చర్చనీయాంశంగా మారిన ‘సాక్షి’ కథనం
విచారణతో వెలుగులోకి వస్తున్న కాంట్రాక్టర్ల మాయాజాలం
జోనల్ కార్యాలయమే వేదికగా తతంగం
ఇంజనీరింగ్ అధికారులతో గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ సమీక్ష
ఏడుగురు కాంట్రాక్టర్లు.. ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై క్రిమినల్ కేసులు
కుత్బుల్లాపూర్: కాంట్రాక్టర్లు బరి తెగించి ఫోర్జరీ సంతకాలతో చెక్కులు డ్రా చేసుకున్న విషయంపై ‘సాక్షి’ లో సోమవారం ప్రచురితమైన ‘ఫోర్జరీ పనులు’ కథనం కలకలం సృష్టించింది. కుత్బుల్లాపూర్ సర్కిల్-15 ో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై అధికారులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏడుగురు కాంట్రాక్టర్లు, ముగ్గురు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. గత మూడు రోజులుగా గోప్యంగా జరుగుతున్న ఈ తంతు ఎట్టకేలకు వెలుగులోకి రావడంతో ఇంజనీరింగ్ అధికారులు పరుగులు పెట్టారు. సోమవారం ఉదయమే కార్యాలయానికి చేరుకున్న అధికారులు సంబంధిత ఏడుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి, వారు డ్రా చేసిన చెక్కుల వివరాలను తయారు చేసే పనిలో పడ్డారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సిద్ధం చేసుకుని, సాయంత్రం గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు నివేదించినట్లు సమాచారం. కాంట్రాక్టర్లు నార్త్ జోన్ కార్యాలయం అకౌంట్స్ సెక్షన్ వేదికగా చేసుకుని ఈ తతంగాన్ని నడిపారు.
క్రిమినల్ కేసులు
ఫోర్జరీ సంతకాలతో చేయని పనులకు బిల్లులు తీసుకున్న విషయాన్ని గుర్తించిన సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్నారెడ్డి, డీఈ హన్మంతరెడ్డి, ఏఈఈ లక్ష్మికాంత్‌రెడ్డిలు ఈ నెల 3వ తేదీన ఏడుగురు కాంట్రాక్టర్లు మాధురి, లక్ష్మణ్‌రాజు, మల్లేశ్, రాజు, సుధీర్, వేణుగోపాల్, రేక్యా నాయక్‌లతో పాటు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది లింగయ్య, విజయ్, ఉపేందర్‌రెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వీరిపై ఐపీసీ సెక్షన్ 120బి, 379, 420, 467, 468ల కింద కేసులు నమోదు చేసినట్లు జీడిమెట్ల సీఐ చంద్రశేఖర్ ‘సాక్షి’ కి తెలిపారు. అదేవిధంగా ఫోర్జరీకి పాల్పడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
గ్రేటర్ కమిషనర్ సమీక్ష
సాక్షిలో వచ్చిన కథనం గ్రేటర్ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సోమవారం సాయంత్రం ఎస్‌ఇ కిషన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్నారెడ్డి, డీఈ హన్మంతరెడ్డి, హెచ్‌డి రమేష్, ఏఈలు భానుచందర్, లక్ష్మికాంత్‌రెడ్డి, రామచంద్రరాజులతో గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. 2013-14, 15 సంవత్సరాల్లో టెండర్ల ద్వారా పనులు దక్కించుకుని కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్లను ఎందుకు గుర్తించలేకపోయారని అసహనం వ్యక్తం చేసినట్లు, అలాగే విషయాన్ని రాష్ర్ట విజిలెన్‌స విభాగం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
‘ఫోర్జరీ’ ఉదంతంపై కదలిక!
Published Tue, Jul 7 2015 12:15 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement
Advertisement