ప్రక్షాళనకు శ్రీకారం!
గ్రేటర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పలువురిపై బదిలీ వేటు
అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
‘సాక్షి’ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు
జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రక్షాళన మొదలైంది. పెచ్చుమీరిన అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు నడుం బిగించారు. బీఆర్‌ఎస్ దర ఖాస్తులకు నిర్ణీత గడువు ముగిశాక కూడా అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండటం.. క్షేత్రస్థాయి సిబ్బంది వాటిని చూసీ చూడనట్లు వదిలేస్తుండటం, టౌన్ ప్లానింగ్ విభాగంలోని అవినీతి, అక్రమాలపై ‘కాసులిస్తే .. సై’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గురువారం టౌన్‌ప్లానింగ్ విభాగంలోని 33 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయినవారిని వెంటనే రిలీవ్ చేయాలని విభాగాధిపతులకు సూచించారు.
సిటీబ్యూరో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలోని అక్రమార్కులపై చర్యలకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. తొలిదశలో భాగంగా 33 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీ కమిషర్ డా.బి.జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఒకేసారి పెద్దఎత్తున ఇంతమందిని బదిలీ చేయడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. టౌన్‌ప్లానింగ్ విభాగంలో పెచ్చుమీరిన అవినీతిపై ‘సాక్షి’లో కథనం రావడంతో...ఇకనైనా ఇలాంటి అక్రమాలు జరుగకుండా ఉండేందుకుగాను టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్లు (టీపీఎస్)/ సెక్షన్ ఆఫీసర్లు, డ్రాఫ్ట్స్‌మన్లు, తదితరులను బదిలీ చేశారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు పరిశీలించేది, ఉన్నతాధికారులకు, నిర్మాణదారులకు మధ్య వ్యవహారాలు నెరిపేది వీరే కావడంతో తొలిదశలో వీరిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో రెండేళ్ల పైబడిన వారి నుంచి 14 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నవారు సైతం ఉన్నారు. ఆయా ప్రాంతాల నుంచి అందిన ఫిర్యాదులు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్ విభాగం వారికి ఎక్కువ ఆదాయ వనరులున్న సర్కిళ్లలో ఒకటైన ఖైరతాబాద్ సర్కిల్‌లో ఐదేళ్లుగా పనిచేస్తున్న శాంసన్‌ను పాతబస్తీకి బదిలీ చేశారు. ఖైరతాబాద్ సర్కిల్‌లోనే నాలుగేళ్లుగా పనిచేస్తున్న నర్సింగ్‌రావును ఎల్‌బీనగర్ సర్కిల్‌కు బదిలీ చేశారు. జి.నరేష్‌ను కూకట్‌పల్లి సర్కిల్‌కు బదిలీ చేశారు. అలాగే నిర్మాణ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి సర్కిళ్లలో పనిచేస్తున్న రాజేందర్, సురేందర్‌రెడ్డిలను ఖైరతాబాద్, ఉప్పల్ సర్కిళ్లకు బదిలీ చేశారు.
అయితే వారు బదిలీ అయిన సర్కిళ్లు కూడా పెద్దవే కావడం గమనార్హం. రెండేళ్లకు పైగా జీహెచ్‌ఎంసీకి పాలకమండలి లేకపోవడం.. కార్పొరేటర్లు లేకపోవడంతో టౌన్‌ప్లానింగ్ లోని వారికి ఎలాంటి ఆటంకం లేకుండా పోయిందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్ల రాకతో కొన్ని సర్కిళ్లలో వారికీ, వీరికీ పొసగడం లేదని తెలుస్తోంది. అలాంటి సర్కిళ్లలో ఉప్పల్ తదితరమైనవి ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ సర్కిల్‌లోని ఓ మహిళా ఉద్యోగి గత 14 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నారు. ఈ బదిలీల్లో భాగంగా ఆమెను ఎల్‌బీనగర్‌కు పంపారు. ఇదే సర్కిల్‌కు చెందిన ఫిలిప్స్‌ను పాతబస్తీలోని సర్కిల్-5కు పంపించారు. కూకట్‌పల్లి సర్కిల్‌కు చెందిన రాజేశ్వర్‌ను పాతబస్తీ పరిధిలోని సర్కిల్-4కు బదిలీ చేశారు.
అవినీతి ఆగేనా..?
బదిలీల్లో భాగంగా కొందరిని మాత్రం ఆదాయం తక్కువగా ఉండే సర్కిళ్లకు బదిలీ చేసినప్పటికీ, ఎక్కువమందిని తిరిగి నిర్మాణ కార్యకలాపాలు ఎక్కువగా ఉండే సర్కిళ్లకే బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త సర్కిళ్లలో కొంతకాలం వరకైనా అక్రమాల్ని తగ్గింవచ్చుననేది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. దానికి తోడు ఉన్న సిబ్బందే తక్కువ కావడంతో ఎవరో ఒకరిని నియమించక తప్పదు కనుక వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ బదిలీలు చేసినట్లు సమాచారం. మరో 40 రోజుల్లోగా 10 వేల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్ని పరిష్కరిస్తామని మునిసిపల్ మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చినందున ఆ అంశాన్ని సైతం పరిగణనలోకి తీసుకొని ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్న సర్కిళ్లకు వీరిని పంపించినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో 11 మంది టీపీఎస్/సెక్షన్ ఆఫీసర్లు, 18 మంది డ్రాఫ్ట్స్‌మన్లు, ముగ్గురు ఏఏడీఎం, ఒక టీపీబీఓ తదితరులున్నారు.