రోడ్ల మరమ్మతులకు ‘108’ తరహా సేవలు
గ్రేటర్ కమిషనర్ యోచన
సాక్షి, సిటీబ్యూరో: ప్రజల నుంచి ఫోన్ రిసీవ్ చేసుకోగానే అత్యవసరంగా వెళ్లే 108 అంబులెన్స్ సర్వీసు మాదిరిగా...ప్రజలెవరైనా రోడ్డు బాగాలేదని ఫిర్యాదు చేయగానే వెంట నే అక్కడకు చేరుకొని మరమ్మతులు చేసేలా ప్రత్యేక వ్యాన్‌ను, ఫోన్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు గ్రేటర్ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు శనివారం వందరోజుల పనుల కార్యాచరణపై ఇంజినీర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఈ ప్రతిపాదన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్లు బాగాలేవనే ఫిర్యాదులు నగరవ్యాప్తంగా వస్తున్నాయని, ఇవి తగ్గాలంటే అత్యవసర వ్యవస్థను అందుబాటులోకి తెస్తే బాగుంటుందన్నారు. ఇది ఎంతవరకు సాధ్యమో నిపుణులను సంప్రదించి నిర్ణయిస్తామన్నారు. నాలాల పూడిక తీత పనులను సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టాలని ఇంజినీర్లకు సూచించారు. వందరోజుల పనులను ఇంజినీర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. రహదారుల మరమ్మతులు, రీ కార్పెటింగ్, నీటి నిల్వ ప్రాంతాలు తదితర అంశాలపై సమీక్షించారు. మోడల్ మార్కెట్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనివ్వాల్సిందిగా సూచించారు. నిర్ణీత వ్యవధిలోగా 50 మార్కెట్లు పూర్తిచేయాలన్నారు.