మీడియాతో మాట్లాడుతున్న టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి
హైదరాబాద్: ఆర్టీసీని ప్రక్షాళన చేసి కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల ముందు ఎర్ర బ్యాడ్జీలతో ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఆర్టీసీ భవన్‌లో ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు థామస్‌రెడ్డి, అధ్యక్షుడు తిరుపతి తదితరులు ఉన్నతాధికారులను కలిసి తమ డిమాండ్లను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకాలు పూర్తి చేయకపోవడంతో ఆర్టీసీ ప్రమాదంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేసి కార్మికులకు అందాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఏళ్లు గడుస్తున్నా టికెట్‌ధరలు పెంచకపోవడంతో పెరిగిన డీజిల్ ధరలు ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి ఇవ్వలేకపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. పాడైన బస్సులను తొలగించి కొత్త బస్సులను సమకూర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని తమ న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ తెలంగాణ ఉపాధ్యక్షుడు బీవీ రెడ్డి, మారయ్య, కోశాధికారి రాజాసింగ్, సంయుక్త కార్యదర్శులు ఉషాకిరణ్, శంకర్, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తీసుకున్న నిర్ణయంతోపాటు ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ఓ కమిటీని వేయడాన్ని టీఎంయూ స్వాగతిస్తుందని నాయకులు పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీలో ఉద్యోగ భద్రత, ఐఆర్‌ను 27 శాతానికి పెంచడాన్ని కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయాల వల్ల తెలంగాణలోని ఆర్టీసీ కార్మికుల్లో ఒత్తిడి, ఆందోళన వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దీంతో తాము కూడా పైడిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment