కర్నూలు, నిర్మల్/సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఎక్కువ ట్రిప్పుల కోసం వేగంగా.. నిరక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణలో రెండు వేర్వేరు ప్రమాదాలు జరగ్గా.. ముగ్గురి ప్రాణాలు పోయాయి. గాయపడిన వాళ్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
గురువారం వేకువ ఝామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అదే సమయంలో నిర్మల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కర్నూల్ జిల్లా కోడుమూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులోని 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. పోలీసులు స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి.. చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బిస్మిల్లా ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుండి ఆదోనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుల్ని హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి(13), గోవర్థిని(8)గా పోలీసులు నిర్ధారించారు.
ఇక.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ పై ముస్కాన్ ప్రైవేట్ బస్సు ఒకటి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో 25 మందికి గాయాలు కాగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. పది మందిని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోందని.. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment