Commissioner ghmc
-
రోడ్డుపై ఉమ్మితే జరిమానా..
ఉప్పల్: నగరంలోని రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా జరిమానా విధిస్తామని గ్రేటర్ కమిషనర్ డా.జనార్ధన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చిన్న రావులపల్లిలో చెత్తనుండి విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగ్రేటర్ హైదరాబాద్‌ను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా చెత్త ఓపెన్ పాయింట్లను దాదాపుగా తొలగించామన్నారు. కార్యక్రమం ముగిసేనాటికి రోడ్లపై ఎక్కడా చెత్త కనబడకుండా చేస్తామన్నారు. ఇకపై రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా, గోడలపై రాసినా, బ్యానర్లు కట్టినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక కార్మికుడు ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తపై అవగాహన కల్పిస్తారని, ఇందులో విద్యార్థులను సైతం భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. వేరువేరుగా చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం అమలుపై వచ్చే నెల 2న ఎస్ఎఫ్ఏలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తమ సేవలందించిన పారిశుద్ద్య కార్మికులకు, అధికారులు, గుర్తింపునిచ్చే విధంగా పూలదండలు వేసి సన్మానం చేస్తామన్నారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డీసీ విజయకృష్ణ, ఈఈ నాగేందర్‌లతో కలిసి పరిశీలించారు. సిటీజన్ సర్వీస్ సెంటర్ తనిఖీ.. ఎర్లీబర్డ్ ఆఫర్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలోని సిటీజన్ సర్వీస్ సెంటర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తనిఖీ చేసి బిల్ కలెక్టర్లను ఆస్థి పన్ను చెల్లింపు అంశాలపై ఆరా తీశారు. అవసరమైతే అధనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి నగరంలో ఎండ తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు ముందుకు రావాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషర్ కోరారు. ఇందుకు జీహెచ్ఎంసీ తరపున అవసరమైన సహాయ సహకారాలతోపాటు జలమండలి ద్వారా ఉచితంగా మంచినీరు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. -
రోడ్ల మరమ్మతులకు ‘108’ తరహా సేవలు
గ్రేటర్ కమిషనర్ యోచన సాక్షి, సిటీబ్యూరో: ప్రజల నుంచి ఫోన్ రిసీవ్ చేసుకోగానే అత్యవసరంగా వెళ్లే 108 అంబులెన్స్ సర్వీసు మాదిరిగా...ప్రజలెవరైనా రోడ్డు బాగాలేదని ఫిర్యాదు చేయగానే వెంట నే అక్కడకు చేరుకొని మరమ్మతులు చేసేలా ప్రత్యేక వ్యాన్‌ను, ఫోన్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు గ్రేటర్ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు శనివారం వందరోజుల పనుల కార్యాచరణపై ఇంజినీర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఈ ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్లు బాగాలేవనే ఫిర్యాదులు నగరవ్యాప్తంగా వస్తున్నాయని, ఇవి తగ్గాలంటే అత్యవసర వ్యవస్థను అందుబాటులోకి తెస్తే బాగుంటుందన్నారు. ఇది ఎంతవరకు సాధ్యమో నిపుణులను సంప్రదించి నిర్ణయిస్తామన్నారు. నాలాల పూడిక తీత పనులను సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టాలని ఇంజినీర్లకు సూచించారు. వందరోజుల పనులను ఇంజినీర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. రహదారుల మరమ్మతులు, రీ కార్పెటింగ్, నీటి నిల్వ ప్రాంతాలు తదితర అంశాలపై సమీక్షించారు. మోడల్ మార్కెట్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనివ్వాల్సిందిగా సూచించారు. నిర్ణీత వ్యవధిలోగా 50 మార్కెట్లు పూర్తిచేయాలన్నారు. -
ప్రక్షాళనకు శ్రీకారం!
గ్రేటర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పలువురిపై బదిలీ వేటు అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ‘సాక్షి’ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రక్షాళన మొదలైంది. పెచ్చుమీరిన అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు నడుం బిగించారు. బీఆర్ఎస్ దర ఖాస్తులకు నిర్ణీత గడువు ముగిశాక కూడా అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండటం.. క్షేత్రస్థాయి సిబ్బంది వాటిని చూసీ చూడనట్లు వదిలేస్తుండటం, టౌన్ ప్లానింగ్ విభాగంలోని అవినీతి, అక్రమాలపై ‘కాసులిస్తే .. సై’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గురువారం టౌన్‌ప్లానింగ్ విభాగంలోని 33 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయినవారిని వెంటనే రిలీవ్ చేయాలని విభాగాధిపతులకు సూచించారు. సిటీబ్యూరో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలోని అక్రమార్కులపై చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. తొలిదశలో భాగంగా 33 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషర్ డా.బి.జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఒకేసారి పెద్దఎత్తున ఇంతమందిని బదిలీ చేయడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. టౌన్‌ప్లానింగ్ విభాగంలో పెచ్చుమీరిన అవినీతిపై ‘సాక్షి’లో కథనం రావడంతో...ఇకనైనా ఇలాంటి అక్రమాలు జరుగకుండా ఉండేందుకుగాను టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లు (టీపీఎస్)/ సెక్షన్ ఆఫీసర్లు, డ్రాఫ్ట్స్మన్లు, తదితరులను బదిలీ చేశారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు పరిశీలించేది, ఉన్నతాధికారులకు, నిర్మాణదారులకు మధ్య వ్యవహారాలు నెరిపేది వీరే కావడంతో తొలిదశలో వీరిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో రెండేళ్ల పైబడిన వారి నుంచి 14 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నవారు సైతం ఉన్నారు. ఆయా ప్రాంతాల నుంచి అందిన ఫిర్యాదులు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్ విభాగం వారికి ఎక్కువ ఆదాయ వనరులున్న సర్కిళ్లలో ఒకటైన ఖైరతాబాద్ సర్కిల్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న శాంసన్‌ను పాతబస్తీకి బదిలీ చేశారు. ఖైరతాబాద్ సర్కిల్లోనే నాలుగేళ్లుగా పనిచేస్తున్న నర్సింగ్రావును ఎల్బీనగర్ సర్కిల్‌కు బదిలీ చేశారు. జి.నరేష్‌ను కూకట్పల్లి సర్కిల్‌కు బదిలీ చేశారు. అలాగే నిర్మాణ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి సర్కిళ్లలో పనిచేస్తున్న రాజేందర్, సురేందర్‌రెడ్డిలను ఖైరతాబాద్, ఉప్పల్ సర్కిళ్లకు బదిలీ చేశారు. అయితే వారు బదిలీ అయిన సర్కిళ్లు కూడా పెద్దవే కావడం గమనార్హం. రెండేళ్లకు పైగా జీహెచ్ఎంసీకి పాలకమండలి లేకపోవడం.. కార్పొరేటర్లు లేకపోవడంతో టౌన్‌ప్లానింగ్ లోని వారికి ఎలాంటి ఆటంకం లేకుండా పోయిందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్ల రాకతో కొన్ని సర్కిళ్లలో వారికీ, వీరికీ పొసగడం లేదని తెలుస్తోంది. అలాంటి సర్కిళ్లలో ఉప్పల్ తదితరమైనవి ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ సర్కిల్లోని ఓ మహిళా ఉద్యోగి గత 14 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నారు. ఈ బదిలీల్లో భాగంగా ఆమెను ఎల్బీనగర్కు పంపారు. ఇదే సర్కిల్‌కు చెందిన ఫిలిప్స్‌ను పాతబస్తీలోని సర్కిల్-5కు పంపించారు. కూకట్పల్లి సర్కిల్‌కు చెందిన రాజేశ్వర్‌ను పాతబస్తీ పరిధిలోని సర్కిల్-4కు బదిలీ చేశారు. అవినీతి ఆగేనా..? బదిలీల్లో భాగంగా కొందరిని మాత్రం ఆదాయం తక్కువగా ఉండే సర్కిళ్లకు బదిలీ చేసినప్పటికీ, ఎక్కువమందిని తిరిగి నిర్మాణ కార్యకలాపాలు ఎక్కువగా ఉండే సర్కిళ్లకే బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త సర్కిళ్లలో కొంతకాలం వరకైనా అక్రమాల్ని తగ్గింవచ్చుననేది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. దానికి తోడు ఉన్న సిబ్బందే తక్కువ కావడంతో ఎవరో ఒకరిని నియమించక తప్పదు కనుక వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ బదిలీలు చేసినట్లు సమాచారం. మరో 40 రోజుల్లోగా 10 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని పరిష్కరిస్తామని మునిసిపల్ మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చినందున ఆ అంశాన్ని సైతం పరిగణనలోకి తీసుకొని ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్న సర్కిళ్లకు వీరిని పంపించినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో 11 మంది టీపీఎస్/సెక్షన్ ఆఫీసర్లు, 18 మంది డ్రాఫ్ట్స్మన్లు, ముగ్గురు ఏఏడీఎం, ఒక టీపీబీఓ తదితరులున్నారు. -
సమరానికి సన్నద్ధం..
గ్రేటర్ సమరానికి అంతా సిద్ధమైంది. నగరంలోని 150 డివిజన్లకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు సోమవారం పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్లను ఒక్కరోజు ముందుగానే ఎన్నికల అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలతో పాటు, ఇతర సామగ్రిని అందజేశారు. గ్రేటర్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఏర్పాట్లపై ఆరా తీశారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి సరైన వసతులు కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డారు. మహిళా సిబ్బంది తమ పిల్లలతో సహా విధులకు రావడంతో ఇబ్బంది పడ్డారు. పలు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు వెబ్ కాస్టింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో మేయర్ పీఠం మాదే: కేటీఆర్ బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధిస్తుంది. 80కి పైగా సీట్లు సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం. టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఓటేయాలో ప్రజలకు ఒక్క సరైన కారణం చూపడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయి. నగరంలో కరెంట్ పోకుండా చూశాం. శామీర్‌పేట్, రాచకొండ ప్రాంతాల్లో భారీ స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మించి రాబోయే రోజుల్లో మహానగరానికి తాగునీటి ఇక్కట్లు రాకుండా చర్యలు తీసుకుంటాం. విజన్ ఉన్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే నగర సమగ్రాభివృద్ధి సాధ్యం. - కేటీఆర్, రాష్ట్రమంత్రి, గ్రేటర్ ఎన్నికల ప్రచార సారధి హైదరాబాద్ హమారా.. గ్రేటర్ పోరులో గెలిచేది మేమే. హైదరాబాద్ హమారా.. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తాం. మా పనితీరుపై ప్రజలకు నమ్మకం ఉంది. గత మూడేళ్ల పాటు సమర్థవంతమైన పరిపాలన అందించాం. వచ్చే ఐదేళ్లలో చేపట్టే పనులపై పక్కా కార్యాచరణ రూపొందించాం. అధికారంలోకి వస్తే.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. ఐదేళ్ల వరకు ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్స్ ఫీజులు పెంచబోం. పూర్తి స్థాయి మెజార్టీ లేకున్నా పాలనా పగ్గాలు చేపట్టిన చరిత్ర మజ్లిస్‌కు ఉంది. - అసదుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ పార్టీ అధినేత పరిణతితో ఓటేయండి.. నేడు జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ఓటరు గొప్ప పరిణతితో ఓటెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్‌ను విధ్వంస కేంద్రంగా చూడాలనుకుంటున్న పార్టీలకు, వంత పాడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. 19 నెలల్లో గాలి మేడలు తప్ప, వాస్తవ పనులేమీ చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం మా కూటమికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. - జి.కిషన్‌రెడ్డి ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాస్వామ్య రక్షణకు ఓటే కీలకం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశాం. నగరంలో ఓటు హక్కు ఉన్న వారంతా విధిగా దాన్ని వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఎంతో కీలకమని గుర్తుంచుకోవాలి. మంగళవారం ఉదయం 8 గంటలకు కుందన్‌బాగ్‌లోని చిన్మయ విద్యాలయంలో నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నా. ఇలాగే ప్రతి ఒక్కరూ తమతమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలి. - ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ కొత్వాల్ నేను వేశా.. మీరూ వేయండి ఓటు అనేది రాజ్యాంగం మనకు ప్రసాదించిన అమూల్యమైన హక్కు. ప్రపంచంలో చాలా దేశాల ప్రజలకు లేని వరం మనకు లభించింది. మన పాలకులను మనమే ఎన్నుకునే అవకాశం ఈ హక్కు కల్పిస్తోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాలి. అందుకు అవసరమైన, అనువైన వాతావరణాన్ని మేం కల్పిస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నా. మీరూ ఓటు అవకాశాన్ని స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ మీరు సిద్ధమా.. నేను బేగంపేట చిన్మయి స్కూల్లో ఉదయం 7 గంటలకే ఓటేస్తున్నా. మరి మీరూ ఓటుహక్కును వినియోగించుకునేందుకు రెడీ అవ్వండి. అన్ని వర్గాలవారూ ఓటేసి పోలింగ్ శాతాన్ని పెంచండి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలలోపు మీకు కేటాయించిన పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటెయ్యండి. - జనార్దన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ నేను జూబ్లీహిల్స్‌లో ఓటేస్తున్నా.. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఆ హక్కును వినియోగించుకోవాలి. ఓటు కోసం కచ్చితంగా సమయం కేటాయించండి. ఎన్నిక ఏదైనా ఓటు ఒక్కటే. అది అసెంబ్లీనా.. లోక్‌సభనా.. జీహెచ్ఎంసీనా అనేది కాదు. ఓటు హక్కు వినియోగించుకుని తీరాలి. మీరు ఓటు వేయకుంటే ఎవరో ఒకరు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. నేను జూబ్లీహిల్స్‌లో ఓటేస్తున్నా. మీరూ కదలిరండి ప్రజాస్వామాన్ని కాపాడుదాం. - బ్రహ్మాజీ, సినీనటుడు సెంటిమెంట్ పాలనకు తెరదించండి ఏడాదిన్నర పాలన అంతా సెంటిమెంట్‌పైనే సాగింది. హైదరాబాద్ అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పనులను తాము చేసినట్టుగా చూపెట్టి, నగర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోంది. తన కుటుంబాన్ని ప్రమోట్ చేసుకునేందుకు కేసీఆర్ ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు. విజ్ఞులైన నగర ప్రజలు.. చేతల మనుషులు ఎవరు, మాటల మనుషులు ఎవరన్న అంశాన్ని గమనించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.- ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీపీసీ అధ్యక్షుడు గ్రేటర్లో గట్టి పోటీ.. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరుగుతున్న ఈ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి గట్టి పోటీనివ్వడం ఖాయం. ప్రచార కార్యక్రమాన్ని సాధారణ ప్రజలకు చేరాలా చేశాం. పేదలకు ఏ కష్టమొచ్చినా వారి పక్షాన నిలిచి పోరాడేది మేమే. నగర ఓటర్లు రాజకీయ విలువలు పెంపొందించే పార్టీలకే పట్టం కట్టాలని కోరుతున్నా. పన్నెండు నియోజకవర్గాల పరిధిలోని 50-60 సీట్లలో ఇతర పార్టీల గెలుపు, ఓటమిని వన్ హైదరాబాద్ కూటమి నిర్ణయిస్తుంది. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ప్రశ్నించే బలాన్నివ్వండి.. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులను బలపరిచి, కేసీఆర్ పాలనలో తప్పులను ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వాలని నగర ప్రజలను కోరుతున్నా. ఇష్టం వచ్చిన రీతిలో పాలన సాగించాలని భావిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని అదుపులో పెట్టాలంటే హైదరాబాద్ ఓటరు ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మాటలు తప్ప, చేతలు చేయని ఈ సర్కారుకు సరైన గుణపాఠం చెప్పే అవకాశం ఇదే. - ఎ. రేవంత్‌రెడ్డి, టీటీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు -
ఈసారి ‘నోటా’ లేదు
మొత్తం పోలింగ్‌కేంద్రాలు 7,802 మొత్తం అభ్యర్థులు 1,333 ► త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘నోటా’ ఆప్షన్ లేదు. ► పెరిగిన ఓటర్ల కనుగుణంగా అదనంగా 45 ఉప పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ► ఐదు వార్డుల్లో అత్యధికంగా 16 మందికి పైగా అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ► నాలుగు వార్డుల్లో అతి తక్కువగా నలుగురు మాత్రమే పోటీ చేస్తున్నారు. ఈ వివరాలను శనివారం ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రేటర్ కమిషనర్, ఎన్నికల అధికారి డాక్టర్ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. 13.87 లక్షల ఓటరు స్లిప్‌లు పంపిణీ జీహెచ్ఎంసీలో మొత్తం ఓటర్లు 74,23,980 మంది కాగా వీరిలో 13,87,000 మందికి వ్యక్తిగతంగా ఓటరుస్లిప్‌ల పంపిణీ జరిగింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా 1,67,000 అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్లు తొలగించారు. వీటిల్లో 66,570 పోస్టర్లు, 46,941 ఫ్లెక్సీలు, 46,627 బ్యానర్లు, 7066 కటౌట్లు ఉన్నాయి. ► 16 మందికంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉన్న వార్డులు: జంగమ్మెట్- 28 మంది, సూరారం-21, ఈస్ట్ ఆనంద్‌బాగ్- 18 , రామంతాపూర్-17 , బాలానగర్-17 మంది. ► 16 మంది రంగంలో ఉన్న వార్డులు: చైతన్యపురి, ఓల్డ్‌బోయిన్‌పల్లి ► 15 మంది ఉన్న వార్డులు: లింగోజిగూడ, సుభాష్‌నగర్,మల్కాజిగిరి. ► 13 మంది పోటీ చేస్తున్న వార్డులు: వెంగళ్రావునగర్, మూసాపేట్, నేరేడ్మెట్, రామ్‌నగర్. ► 11 వార్డుల్లో 12 మంది చొప్పున, 15 వార్డుల్లో 11 మంది, 18 వార్డుల్లో పదిమంది చొప్పున పోటీలో ఉన్నారు. ► నలుగురు మాత్రమే బరిలో ఉన్న వార్డులు: చావుని, నవాబ్‌సాహెబ్‌కుంట, సులేమాన్‌నగర్, దత్తాత్రేయనగర్, గోల్కొండ, నానల్‌నగర్, అహ్మద్‌నగర్, చందానగర్ కనీస సదుపాయాలు.. పోలింగ్ స్టేషన్ల వద్ద తాగునీరు, విద్యుత్, టాయ్‌లెట్స్, ర్యాంపులు, ఎండ త గలకుండా పైకప్పులు, అవసరమైన ర్యాంపులు తదితరమైనవి ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచించారు. వీటికోసం రూ. 3.33 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. -
‘ఫోర్జరీ’ ఉదంతంపై కదలిక!
చర్చనీయాంశంగా మారిన ‘సాక్షి’ కథనం విచారణతో వెలుగులోకి వస్తున్న కాంట్రాక్టర్ల మాయాజాలం జోనల్ కార్యాలయమే వేదికగా తతంగం ఇంజనీరింగ్ అధికారులతో గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ సమీక్ష ఏడుగురు కాంట్రాక్టర్లు.. ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై క్రిమినల్ కేసులు కుత్బుల్లాపూర్: కాంట్రాక్టర్లు బరి తెగించి ఫోర్జరీ సంతకాలతో చెక్కులు డ్రా చేసుకున్న విషయంపై ‘సాక్షి’ లో సోమవారం ప్రచురితమైన ‘ఫోర్జరీ పనులు’ కథనం కలకలం సృష్టించింది. కుత్బుల్లాపూర్ సర్కిల్-15 ో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై అధికారులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏడుగురు కాంట్రాక్టర్లు, ముగ్గురు ఔట్సోర్సింగ్ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. గత మూడు రోజులుగా గోప్యంగా జరుగుతున్న ఈ తంతు ఎట్టకేలకు వెలుగులోకి రావడంతో ఇంజనీరింగ్ అధికారులు పరుగులు పెట్టారు. సోమవారం ఉదయమే కార్యాలయానికి చేరుకున్న అధికారులు సంబంధిత ఏడుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి, వారు డ్రా చేసిన చెక్కుల వివరాలను తయారు చేసే పనిలో పడ్డారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సిద్ధం చేసుకుని, సాయంత్రం గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు నివేదించినట్లు సమాచారం. కాంట్రాక్టర్లు నార్త్ జోన్ కార్యాలయం అకౌంట్స్ సెక్షన్ వేదికగా చేసుకుని ఈ తతంగాన్ని నడిపారు. క్రిమినల్ కేసులు ఫోర్జరీ సంతకాలతో చేయని పనులకు బిల్లులు తీసుకున్న విషయాన్ని గుర్తించిన సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్నారెడ్డి, డీఈ హన్మంతరెడ్డి, ఏఈఈ లక్ష్మికాంత్‌రెడ్డిలు ఈ నెల 3వ తేదీన ఏడుగురు కాంట్రాక్టర్లు మాధురి, లక్ష్మణ్‌రాజు, మల్లేశ్, రాజు, సుధీర్, వేణుగోపాల్, రేక్యా నాయక్‌లతో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బంది లింగయ్య, విజయ్, ఉపేందర్రెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వీరిపై ఐపీసీ సెక్షన్ 120బి, 379, 420, 467, 468ల కింద కేసులు నమోదు చేసినట్లు జీడిమెట్ల సీఐ చంద్రశేఖర్ ‘సాక్షి’ కి తెలిపారు. అదేవిధంగా ఫోర్జరీకి పాల్పడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ కమిషనర్ సమీక్ష సాక్షిలో వచ్చిన కథనం గ్రేటర్ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సోమవారం సాయంత్రం ఎస్ఇ కిషన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్నారెడ్డి, డీఈ హన్మంతరెడ్డి, హెచ్డి రమేష్, ఏఈలు భానుచందర్, లక్ష్మికాంత్‌రెడ్డి, రామచంద్రరాజులతో గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. 2013-14, 15 సంవత్సరాల్లో టెండర్ల ద్వారా పనులు దక్కించుకుని కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్లను ఎందుకు గుర్తించలేకపోయారని అసహనం వ్యక్తం చేసినట్లు, అలాగే విషయాన్ని రాష్ర్ట విజిలెన్స విభాగం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
‘గ్రేటర్’ గందరగోళం
z అవన్నీ కాకిలెక్కలని {పీ విజిట్-1లో వెల్లడి అంచనాలు తలకిందులు చేస్తూ పెరిగిన జనాభా ఇంటి నంబర్లు క్రమపద్ధతిలో లేక ఎన్యూమరేటర్ల అవస్థలు ఇబ్బందులను అధిగమిస్తాం: జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ : గ్రేటర్‌లోని ఇళ్ల సంఖ్య.. జనాభాపై ఇప్పటి వరకు వేసిన లెక్కలన్నీ కాకిలెక్కలేన నే అంశం మరోమారు వెల్లడైంది. 19న జరుగనున్న సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆదివారం ప్రీ విజిట్-1లో ఈ విషయం వెలుగు చూసింది. ప్రస్తుత నగర జనాభా కోటిగా అంచనా వేసిన అధికారులు అందుకనుగుణంగా 25 వేల మంది ఎన్యూమరేటర్లను, సహాయకులుగా కళాశాలల విద్యార్థులతో పాటు మరో 35 వేల మందిని నియమించారు. అధికారుల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఇళ్ల సంఖ్య.. జనాభా పెరిగిపోయింది. 2011 జన గణనలో భారీ పొరపాట్లు జరిగినట్లు అధికారుల తాజా ప్రీ విజిట్-1లో వెల్లడైంది. ఒక డోర్ నంబర్‌తో సగటున నాలుగైదు ఇళ్లు ఉండవచ్చునని అధికారులు అంచనా వేసినప్పటికీ, అంతకు మించి ఇళ్లు పెరిగిపోయాయి. దీంతో సర్వేలో భాగంగా ప్రీ విజిట్-1లో ఆదివారం ఎన్యూమరేటర్లకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక ఎన్యూమరేటర్‌కు 26 ఇళ్లను అప్పగిస్తూ అందుకనుగుణంగా కరపత్రాలు, స్టిక్కర్లు పంపిణీ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో అతనికి 85 ఇళ్లు కనిపించాయి. ఇదే పరిస్థితి ఎన్యూమరేటర్లందరికీ ఎదురైంది. దీంతో తొలిరోజు ప్రీ విజిట్‌లో ఎన్యూమరేటర్లు తమకు అప్పగించిన అన్ని ఇళ్లకూ వెళ్లలేకపోయారు. మిగతా ఇళ్లకు సోమవారం వెళ్లనున్నారు. 19న ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించేందుకే ఆది, సోమవారాల్లో రెండు రోజుల ప్రీ విజిట్లు ఏర్పాటు చేశామని, క్షేత్రస్థాయి అనుభవాలతో 19న సర్వేను సజావుగా పూర్తిచేయగలమని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. ప్రీ విజిట్లు ఏర్పాటు చేయకుంటే పరిస్థితి క్లిష్టమయ్యేదన్నారు. కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో కొత్త ఏరియాలు అధికమై జనాభా కూడా లక్షల్లో పెరిగిందన్నారు. గత జనగణనలో వందమంది జనాభాగా ఉన్న చోట ఇప్పుడు క్షేత్రస్థాయిలో పదివేల మంది ఉండటాన్నిప్రస్తావించారు. ప్రీ విజిట్‌తో ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ప్రీ విజిట్-1లో దృష్టికొచ్చిన అంశాలివీ.. ఎన్యూమరేటర్లు తమకు అప్పగించిన ఇంటి నంబర్లు క్రమపద్ధతిలో లేకపోవడంతో పలు ఇబ్బందులకు గురయ్యారు.కొన్నిచోట్ల ఇంటి నంబర్లు కాకుండా ప్రాంతాల వారీగా కేటాయించడంతో.. కొన్ని ఇళ్లకు ఇద్దరు ఎన్యూమరేటర్లు వెళ్లగా, మరికొన్ని ఇళ్లకు అసలే వెళ్లలేకపోయారు. ఒకే డోర్ నంబర్‌తో నాలుగు ఇళ్ల నుంచి మొదలు పెడితే వంద ఇళ్ల వరకు ఉండటంతో ఇంటికంటించే స్టిక్కర్లు, ఇవ్వాల్సిన కరపత్రాలు సరిపోలేదు. దీంతో ఎన్యూమరేటర్లు వాటిని జిరాక్స్‌లు తీయించుకోవాల్సిందిగా ఇరుగుపొరుగు కుటుంబాలకు చెప్పారు. ఈ పరిస్థితి ఎదుర్కొనేందుకు సర్కిల్ స్థాయిలోని అధికారులు ఎక్కడికక్కడ ప్రింటింగ్ చేయించి పంపిణీ చేయాల్సిందిగా కమిషనర్ సూచించారు. ఒక్కో ఎన్యూమరేటర్ సహాయకులుగా ఐదుగురు వరకు తీసుకోవచ్చునని చెప్పినప్పటికీ అందుబాటులో లేరు. దాదాపు 70 వేల మంది సహాయకుల అవసరం కాగా, 35 వేల మంది మాత్రమే విధుల్లో పాల్గొన్నారు.ఆదివారం రాత్రి 7 గంటల వరకు ఎన్యూమరేటర్లు రాకుంటే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్(నంబరు 040-21 11 11 11)కు ఫిర్యాదు చేయాల్సిందిగా నగరవాసులకు అధికారులు సూచించారు. రాత్రి 7.30 గంటల నుంచి కాల్‌సెంటర్‌కు లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులందాయి.