ఇదేమిటబ్బా.. ‘ఏ పుట్టలో ఏ పాముంటుందో?’ అనేది కదా సామెత! ఇక్కడేదో తేడా కొడుతోందే అనుకుంటున్నారు కదా? సామెత అదే గానీ.. ఇప్పుడు రోజులు మారిపోయాయి. మోసకారి బతుకులు బతికే వారి బుర్రల్లో రకరకాల విషనాగులు, అనకొండలు, ర్యాటిల్ స్నేక్ లు రకరకాల పాములు.. అనేక రకాల టక్కుటమారాల మాయోపాయాల రూపంలో దాగి ఉంటున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. ఎవడితో ఫోటో దిగాలన్నా సరే.. కూసింత సెలబ్రిటీ స్టేటస్ ఉండే వాడు వణికి చచ్చిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కంగారు పుడుతోంది. ఇక్కడ కట్ చేసి ఒక పాత ముచ్చట చెప్పుకుందాం..
నాకు తెలిసి సినీ రంగంలో చాలా పెద్దాయన ఉండేవాడు. చాలా అంటే చాలా అన్నమాట. సొంత బ్యానర్ మీద సినిమాలు తీసినా కూడా.. ఎన్నడూ ఆ సినిమా కోసం బయటి కార్యక్రమాలకు రాలేనంత పెద్దాయన. ఆయన సినిమాలకు రాష్ట్రంలో ఏవైనా సంస్థలు అవార్డులు ప్రకటిస్తే.. ఆ సమాచారం పెద్దాయనకు వెళ్లిన వెంటనే.. ‘థాంక్యూ’ అనే పదం వచ్చేది కాదు. అసలు ఆ అవార్డు తాము తీసుకోవాలా వద్దా? అనే మేధోమధనం చేసేవాళ్లు.. తన అనుంగు సహచరులతో కలిసి! తన డికెష్టీలను పరిశోధన కోసం పంపేవాళ్లు. ఆ సంస్థ ఎలాంటిది? దాని సారధులు ఎలాంటి వాళ్లు? వారి పుట్టుపూర్వోత్తరాలు, పుట్టుమచ్చలు ఏమిటి? అన్నీ ఆరా తీసేవాళ్లు.
అంతా తేలిన తర్వాత.. ఆ అవార్డు తీసుకోవాలా వద్దా? తీసుకోదలచుకుంటే.. తాను వెళ్లాలా? తన ప్రతినిధులు వెళ్లాలా? అనేది ఆ పెద్దాయన డిసైడ్ అయ్యేవాళ్లు! అవార్డు ఇస్తానన్నారు కదా అని ఎగబడి వెళ్లి తీసేసుకుంటే.. తనతో దిగిన ఫోటోలను అవతలి వాళ్లు మార్కెట్ చేసేసుకుని.. లాభపడిపోతారేమో అని ఆ పెద్దాయనకు భయం. అంత అతిజాగ్రత్త అన్నమాట. ఈ ముచ్చట మొత్తం కొన్ని దశాబ్దాల కిందటిది. ఇప్పుడు ఆయన లేరు. కానీ అప్పట్లో ఆయన పాటించిన జాగ్రత్తలు మాత్రం అందరికీ అవసరమేమో అనిపిస్తున్నది. ఇక్కడ కట్ చేసి అసలు సంగతిలోకి వద్దాం..
విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్ అనే కుర్రాడున్నాడు. పదో తరగతి ఫెయిలయ్యాడు. సెలబ్రిటీలతో కార్యక్రమాలు నిర్వహించడం వారితో ఉన్న ఫోటోలు పరిచయాలను ప్రచారానికి వాడుకుని.. వారందరూ తనకు భాగస్వాములని, తన వ్యాపారాల్లో బినామీలుగా పెట్టుబడులు పెట్టారని చెప్పుకుంటూ.. ఇతరుల నుంచి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించడం.. అంతా అయిన కొన్నాళ్లకు ఆ వ్యాపారం బోర్డు తిప్పేయడం అనే టెక్నిక్ ను కనుగొన్నాడు.
ఊళ్లమీదికొచ్చి చేయి చూసి జాతకం చెప్పే, సిగలో ఈకలు దూర్చుకున్న కొండదొర.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేషూ, నాగార్జునలతో దిగిన ఫోటోలని చూపించి డప్పు కొట్టుకున్నట్టే అన్నమాట! ఈ ప్రబుద్ధుడు ముందు విశాఖలో పింక్ థాన్ అనే కార్యక్రమం పేరుతో సెలబ్రిటీలు చాలా మంది అక్కడికొచ్చేలా ప్లాన్ చేశాడు. హైదరాబాదులో సస్టెయినబుల్ కార్ట్ అంటూ ఓ దుకాణం తెరిచాడు. ఓ సెలబ్రిటీతో రెండు కోట్లు పెట్టుబడి పెట్టించాడు. అందులో గందరగోళాలు గమనించి ఆమె త్వరగానే తప్పుకున్నారు.
తర్వాత హైదరాబాదులో చైన్ ఆఫ్ హోటల్స్ ప్రారంభించి.. ఓ మాజీ మంత్రి, ఓ సినిమా ఫ్యామిలీ తన వాటాదారులని నమ్మించి ఇతరులతో కోట్లు పెట్టుబడి పెట్టించాడు. ఆ రెండు దుకాణాలను ఎత్తేసి.. తృతీయ జువెలర్స్ అంటూ కొత్త దందా మొదలెట్టాడు. సినీ నటి అందులో పార్టనర్ అని చెప్పుకుని.. ఇతరులతో మరికొన్ని కోట్లు పెట్టుబడి పెట్టించాడు. తీరా ఒకటి రెండు వ్యవహారాలు పోలీసు గడప తొక్కగానే ప్రస్తుతం కటకటాల్లో ఉన్నాడు.
కట్ చేస్తే.. జనం ఇంత సులువుగా ఎలా మోసపోతున్నారనేది ఆలోచించాల్సిన సంగతి. అలాగే సెలబ్రిటీలు ఎవరికైనా తమకు పుట్టుపూర్వోత్తరాలతో సహా తెలియని వ్యక్తులు వచ్చి కార్యక్రమాలకు, అవార్డులకు పిలిస్తే వెళ్లడానికి భయపడాల్సిన పరిస్థితి. ఏ అవార్డు పుచ్చుకుంటే.. ఆ ఫోటోలతో ఎవరెలాంటి కొత్త మోసాలను ప్లాన్ చేస్తుంటారో ఎవ్వరికీ బోధపడని ఆధునిక రోజులు. సైబర్ మోసాల ద్వారా.. అమాయకులైన పేద ప్రజలు అకౌంట్లలో ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా మోసపోవడం చాలా చూస్తున్నాం. ఇప్పుడిలా సెల్రబిటీలు మోసపోయే వారు కొందరు.. మోసాల క్రీడలో తాము పావులుగా మారుతున్నవారు మరికొందరు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. ఇలాంటివి మరికొన్ని జరిగితే.. ఎవరు ఏ అవార్డు ఆఫర్ చేసినా, గెస్టుగా పిలిచినా.. సెలబ్రిటీలు.. ముందు చెప్పుకున్న పెద్దాయన సిద్ధాంతాన్ని ఫాలో అయి.. వంద ఆలోచిస్తారేమో మరి!
-ఎం. రాజేశ్వరి.
Comments
Please login to add a commentAdd a comment