సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు విద్య సంకటంలో పడింది. అసలే అరకొర సౌకర్యాలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం బోధకుల సమస్య తలెత్తింది. గతేడాది జరిగిన బదిలీల ప్రక్రియ కారణంగా పలు గ్రామీణ పాఠశాలల్లో టీచర్లు లేకుండా పోయారు. ఇక నెలవారీ ఉపాధ్యాయుల పదవీ విరమణల నేపథ్యంలో మరిన్ని పాఠశాలలు గురువులేని బడులుగా మారిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో టీచర్లులేని స్కూళ్లు 98 ఉన్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో పది కంటే ఎక్కువ మంది పిల్లలున్న పాఠశాలలు 44 ఉన్నట్టు గుర్తించారు. ఆయా పాఠశాలల్లో 6,035 మంది విద్యార్థులుండడం గమనార్హం.
471 స్కూళ్లలో సింగిల్ టీచర్లే..
జిల్లాలో 2,373 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,682 ప్రాథమిక, 267 ప్రాథమికోన్నత, 424 ఉన్నత పాఠశాలలున్నాయి. గతేడాది బదిలీలతో కొన్ని పాఠశాలల్లోని టీచర్లకు స్థానచలనం కలిగింది. అయితే కొత్తగా టీచర్లు రాకపోవడంతో ఆయా పాఠశాలలు గురువుల్లేని పాఠశాలలయ్యాయి. దీంతో అక్కడ బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయలేదు.
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కొన్ని పాఠశాలల్లో పరిమిత సంఖ్యలోనే ఉపాధ్యాయులను రిలీవ్ చేశారు. మరికొందరు బదిలీ అయినా వారికి రిలీవింగ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా బదిలీ అ యినా రిలీవ్ కానీ టీచర్లు దాదాపు 200 మంది వరకు ఉన్నారు. అయితే గత విద్యాసంవత్సరంలో నెలవారీగా జరిగి న పదవీ విరమణలతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం టీచర్లులేని పాఠశాలలు 98 కాగా, సింగిల్ టీచర్లతో నెట్టుకొస్తున్న పాఠశాలలు 471 ఉన్నాయి.
తాత్కాలిక బోధకుల ఊసేదీ..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు వందల సంఖ్యలో ఉన్నా.. వాటి భర్తీకి కొన్నేళ్లుగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అప్పటికే ఉన్న ఖాళీలకు తోడు పదవీ విరమణలతో ఏర్పడిన కొత్త ఖాళీలు ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,500 ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. కానీ నియామకాలు చేపట్టకపోవడంతో పాఠశాలల్లో విద్యాబోధన ఇబ్బందిగా మారింది.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు తలపెట్టిన విద్యావలంటీర్ల విధానం ఆర్టీఈ చట్టం అమల్లోకి రావడంతో రద్దయింది. దీంతో గతేడాది అవసరం ఉన్న పాఠశాలలకు విద్యాబోధకుల పేరిట కొందరిని నియమించి నెట్టుకొచ్చారు. విద్యాసంవత్సరం ముగియడంతో వారి నియామకం రద్దయింది. తాజాగా మళ్లీ టీచర్ల కొరత ఏర్పడింది. బడులు తెరిచి రెండు నెలలు కావొస్తున్నా ప్రభుత్వం మాత్రం తాత్కాలిక బోధకుల నియామక విషయం ఎత్తడంలేదు.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామంటూ ఓ వైపు కొత్త సర్కారు గొప్పలు చెప్పుకుంటుండగా.. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో బోధకులు లేక విద్యార్థులకు పాఠాల బోధన ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికి జిల్లాకు 1200 మంది బోధకులు అవసరమని గుర్తించిన విద్యాశాఖ ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. కానీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది.
టీచర్లులేని స్కూళ్లు 98
Published Tue, Jul 22 2014 11:35 PM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement