ఉప్పల్: నగరంలోని రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా జరిమానా విధిస్తామని గ్రేటర్ కమిషనర్ డా.జనార్ధన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చిన్న రావులపల్లిలో చెత్తనుండి విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగ్రేటర్ హైదరాబాద్‌ను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా చెత్త ఓపెన్ పాయింట్లను దాదాపుగా తొలగించామన్నారు. కార్యక్రమం ముగిసేనాటికి రోడ్లపై ఎక్కడా చెత్త కనబడకుండా చేస్తామన్నారు.
ఇకపై రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా, గోడలపై రాసినా, బ్యానర్లు కట్టినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక కార్మికుడు ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తపై అవగాహన కల్పిస్తారని, ఇందులో విద్యార్థులను సైతం భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. వేరువేరుగా చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం అమలుపై వచ్చే నెల 2న ఎస్‌ఎఫ్‌ఏలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఉత్తమ సేవలందించిన పారిశుద్ద్య కార్మికులకు, అధికారులు, గుర్తింపునిచ్చే విధంగా పూలదండలు వేసి సన్మానం చేస్తామన్నారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డీసీ విజయకృష్ణ, ఈఈ నాగేందర్‌లతో కలిసి పరిశీలించారు.
సిటీజన్ సర్వీస్ సెంటర్ తనిఖీ..
ఎర్లీబర్డ్ ఆఫర్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలోని సిటీజన్ సర్వీస్ సెంటర్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తనిఖీ చేసి బిల్ కలెక్టర్లను ఆస్థి పన్ను చెల్లింపు అంశాలపై ఆరా తీశారు. అవసరమైతే అధనపు కౌంటర్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
నగరంలో ఎండ తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు ముందుకు రావాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషర్ కోరారు. ఇందుకు జీహెచ్‌ఎంసీ తరపున అవసరమైన సహాయ సహకారాలతోపాటు జలమండలి ద్వారా ఉచితంగా మంచినీరు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
రోడ్డుపై ఉమ్మితే జరిమానా..
Published Wed, Apr 27 2016 1:03 AM | Last Updated on Fri, Nov 9 2018 6:23 PM
Advertisement
Advertisement