కడప ఎడ్యుకేషన్:విద్యా రంగంలో ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. విద్యారంగ ప్రగతి సాధనతోపాటు విద్యార్థులకు సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వృథా ఖర్చులను తగ్గించి నిధులు కొరత అధిగమించాలన్న లక్ష్యంతో మూడు శాఖలుగా ఉన్న సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక అభియాన్ (ఆర్‌ఎంఎస్), స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్టీ) పథకాలను ఒకే గొడుకు కిందకు తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి కార్యాచరణను కూడా మొదలు పెట్టినట్లు చర్చ సాగుతుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ కార్యక్రమాన్ని ఈ నెలాఖరుకల్లా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాఠశాలలను బలోపేతం చేసేందుకే..
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేం దుకు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటి వరకూ సర్వశిక్ష అభియాన్ ద్వారా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించేవారు. 9,10 తరగతుల విద్యార్థులకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ప్రాజెక్టు ద్వారా పథకాలను అమలు చేసేవారు. ఇలాగే విద్యార్థులకు, టీచర్లకు నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ౖట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్టీ)శాఖ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ మూడుశాఖలను కలిపి ఒకేశాఖగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
నిధులతోపాటు సమయం ఆదా..
గతంలో సర్వశిక్ష అభియాన్ ద్వారా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు శిక్షణలు ఇచ్చేవారు. అలాగే 9,10 తరగతులకు రాష్ట్రీయ శిక్షా అభియాన్ వారు శిక్షణలు ఇచ్చేవారు. ఇలా చేయడం ద్వారా నిధుల ఖర్చుతోపాటు సమయం కూడా వృథా అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఈ రెండింటిని ఎస్సీఈఆర్టీ పర్యవేక్షించేది. ఇలా చేయడం ద్వారా నిధులు ఖర్చుతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు చర్చ సాగుతోంది. దీంతో అన్నింటిని ఒకే గొడుకు కిందకు తెచ్చి ఉన్న సిబ్బందిని క్రమబద్ధీకరించి అన్నింటికి కలిపి ఒక ఉన్నతస్థాయి అధికారితో పర్యవేక్షణను పెంచి సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించినట్లు సమాచారం. దీనిని అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని కూడా నియమించినట్లు తెలిసింది.
జీఓ రాలేదు
సర్వశిక్ష అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ, ఎస్సీఈఆర్టీలను ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికైతే జీఓ రాలేదు. ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
– పొన్నతోట శైలజ, సర్వశిక్షఅభియాన్ ప్రాజెక్టు అధికారి
Comments
Please login to add a commentAdd a comment