్ ఉండొచ్చు. రాయలసీమ జిల్లాల నుంచి కాలవ శ్రీనివాసులు, బీకే పార్ధసారధి, ఎస్వీ సతీష్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డీకే సత్యప్రభ పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. కాగా అనేక ప్రలోభాలు కురిపించి వైఎస్సార్సీపీ నుంచి పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యేలలో చాలామంది విస్తరణపై ఆశలు పెట్టుకున్నారని వినిపిస్తోంది. మొత్తానికి ఆశావహుల ఒత్తిళ్లు ముఖ్యమంత్రికి పెద్ద తలనొప్పిగా మారాయని పార్టీవర్గాలంటున్నాయి. -
నదుల ప్రక్షాళన చేపట్టాలి
హనుమాన్ పీఠాధిపతి రాములు స్వామి ఏటూరునాగారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలోని కృష్ణ, గోదావరి నదుల ప్రక్షాళన చేపట్టాలని హనుమాన్ పీఠాధిపతి గాదెపాక రాములు స్వామి అన్నారు. తెలంగాణలోని గోదావరి పుష్కరఘాట్ల సందర్శనలో భాగంగా మంగళవారం మండలంలోని రామన్నగూడెం ఘాట్ వద్ద గోదావరి నదికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదుల్లో మలినాలను తొలగించి, మానవ మనగడకు ఆరోగ్య ప్రదాతలుగా బాధ్యత వహించాలన్నారు. చాలా మంది ఘాట్ల వద్ద మలినాలను వదిలేయడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. నదుల పవిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబక్‌లో జన్మించి 1465 కిలోమీటర్ల ప్రయాణంతో బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం, పర్ణశాల, భద్రాచలం, రాజమండ్రి, ధవళేశ్వరంలో ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తోందన్నారు. పర్ణశాల, భద్రాచలం, రామన్నగూడెం ఘాట్లను, బుధవారం నుంచి కాళ్లేశ్వరం, ధర్మపురి, బాసరను సందర్శిస్తానని వెల్లడించారు. దుగ్గొండి మండలం ముద్దునూరుకు చెందిన తాను పవిత్ర నదులను శుద్ధి చేసి అపవిత్రం కాకుండా ఉండేందుకు ఈనెల 20 నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల్లో మౌనదీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. -
గ్రేటర్ ప్రక్షాళన
టౌన్‌ప్లానింగ్ ఏసీపీల బదిలీ కొత్తగా ఐదుగురికి పోస్టింగ్‌లు.. వెంటనే రిలీవ్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు ‘సాక్షి’ కథనాలకు స్పందన సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో పారదర్శకత కోసం సమూల ప్రక్షాళన చేట్టారు. ఒకే చోట దీర్ఘకాలంగా పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్‌లోని అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ)లను బదిలీ చేశారు. వీరితోపాటు అవినీతి ఆరోపణలున్న వారికి సైతం స్థానచలనం కల్పించారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’లో వెలువడిన కథనాలతో గ్రేటర్ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్‌రెడ్డి ప్రక్షాళన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు నెలల క్రితం సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేయగా, తాజాగా వారి పైస్థాయిలోని ఏసీపీలను బదిలీ చేశారు. టౌన్‌ప్లానింగ్‌లో కీలకపాత్ర వీరిదే. భవన నిర్మాణ అనుమతుల్లో సాంకేతికంగా వీరిదే అధికారం కావడంతో వీరిపై భారీయెత్తున అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో 10 మంది ఏసీపీలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. డీటీసీపీ నుంచి వచ్చిన ఐదుగురికి కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. గతంలోనూ ఇదే స్టైల్.. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మరోమారు తనదైన శైలిలో బదిలీలకు శ్రీకారం చుట్టారు. బదిలీ అయిన వారు పైరవీలు చేసుకోకుండా వరుస సెలవుల రోజుల్లో ఏసీపీలకు స్థానచలనం కలిగించారు. పోస్టింగ్‌లు, బదిలీ ఉత్తర్వులు అందినవారు వెంటనే విధుల్లో చేరేలా వారిపై అధికారులు వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. గతంలో రవాణా విభాగంలో దీర్ఘకాలంగా పని చేస్తున్నవారిని బదిలీ చేసినప్పుడూ ఇదే సూత్రం పాటించారు. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను ఆగమేఘాల మీద బదిలీ, మాతృ సంస్థలకు సరెండర్ చేయడం తెలిసిందే. సీనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్‌లు.. బిల్కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి 2014 నవంబర్‌లో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చారు. అయితే వారిని ఇంతవరకు పాత పోస్టుల్లోనే కొనసాగిస్తున్నారు. జనగణన, ఎన్నికలు, ఓటర్ల తొల గింపు.. ఇలా వరుస కార్యక్రమాలు వస్తుండటంతో వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం అలాంటి వారందరికీ సీనియర్ అసిస్టెంట్లుగా పోస్టింగ్ లిచ్చారు. ఇలా మొత్తం 320 మందిని సీనియర్ అసిస్టెంట్లుగా ప్రధాన కార్యాలయం, వివిధ జోన్లలో నియమించారు. ఈస్ట్‌జోన్‌లో 58 మందికి, సౌత్జోన్లో 50 మం దికి సెంట్రల్ జోన్లో 63 మందికి, వెస్ట్‌జోన్‌లో 48 మందికి, నార్త్‌జోన్‌లో 49 మందికి, ప్రధాన కార్యాలయంలో 52 మందికి పోస్టింగ్ వేశారు. అయితే ఈ పోస్టింగ్స్‌లో భారీగా పైరవీలు సాగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదోన్నతులు పొందిన మొత్తం 320 మందిలో 160 మందికి పైగా రెవెన్యూ విభాగంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ఖాళీ చేసిన స్థానాలను భర్తీ చేసేందుకు దిగువ స్థాయిలో పనిచేస్తున్న వారికి త్వరలో పదోన్నతులిచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. -
ప్రక్షాళన ప్రారంభమైంది..!
బదిలీ అయినవారిని తిరిగి రానివ్వం శాశ్వత ఈవోను నియమిస్తాం భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ విజయవాడ : దుర్గగుడిలో ప్రక్షాళన ప్రారంభించామని, బదిలీ అయినవారిని తిరిగి ఇక్కడికి రానిచ్చేది లేదని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ అన్నారు. దుర్గగుడిని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుష్కరఘాట్లలో జరుగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంద్రకీలాద్రికి వస్తే దేవాలయానికి వచ్చామనే భావన కలగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. భవనాలను అడ్డగోలుగా పగలగొట్టడమేమిటంటూ ఇంజినీరింగ్ సిబ్బందిని నిలదీశారు. పుష్కరాల నాటికి పనులు ఏవిధంగా పూర్తిచేస్తారని ప్రశ్నిం చారు. దేవస్థానంలో భక్తులకు ప్రాధ్యాన్యత ఇవ్వాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు కాదంటూ హితవు పలికారు. ఐదేళ్లు దాటితే బదిలీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దుర్గగుడిలో ప్రక్షాళన ప్రారంభించామని చెప్పారు. ఐదేళ్లు దాటిన వారిని బదిలీ చేశామన్నారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చామో అక్కడే వారు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకునే బదిలీలు చేశామని, ఇంజినీరింగ్ సెక్షన్లో ఇక్కడకు వచ్చిన వారే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారన్నారు. దుర్గగుడిలో కొంతమంది వాళ్ల అవసరాలే చూసుకుంటున్నారని, ఇలాంటి వారు ఇప్పటికైనా మారకపోతే మరోసారి పక్షాళన చేసేందుకు ఏమాత్రం వెనుకాడబోమని హెచ్చరించారు. తమకు భక్తులే ముఖ్యమని, వారికి సౌకర్యాలు కల్పించేందుకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. బదిలీల విషయంలో అర్చకులకు ఏవిధమైన మినహాయింపులు ఉండబోవన్నారు. ఎవరైనా అర్చకులు సరిగా పనిచేయడం లేదని తెలిస్తే వారిని ఇక్కడి నుంచి మార్చివేసేందుకు ఏమాత్రం వెనుకాడబోమని చెప్పారు. దుర్గగుడికి త్వరలోనే శాశ్వత ఈవోను ఏర్పాటు చేస్తామన్నారు. బాగా పనిచేసే అధికారుల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దేవాదాయశాఖ కార్యాలయం గొల్లపూడిలో నిర్మిస్తున్నామని, రానున్న మూడు నెలల్లో అక్కడ పనిచేయడం ప్రారంభిస్తామని చెప్పారు. కాగా దుర్గగుడి ఈవో చంద్రశేఖర్ ఆజాద్, ఈఈ కోటేశ్వరరావు తదితరులు ఆయనతో పాటు తనిఖీల్లో పాల్గొని దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. -
ప్రగతి చక్రం ప్రక్షాళన
సీఎం కేసీఆర్ సూచనతో ఆర్టీసీలో కదలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు ఏటూరునాగారంలో కొత్తగా డిపో ఏర్పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి తిరుపతికి బస్సు వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు కూడా బస్సులు నడపాలని నిర్ణయం హన్మకొండ : ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి ప్రక్షాళన మొదలైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. లాభాల్లో ఉన్న డిపోలను అధ్యయనం చేయాలని, నష్టాలను పూరించేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. దీంతో ఆర్టీసీ అధికారులు డిపోలు, రీజియన్ల వారీగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆక్యుపెన్సీ రేషియో, కమర్షియల్ ఆదాయం పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. 2014-2015లో రూ.18.91 కోట్ల నష్టాల్లో ఉన్న వరంగల్ రీజియన్.. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో 30.75 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. నష్టం దాదాపు రెట్టింపైంది. గత ఆర్థిక సంవత్సరంలో వేతన సవరణ జరగడంతో భారం పెరిగి అదనంగా రూ.11.84 కోట్లు నష్టం పెరిగింది. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో వరంగల్-1 డిపో లాభాల్లో ఉండగా, మిగతా ఎనిమిది డిపోలు నష్టాల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-2017) గత మూడు నెల లు పరిశీలిస్తే కొంత మెరుగ్గా కనిపిస్తోంది. ఏప్రిల్ నుంచి మే మాసం నాటికి వరంగల్-1, వరంగల్-2, హన్మకొండ, నర్సంపేట డిపోలు లాభాల్లో ఉండగా పరకాల, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, భూపాలపల్లి డిపోలు నష్టాల్లో ఉన్నాయి. రీజియన్ మొత్తంగా చూస్తే మాత్రం రూ.27లక్షల లాభాల్లో ఉంది. నష్టం పూడ్చుకునేందుకు ప్రణాళికలు రీజియన్‌లో నష్టాలు పూడ్చుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాథమికంగా వీరు తయారు చేసిన నివేదికను శుక్రవారం హైదరాబాద్‌లో జరుగనున్న డిప్యూటీ సీటీఎంల సమావేశంలో ఎండీ రమణారావుకు వివరించనున్నారు. అనంతరం మరింత కసరత్తు చేసి పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందించే ఆలోచనలో అధికారులున్నారు. ఏటూరునాగారంలో 66 బస్సులతో కొత్తగా డిపో ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి నివేదించారు. ఇక్కడ ఆర్టీసీకి చెందిన స్థలం ఉంది. దీంతో ఇక్కడ డిపో నిర్మించడం పెద్ద కష్టమేని కాదని అధికారులు ఆలోచన. గోదావరి నదిపై ముల్లకట్ట వద్ద వంతెన కూడా అందుబాటులోకి రావడంతో నది అవతలి ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా అదాయాన్ని సమకూర్చుకోవాలని ఆధికారులు నిర్ణయించారు. హన్మకొండ ఎన్జీవోస్కాలనీ రోడ్డు రాంనగర్‌లోని హన్మకొండ డిపో ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో, మహబూబాబాద్‌లోని ఆర్టీసీ స్థలంలో షాపింగ్ కాంప్లెంక్స్ నిర్మాణంతో పాటు మినీ థియేటర్ ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధ చేశారు. సరుకుల రవాణాపై కూడా దృష్టిసారించారు. సరుకుల రవాణా ఎలా చేస్తే లాభసాటిగా ఉంటుందో పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఈ నివేదికను ఆర్టీసీ ఎండీ ముందుంచనున్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి బస్సులు నడుపాలనే నిర్ణయానికి వచ్చారు. జిల్లాలోని ఆయా డిపోల నుంచి 18 మినీ బస్సులు నడపాలని, జిల్లా కేంద్రం నుంచి 16 ఏసీ మినీ బస్సులు నడుపాలని నిర్ణరుుంచారు. ముందుగా ఎనిమిది ఏసీ మినీ బస్సులు జిల్లా కేంద్రంలోని నాలుగు సెక్టార్ల నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలను నడపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్-1 డిపో నుంచి గోవాకు ఏసీ గరుడ బస్సు, పూణే, చెన్నైకి సూపర్‌లగ్జరీ బస్సు, వరంగల్-2 డిపో నుంచి షోలాపూర్‌కు, హన్మకొండ నుంచి మహారాష్ర్టలోని గుగ్గూర్, వరంగల్-2 డిపో నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బైలడిల్ల, భూపాలపల్లి డిపో నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని సీరంచ, అసరవెల్లి, గడ్చిరోలికి బస్సులు నడుపాలని ప్రణాళిక రూపొందించారు. దీంతో పాటు ఆక్యుపెన్సీ రేషియో పెంచడానికి, ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ఏం చేయాలనే అంశంపై అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. -
హక్కులే శ్వాసగా..
నినదించిన నారీలోకం ‘మహిళా విధానం’పై సుదీర్ఘ చర్చ ప్రక్షాళనతోనే సమాజ మార్పు ఆకాశం ఆమె.. ఆలోచన ఆమె.. అన్నింటా అభివృద్ధి ఆమె. అయినా ఆమె సమాజంలో ద్వితీయ శ్రేణి పౌరురాలే. ఇంటా బయటా అంతటా లింగ వివక్షే. పనిచేసే చోట అణచివేత ధోరణులు కనిపిస్తునే ఉన్నాయి. ఓపక్క ఇంటిని చక్కదిద్దుకుంటూ.. పురుషులతో సమానంగా పనిచేస్తున్నా ఆమె శ్రమకు దక్కే ప్రతిఫలం మాత్రం సగమే. ఇల్లూ, బడీ, గుడీ, వ్యవసాయం, పారిశ్రామికం.. కార్యక్షేత్రం ఏదైతేనేం.. అన్నింటా వివక్షే. దాన్ని ఛేదించేందుకు దశాబ్దాలుగా పోరాటం చేస్తునే ఉంది. స్త్రీ హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలని ఒకటిన్నర దశాబ్దాల తరువాత భారత ప్రభుత్వం ‘మహిళా విధానాన్ని’ రూపొందించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా దక్షిణ భారత మహిళల ప్రాంతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించింది. జాతీయ మహిళా కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ సంయుక్తాధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ సమావేశానికి కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. 2016 మహిళా పాలసీపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత చట్టాలను, విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, వివక్షారహిత సమాజ ఏర్పాటుకు పలు సూచనలు చేశారు. - సాక్షి, సిటీబ్యూరో న్యాయవ్యవస్థలో మార్పు అవసరం న్యాయ వ్యవస్థను, పోలీసులను సమూలంగా ప్రక్షాళన చేసినప్పుడే స్త్రీల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. స్త్రీలకు ఉద్దేశించిన చట్టాలు మన దేశంలో చాలా తక్కువ. వాటిలో గృహహింసకు సంబంధించిన ఏకైక చట్టం ‘498ఏ’. ఇది దుర్వినియోగం అవుతుందని సుప్రీంకోర్టు చెప్పడం స్త్రీలపట్ల న్యాయ వ్యవస్థకున్న దృక్పథాన్ని స్పష్టం చేస్తోంది. ఇటువంటి తీర్పులు స్త్రీల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. కేరళలో కళాలయ జ్యోతి ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల్లో లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు అన్ని దశల్లోనూ బాలికల, మహిళల సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అందుకు ప్రత్యేకించిన కౌన్సిలర్స్‌ను కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే యువతకు పెళ్లికి ముందు ఉమన్ కమిషన్, కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశాం. పెళ్లికి ముందు మా కౌన్సిలింగ్లో పాల్గొన్నట్టు సర్టిఫికెట్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - కేసి రోజా కుట్టి, కేరళ ఉమన్ కమిషన్ చైర్పర్సన్ మహిళా కమిషన్‌కు అధికారం ఇవ్వాలి స్త్రీలపై వివక్షకు హద్దులేదు. అన్ని రంగాల్లోను అన్ని వర్గాల స్త్రీలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. చట్టాలుంటే చాలదు, అవి సక్రమంగా అమలు జరగాలి. మహిళా కమిషన్ని నామమాత్రంగా ఉంచితే సరిపోదు. దానికి కొన్ని అధికారాలు ఉండాలి. సమానమైన పనికి సమాన వేతనం మన దేశంలో ఎక్కడా అమలు జరగడం లేదు. క్షేత్రస్థాయి మహిళల నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్న స్త్రీల వరకు ఎవరికీ సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదు. సరోగసీ ద్వారా ఒక మహిళ 15 మందికి జన్మనిచ్చింది. ఆమె ఆరోగ్య బాధ్యత ఎవరిది? ఈ పాలసీలో చెప్పాలి. విశాఖ కమిటీ సిఫార్సుల ప్రకారం పని ప్రదేశాల్లో కంప్లెయింట్ బాక్స్‌లు ఉండాలి. ఈ ఫిర్యాదు కమిటీల్లో స్త్రీలకు న్యాయం జరుగుతున్న దాఖలాలు లేవు. దీనికి కారణం యాజమాన్యాలే ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండడం. యాజమాన్యాల భాగస్వామ్యం లేని కమిటీలు కావాలి. - వత్సల, తమిళనాడు వుమన్ కమిషన్ సభ్యురాలు ‘మహిళా పాలసీ’ చేయాలి.. దేశంలో ఎక్కడా ఏ వర్గం మహిళలకూ సరైన గౌరవం దక్కడం లేదన్నది నిర్వివాదాంశం. ప్రధానంగా మైనారిటీ మహిళలు, దళితులు మరింత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత చట్టాలను బలోపేతం చేయాలి. ఈ చట్టాల అమలుపై పర్యవేక్షణ ఉండాలి. కర్నాటక మహిళా అయోగ్ కమిషన్ ద్వారా కేసులను మేం డీల్ చేస్తున్నాం. కర్నాటకలో వరకట్నం, యువతులపై యాసిడ్ దాడులు తీవ్రమైన సమస్యగా ముందుకొస్తున్నాయి. చట్టాలెన్ని ఉన్నా దోషులు తప్పించుకునే వీలు కూడా ఈ చట్టాల్లోనే ఉంటోంది. దాన్ని అరికట్టే దిశగా ప్రభుత్వం మహిళా విధానాన్ని రూపొందించాలి. కర్నాటకలోనూ మహిళా కమిషన్‌కి ప్రత్యేక బడ్జెట్ లేకపోయినా ప్రభుత్వ సాయంతో హింసకు గురైన మహిళలను ఆదుకుంటున్నాం. - అనితా గుర్జాల్, కర్నాటక మహిళా కమిషన్ సభ్యురాలు స్త్రీల ఆరోగ్య హక్కుల మాటేమిటి? దళిత, ఆదివాసీ స్త్రీల ఆరోగ్యాంశాలను ఈ విధానం స్పృశించలేదు. ఆరోగ్యం ప్రైవేటైజ్ అయిన తర్వాత స్త్రీలకైనా, పురుషులకైనా హక్కులెలా ఉంటాయి? ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత కావాలి. ప్రధానంగా స్త్రీల ఆరోగ్యం ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యతే. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి. విద్యావ్యవస్థ బలోపేతం కాకుండా స్త్రీ విద్య అసాధ్యం. అన్నిరంగాల్లో వివక్ష ఉన్నట్లే కుటుంబాల్లో బాలికల విద్యపట్ల సైతం వివక్ష ఉంది. ఓ పక్క అన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ హక్కుల గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. ముందుగా స్త్రీల హక్కులు మావన హక్కులేనా కాదా అన్నది చర్చిస్తే.. స్త్రీల హక్కులను మానవ హక్కులుగా గుర్తిస్తే అప్పుడు వారి సమస్యలను సరైన కోణంలో అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. - విమల, రచయిత్రి ‘మహిళా బిల్లు’తోనే సాధ్యం చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఇంతవరకు సాధ్యం కాలేదు. దీనిపై ప్రభుత్వాలు ఆలోచించాలి. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం లేకుండా మహిళా సాధికారత అసాధ్యం. అన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆలోచించాలి. గృహహింసకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించాలి. మహిళా కమిషన్‌కు అధికారాలు ఉండాలి. అలాగే కమిషన్‌కి నిధులు కూడా అవసరం. కమిషన్‌కు స్వయం ప్రతిపత్తినివ్వాలి. - త్రిపురాన వెంకటరత్నం. తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ దళిత స్త్రీల సమస్యలు ప్రధానం దళిత, ఆదివాసీ స్త్రీల సమస్యలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ పాలసీలో అది లోపించింది. అన్ని వర్గాల స్త్రీలను ఒకేగాటన కట్టలేం. కుల, లింగ వివక్షకు, అణచివేతకు గురవుతున్న ఈ వర్గాల స్త్రీల సమస్యలపై పాలసీ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం వుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న శ్రామిక స్త్రీల సమస్యలను సైతం ఈ పాలసీ విస్మరించింది. ఇంటి పనివారి సమస్యల ప్రస్తావన కూడా ఈ పాలసీలో లేదు. వీరంతా దళిత స్త్రీలే. దళిత, ఆదివాసీ స్త్రీల హక్కులను కాపాడకుండా ఈ దేశం ఎటువంటి అభివృద్ధినీ సాధించలేదు. - రూత్ మనోరమ, జాతీయ దళిత మహిళా సంఘం లింగ వివక్ష అప్రజాస్వామికం బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయకపోతే సమాజం భావ దారిద్య్రంలో మునిగిపోతుంది. జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు కొంత ప్రయోజన కరంగా ఉన్నప్పటికీ, మహిళల విద్యావకాశాల విషయంలో మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. భారతదేశంలో విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. కుల, లింగ వివక్షతో విద్యను నిరాకరించడం అప్రజాస్వామికం. అలాగే ఐసీడీఎస్‌ల ఉద్దేశం కేవలం పౌష్టికాహారం సరఫరా మాత్రమే కాదు.. ప్రిప్రైమరీ విద్యను అందించడం కూడా. కానీ ఎక్కడా అమలు జరగడం లేదు. - ప్రొఫెసర్ రమా మేల్కొటే మహిళా రైతుల హక్కులను గుర్తించాలి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలను హక్కుదారులుగా గుర్తించడంలో ఇప్పటి దాకా ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు మహిళా రైతులను దృష్టిలో పెట్టుకోవాలి. రైతాంగానికి ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీలు, సహాయం, రుణాలు అన్నింటిలోను సమాన వాటా ఉండేలా చూడాలి. అందులో ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు మరింత ప్రత్యేకమైన సహకారం అందించాలి. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నరైతు కుటుంబాలను నడుపుతున్నది కూడా మహిళా రైతులే. కాబట్టి దీనిపై ప్రత్యేకమైన సర్వే నిర్వహించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో సాగుతున్న అభివృద్ధిలో మహిళలకు సముచిత స్థానం కల్పంచే విధంగా ఈ విధానం రూపొందించాలి. - రుక్మిణీ రావు, గ్రామ్య స్వచ్ఛంద సంస్థ 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరి.. స్త్రీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని హామీ యిస్తేనే ఆ రాజకీయ పార్టీకి గుర్తింపునివ్వాలి. అలా ఇవ్వని పక్షంలో ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. అలాగే జెండర్ బడ్జెట్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మాదిరిగా స్త్రీలకు ప్రత్యేకించిన బడ్జెట్ కేటాయింపులు అవసరం. అన్ని రకాల స్త్రీ హింసలకు అసమానతలే కారణం. అసమానతలను పెంచి పోషించే విద్యావ్యవస్థను నిరాకరించాలి. స్త్రీ, పురుష సమానత్వాన్ని బోధించే పాఠ్యపుస్తకాలను తెలంగాణ ప్రభుత్వం కొన్ని క ళాశాలల్లో ప్రవేశపెడుతోంది. ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా జరగాలి. అన్ని రంగాల్లో స్త్రీల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి. - కె. లలిత, యుగాంతర్ స్వచ్ఛంద సంస్థ పాఠ్యాంశాల్లో మార్పు అవసరం అన్నిచోట్లా స్త్రీలపై హింస పెరిగిపోతోంది. దీన్ని అడ్డుకోవాలంటే చిన్నప్పటి నుంచే పిల్లలల్లో మార్పు తీసుకురావాలి. ఇందుకోసం స్త్రీ, పురుష సమానత్వాన్ని పెంపొందించే అంశాలను, సామాజిక స్పృహను అందించే విషయాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి. వాటిని అన్ని వయసుల్లోను వారికి బోధించాలి. చట్టాలపై అవగాహన కూడా విద్యార్థులకు తప్పనిసరి. ఈ విషయాలన్నింటినీ మహిళా విధానంలో భాగం చేయాలి. - స్వాతి లక్రా, షీటీమ్స్ ఇన్చార్జ్ -
సాగర మధనం... సాగేదెలా?
⇒హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు మూలకు ⇒ఘన వ్యర్థాల తొలగింపుపై నిర్లక్ష్యం ⇒ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో {పక్షాళన అవసరం ⇒కూకట్పల్లి నాలా మళ్లింపు పనుల పూర్తితో గరళ జలాల నుంచి విముక్తి ⇒ఘన వ్యర్థాలను హెచ్డీపీఈ పైపుల్లో నింపేందుకు అవకాశం నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్ సాగర్ సుందర తటాకంగా మారడం కలేనా...? తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన సాగర్ ప్రక్షాళన పనులు అటకెక్కినట్టేనా...? కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేయడం అసాధ్యమేనా....అంటే... ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. తెలంగాణ ప్రభుత్వం తొలుత చేసిన ప్రకటనలు చూసి.. మన సాగరం ఇక ఆస్ట్రియా దేశంలోని ‘డాన్యుబ్ నది’లా మారుతుందని నగరవాసులు ఆశించారు. ముక్కు మూసుకోకుండా స్వేచ్ఛగా...స్వచ్ఛమైన జలాల్లో విహరించొచ్చని భావించారు. విశ్వనగరి కాబోతున్న భాగ్యనగరికి హుస్సేన్ సాగర్ తలమానికమవుతుందని ఆనందించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రక్షాళన పర్వంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పనులపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో సాగర్ ప్రక్షాళన ఇప్పట్లే లేనట్లే అని భావించాల్సి వస్తోంది. సిటీబ్యూరో: ఒకప్పుడు స్వచ్ఛమైన తాగునీటితో మహానగర దాహార్తిని తీర్చిన హుస్సేన్ సాగరం.. దశాబ్దాలుగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక ఘన వ్యర్థాలను తన గర్భంలో దాచుకొని కాలుష్య కాసారంలా మారింది. ఈ సాగరానికి పూర్వపు వైభవం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లక్రితం ఆర్భాటంగా ప్రకటించింది. ఈ కృషిలో భాగంగా కూకట్పల్లి నాలా మళ్లింపు పనులను ఇటీవలే పూర్తిచేయడంతో పారిశ్రామిక వ్యర్థాలు సాగరంలోకి చేరకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా..సాగరం అట్టడుగున పేరుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపుపై మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ వ్యర్థాలను తొలగించేందుకు ఆస్ట్రియాదేశంలోని డాన్యుబ్ నదిని ప్రక్షాళన చేసిన తరహాలోనే ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది ఆస్ట్రియా నిపుణుల బృందం సాగరాన్ని పరిశీలించి అందులోని నీటిని తొలగించకుండానే అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు తమ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని ప్రభుత్వానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. కానీ ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సాగర్ ప్రక్షాళన నీటిమీద రాతలా మారింది. ఆస్ట్రియాలో డాన్యుబ్ నది ప్రక్షాళన ఇలా... ఆస్ట్రియా దేశంలోని డాన్యుబ్ నది ఒకప్పుడు గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాల నుంచి వెలువడిన ఘన,ద్రవ,పారిశ్రామిక వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నదిని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించింది. ఈపనులను 2015 చివరి నాటికి పూర్తిచేశారు. నదిలోని నీటిని తొలగించకుండానే అడుగున గడ్డకట్టుకుపోయిన వ్యర్థాలను ప్రత్యేకమైన యంత్రాలతో తొలగించి వీటిని జియోటెక్స్‌టైల్(మందమైన హెచ్డీపీఈ పైపులు)పైపుల్లో నింపి నది చుట్టూ కట్టలా ఏర్పాటు చేశారు. ఇక నదిలోకి మురుగు వ్యర్థాలు ప్రవేశిస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ మురుగు జలాలను శుద్ధి చేసే ఎస్టీపీలు, హానికారక రసాయనాలను తొలగించే ఈటీపీ(ఎఫ్లుయెంట్ట్రీట్మెంట్ ప్లాంట్లు) ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసిన అనంతరమే నదిలోకి వదులుతున్నారు. దీంతో ఒకప్పుడు దుర్గంధాన్ని వెదజల్లిన ఈ నది ఇపుడు మంచినీటి సాగరంలా మారింది. అంతేకాదు ఈ నది వద్ద ఏర్పాటు చేసిన ఈతకొలను ఇపుడు పర్యాటకులకు స్వర్గధామంలా మారింది. ఒకప్పుడు ఈ నది చెంతకు రావాలంటేనే భయపడిన స్థానికులు ఇపుడు ఇక్కడి ఆహ్లాద పరిస్థితుల్లో సేదదీరుదుతుండడం విశేషం. హుస్సేన్ సాగర్ శుద్ధీ సాధ్యమే..! సుమారు 900 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన హుస్సేన్‌సాగర గర్భంలో దశాబ్దాలుగా సుమారు 40 లక్షల టన్నుల ఘనవ్యర్థాలు పోగుపడి నట్లు అంచనా. ఘనవ్యర్థాలన్నీ గడ్డకట్టుకుపోయి గుట్టలా పేరుకుపోయాయి. ప్రభుత్వం గత రెండేళ్లుగా సాగరంలోకి పికెట్, బంజారా, కూకట్పల్లి, బుల్కాపూర్ నాలాల నీరు చేరుతున్న ప్రాంతాల్లో వ్యర్థాల తొలగింపు పనులు చేపట్టింది. సుమారు 5 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించినట్లు సమాచారం. తొలగించిన వ్యర్థాలను సైతం పర్యావరణ సమస్యలు తలెత్తకుండా పీసీబీ అనుమతితో ఇక్కడి నుంచి తరలించి గాజులరామారంలోని క్వారీ గుంతల్లో నింపారు. మిగిలిన 35 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు సాగర గర్భంలోనే మిగిలి పోవడంతో ప్రక్షాళన పర్వం ప్రహసనంగా మారింది. ఈ ఘన వ్యర్థాలను కూడా డాన్యుబ్ నది తరహాలో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించి మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ కట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేని పక్షంలో సాగరం మధ్యలో ఐల్యాండ్(దీవి)మాదిరిగా వ్యర్థాలు నింపిన పైపులను ఏర్పాటు చేయవచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రి యా నిపుణుల సహకారం, సాంకేతికతతో మాత్రమే ఈ పనులు చేయగలుగుతారని..ప్రస్తుతం మన వద్ద అందుబాటులో ఉన్న విధానాలతో అట్టడుగున ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేస్తుండడం గమనార్హం. విషం నుంచి విముక్తి ఇలా.. బాలానగర్, జీడిమెట్ల, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడల నుంచి రోజువారీగా 500 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలు హుస్సేన్‌సాగర్‌లో చేరకుండా ఇటీవలే కూకట్పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తిచేశారు. సుమారు రూ.53 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ప్రకాశ్‌నగర్ ఐఅండ్‌డీ(ఇంటర్ సెప్టార్ అండ్ డైవర్షన్)నుంచి మారియట్ హోటల్ దిగువ వరకు ఈ పనులను చేపట్టారు. ఈ మార్గంలో 2200 డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్‌స్టీల్ పైపులైను ఏర్పాటు చేసి మారియట్హోటల్ అవతల ఉన్న హుస్సేన్‌సాగర్ సర్ప్లస్నాలా వరకు పారిశ్రామిక వ్యర్థ జలాలను సాగర్‌లోకి చేరకుండా దారి మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి ప్రకాశ్‌నగర్, గోల్నాక, అంబర్పేట్ మీదుగా మూసీలోకి ప్రవేశించే ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యంలో అంబర్పేట్ మురుగుశుద్ధి కేంద్రం వద్ద ఈ పారిశ్రామిక వ్యర్థజలాల్లో ఉన్న ఘన వ్యర్థాలను తొలగించి మూసీలోకి వదులుతున్నారు. మిషన్ హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో మిగిలిన పనులివే.. ⇒{పధానంగా కలుస్తోన్న నాలాలు: పికెట్, బుల్కాపూర్, బంజారా నాలాలు ⇒జలాశయం నీటి నాణ్యత మెరుగుపరచడం, జలాశయంలోకి ఘనవ్యర్థాలు చేరకుండా చూడడం ⇒ మిగిలిన మూడు నాలాల నుంచి చేరుతున్న మురుగునీటిని దారి మళ్లించడం ⇒జలాశయంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ⇒ జలాశయం నీటిని ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ అవసరాలకు వాడుకునేలా శుద్ధిచేయడం ⇒పికెట్‌నాలా వద్ద నీటి శుద్ధికి 30 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగుశుద్ధి కేంద్రం నిర్మాణం ⇒ హుస్సేన్‌సాగర్ వద్దనున్న 20 ఎంఎల్డీ ఎస్టీపీ అధునికీకరణ ⇒హుస్సేన్‌సాగర్ చుట్టూ రింగ్‌సీవర్ మెయిన్స్ నిర్మించి మురుగునీరు చేరకుండా చూడడం ⇒రంగధాముని చెరువు వద్ద 5 ఎంఎల్డీ సామర్థ్యంతో మినీ ఎస్టీపీ నిర్మాణం ⇒సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ట్రంక్సీవర్ మెయిన్స్ నిర్మాణం ⇒శుద్ధిచేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు ⇒జలాశయం అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా తొలగింపు ⇒జలాశయంలో ఆక్సీజన్ శాతం పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థ ఏర్పాటు ⇒జలాశయంలో నేరుగా పూజా సామాగ్రిని పడవేయకుండా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు ⇒హుస్సేన్‌సాగర్‌కు ఆనుకొని ఉన్న 22 మురికివాడలను ఎన్జీఓల సహకారంతో అభివృద్ధి ⇒సమీప బస్తీలు,కాలనీల్లో టాయిలెట్స్ నిర్మాణం. ⇒జలాశయంలో ఘన వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక యంత్రాంగం నెలకొల్పడం. ⇒మిషన్ హుస్సేన్‌సాగర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యం పెంచడం. -
ప్రక్షాళన షురూ..
మురుగునీటి పైపులైన్ల ప్రక్షాళనకు రంగం సిద్ధం.. జూన్10లోగా పనులు పూర్తిచేయాలని ఎండీ దానకిశోర్ ఆదేశం.. 16 డివిజన్లకు రూ.2.31 కోట్లు కేటాయింపు.. సిటీబ్యూరో: గ్రేటర్లో చిన్నపాటి వర్షానికే ఉప్పొంగుతున్న మురుగునీటి పైపులైన్లు, మ్యాన్‌హోళ్ల ప్రక్షాళనకు ఎట్టకేలకు జలమండలి నడుం బిగించింది. మహానగర పరిధిలోని సుమారు ఐదు వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మురుగునీటి పైపులైన్లలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడికను జూన్ 10లోగా యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఎండీ దానకిశోర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ప్రీమాన్సూన్ యాక్షన్ ప్లాన్‌ను సోమవారం ఖరారు చేశారు. పనులు చేపట్టేందుకుగాను 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో రూ.2.31 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నిర్వహణ డివిజన్ల వారీగా చీఫ్ జనరల్ మేనేజర్లు తమకు కేటాయించిన బడ్జెట్ మేరకు పనులను గుర్తించి ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. చేపట్టాల్సిన పనులు ఇవే.. లోతట్టు ప్రాంతాలు, తరచూ నీటమునిగే ప్రాంతాలు, మురుగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు, మురుగునీటి పైపులైన్ల పూడికను తొలగించాలి. పనులు చేపట్టాల్సిన ప్రాంతాలను తక్షణం గుర్తించి, కార్యాచరణ సిద్ధంచేయాలి. పనుల ప్రారంభానికి ముందు స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల అనుమతి తీసుకోవాలి. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో జీఎంలు,సీజీఎంలు పర్యటించి ఫోటోలు తీసి సీడీల రూపంలో బిల్లులతో సహా బోర్డుకు సమర్పించాలి. ఎయిర్‌టెక్ యంత్రాల సాయంతో పూడిక తొలగించాలి. {పతి స్టోరేజి రిజర్వాయర్ వద్ద అవసరమైన మేరకు క్లోరినేషన్ ప్లాంట్లును జూన్1 లోగా ఏర్పాటు చేయాలి. 600 ఎంఎం డయా వ్యాసార్థం దాటిన మురుగునీటి మ్యాన్‌హోళ్లపై సేఫ్టీగ్రిల్స్ ఏర్పాటు చేయాలి. 29 అత్యవసర బృందాలకు అవసరమైన యంత్రసామాగ్రిని సమకూర్చాలి. ఒక్కో బృందంలో పదిమంది సభ్యులుండాలి. వారికి అవసరమైన వాహనం సమకూర్చాలి. జూన్-ఆగస్టు మధ్యకాలంలో అత్యవసర బృందాలు మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో రంగంలోకి దిగి పనులు చేపట్టాలి. జూన్-ఆగస్టు మధ్యకాలంలో ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్‌కు అందిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి. ఫిర్యాదుల స్వీకరణకు షిఫ్టులవారీగా సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఒక డీజీఎం ఈ సెల్‌ను పర్యవేక్షించాలి. సెంట్రల్ స్టోర్ డివిజన్ నుంచి 29 అత్యవసర బృందాలకు అవసరమైన సాధనాసంపత్తి,యంత్రాలను సమకూర్చాలి. -
‘ఇంజనీరింగ్’ ప్రక్షాళన
దేశంలో ప్రపంచీకరణ విధానాల అమలు మొదలయ్యాక అంతక్రితం లేని ఆక ర్షణను సంతరించుకున్న ఇంజనీరింగ్ విద్యకు చాలా త్వరగానే గ్రహణం పట్టింది. పట్టుమని పాతికేళ్లు గడవకుండానే అదిప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇంజనీరింగ్ విద్యకు అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళిక, వర్తమాన అవసరాల స్పృహ, భవిష్యత్తులో అది ఎదిగే క్రమం ఎలా ఉంటుందన్న అంశాల్లో ఇంజనీరింగ్ కళాశాలలకుగానీ, వాటి పర్యవేక్షణను చూసే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కుగానీ అవగాహన కొరవడుతున్నదని అర్ధమవుతోంది. ప్రమాణాలు పతనం కావడానికీ...పట్టా తీసుకుని బయటికొస్తున్నవారిలో అత్యధి కులు నిరుద్యోగులుగా మిగిలిపోవడానికీ ఇదే కారణం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధన తీరుతెన్నులపై మంగళవారంనాటి ‘సాక్షి’లో వెలు వడిన కథనం ఈ దయనీయ స్థితిని వెల్లడిస్తోంది. తమ పిల్లలు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని ఆశించే తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదువుల కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వాలు ఎగ్గొడుతున్నా వారు వెనక్కు తగ్గడంలేదు. అలాంటివారంతా చివరకు దగాపడుతున్నారు. మన దేశంలో ఒక విచిత్రమైన స్థితి నెలకొని ఉంది. పరిశ్రమల్లో అయితేనేమి, వివిధ రంగాల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అయితేనేమి నిపుణుల అవసరం ఎంతగానో ఉంది. అటు ఏటా ఆరు లక్షలమంది ఇంజనీరింగ్ గ్రాడ్యు యేట్లు బయటికొస్తున్నారు. కానీ వారిలో 80 శాతంమందికి ఆయా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం ఏమాత్రం లేదని మొన్న జనవరిలో విడుదలైన ‘యాస్పై రింగ్ మైండ్స్’ సంస్థ నివేదిక వెల్లడించింది. వీరికి తాము చదువుకున్న కోర్సుల్లో అవగాహన మాట అటుంచి, కనీసం తమ గురించి తాము చెప్పుకోవడానికి అవసరమైన ఇంగ్లిష్ భాషా నైపుణ్యం కూడా లేదని ఆ నివేదిక వివరించింది. ఐటీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 25 శాతంమంది మాత్రమే కొలువుకు పని కొస్తారని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కాం నిరుడు ప్రకటించింది. తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాల్లో 33,706మంది అధ్యాపకులు అవసరం కాగా కేవలం 25,000మంది మాత్రమే ఉన్నారని ‘సాక్షి’ కథనం వెల్లడిస్తోంది. ఇందులో సగం మందికిపైగా బీటెక్ చదివినవారే! ఇక ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లోనూ తగిన అర్హతలున్నవారు తక్కువే. ఒకపక్క విద్యార్థులనుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ తాత్కాలిక అధ్యాపకులతో, నామమాత్ర వనరులతో మెజారిటీ ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్నాయి. వేరే కళాశాలలో బోధించే అధ్యాపకులనే తమ కళాశాల అధ్యాపకులుగా చూపడం వంటి చేష్టలు మితిమీరాయి. అధ్యాపకులకు వేతనాలు సరిగా చెల్లించకపోవడం, చివరకు విసుగు చెంది వారు తప్పుకోవాలని నిర్ణయించినప్పుడు బకాయిలు ఎగ్గొట్టడం వంటి ధోరణులు పెరిగాయి. తప్పుడు లెక్కలతో అటు విద్యార్థులనూ, ఇటు ప్రభు త్వాలనూ బోల్తా కొట్టించడం అలవాటుగా మారింది. 90వ దశకంలో దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమయ్యాక సాంకేతిక రంగానికి ఊతమివ్వాలని, ఆ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందింపజేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పెరిగిన గిరాకీకి అనుగుణంగా భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి నివ్వాలని కూడా నిర్ణయించింది. ఫలితంగా వ్యాపార ధోరణులు కట్టలు తెంచు కున్నాయి. తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని సంపన్నులు, రాజకీయ నాయకులు కళాశాలలకు అనుమతులు తెచ్చుకున్నారు. ఏఐసీటీఈ దీనికంతకూ వంతపాడింది. ఎడాపెడా గుర్తింపులిచ్చింది. వీటన్నిటి పర్యవసానంగానే ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్య ఇలా అఘోరించింది. ఇప్పుడు ఏఐసీటీఈలో కదలిక వచ్చింది. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాల, యూనివర్సిటీల వైఖరి కూడా మారింది. ఇంజనీరింగ్ కళా శాలల్లో జరుగుతున్నదేమిటో తెలుసుకునే ప్రయత్నం మొదలైంది. మరోపక్క ఇంజనీరింగ్ విద్యవైపు మొగ్గు కూడా క్రమేపీ తగ్గింది. 2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కన్వీనర్ కోటాలో 73,000 సీట్లు మిగిలిపోగా, నిరుడు అది 84,000కు చేరుకుంది. తెలంగాణలో నిబంధనలు పాటించని అనేక కళాశాలలను కౌన్సెలింగ్‌కు దూరం చేయగా...కొన్ని కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసు కోవడమే మానుకున్నాయి. ఇది ఒక రకంగా మంచి పరిణామం. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్యతోపాటు ఇప్పుడున్న దాదాపు 17 లక్షల సీట్లను పది లక్షలకు తగ్గించేందుకు చర్యలు ప్రారంభించామని ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్ర బుధే ఆమధ్య ప్రకటించారు. ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన నియంత్రణను చూసే ఏఐసీటీఈకి ఇంకా చాలా వ్యాపకాలున్నాయి. అది ఇంజనీరింగ్ విద్యతో పాటు ఫార్మాస్యూటికల్, ఆర్కిటెక్చర్, అర్బన్ ప్లానింగ్, టూరిజం, మేనేజ్మెంట్ కోర్సుల వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తుంది. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య వైపు మొగ్గు చూపడం ప్రారంభించాక, నాణ్యతా ప్రమాణాలపై ఫిర్యాదులందడం మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం మేల్కొనవలసింది. ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించే వ్యవస్థ అవసరం ఉన్నదని గుర్తించవలసింది. ఆ పని జరగలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన చర్యలన్నీ ప్రారంభించాలి. ఇంజనీరింగ్ కళాశాలలకు నిర్దిష్టమైన ప్రమాణాలను నిర్దేశించి వాటిని తప్పనిసరిగా పాటించేలా చూడాలి. వాటి ఆధారంగా ర్యాంక్‌లను నిర్ణయించి...జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఏ కళాశాల స్థాయి ఏమిటో ఏటా తేల్చాలి. ఏ అంశంలో వెనకబడి ఉన్నా వెనువెంటనే సరిదిద్దుకోమని హెచ్చరించాలి. తగిన సమయమిచ్చి చూసి మారకపోతే గుర్తింపును కూడా రద్దు చేయాలి. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా సాగాలి. అప్పుడే ఇంజనీరింగ్ విద్యకు గత వైభవం సాధ్యమవుతుంది. -
ప్రక్షాళనకు శ్రీకారం!
గ్రేటర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పలువురిపై బదిలీ వేటు అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ‘సాక్షి’ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రక్షాళన మొదలైంది. పెచ్చుమీరిన అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు నడుం బిగించారు. బీఆర్ఎస్ దర ఖాస్తులకు నిర్ణీత గడువు ముగిశాక కూడా అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండటం.. క్షేత్రస్థాయి సిబ్బంది వాటిని చూసీ చూడనట్లు వదిలేస్తుండటం, టౌన్ ప్లానింగ్ విభాగంలోని అవినీతి, అక్రమాలపై ‘కాసులిస్తే .. సై’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గురువారం టౌన్‌ప్లానింగ్ విభాగంలోని 33 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయినవారిని వెంటనే రిలీవ్ చేయాలని విభాగాధిపతులకు సూచించారు. సిటీబ్యూరో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలోని అక్రమార్కులపై చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. తొలిదశలో భాగంగా 33 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషర్ డా.బి.జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఒకేసారి పెద్దఎత్తున ఇంతమందిని బదిలీ చేయడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. టౌన్‌ప్లానింగ్ విభాగంలో పెచ్చుమీరిన అవినీతిపై ‘సాక్షి’లో కథనం రావడంతో...ఇకనైనా ఇలాంటి అక్రమాలు జరుగకుండా ఉండేందుకుగాను టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లు (టీపీఎస్)/ సెక్షన్ ఆఫీసర్లు, డ్రాఫ్ట్స్మన్లు, తదితరులను బదిలీ చేశారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు పరిశీలించేది, ఉన్నతాధికారులకు, నిర్మాణదారులకు మధ్య వ్యవహారాలు నెరిపేది వీరే కావడంతో తొలిదశలో వీరిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో రెండేళ్ల పైబడిన వారి నుంచి 14 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నవారు సైతం ఉన్నారు. ఆయా ప్రాంతాల నుంచి అందిన ఫిర్యాదులు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్ విభాగం వారికి ఎక్కువ ఆదాయ వనరులున్న సర్కిళ్లలో ఒకటైన ఖైరతాబాద్ సర్కిల్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న శాంసన్‌ను పాతబస్తీకి బదిలీ చేశారు. ఖైరతాబాద్ సర్కిల్లోనే నాలుగేళ్లుగా పనిచేస్తున్న నర్సింగ్రావును ఎల్బీనగర్ సర్కిల్‌కు బదిలీ చేశారు. జి.నరేష్‌ను కూకట్పల్లి సర్కిల్‌కు బదిలీ చేశారు. అలాగే నిర్మాణ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి సర్కిళ్లలో పనిచేస్తున్న రాజేందర్, సురేందర్‌రెడ్డిలను ఖైరతాబాద్, ఉప్పల్ సర్కిళ్లకు బదిలీ చేశారు. అయితే వారు బదిలీ అయిన సర్కిళ్లు కూడా పెద్దవే కావడం గమనార్హం. రెండేళ్లకు పైగా జీహెచ్ఎంసీకి పాలకమండలి లేకపోవడం.. కార్పొరేటర్లు లేకపోవడంతో టౌన్‌ప్లానింగ్ లోని వారికి ఎలాంటి ఆటంకం లేకుండా పోయిందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్ల రాకతో కొన్ని సర్కిళ్లలో వారికీ, వీరికీ పొసగడం లేదని తెలుస్తోంది. అలాంటి సర్కిళ్లలో ఉప్పల్ తదితరమైనవి ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ సర్కిల్లోని ఓ మహిళా ఉద్యోగి గత 14 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నారు. ఈ బదిలీల్లో భాగంగా ఆమెను ఎల్బీనగర్కు పంపారు. ఇదే సర్కిల్‌కు చెందిన ఫిలిప్స్‌ను పాతబస్తీలోని సర్కిల్-5కు పంపించారు. కూకట్పల్లి సర్కిల్‌కు చెందిన రాజేశ్వర్‌ను పాతబస్తీ పరిధిలోని సర్కిల్-4కు బదిలీ చేశారు. అవినీతి ఆగేనా..? బదిలీల్లో భాగంగా కొందరిని మాత్రం ఆదాయం తక్కువగా ఉండే సర్కిళ్లకు బదిలీ చేసినప్పటికీ, ఎక్కువమందిని తిరిగి నిర్మాణ కార్యకలాపాలు ఎక్కువగా ఉండే సర్కిళ్లకే బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త సర్కిళ్లలో కొంతకాలం వరకైనా అక్రమాల్ని తగ్గింవచ్చుననేది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. దానికి తోడు ఉన్న సిబ్బందే తక్కువ కావడంతో ఎవరో ఒకరిని నియమించక తప్పదు కనుక వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ బదిలీలు చేసినట్లు సమాచారం. మరో 40 రోజుల్లోగా 10 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని పరిష్కరిస్తామని మునిసిపల్ మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చినందున ఆ అంశాన్ని సైతం పరిగణనలోకి తీసుకొని ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్న సర్కిళ్లకు వీరిని పంపించినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో 11 మంది టీపీఎస్/సెక్షన్ ఆఫీసర్లు, 18 మంది డ్రాఫ్ట్స్మన్లు, ముగ్గురు ఏఏడీఎం, ఒక టీపీబీఓ తదితరులున్నారు. -
సాగర మథనం..మరింత దూరం!
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు వాయిదా? మళ్లీ పూర్తిగా నిండిన జలాశయం ఈ వేసవిలో పూడికతీత పనులు లేనట్లే ‘ఆస్ట్రియా టెక్నాలజీ’పై తేల్చని ప్రభుత్వం సిటీబ్యూరో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు మరికొంత కాలం వాయిదా పడనుంది. తొలుత నాలాల దారి మళ్లింపు తర్వాతే హుస్సేన్‌సాగర్‌లో పూడికతీత పనులు చేపట్టే అవకాశం కన్పిస్తోంది. గత ఏడాది మొత్తం రిజర్వాయర్‌లోని నీటిని ఖాళీ చేసిన యంత్రాంగం.. ఒక దశలో పూడికతీత పనులను ప్రారంభించాలని భావించింది. కానీ పర్యావరణవేత్తల నుండి వచ్చిన అభ్యంతరాలతో సాధ్యం కాలేదు. అయితే ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లోకి విష రసాయనాలను మోసుకొస్తున్న కూకట్పల్లి నాలా మళ్లింపు పనులు దాదాపు పూర్తయ్యాయి. ముందుగా అనుకున్న పథకం ప్రకారమైతే ఈ వేసవిలో పూడికతీత ప్రారంభం కావాలి. అందుకు హుస్సేన్‌సాగర్ నీటిని ఇప్పటి నుండే ఖాళీ చేస్తే వచ్చే ఏప్రిల్ మాసంలో పూడిక తీసే పనులు ప్రారంభించే ఛాన్స్ ఉంటుంది. కానీ బోట్ల రాకపోకలకు అనువుగా ఉండేందుకు టూరిజం శాఖ సూచన మేరకు హుస్సేన్‌సాగర్‌లో పూర్తి నీటిమట్టం కొనసాగించా లని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం రిజర్వాయర్ పూర్తి నీటిమట్టంతో ఉంది. దీనికి తోడు పూడికతీతకు సన్నాహాలు చేసిన నీటిపారుదల శాఖకు కూడా ఎలాంటి ఆదేశాలు లేకపోవటంతో వారు ఇతర పనులపై దృష్టి సారించారు. ‘ఆస్ట్రియా టెక్నాలజీ’పై స్పష్టత లేదు... హుస్సేన్‌సాగర్‌లో పూడిక తీయకుండానే నీటిని ఏరియేషన్ చేయటం ద్వారా శుద్ధి చేస్తామని ముందుకు వచ్చిన ఆస్ట్రియా కంపెనీ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆస్ట్రియాలో డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన తరహాలో రూ.370 కోట్ల వ్యయంతో తాము పనులు చేస్తామని ఆస్ట్రియా ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. ఆ ప్రతిపాదలను సైతం ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. సాగర్‌లో మట్టి ప్రతిమలకే అనుమతి ఈ యేడాది నుండి హుస్సేన్‌సాగర్‌లో మట్టి వినాయక ప్రతిమలనే నిమజ్జనానికి అనుమతించే దిశగా సర్కార్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సోమవారం హైకోర్టుకు సమర్పించిన యాక్షన్‌ప్లాన్‌లో సహజసిద్ధ రంగుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు పీసీబీ తరపున ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయనున్నట్లు కోర్టుకు ఇచ్చిన లేఖలో పేర్కొంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శారదాదేవి అనే మహిళ నేచురల్ (సహజసిద్ధ) కలర్స్ తయారు చేస్తోందని, ఈ రంగుల తయారీకి గాను ఆమె ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కోరగా, పీసీబీ తరుపున కోటి రూపాయలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని రంగుల తయారీకి వాడే రా మెటీరియల్, మిషనరీ కొనుగోలుకు వెచ్చించేందుకు కేటాయించనున్నారు. ఆమె కోరిన మిగిలిన మొత్తాన్ని ఇతర ప్రభుత్వ విభాగాలు సహాయం చేసేవిధంగా పీసీబీ అధికారులు కోరారు. వినాయకప్రతిమలు తయారు చేసే రాజస్థానీలను సైతం మట్టి వినాయకుల తయారీ దిశగా మళ్లించేందుకు త్వరలో ఐదు చోట్ల శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. -
దసరా తర్వాత టీడీపీలో మంత్రివర్గ విస్తరణ!
-
ఆపరేషన్ ‘సాగర్’
హుస్సేన్ సాగర్ సందర్శనకు ఆస్ట్రియా నిపుణులు నేడు ఉన్నతాధికారులతో సమావేశం సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఆస్ట్రియాకు చెందిన నిపుణులు శనివారం హుస్సేన్‌సాగర్‌ను సందర్శించనున్నారు. సాగర్ ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే తొలిదశ పనుల్ని చేపట్టిన అధికారులు తూములు, అలుగుల ద్వారా వీలైనంత నీటిని వెలుపలికి పంపిస్తున్న విషయం తెలిసిందే. నీరంతా ఖాళీ అయ్యాక పూడిక తొలగింపు.. వ్యర్థాల డంప్ తీవ్ర సమస్యగా మారనుంది. అలాగే సాగర్ భూగర్భంలోని రసాయన విషతుల్యాల ప్రభావం..వాటి ద్వారా వెలువడే దుర్వాసనను అంచనా వేసి, పరిష్కారానికి తగుచర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకుగాను అధికారులు హుస్సేన్‌సాగర్‌లో కూకట్పల్లి నాలా కలిసే చోట ప్రయోగాత్మకంగా పనులు ప్రారంభించారు. నాలాలు, తూముల సామర్థ్యం పెంచడంతోపాటు అక్కడ నీరు త్వరగా ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో నీరు ఇంకిపోయింది. ఆస్ట్రియా నిపుణులు తమ పర్యటనలో హుస్సేన్‌సాగర్‌ను పరిశీలించడంతోపాటు నీరు ఇంకిన ప్రదేశం, అక్కడి కెమికల్స్ తదితర అంశాలను అధ్యయనం చేసే అవకాశం ఉంది. సాగర్‌లో పేరుకుపోయిన ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్, ప్లాస్టిక్, తదితర వ్యర్థాలతో దుర్గంధం వెలువడుతోంది. నీటిలో పెరిగే పిచ్చిమొక్కలతో పాటు అల్గే వల్ల కూడా వాసన వస్తుందనే అంచనాలున్నాయి. సాగర్‌లో చేరే కాలుష్య కారకల ప్రభావం, తదితర అంశాలు అంచనా వేసి నిపుణులు నీటిని పూర్తిగా ఖాళీ చేసేందుకు అనుసరించాల్సిన విధానాలు, దుర్వాసన రాకుండా ప్రత్యామ్నాయాలపై తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హుస్సేన్‌సాగర్‌ను సందర్శించే ముందు లేదా అనంతరం నిపుణులు సాగర్ ప్రక్షాళనలో పాలుపంచుకునే వివిధ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు జీహెచ్ఎంసీ, జల మండలి, హెచ్ఎండీఏ, పీసీబీ, తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. -
వచ్చే వేసవిలో హుస్సేన్ సాగర్ ఖాళీ!
హైదరాబాద్: కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్‌సాగర్‌ను వచ్చే వేసవిలో ఖాళీ చేసి.. ఇకపై శుద్ధిచేసిన నీటిని మాత్రమే హుస్సేన్‌సాగర్‌లో కలిసేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులు సాగర్‌ను ఖాళీచేసేందుకు తమ పరిధిలో చేయగల పనులపై దృష్టి సారించారు. ఈ మహాయజ్ఞంలో తాను కూడా శ్రమదానం చేస్తానని సీఎం స్వయంగా ప్రకటించడంతో ఆయా అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 'మిషన్ హుస్సేన్‌సాగర్' ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆయా విభాగాలు సాగర్‌ను ఖాళీ చేయించే ప్రక్రియలో తాము చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో జరుగబోయే ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఆయా విభాగాల అధికారులు బాధ్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా సాగర్‌ను ఎప్పటిలోగా ఖాళీ చేయాలి, పూడికను ఎక్కడకు తరలించాలి తదితర అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఇందుకుగాను అన్ని విభాగాలను సమన్వయం చేసే బాధ్యతను జీహెచ్ఎంసీకి అప్పగించనున్నట్లు సమాచారం. అయితే తాము ఇప్పటి వరకు హుస్సేన్‌సాగర్‌కు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని జీహెచ్ఎంసీ కమిషనర్.. స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ సమూల ప్రక్షాళన, సాధ్యాసాధ్యాలు, ఎదురయ్యే ఇబ్బందులు, విభాగాల వారీగా బాధ్యతల నిర్వహణ, ప్రణాళికలు, వ్యయం తదితర అంశాలపై 'సాక్షి' ఫోకస్.. బృహత్ ప్రణాళిక.. చెరువులు, నీటి తరలింపు, పూడిక తీతకు మూడు నెలల సమయం పట్టనున్నట్లు అంచనా. నీటి తరలింపు పనుల కోసం 45 రోజులు, సాగర్‌లోని పూడికను తరలించేందుకు మరో 45 రోజులు పట్టవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. హుస్సేన్‌సాగర్ నీటి నిల్వ సామర్ధ్యం 1 టీఎంసీ కాగా, సాగర్‌లో ప్రస్తుతం 0.8 టీఎంసీల నీరుంది. సగటున రోజుకు 400 క్యూసెక్కుల తోడిపోసినా జలాశయాన్ని ఖాళీ చేసేందుకు దాదాపు 45 రోజులు పట్టవచ్చు. అయితే సాగర్ నీరు వెళ్లే తూముల గుండానే నీటిని బయటికి పంపాల్సి ఉన్నందున నీటి వేగాన్ని పెంచేందుకు 200 హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన పదికి పైగా మోటార్లు, లేదా 1800 హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన నాలుగైదు మోటార్లు వినియోగించాల్సి ఉంటుందని అంచనా. ప్రారంభంపై మల్లగుల్లాలు ఈ మహాయజ్ఞానికి సంబంధించి ఆయా ప్రభుత్వ విభాగాలు తాము చేయగల పనులు.. వ్యయం తదితరమైన వాటిపై ప్రస్తుతం కసరత్తు చేసి, ఎవరికివారు నమూనా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పని విభజన.. వ్యయం తదితర అంశాలతోపాటు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక తయారు కావాల్సి ఉంది. ఇందులో విభాగాల వారీగా బాధ్యతలు అప్పగించిన తర్వాతే వారు అధికారికంగా తమ పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లు పిలవాల్సి ఉంది. ఇవన్నీ ఈ వేసవిలోనే జరగడం కష్టమనే కొందరు పేర్కొంటున్నారు. ప్రక్రియ అంటూ ప్రారంభిస్తే.. వచ్చే నవంబర్-డిసెంబర్ నుంచి పనులు ప్రారంభం కాగలవని సమాచారం. అయితే ఈ విషయుంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయుంపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉన్నతస్థాయి కమిటీ.. వివిధ పాలసీలు.. పథకాలకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ హుస్సేన్‌సాగర్ నీటిని తొలగించే అంశంపై తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకుగాను ఆయా విభాగాల నుంచి సమాచారం కోరినట్లు సమాచారం. ఈ నివేదికలను పరిశీలించిన తర్వాత మిషన్ హుస్సేన్‌సాగర్‌పై కమిటీ తగు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పూడికతీతే కీలకం.. నీటి తరలింపు తర్వాత మరో కీలకమైన పని డీసిల్టింగ్. అయితే పూడికను తడిగా ఉన్నప్పుడే తరలిస్తారా.. లేక ఎండిపోయాక తరలిస్తారా అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకు గాను దాదాపు 45 రోజులు పట్టవచ్చునని ప్రాథమిక అంచనా. పూడిక పరిమాణం దాదాపు 45 లక్షల క్యూబిక్ మీటర్లు ఉండవచ్చునని, రోజులకు లక్ష క్యూబిక్ మీటర్ల వంతున తరలించినా దాదాపు 45 రోజులు పట్టవచ్చునని అంచనా. ఇందుకుగాను దాదాపు 50 పొక్లెయిన్లు అవసరం కాగలవని నిర్ణయించారు. టెండరు పొందే కాంట్రాక్టు సంస్థ వనరుల ఆధారంగా తరలింపు పనులు చేపట్టనున్నారు. నీటి తరలింపు.. పూడిక తరలింపు పనులకు దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు కాగలవని ప్రాథమిక అంచనా. అయితే పూడికను డంప్ చేసే అంశాన్ని బట్టి ఖర్చులో హెచ్చుతగ్గులుంటాయి. పూడికను ఎక్కడ డంప్ చేయాలనే అంశంలోనూ స్పష్టత లేదు. ప్రస్తుతం హెచ్ఎండీఏ తరలిస్తున్న పూడికను కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో డంప్ చేస్తున్నారు. సాగర్ ఖాళీ ప్రక్రియలో వచ్చే వ్యర్థాలను సైతం అక్కడే డంప్ చేస్తారా.. లేక దూరప్రదేశాలకు తరలిస్తారా అన్నదానిపై ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటితోపాటు భూసార పరీక్షలు చేసి.. దేనికి ఉపకరిస్తే అందుకనుగుణంగా తగు చర్యలు తీసుకోనున్నారు. భూసార పరీక్షలను బట్టి క్వారీలకు తరలించి, ఇటుకల తయూరీకి ఉపకరిస్తే అందుకు వినియోగించాలని భావిస్తున్నారు. పర్యవేక్షక పాత్రలో పీసీబీ.. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రక్రియలో పీసీబీ పర్యవేక్షక బాధ్యతలు నిర్వహించనుంది. జలాశయంలోని నీటిని ఖాళీ చేసిన తర్వాత ప్రభుత్వం ఆదేశిస్తే జలాశయం అడుగున పేరుకుపోయిన రసాయనిక ఘన వ్యర్థాలు (సెడిమెంట్స్)ను పరీక్షిస్తామని పీసీబీ సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్త ఒకరు 'సాక్షి'కి తెలిపారు. జలాశయం అడుగున దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఘన వ్యర్థాలు పోగుపడి ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. వీటిని తొలగించి గాజులరామారంలో ప్రభుత్వం కేటాయించిన భూమిలో ల్యాండ్‌ఫిల్లింగ్ (భూమిలో భూగర్భంలోనికి ఇంకని తరహాలో పూడ్చివేత) విధానంలో వ్యర్థాలను నిక్షిప్తం చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా పర్యావరణానికి, అక్కడి పరిసరాలకు, భూగర్భజలాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు. తరలింపులోనే తలనొప్పి..! సాగర్‌నుంచి వెలువడిన పూడికను పరిసరాల్లోనే ఒకే దగ్గర కుప్పగా పోసి దశలవారీగా దూరప్రాంతాలకు తరలించడమా.. లేక ఎప్పటికప్పుడే తరలింపు పనులు చేపట్టాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ కారణంగా వెలువడే వ్యర్థాలు, కలుషిత వాయువులు, దుర్గంధం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. తోడి వేసిన మట్టిని పిరమిడ్ ఆకారంలో కుప్పగా పోసి వాటిపై మొక్కలు పెంచేందుకు కూడా అవకాశం ఉందని సంబంధిత రంగం నిపుణులు పేర్కొంటున్నారు. సాగర్ ఒడ్డున ఇందుకు అవకాశం ఉందని, ఈ కారణంగా పక్షులు రావడానికీ వీలుంటుందని, తద్వారా జీవవైవిధ్యానికీ ఆస్కారముంటుందని వారు పేర్కొంటున్నారు. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో మొక్కల పెంపకం.. పిల్లల ఉద్యానవనాలు ఏర్పాటు చేసే వీలుందన్నారు. చాలా మంచిపని చేస్తున్నారు హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నూటికి నూరుశాతం సరైంది. ఇందుకుగాను పక్కా ప్రణాళికలు రూపొందించాలి. గతంలో డ్రెడ్జింగ్ ద్వారా సుమారు 5.5లక్షల టన్నుల పూడిక తీసేందుకే రెండేళ్లు సమయం పట్టింది. ప్రస్తుతం సాగర్‌లో 40లక్షల టన్నుల మేర పూడిక ఉందంటున్నారు. అసలు ఎంత పూడిక ఉందన్నది ట్రయల్ పిట్ ద్వారా తెలుస్తుంది. ప్రాథమిక అంచనా ప్రకారం 40లక్షల టన్నులు పూడిక ఉందనుకొంటే.. సుమారు 16 లక్షల క్యూబిక్ మీటర్ల పిల్ట్ ఉంటుందని అంచనా. దీన్ని తొలగించడానికి ఎంత ఖర్చు అవుతుందన్నది ఇప్పుడే చెప్పలేం. డంపింగ్ యార్డ్ దూరం పెరిగితే.. వ్యయం కూడా పెరుగుతుంది. అయితే.. నీటి మట్టం తగ్గేకొద్దీ దుర్వాసన వెదజల్లుతుంది. దానిని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. - మాజీ ఈఎన్సీ టి.హనుమంతరావు అందరూ కీలకమే.. సాగర్‌ను ఖాళీచేసే మహాక్రతువులో వివిధ ప్రభుత్వ విభాగాలు ముఖ్య భూమిక పోషించనున్నాయి. ఆయా విభాగాల వారీగా బాధ్యతలు ఇవీ.. * నీటిపారుదలశాఖ: ఈ యజ్ఞంలో ముఖ్యభూమిక వీరిదే. హుస్సేన్‌సాగర్ నీటి మట్టం.. నీటి నిల్వ.. నీటి తరలింపు.. తదితర అంశాలను పరిశీలించి అందుకు చేయాల్సిన ఏర్పాట్లు, తదితర కీలక బాధ్యతలు వీరే నిర్వహించాల్సి ఉంటుంది. * మైనింగ్ విభాగం: భూగర్భపరీక్షలు నిర్వహించి వెలువడే వ్యర్థాలను ఎక్కడకు తరలించాలనే అంశంపై తగు నిర్ణయం తీసుకోనున్నారు. * పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు: వెలువడే దుర్గంధం.. వాయు కాలుష్యం తదితర అంశాలపై అంచనా వేసి ప్రజల ఆరోగ్యానికి హాని కలుగకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.. * జీహెచ్ఎంసీ: వ్యర్థాల తరలింపు.. తదితర బాధ్యతలతోపాటు స్థానిక సంస్థగా వివిధ విభాగాలను సమన్వయం చేయడంలో ప్రధాన భూమిక పోషించనుంది. * హెచ్ఎండీఏ: ఇప్పటికే హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు సంబంధించిన అనుభవముండటంతో దానిని కొనసాగించాల్సి ఉంటుంది. గత అనుభవాలతో భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. * జలమండలి: వివిధ నాలాల నుంచి వచ్చే మురుగునీరు హుస్సేన్‌సాగర్‌లో కలువకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. * పోలీసు: హుస్సేన్‌సాగర్‌ను ఖాళీ చేసే సమయంలో.. వ్యర్థాల తరలింపులో ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా అవసరమైన ఏర్పాట్లతోపాటు బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది. * పరిపాలన విభాగాలు: పరిపాలనను పర్యవేక్షించే జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు తమవంతు సేవలందించాల్సి ఉంటుంది. వీరికి తోడు వివిధ శాఖలు ఎప్పటికప్పడు అవసరాలను బట్టి తమ సేవలు అందించాల్సి ఉంటుంది. నిరోధమే మార్గం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ పరివాహక ప్రాంతంలోని దాదాపు రెండు లక్షల ఎకరాలకుపైగా పంటపొలాలను విషతుల్యంగా మార్చే హుస్సేన్‌సాగర్ నీటి విడుదల కార్యక్రమానికి స్వస్తి పలకాలని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ డిమాండ్ చేసింది. హుస్సేన్‌సాగర్ మురికినీటి తరలింపునకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాన్ని చేపడతామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవసరమైతే ఈ విషయమై కోర్టుకు వెళతామన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా, పర్యావరణ వేత్తల అభిప్రాయాలు పరిగణనలోనికి తీసుకోకుండా ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పేరుతో వ్యర్థాల తరలింపునకు పాల్పడడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అంతర్జాతీయ జల నిపుణులు డాక్టర్ సుబ్బారావు అన్నారు. 1974 ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారం పర్యావరణానికి హాని కలిగించే కర్మాగారాలు, ఫ్యాక్టరీలను మూసివేసేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు. హుస్సేన్‌సాగర్‌లోకి వస్తున్న వ్యర్ధాలకు అడ్డుకట్ట వేయకుండా ప్రక్షాళన అసాధ్యమన్నారు. ప్రభుత్వం మొదట అటువంటి ఫ్యాక్టరీలు, కర్మాగారాలను నియుంత్రించాలని డిమాండ్ చేశారు. సాగర్ ఆక్రమణలు, కాలుష్యంపై రాజమణి, సాగర్ధార, ఆర్సీ రెడ్డి సమర్పించిన నివేదికలను ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోలేదని సోల్ సంస్థ కోకన్వీనర్ లుబ్నా సర్వంత్ పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే చెరువులు, రిజర్వాయర్లు, నీటిని విషతుల్యంగా మార్చడం ఐపీసీ 277 ప్రకారం శిక్షార్హమన్నారు. సాగర్ నుంచి ఐదు నాలాల ద్వారా నీటిని తరలించడం వల్ల మూసీ పరివాహక ప్రాంత దిగవన ఉన్న ప్రజలు ముంపునకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కార్పొరేట్ సంస్థలు, రియల్టర్లకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సాగర్ లోని 40 లక్షల క్యూబిక్ మీటర్ల క్యాన్సర్ కారక వ్యర్థాలను ప్రజలపైకి వదిలి అసలే ప్రమాదకరంగా ఉన్న మూసీని మరింత విషతుల్యంగా మారుస్తున్నారని సంస్థ ఫౌండర్ కన్వీనర్ జస్లీన్ జేరత్ పేర్కొన్నారు. పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వ్యర్థాలను తరలించేందుకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. పర్యావరణ వేత్తల, ప్రజల ప్రమేయంలేని సాగర్ ప్రక్షాళన కార్యక్రమంలో ప్రజాధనం వృథాకాదన్న గ్యారంటీ ఏమిటన్నారు. 2010లో ఏర్పాటు చేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలో ఎందరో అధికారులు భాగస్వాములుగా ఉన్నా నగరంలో సరస్సులు, చెరువులు కాలుష్య కాసారాలుగా మారడానికి కారణాలేమిటో ప్రభుత్వమే తేల్చాలని సోల్ సంస్థ సభ్యులు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశహర్మ్యాల నిర్మాణం కాకుండా, ప్రజావసరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 28వ తేదీన సోల్ సంస్థ లేక్ మేళాను నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. -
దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాలి
తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి నిజాయితీ పరులైన అధికారులను నియమించాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ కోరారు. సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచారి అధ్యక్షతన ఆదివారం నగరంలో సమాఖ్య విస్తృత సమావేశం జరిగింది. గ్రామప్రాంతాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప, దీప, నైవేద్యం పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచాలని కోరారు. ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.920 కోట్లు వెంటనే చెల్లించే విధంగా స్థానిక టీడీపీ, బీజేపీ నేతలు కృషి చేయాలని కోరారు.విభజన చట్టం ప్రకారం టీటీడీ రూ.583కోట్లు, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం మల్లికార్జున తదితర 16 పెద్ద దేవాలయాల నుంచి రూ.337కోట్లు తెలంగాణకు కామన్‌గుడ్ ఫండ్, అర్చక వెల్ఫేర్ ఫండ్‌కు జమచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ లో 12,260 దేవాలయాల అభివృద్ధికి, అర్చక సంక్షేమానికి రూ.100కోట్లు కేటాయిం చాలన్నారు. తెలంగాణ దేవాదాయశాఖలో ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వాస్పత్రుల ప్రక్షాళన
భద్రాచలం : వ్యాధుల బారిన పడినవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటమే లక్ష్యంగా ప్రభుత్వాస్పత్రులను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం రాత్రి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బస చేసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రాంతంలో ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానాకు’ అనే దుస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వాల శాపం, వారు చేసిన పాపం వల్ల ప్రభుత్వాసుపత్రులు నిర్వీర్యం అయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగం అభివృద్ధికి బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఏరియా ఆస్పత్రికి రూ.కోటి చొప్పున మంజూరు చేశామన్నారు. వైద్య సేవల వికేంద్రీకరణ దిశగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాను ఏరియా ఆస్పత్రిలో రాత్రి బస చేస్తున్నానని తెలిపారు. ఐదు నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నానని చెప్పారు. రిఫరల్ విధానానికి స్వస్తి పలకాలని, 30 శాతం ఉన్న ఆస్పత్రుల సేవలను 50 నుంచి 60 శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. వైద్యులు రోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. ప్రతి పీహెచ్సీ వైద్యుడికి ప్రత్యేక వాహనం కేటాయిస్తామని, ఇందుకోసం నెలకు రూ. 25 వేలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పీహెచ్‌సీల స్థాయి పెంపు... రాష్ట్రంలో అవసరమైన చోట్ల పీహెచ్‌సీల స్థాయిని పెంచేందుకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 31 పీహెచ్‌సీల్లో మౌలిక వసతుల కల్పనకు కోసమని ఒక్కో కేంద్రానికి రూ.40 లక్షలు విడుదల చేస్తున్నామని, రూ.30 కోట్లతో పలు పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. వైద్యులకు కూడా ప్రొటోకాల్ ఉండేలా ఉత్తర్వులు ఇస్తామన్నారు. అయితే విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాచలం ఆసుపత్రిలో ప్లేట్లెట్ కౌంట్ యంత్రం... మలేరియా, డెంగీ జ్వరాల నివారణకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్లేట్లెట్ కౌంట్ యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రాజయ్య తెలిపారు. ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి రూ.18.30 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి రూ.10 కోట్లు కేటాయించామన్నారు. మలేరియా, డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదయ్యే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రోగుల నాడిపట్టిన రాజయ్య.. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పలువురు రోగులను మంత్రి రాజయ్య నాడిపట్టి పరీక్షించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. వైద్యశాఖపై సమీక్ష :- పర్యటనలో భాగంగా రాత్రి పది గంటల తరువాత వైద్య శాఖపై ఏరియా ఆసుపత్రిలోనే సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో పలు విషయాలపై చర్చించారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో దివ్య, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భానుప్రకాష్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, ఆసుపత్రుల జిల్లా సమన్వయ అధికారిణి ఆనందవాణి, సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి, క్లస్టర్ అధికారిణి కోమల తదితరులు ఉన్నారు. మంత్రి రాత్రి బస నేపథ్యంలో కొత్తగూడెం డీఎస్పీ సురేందర్ నేతృత్వంలో భద్రాచలం, పాల్వంచ సీఐలు ఆంజనేయలు, షుకూర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.