మళ్లీ బదిలీల ‘రగడ’ | Again transformations | Sakshi
Sakshi News home page

మళ్లీ బదిలీల ‘రగడ’

Published Sat, Jun 13 2015 11:48 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Again transformations

విద్యాశాఖలో మరోసారి బదిలీల చిచ్చు రాజుకుంది. ఇప్పటికే లెక్కకు మించి స్థానికేతర టీచర్లుండగా.. తాజాగా పొరుగు జిల్లాలకు చెందిన మరో 12 మంది టీచర్లను జిల్లాకు బదిలీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఫైళ్లను సిద్ధం చేసింది. ఇవన్నీ దాదాపు చివరి దశలో ఉండగా.. నేడో, రేపో ఉత్తర్వులు సైతం వెలువడే అవకాశం ఉంది. దీంతో స్థానిక నిరుద్యోగులకు మరింత అన్యాయం జరగనుంది. వీటికి తోడు జిల్లాలో పనిచేస్తున్న 24 మంది టీచర్లను హెచ్‌ఆర్‌ఏ ప్రాంతాల్లోకి బదిలీచేసే ఉత్తర్వులు సైతం చివరి అంకానికి చేరడంతో.. పట్టణ ప్రాంతంలో పనిచేయాలనుకున్న టీచర్లకు ఈ ప్రక్రియ పిడుగులాంటి వార్తే.      - సాక్షి, రంగారెడ్డి జిల్లా
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో స్థానిక, స్థానికేతర టీచర్ల అంతరం ఎక్కువగా ఉంది. స్థానికేతర కోటా 20శాతానికి మించకూడదు. కానీ జిల్లాలో 45శాతానికి పెరిగింది. దీంతో జిల్లాలోని ఉపాధ్యాయ ఖాళీలన్నీ స్థానికేతరులతో నిండిపోతుండడంతో.. స్థానిక అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కడం కష్టంగా మారుతోంది. వాస్తవానికి అంతర్‌జిల్లా బదిలీలపై జిల్లాలోని అన్ని వర్గాలు ఉద్యమిస్తున్నాయి. ఈ అంశంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానాలు, ఇతర సమావేశాల్లో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి సూచించినప్పటికీ.. అవన్నీ అరణ్యరోధనే అయ్యాయి. ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో జిల్లాకు మరో 12 మంది పొరుగు జిల్లాల టీచర్లు బదిలీపై రానున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో ఫైళ్లు చకచకా కదులుతున్నాయి.
 
 అంతర్‌జిల్లా బదిలీల వివరాలు..
  వరంగల్ జిల్లా వడ్లకొండ పాఠశాలకు చెందిన ఓ ఎస్‌జీటీ జిల్లాకు బదిలీ అయ్యేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టుకున్నారు.
 
  కరీంనగర్ జిల్లా బుబ్బగూడెంకు చెందిన మరో ఎస్‌జీటీ కూడా జిల్లాకు బదిలీపై రానున్నారు. ఉత్తర్వులు చివరిదశలో ఉన్నాయి.
 
  ఆదిలాబాద్ జిల్లా చిన్నబెల్లంకొండకు చెందిన ఎస్‌జీటీ జిల్లాకు బదిలీ ఉత్తర్వులు నేడో, రేపో రానున్నాయి.
 
  ఖమ్మం జిల్లా వెంకటాపురం పాఠశాలలో పనిచేస్తున్న ఎస్‌జీటీ నిజాంపేట పాఠశాలకు బదిలీ అయ్యేందుకు మార్గం సగమమైంది.
 
  ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్‌అసిస్టెంట్ జిల్లాకు త్వరలో బదిలీ కానున్నారు.
 
  నల్లగొండ జిల్లా పుట్టపాకకు చెందిన స్కూల్‌అసిస్టెంట్ (తెలుగు) జిల్లాకు బదిలీ అయ్యేందుకు ప్రభుత్వం వద్ద ఫైలు పెండింగ్‌లో ఉంది.
 
 గ్రామీణ టీచర్లకు ‘కలే’
 జిల్లాలోని పట్టణ ప్రాంతంలో ఉద్యోగం చేయాలనే ఆశ గ్రామీణ టీచర్లకు ఈసారి కూడా కష్టమే. త్వరలో బదిలీలు జరుగుతాయని విద్యాశాఖ చెబుతున్నప్పటికీ.. దొడ్డిదారి బదిలీలతో పల్లె టీచర్లు పట్నం వచ్చే అవకాశాలకు తూట్లు పడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దీర్ఘకాలం ఒకేచోట పనిచేస్తే బదిలీ అనివార్యం. కానీ పట్టణ ప్రాంతంలో పనిచేస్తున్న కొందరు టీచర్లు ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి తెచ్చి ప్రత్యేక ఉత్తర్వులతో కోరిన చోటుకు బదిలీ అవుతున్నాయి. తాజాగా 24 మందికి బదిలీ ఉత్తర్వులు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ పట్టణ ప్రాంతానికి చెందినవే. వీరి బదిలీలతో పట్టణ ప్రాంతంలో 24 ఖాళీలు భర్తీ కానున్నాయి. దీంతో గ్రామీణ టీచర్లకు హెచ్ ఆర్‌ఏ ప్రాంతంలో పనిచేసేది చివరకు కలగానే మిగులుతోంది. ఐదేళ్లు దాటిన టీచర్లకు తప్పనిసరి బదిలీ చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే ఈ పరిమితిని ఎనిమిదేళ్లకు పెంచుతోందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ప్రక్రియతో మెజార్టీ టీచర్లకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఐదేళ్లు దాటిన టీచర్లను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 
  ఆ బదిలీలు అడ్డుకుంటాం..
 అంతర్‌జిల్లా బదిలీలను ఎలాగైనా అడ్డుకోవాలని ఉపాధ్యాయ ఐక్యకార్యచరణ సమితి నిర్ణయించింది. శనివారం జిల్లా పరిషత్ ఆవరణలో జాక్టో సమావేశమైంది. ఈ సందర్భంగా అంతర్‌జిల్లా బదిలీలతో పదుల సంఖ్యలో టీచర్లు జిల్లాకు వస్తున్నారని, వాటిని అడ్డుకోకుంటే స్థానిక నిరుద్యోగులకు, స్థానిక టీచర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జాక్టో ప్రతినిధులు చెన్నకేశవరెడ్డి, యూ.పోచయ్య, పి.మాణిక్‌రెడ్డి, సదానంద్, ఆంజనేయులు తదితరులు పేర్కొన్నారు. ఒకట్రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు రానున్నాయనే సమాచారముందని, జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు వెంటనే కలగజే సుకుని ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. అంతర్జిల్లా బదిలీలను వ్యతిరేకిస్తూ సోమవారం కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల దిగ్భందానికి పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement