సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధించిన ఇంటిని ఖాళీ చేయకుండా వేధించడంతో పాటు తన సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 62 లో దివాకర్ రెడ్డికి ఇల్లు ఉంది. దానిని సాహితీ లక్ష్మీనారాయణకు అద్దెకు ఇచ్చారు. అయితే ఒప్పందం గడువును మూడేళ్లుగా నిర్ణయించుకున్నారు. ఒప్పంద గడువు 2023 మేతో ముగియడంతో ఇంటిని ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా... స్పందించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆపై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో అఫిడవిట్ వేసినట్లు జేసీ దివాకర్‌రెడ్డి గుర్తించారు.
బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్‌లు తమకు లీజు గడువు ఇంకా ఉన్నట్లు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతో జేసీకి కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. లక్ష్మీనారాయణ, అతని న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పత్రాలను గమనించిన జేసీ.. ఒప్పందం తేదీని 2021 మే నెలగా చూపినట్లు గుర్తించారు. అంతేకాదు తన సంతకం ఫోర్జరీ జరిగిందని, నకిలీ పత్రాలతో బూదాటి లక్ష్మీనారాయణ, సాత్విక్, వారి న్యాయవాది మహమ్మద్ షాజుద్దీన్‌లు కోర్టును తప్పుదోవ పట్టించారని జేసీ పోలీసులను ఆశ్రయించారు. సోమవారం ఆయన ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment