బదిలీ అయినవారిని తిరిగి రానివ్వం శాశ్వత ఈవోను నియమిస్తాం
భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్
విజయవాడ : దుర్గగుడిలో ప్రక్షాళన ప్రారంభించామని, బదిలీ అయినవారిని తిరిగి ఇక్కడికి రానిచ్చేది లేదని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ అన్నారు. దుర్గగుడిని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుష్కరఘాట్లలో జరుగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంద్రకీలాద్రికి వస్తే దేవాలయానికి వచ్చామనే భావన కలగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. భవనాలను అడ్డగోలుగా పగలగొట్టడమేమిటంటూ ఇంజినీరింగ్ సిబ్బందిని నిలదీశారు. పుష్కరాల నాటికి పనులు ఏవిధంగా పూర్తిచేస్తారని ప్రశ్నిం చారు. దేవస్థానంలో భక్తులకు ప్రాధ్యాన్యత ఇవ్వాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు కాదంటూ హితవు పలికారు.
ఐదేళ్లు దాటితే బదిలీ
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దుర్గగుడిలో ప్రక్షాళన ప్రారంభించామని చెప్పారు. ఐదేళ్లు దాటిన వారిని బదిలీ చేశామన్నారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చామో అక్కడే వారు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకునే బదిలీలు చేశామని, ఇంజినీరింగ్ సెక్షన్‌లో ఇక్కడకు వచ్చిన వారే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారన్నారు. దుర్గగుడిలో కొంతమంది వాళ్ల అవసరాలే చూసుకుంటున్నారని, ఇలాంటి వారు ఇప్పటికైనా మారకపోతే మరోసారి పక్షాళన చేసేందుకు ఏమాత్రం వెనుకాడబోమని హెచ్చరించారు. తమకు భక్తులే ముఖ్యమని, వారికి సౌకర్యాలు కల్పించేందుకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. బదిలీల విషయంలో అర్చకులకు ఏవిధమైన మినహాయింపులు ఉండబోవన్నారు. ఎవరైనా అర్చకులు సరిగా పనిచేయడం లేదని తెలిస్తే వారిని ఇక్కడి నుంచి మార్చివేసేందుకు ఏమాత్రం వెనుకాడబోమని చెప్పారు. దుర్గగుడికి త్వరలోనే శాశ్వత ఈవోను ఏర్పాటు చేస్తామన్నారు. బాగా పనిచేసే అధికారుల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దేవాదాయశాఖ కార్యాలయం గొల్లపూడిలో నిర్మిస్తున్నామని, రానున్న మూడు నెలల్లో అక్కడ పనిచేయడం ప్రారంభిస్తామని చెప్పారు. కాగా దుర్గగుడి ఈవో చంద్రశేఖర్ ఆజాద్, ఈఈ కోటేశ్వరరావు తదితరులు ఆయనతో పాటు తనిఖీల్లో పాల్గొని దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.