సీఎం కేసీఆర్ సూచనతో ఆర్టీసీలో కదలిక
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు
ఏటూరునాగారంలో కొత్తగా డిపో ఏర్పాటు
ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి తిరుపతికి బస్సు
వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు కూడా బస్సులు నడపాలని నిర్ణయం
హన్మకొండ : ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి ప్రక్షాళన మొదలైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. లాభాల్లో ఉన్న డిపోలను అధ్యయనం చేయాలని, నష్టాలను పూరించేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. దీంతో ఆర్టీసీ అధికారులు డిపోలు, రీజియన్‌ల వారీగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆక్యుపెన్సీ రేషియో, కమర్షియల్ ఆదాయం పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. 2014-2015లో రూ.18.91 కోట్ల నష్టాల్లో ఉన్న వరంగల్ రీజియన్.. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో 30.75 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. నష్టం దాదాపు రెట్టింపైంది. గత ఆర్థిక సంవత్సరంలో వేతన సవరణ జరగడంతో భారం పెరిగి అదనంగా రూ.11.84 కోట్లు నష్టం పెరిగింది. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో వరంగల్-1 డిపో లాభాల్లో ఉండగా, మిగతా ఎనిమిది డిపోలు నష్టాల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-2017) గత మూడు నెల లు పరిశీలిస్తే కొంత మెరుగ్గా కనిపిస్తోంది. ఏప్రిల్ నుంచి మే మాసం నాటికి వరంగల్-1, వరంగల్-2, హన్మకొండ, నర్సంపేట డిపోలు లాభాల్లో ఉండగా పరకాల, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, భూపాలపల్లి డిపోలు నష్టాల్లో ఉన్నాయి. రీజియన్ మొత్తంగా చూస్తే మాత్రం రూ.27లక్షల లాభాల్లో ఉంది.
నష్టం పూడ్చుకునేందుకు ప్రణాళికలు
రీజియన్‌లో నష్టాలు పూడ్చుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాథమికంగా వీరు తయారు చేసిన నివేదికను శుక్రవారం హైదరాబాద్‌లో జరుగనున్న డిప్యూటీ సీటీఎంల సమావేశంలో ఎండీ రమణారావుకు వివరించనున్నారు. అనంతరం మరింత కసరత్తు చేసి పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందించే ఆలోచనలో అధికారులున్నారు. ఏటూరునాగారంలో 66 బస్సులతో కొత్తగా డిపో ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి నివేదించారు. ఇక్కడ ఆర్టీసీకి చెందిన స్థలం ఉంది. దీంతో ఇక్కడ డిపో నిర్మించడం పెద్ద కష్టమేని కాదని అధికారులు ఆలోచన. గోదావరి నదిపై ముల్లకట్ట వద్ద వంతెన కూడా అందుబాటులోకి రావడంతో నది అవతలి ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా అదాయాన్ని సమకూర్చుకోవాలని ఆధికారులు నిర్ణయించారు. హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీ రోడ్డు రాంనగర్‌లోని హన్మకొండ డిపో ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో, మహబూబాబాద్‌లోని ఆర్టీసీ స్థలంలో షాపింగ్ కాంప్లెంక్స్ నిర్మాణంతో పాటు మినీ థియేటర్ ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధ చేశారు. సరుకుల రవాణాపై కూడా దృష్టిసారించారు. సరుకుల రవాణా ఎలా చేస్తే లాభసాటిగా ఉంటుందో పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఈ నివేదికను ఆర్టీసీ ఎండీ ముందుంచనున్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి బస్సులు నడుపాలనే నిర్ణయానికి వచ్చారు. జిల్లాలోని ఆయా డిపోల నుంచి 18 మినీ బస్సులు నడపాలని, జిల్లా కేంద్రం నుంచి 16 ఏసీ మినీ బస్సులు నడుపాలని నిర్ణరుుంచారు.
ముందుగా ఎనిమిది ఏసీ మినీ బస్సులు జిల్లా కేంద్రంలోని నాలుగు సెక్టార్ల నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలను నడపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్-1 డిపో నుంచి గోవాకు ఏసీ గరుడ బస్సు, పూణే, చెన్నైకి సూపర్‌లగ్జరీ బస్సు, వరంగల్-2 డిపో నుంచి షోలాపూర్‌కు, హన్మకొండ నుంచి మహారాష్ర్టలోని గుగ్గూర్, వరంగల్-2 డిపో నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బైలడిల్ల, భూపాలపల్లి డిపో నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని సీరంచ, అసరవెల్లి, గడ్చిరోలికి బస్సులు నడుపాలని ప్రణాళిక రూపొందించారు. దీంతో పాటు ఆక్యుపెన్సీ రేషియో పెంచడానికి, ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ఏం చేయాలనే అంశంపై అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.