‘గ్రేటర్’ గందరగోళం
z
అవన్నీ కాకిలెక్కలని {పీ విజిట్-1లో వెల్లడి
అంచనాలు తలకిందులు చేస్తూ పెరిగిన జనాభా
ఇంటి నంబర్లు క్రమపద్ధతిలో లేక ఎన్యూమరేటర్ల అవస్థలు
ఇబ్బందులను అధిగమిస్తాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్
హైదరాబాద్ : గ్రేటర్‌లోని ఇళ్ల సంఖ్య.. జనాభాపై ఇప్పటి వరకు వేసిన లెక్కలన్నీ కాకిలెక్కలేన నే అంశం మరోమారు వెల్లడైంది. 19న జరుగనున్న సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆదివారం ప్రీ విజిట్-1లో ఈ విషయం వెలుగు చూసింది. ప్రస్తుత నగర జనాభా కోటిగా అంచనా వేసిన అధికారులు అందుకనుగుణంగా 25 వేల మంది ఎన్యూమరేటర్లను, సహాయకులుగా కళాశాలల విద్యార్థులతో పాటు మరో 35 వేల మందిని నియమించారు. అధికారుల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఇళ్ల సంఖ్య.. జనాభా పెరిగిపోయింది. 2011 జన గణనలో భారీ పొరపాట్లు జరిగినట్లు అధికారుల తాజా ప్రీ విజిట్-1లో వెల్లడైంది. ఒక డోర్ నంబర్‌తో సగటున నాలుగైదు ఇళ్లు ఉండవచ్చునని అధికారులు అంచనా వేసినప్పటికీ, అంతకు మించి ఇళ్లు పెరిగిపోయాయి. దీంతో సర్వేలో భాగంగా ప్రీ విజిట్-1లో ఆదివారం ఎన్యూమరేటర్లకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఒక ఎన్యూమరేటర్‌కు 26 ఇళ్లను అప్పగిస్తూ అందుకనుగుణంగా కరపత్రాలు, స్టిక్కర్లు పంపిణీ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో అతనికి 85 ఇళ్లు కనిపించాయి. ఇదే పరిస్థితి ఎన్యూమరేటర్లందరికీ ఎదురైంది. దీంతో తొలిరోజు ప్రీ విజిట్‌లో ఎన్యూమరేటర్లు తమకు అప్పగించిన అన్ని ఇళ్లకూ వెళ్లలేకపోయారు. మిగతా ఇళ్లకు సోమవారం వెళ్లనున్నారు. 19న ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించేందుకే ఆది, సోమవారాల్లో రెండు రోజుల ప్రీ విజిట్‌లు ఏర్పాటు చేశామని, క్షేత్రస్థాయి అనుభవాలతో 19న సర్వేను సజావుగా పూర్తిచేయగలమని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. ప్రీ విజిట్‌లు ఏర్పాటు చేయకుంటే పరిస్థితి క్లిష్టమయ్యేదన్నారు. కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో కొత్త ఏరియాలు అధికమై జనాభా కూడా లక్షల్లో పెరిగిందన్నారు. గత జనగణనలో వందమంది జనాభాగా ఉన్న చోట ఇప్పుడు క్షేత్రస్థాయిలో పదివేల మంది ఉండటాన్నిప్రస్తావించారు. ప్రీ విజిట్‌తో ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు.
ప్రీ విజిట్-1లో దృష్టికొచ్చిన అంశాలివీ..
ఎన్యూమరేటర్లు తమకు అప్పగించిన ఇంటి నంబర్లు క్రమపద్ధతిలో లేకపోవడంతో పలు ఇబ్బందులకు గురయ్యారు.కొన్నిచోట్ల ఇంటి నంబర్లు కాకుండా ప్రాంతాల వారీగా కేటాయించడంతో.. కొన్ని ఇళ్లకు ఇద్దరు ఎన్యూమరేటర్లు వెళ్లగా, మరికొన్ని ఇళ్లకు అసలే వెళ్లలేకపోయారు. ఒకే డోర్ నంబర్‌తో నాలుగు ఇళ్ల నుంచి మొదలు పెడితే వంద ఇళ్ల వరకు ఉండటంతో ఇంటికంటించే స్టిక్కర్లు, ఇవ్వాల్సిన కరపత్రాలు సరిపోలేదు. దీంతో ఎన్యూమరేటర్లు వాటిని జిరాక్స్‌లు తీయించుకోవాల్సిందిగా ఇరుగుపొరుగు కుటుంబాలకు చెప్పారు. ఈ పరిస్థితి ఎదుర్కొనేందుకు సర్కిల్ స్థాయిలోని అధికారులు ఎక్కడికక్కడ ప్రింటింగ్ చేయించి పంపిణీ చేయాల్సిందిగా కమిషనర్ సూచించారు.
ఒక్కో ఎన్యూమరేటర్ సహాయకులుగా ఐదుగురు వరకు తీసుకోవచ్చునని చెప్పినప్పటికీ అందుబాటులో లేరు. దాదాపు 70 వేల మంది సహాయకుల అవసరం కాగా, 35 వేల మంది మాత్రమే విధుల్లో పాల్గొన్నారు.ఆదివారం రాత్రి 7 గంటల వరకు ఎన్యూమరేటర్లు రాకుంటే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్(నంబరు 040-21 11 11 11)కు ఫిర్యాదు చేయాల్సిందిగా నగరవాసులకు అధికారులు సూచించారు. రాత్రి 7.30 గంటల నుంచి కాల్‌సెంటర్‌కు లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులందాయి.