‘హై'జాక్! | 'High Jack! | Sakshi
Sakshi News home page

‘హై'జాక్!

Published Wed, Oct 8 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

'High Jack!

సాక్షి ప్రతినిధి, కడప: రాజారత్నం ఐజాక్... ఈయనో పెద్దమనిషి.. కబీర్ పురస్కార్ అవార్డు గ్రహీత. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్. జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడుగా, ఏపీ ఖోఖో రాష్ట్ర అసోసియేషన్ శాశ్వత చైర్మన్‌గా సైతం కొనసాగుతూనే  ఉన్నారు. కొత్తగా జిల్లాకు కలెక్టర్, ఎస్పీలుగా బదిలీపై వస్తే ముందుగా వెళ్లి స్వాగతం పలికే పెద్ద మనిషి. అలాంటాయన తన ఇంటి ఆవరణంలో ఐదుగురి మృతదేహాల్ని పాతిపెట్టించారు. ఏడాదిన్నరగా అదే పెద్దమనిషిగా చలామణీ అవుతున్నారు. నా కుమార్తె, అల్లుడు, పిల్లలు కన్పించలేదు మొర్రో అని ఓ మహిళ ఆవేదన ఐజాక్ ‘కా’మాయ ముందు అరణ్యరోదనగా మారింది.

 కృపాకర్ ఐజాక్ 2004లో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో రాజరత్నం కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఏమాత్రం ఇష్టం లేదని వారి బంధువుల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగా మౌనికకు వివాహేతర సంబంధం అంటగట్టారని తెలుస్తోంది. కాగా కృపాకర్ తన భార్యను చంపిన అనంతరం రాజారత్నం ఐజాక్‌కు మృతదేహం ఫోటోలు చూపించినట్లు పలువురు పేర్కొంటున్నారు. రాజారత్నం ప్రమేయం లేకుంటే ఆయనకు మౌనిక చనిపోయిన ఫొటోలు ఎందుకు చూపించారు.

స్కూల్ ప్రాంగణంలోనే పాతిపెట్టమని చెప్పాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కృపాకర్, రాజారత్నం ఐజాక్ ఇరువురు నివసిస్తున్న ఇళ్ల మధ్య కేవలం 20మీటర్లు దూరం ఉంది. కృపాకర్ ముగ్గురు పిల్లల్ని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకోవడం, ఆ పక్కనే వారిని పాతిపెట్టమని ఆదేశించడం ఇవన్నీ చూస్తుంటే పథకం ప్రకారం చోటుచేసుకున్న సంఘటనలుగా పలువురు భావిస్తున్నారు.

కృపాకర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడైతే నలుగుర్ని హత్య చేసేందుకు వ్యూహ రచన చేస్తాడా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇందతా పెద్ద మనిషిగా చలామణి అవుతున్న రాజరత్నం ఐజాక్‌కు తెలియక పోవడం మరీ విచిత్రంగా ఉందని పలువురు చెప్పుకొస్తున్నారు.

 నిష్ణాతుడైన అధికారికి అప్పగించాం...
 మౌనిక, కృపాకర్ కుటుంబం మిస్సింగ్ కేసును నమ్మకస్తుడైన సీఐ స్థాయి అధికారికి అప్పగించి వెలుగులోకి తెచ్చామని ఎస్పీ నవీన్‌గులాఠి చెప్పారు. కృపాకర్ కుటుంబం కనుమరుగు వ్యవహారంలో అప్పటికే స్థానిక అధికారుల వైఖరి ఎస్పీకి తెలిసిందా? రాజారత్నం ఐజాక్‌తో స్థానిక అధికారులకు ఉన్న బంధం కారణంగా ఈ కేసును మరో సబ్ డివిజన్ పరిధిలోని అధికారికి అప్పగించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికీ కొంత మంది అధికారులు ఐజాక్‌కు హత్యలతో సంబంధం లేదనే వాదనను తెరముందుకు తెస్తున్నట్లు సమాచారం. ఏడాదిన్నరగా సుజాత ఐజాక్‌తో అనేక పర్యాయాలు కుమార్తె, అల్లుడి గురించి వాకబు చేిసింది. అన్నీ తెలిసీ కూడా ఐజాక్ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ఉండిపోయారు. అందుకు కారణం పోలీసు అధికారులతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యమేనని పలువురు చె బుతున్నారు.

 ఇరువురిలో ఒకరికి బ్రేక్...
 సొంత కుమారుడు కృపాకర్ కుటుంబాన్ని హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజారత్నం ఐజాక్, ఆ కేసును ఛాలెంజ్‌గా స్వీకరించి ఛేదించిన సీఐ సత్యనారాయణ ఇరువురు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నవారే. కబీర్ పురస్కార్ అవార్డును రాజారత్నం ఐజాక్ రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోగా, నిబద్ధతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారని సీఐ సత్యనారాయణ సైతం రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. శాంతిసంఘం ముసుగులో ఉన్న పెద్ద మనిషి సొంత కుటుంబాన్ని సైతం పరువుకోసం మట్టుబెట్టడం, ఆ విషయాన్ని మరుగు పర్చడం తీవ్ర చర్చనీయాంశంగా

మారింది.అడుగడుగునా పోలీసుల వైఫల్యం...
 మౌనిక కన్పించకపోవడంతో ముందుగా బంధువర్గాన్ని ఆశ్రయించిన ఆమె తల్లి సుజాతకు అందరి నుంచి ఛీత్కారాలు ఎదురైనట్లు తెలుస్తోంది. కబీర్ పురస్కార్ అవార్డు పొందిన ఐజాక్‌సైతం తుపాకితో కాలుస్తానని బెదిరించినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మూడు మాసాలుగా ఆమె పోలీసుల కాళ్లావేళ్లా పడ్డట్లు తెలుస్తోంది. ఎస్‌ఐ నుంచి ఎస్పీ దాకా ప్రతి అధికార్ని సుజాత కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 8న ఎస్పీ నవీన్ గులాఠి ఆదేశాల మేరకు తాలుకా స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం ఆ కేసులో ఎదుగూ బొదుగు లేకుండా పోయింది.

ఈ క్రమంలో పోలీసు యంత్రాంగంలోని కొందరికి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. అందులో భాగంగా ఐజాక్‌ను రక్షించే క్రమంలో సుజాత కేసును నీరుగార్చినట్లు తెలుస్తోంది. అన్యూహ్యంగా డ్రైవర్‌గా పనిచే స్తున్న వ్యక్తికి పాస్‌పోర్టు కోసం రాజారత్నం ఐజాక్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పాస్‌పోర్టు కోసం డ్రైవర్ రామాంజనేయరెడ్డి సైతం పెద్ద ఎత్తున పోలీసులకు లంచం ఆశ చూపడంతో అనుమానం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ నవీన్ గులాఠీ సీఐ సత్యనారాయణకు కేసు అప్పగించినట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement