the transfer
-
లా అండ్ ఆర్డర్... విభజన షురూ
ఇద్దరు డీసీపీల నియామకం ఒక్కొక్కరికి మూడు జోన్ల కేటాయింపు కొత్త డీసీపీలు రెండు రోజుల్లో రాక విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో పని విభజన మొదలైంది. ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ముగ్గురు అధికారుల్ని ప్రభుత్వం కమిషనరేట్‌కు కేటాయించింది. ఈ క్రమంలో కమిషనరేట్ అప్‌గ్రేడ్ అయిన తర్వాత మొదటిసారిగా పోస్టులన్నీ భర్తీ చేశారు. లా ఆండ్ ఆర్డర్ విభాగానికి ఇద్దరు డీసీపీలను ప్రభుత్వం కేటాయించింది. ట్రాఫిక్‌కు మరో డీసీపీని నియమించింది. నూతనంగా కేటాయించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు మరో రెండు రోజుల్లో విధుల్లో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో కమిషనరేట్ ఉన్నతాధికారులు లా ఆండ్ ఆర్డర్ విభజన ప్రక్రియపై దృష్టి సారించి ప్రాథమికంగా పూర్తి చేశారు. ప్రస్తుతం విభాగాలు ఇలా... కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లతో కలిపి ఐదు పోలీస్ సబ్ డివిజన్లు, వీటి పరిధిలో 20 పోలీస్ స్టేషన్లు, ఇవి కాకుండా ట్రాఫిక్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, మహిళా పోలీస్ స్టేషన్ ఇలా అనేక విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నీ ఇప్పటి వరకు ఏసీపీ పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్, పరిపాలన విభాగానికి మాత్రమే డీసీపీలు ఉండేవారు. లా అండ్ ఆర్డర్ విభాగం గత రెండు నెలలుగా ఖాళీగా ఉంది. గతంలో లా అండ్ ఆర్డర్ డీసీపీగా ఉన్న కాళిదాసు రంగారావును విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించటంతో ఆ స్థానం భర్తీ కాకుండా ఉండటంతో పరిపాలన విభాగం డీసీపీ అశోక్ కుమార్ దానిని కూడా ఇప్పటి వరకు పర్యవేక్షించారు. కమిషనరేట్‌లో అదనపు డీజీ క్యాడర్లో ఉన్న కమిషనర్ పోస్టుతో పాటు ఐజీ క్యాడర్లో అదనపు కమిషనర్ పోస్టు, డీఐజీ క్యాడర్లో జాయింట్ కమిషనర్ పోస్టులతో పాటు నాలుగు డీసీపీ పోస్టులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ముగ్గురు డీసీపీలతో కలిపి అన్ని పోస్టులూ భర్తీ అయినట్టే. ఇక అదనపు కమిషనర్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. గతంలో ఈ పోస్టులో మహేష్ చంద్ర లడ్హా కొద్ది రోజులు పనిచేసి బదిలీపై వెళ్లిపోయారు. లా అండ్ ఆర్డర్‌కు ఇక ఇద్దరు డీసీపీలు... లా అండ్ ఆర్డర్‌కు ఇప్పటి వరకు ఒక్కరే డీసీపీగా కొనసాగుతూ వచ్చారు. దీనిని తాజాగా రెండుగా విభజించారు. కమిషనరేట్ పరిధిలో ఈస్ట్, వెస్ట్. సౌత్, నార్త్, సెంట్రల్ జోన్లతో పాటు, సీసీఎస్ (క్రైం) ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ డీసీపీ-1గా డాక్టర్ కొయ్య ప్రవీణ్‌ను, డీసీపీ-2గా జి.పాల్‌రాజును నియమించారు. డీసీపీ-1 పరిధిలోకి మూడు జోన్లు, డీసీపీ-2 పరిధిలోకి సీసీఎస్‌తో కలిపి మూడు జోన్లు కేటాయించనున్నారు. జోన్ల పరిధి, సరిహద్దును పరిగణనలోకి తీసుకొని వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు కమిషనరేట్ పరిధిలోని ప్రత్యేక టాస్క్లకూ డీసీపీలనే ఎక్కువగా వినియోగించనున్నారు. ట్రాఫిక్ విభాగాన్ని ఏడీసీపీ నాగరాజు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ విభాగానికి డీసీపీగా క్రాంతి రతన్ టాటాను నియమించారు. ట్రాఫిక్ స్టేషన్లు పరిమితంగా ఉండటం, ఒక్కరే డీసీపీ కావటంతో ఎలాంటి విభజన లేకుండా ఈ విభాగాన్ని రతన్ టాటాకు అప్పగించనున్నారు. -
ప్రక్షాళన ప్రారంభమైంది..!
బదిలీ అయినవారిని తిరిగి రానివ్వం శాశ్వత ఈవోను నియమిస్తాం భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ విజయవాడ : దుర్గగుడిలో ప్రక్షాళన ప్రారంభించామని, బదిలీ అయినవారిని తిరిగి ఇక్కడికి రానిచ్చేది లేదని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ అన్నారు. దుర్గగుడిని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుష్కరఘాట్లలో జరుగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంద్రకీలాద్రికి వస్తే దేవాలయానికి వచ్చామనే భావన కలగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. భవనాలను అడ్డగోలుగా పగలగొట్టడమేమిటంటూ ఇంజినీరింగ్ సిబ్బందిని నిలదీశారు. పుష్కరాల నాటికి పనులు ఏవిధంగా పూర్తిచేస్తారని ప్రశ్నిం చారు. దేవస్థానంలో భక్తులకు ప్రాధ్యాన్యత ఇవ్వాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు కాదంటూ హితవు పలికారు. ఐదేళ్లు దాటితే బదిలీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దుర్గగుడిలో ప్రక్షాళన ప్రారంభించామని చెప్పారు. ఐదేళ్లు దాటిన వారిని బదిలీ చేశామన్నారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చామో అక్కడే వారు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకునే బదిలీలు చేశామని, ఇంజినీరింగ్ సెక్షన్లో ఇక్కడకు వచ్చిన వారే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారన్నారు. దుర్గగుడిలో కొంతమంది వాళ్ల అవసరాలే చూసుకుంటున్నారని, ఇలాంటి వారు ఇప్పటికైనా మారకపోతే మరోసారి పక్షాళన చేసేందుకు ఏమాత్రం వెనుకాడబోమని హెచ్చరించారు. తమకు భక్తులే ముఖ్యమని, వారికి సౌకర్యాలు కల్పించేందుకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. బదిలీల విషయంలో అర్చకులకు ఏవిధమైన మినహాయింపులు ఉండబోవన్నారు. ఎవరైనా అర్చకులు సరిగా పనిచేయడం లేదని తెలిస్తే వారిని ఇక్కడి నుంచి మార్చివేసేందుకు ఏమాత్రం వెనుకాడబోమని చెప్పారు. దుర్గగుడికి త్వరలోనే శాశ్వత ఈవోను ఏర్పాటు చేస్తామన్నారు. బాగా పనిచేసే అధికారుల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దేవాదాయశాఖ కార్యాలయం గొల్లపూడిలో నిర్మిస్తున్నామని, రానున్న మూడు నెలల్లో అక్కడ పనిచేయడం ప్రారంభిస్తామని చెప్పారు. కాగా దుర్గగుడి ఈవో చంద్రశేఖర్ ఆజాద్, ఈఈ కోటేశ్వరరావు తదితరులు ఆయనతో పాటు తనిఖీల్లో పాల్గొని దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. -
మళ్లీ బదిలీల ‘రగడ’
విద్యాశాఖలో మరోసారి బదిలీల చిచ్చు రాజుకుంది. ఇప్పటికే లెక్కకు మించి స్థానికేతర టీచర్లుండగా.. తాజాగా పొరుగు జిల్లాలకు చెందిన మరో 12 మంది టీచర్లను జిల్లాకు బదిలీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఫైళ్లను సిద్ధం చేసింది. ఇవన్నీ దాదాపు చివరి దశలో ఉండగా.. నేడో, రేపో ఉత్తర్వులు సైతం వెలువడే అవకాశం ఉంది. దీంతో స్థానిక నిరుద్యోగులకు మరింత అన్యాయం జరగనుంది. వీటికి తోడు జిల్లాలో పనిచేస్తున్న 24 మంది టీచర్లను హెచ్ఆర్ఏ ప్రాంతాల్లోకి బదిలీచేసే ఉత్తర్వులు సైతం చివరి అంకానికి చేరడంతో.. పట్టణ ప్రాంతంలో పనిచేయాలనుకున్న టీచర్లకు ఈ ప్రక్రియ పిడుగులాంటి వార్తే. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో స్థానిక, స్థానికేతర టీచర్ల అంతరం ఎక్కువగా ఉంది. స్థానికేతర కోటా 20శాతానికి మించకూడదు. కానీ జిల్లాలో 45శాతానికి పెరిగింది. దీంతో జిల్లాలోని ఉపాధ్యాయ ఖాళీలన్నీ స్థానికేతరులతో నిండిపోతుండడంతో.. స్థానిక అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కడం కష్టంగా మారుతోంది. వాస్తవానికి అంతర్జిల్లా బదిలీలపై జిల్లాలోని అన్ని వర్గాలు ఉద్యమిస్తున్నాయి. ఈ అంశంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానాలు, ఇతర సమావేశాల్లో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి సూచించినప్పటికీ.. అవన్నీ అరణ్యరోధనే అయ్యాయి. ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో జిల్లాకు మరో 12 మంది పొరుగు జిల్లాల టీచర్లు బదిలీపై రానున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో ఫైళ్లు చకచకా కదులుతున్నాయి. అంతర్జిల్లా బదిలీల వివరాలు.. వరంగల్ జిల్లా వడ్లకొండ పాఠశాలకు చెందిన ఓ ఎస్జీటీ జిల్లాకు బదిలీ అయ్యేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా బుబ్బగూడెంకు చెందిన మరో ఎస్జీటీ కూడా జిల్లాకు బదిలీపై రానున్నారు. ఉత్తర్వులు చివరిదశలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా చిన్నబెల్లంకొండకు చెందిన ఎస్జీటీ జిల్లాకు బదిలీ ఉత్తర్వులు నేడో, రేపో రానున్నాయి. ఖమ్మం జిల్లా వెంకటాపురం పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ నిజాంపేట పాఠశాలకు బదిలీ అయ్యేందుకు మార్గం సగమమైంది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్‌అసిస్టెంట్ జిల్లాకు త్వరలో బదిలీ కానున్నారు. నల్లగొండ జిల్లా పుట్టపాకకు చెందిన స్కూల్‌అసిస్టెంట్ (తెలుగు) జిల్లాకు బదిలీ అయ్యేందుకు ప్రభుత్వం వద్ద ఫైలు పెండింగ్‌లో ఉంది. గ్రామీణ టీచర్లకు ‘కలే’ జిల్లాలోని పట్టణ ప్రాంతంలో ఉద్యోగం చేయాలనే ఆశ గ్రామీణ టీచర్లకు ఈసారి కూడా కష్టమే. త్వరలో బదిలీలు జరుగుతాయని విద్యాశాఖ చెబుతున్నప్పటికీ.. దొడ్డిదారి బదిలీలతో పల్లె టీచర్లు పట్నం వచ్చే అవకాశాలకు తూట్లు పడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దీర్ఘకాలం ఒకేచోట పనిచేస్తే బదిలీ అనివార్యం. కానీ పట్టణ ప్రాంతంలో పనిచేస్తున్న కొందరు టీచర్లు ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి తెచ్చి ప్రత్యేక ఉత్తర్వులతో కోరిన చోటుకు బదిలీ అవుతున్నాయి. తాజాగా 24 మందికి బదిలీ ఉత్తర్వులు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ పట్టణ ప్రాంతానికి చెందినవే. వీరి బదిలీలతో పట్టణ ప్రాంతంలో 24 ఖాళీలు భర్తీ కానున్నాయి. దీంతో గ్రామీణ టీచర్లకు హెచ్ ఆర్ఏ ప్రాంతంలో పనిచేసేది చివరకు కలగానే మిగులుతోంది. ఐదేళ్లు దాటిన టీచర్లకు తప్పనిసరి బదిలీ చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే ఈ పరిమితిని ఎనిమిదేళ్లకు పెంచుతోందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ప్రక్రియతో మెజార్టీ టీచర్లకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఐదేళ్లు దాటిన టీచర్లను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ బదిలీలు అడ్డుకుంటాం.. అంతర్జిల్లా బదిలీలను ఎలాగైనా అడ్డుకోవాలని ఉపాధ్యాయ ఐక్యకార్యచరణ సమితి నిర్ణయించింది. శనివారం జిల్లా పరిషత్ ఆవరణలో జాక్టో సమావేశమైంది. ఈ సందర్భంగా అంతర్జిల్లా బదిలీలతో పదుల సంఖ్యలో టీచర్లు జిల్లాకు వస్తున్నారని, వాటిని అడ్డుకోకుంటే స్థానిక నిరుద్యోగులకు, స్థానిక టీచర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జాక్టో ప్రతినిధులు చెన్నకేశవరెడ్డి, యూ.పోచయ్య, పి.మాణిక్‌రెడ్డి, సదానంద్, ఆంజనేయులు తదితరులు పేర్కొన్నారు. ఒకట్రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు రానున్నాయనే సమాచారముందని, జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు వెంటనే కలగజే సుకుని ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. అంతర్జిల్లా బదిలీలను వ్యతిరేకిస్తూ సోమవారం కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల దిగ్భందానికి పిలుపునిచ్చారు. -
‘హై'జాక్!
సాక్షి ప్రతినిధి, కడప: రాజారత్నం ఐజాక్... ఈయనో పెద్దమనిషి.. కబీర్ పురస్కార్ అవార్డు గ్రహీత. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్. జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడుగా, ఏపీ ఖోఖో రాష్ట్ర అసోసియేషన్ శాశ్వత చైర్మన్‌గా సైతం కొనసాగుతూనే ఉన్నారు. కొత్తగా జిల్లాకు కలెక్టర్, ఎస్పీలుగా బదిలీపై వస్తే ముందుగా వెళ్లి స్వాగతం పలికే పెద్ద మనిషి. అలాంటాయన తన ఇంటి ఆవరణంలో ఐదుగురి మృతదేహాల్ని పాతిపెట్టించారు. ఏడాదిన్నరగా అదే పెద్దమనిషిగా చలామణీ అవుతున్నారు. నా కుమార్తె, అల్లుడు, పిల్లలు కన్పించలేదు మొర్రో అని ఓ మహిళ ఆవేదన ఐజాక్ ‘కా’మాయ ముందు అరణ్యరోదనగా మారింది. కృపాకర్ ఐజాక్ 2004లో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో రాజరత్నం కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఏమాత్రం ఇష్టం లేదని వారి బంధువుల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగా మౌనికకు వివాహేతర సంబంధం అంటగట్టారని తెలుస్తోంది. కాగా కృపాకర్ తన భార్యను చంపిన అనంతరం రాజారత్నం ఐజాక్‌కు మృతదేహం ఫోటోలు చూపించినట్లు పలువురు పేర్కొంటున్నారు. రాజారత్నం ప్రమేయం లేకుంటే ఆయనకు మౌనిక చనిపోయిన ఫొటోలు ఎందుకు చూపించారు. స్కూల్ ప్రాంగణంలోనే పాతిపెట్టమని చెప్పాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కృపాకర్, రాజారత్నం ఐజాక్ ఇరువురు నివసిస్తున్న ఇళ్ల మధ్య కేవలం 20మీటర్లు దూరం ఉంది. కృపాకర్ ముగ్గురు పిల్లల్ని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకోవడం, ఆ పక్కనే వారిని పాతిపెట్టమని ఆదేశించడం ఇవన్నీ చూస్తుంటే పథకం ప్రకారం చోటుచేసుకున్న సంఘటనలుగా పలువురు భావిస్తున్నారు. కృపాకర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడైతే నలుగుర్ని హత్య చేసేందుకు వ్యూహ రచన చేస్తాడా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇందతా పెద్ద మనిషిగా చలామణి అవుతున్న రాజరత్నం ఐజాక్‌కు తెలియక పోవడం మరీ విచిత్రంగా ఉందని పలువురు చెప్పుకొస్తున్నారు. నిష్ణాతుడైన అధికారికి అప్పగించాం... మౌనిక, కృపాకర్ కుటుంబం మిస్సింగ్ కేసును నమ్మకస్తుడైన సీఐ స్థాయి అధికారికి అప్పగించి వెలుగులోకి తెచ్చామని ఎస్పీ నవీన్‌గులాఠి చెప్పారు. కృపాకర్ కుటుంబం కనుమరుగు వ్యవహారంలో అప్పటికే స్థానిక అధికారుల వైఖరి ఎస్పీకి తెలిసిందా? రాజారత్నం ఐజాక్‌తో స్థానిక అధికారులకు ఉన్న బంధం కారణంగా ఈ కేసును మరో సబ్ డివిజన్ పరిధిలోని అధికారికి అప్పగించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికీ కొంత మంది అధికారులు ఐజాక్‌కు హత్యలతో సంబంధం లేదనే వాదనను తెరముందుకు తెస్తున్నట్లు సమాచారం. ఏడాదిన్నరగా సుజాత ఐజాక్‌తో అనేక పర్యాయాలు కుమార్తె, అల్లుడి గురించి వాకబు చేిసింది. అన్నీ తెలిసీ కూడా ఐజాక్ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ఉండిపోయారు. అందుకు కారణం పోలీసు అధికారులతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యమేనని పలువురు చె బుతున్నారు. ఇరువురిలో ఒకరికి బ్రేక్... సొంత కుమారుడు కృపాకర్ కుటుంబాన్ని హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజారత్నం ఐజాక్, ఆ కేసును ఛాలెంజ్‌గా స్వీకరించి ఛేదించిన సీఐ సత్యనారాయణ ఇరువురు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నవారే. కబీర్ పురస్కార్ అవార్డును రాజారత్నం ఐజాక్ రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోగా, నిబద్ధతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారని సీఐ సత్యనారాయణ సైతం రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. శాంతిసంఘం ముసుగులో ఉన్న పెద్ద మనిషి సొంత కుటుంబాన్ని సైతం పరువుకోసం మట్టుబెట్టడం, ఆ విషయాన్ని మరుగు పర్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అడుగడుగునా పోలీసుల వైఫల్యం... మౌనిక కన్పించకపోవడంతో ముందుగా బంధువర్గాన్ని ఆశ్రయించిన ఆమె తల్లి సుజాతకు అందరి నుంచి ఛీత్కారాలు ఎదురైనట్లు తెలుస్తోంది. కబీర్ పురస్కార్ అవార్డు పొందిన ఐజాక్సైతం తుపాకితో కాలుస్తానని బెదిరించినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మూడు మాసాలుగా ఆమె పోలీసుల కాళ్లావేళ్లా పడ్డట్లు తెలుస్తోంది. ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా ప్రతి అధికార్ని సుజాత కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 8న ఎస్పీ నవీన్ గులాఠి ఆదేశాల మేరకు తాలుకా స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం ఆ కేసులో ఎదుగూ బొదుగు లేకుండా పోయింది. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగంలోని కొందరికి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. అందులో భాగంగా ఐజాక్‌ను రక్షించే క్రమంలో సుజాత కేసును నీరుగార్చినట్లు తెలుస్తోంది. అన్యూహ్యంగా డ్రైవర్‌గా పనిచే స్తున్న వ్యక్తికి పాస్‌పోర్టు కోసం రాజారత్నం ఐజాక్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పాస్‌పోర్టు కోసం డ్రైవర్ రామాంజనేయరెడ్డి సైతం పెద్ద ఎత్తున పోలీసులకు లంచం ఆశ చూపడంతో అనుమానం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ నవీన్ గులాఠీ సీఐ సత్యనారాయణకు కేసు అప్పగించినట్లు సమాచారం.