సెల్‌ఫోన్‌తో నో ఎంట్రీ!
దుర్గగుడి క్యూలైన్లలో తనిఖీలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సెల్‌ఫోన్‌తో అంతరాలయంలో మూలవిరాట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఘటనపై దుర్గగుడి అధికారులు సోమవారం సీరియస్‌గా స్పందించారు. సోమవారం ఉదయం నుంచి సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేకంగా తనిఖీలు చేసిన తర్వాతే కొండపైకి అనుమతించారు. దర్శనం కోసం క్యూలైన్‌లోకి ప్రవేశించే ముందే భక్తులతో పాటు వారి బ్యాగులు, లగేజీలను పూర్తిగా తనిఖీ చేశారు.
క్యూలైన్‌లోకి ప్రవేశించిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించే మార్గాల వద్ద మరోమారు తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం, రూ. 100, రూ.300, రూ.500 టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహించడంతో పాటు సెల్‌ఫోన్‌తో ఉన్న భక్తులను బయటకు పంపేశారు. దీంతో ఒకరిద్దరు భక్తులు సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగినా వారిని బయటకు పంపేశారు. కొంత మంది ఇదే విషయాన్ని వీడియో రికార్డు చేసి మరో మారు సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశారు. సెల్‌ఫోన్లతో క్యూలైన్‌లోకి వస్తే, మళ్లీ కౌంటర్ వద్దకు వెళ్లాల్సి వస్తుందని, దీంతో గంట సమయం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ముందుగానే సెల్‌ఫోన్లను కౌంటర్‌లో పెట్టుకుని రావాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు. మరో వైపున భక్తులెవరిని ఎట్టి పరిస్థితులలోనూ సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి పంపే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అలాగే మహా మండపం రాజగోపురం వద్ద, లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద, నటరాజ స్వామి వారి ఆలయం వద్ద సెల్‌ఫోన్లతో ఫొటోలు దిగే వారిని వారించారు. కొంత మంది నుంచి సెల్‌ఫోన్లను తీసుకునే ప్రయత్నం చేయడంతో వాదనలు జరిగాయి. సెల్‌ఫోన్లను ఆలయంలోకి అనుమతించకుండా ఇదే విధంగా కట్టుదిట్టంగా వ్యవహరించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment