సమరానికి సన్నద్ధం..
గ్రేటర్ సమరానికి అంతా సిద్ధమైంది. నగరంలోని 150 డివిజన్లకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు సోమవారం పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్లను ఒక్కరోజు ముందుగానే ఎన్నికల అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలతో పాటు, ఇతర సామగ్రిని అందజేశారు. గ్రేటర్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఏర్పాట్లపై ఆరా తీశారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి సరైన వసతులు కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డారు. మహిళా సిబ్బంది తమ పిల్లలతో సహా విధులకు రావడంతో ఇబ్బంది పడ్డారు. పలు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు వెబ్ కాస్టింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో
మేయర్ పీఠం మాదే: కేటీఆర్
బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధిస్తుంది. 80కి పైగా సీట్లు సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం. టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఓటేయాలో ప్రజలకు ఒక్క సరైన కారణం చూపడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయి. నగరంలో కరెంట్ పోకుండా చూశాం. శామీర్‌పేట్, రాచకొండ ప్రాంతాల్లో భారీ స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మించి రాబోయే రోజుల్లో మహానగరానికి తాగునీటి ఇక్కట్లు రాకుండా చర్యలు తీసుకుంటాం. విజన్ ఉన్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే నగర సమగ్రాభివృద్ధి సాధ్యం. - కేటీఆర్, రాష్ట్రమంత్రి, గ్రేటర్ ఎన్నికల ప్రచార సారధి
హైదరాబాద్ హమారా..
గ్రేటర్ పోరులో గెలిచేది మేమే. హైదరాబాద్ హమారా.. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తాం. మా పనితీరుపై ప్రజలకు నమ్మకం ఉంది. గత మూడేళ్ల పాటు సమర్థవంతమైన పరిపాలన అందించాం. వచ్చే ఐదేళ్లలో చేపట్టే పనులపై పక్కా కార్యాచరణ రూపొందించాం. అధికారంలోకి వస్తే.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. ఐదేళ్ల వరకు ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్స్ ఫీజులు పెంచబోం. పూర్తి స్థాయి మెజార్టీ లేకున్నా పాలనా పగ్గాలు చేపట్టిన చరిత్ర మజ్లిస్‌కు ఉంది. - అసదుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ పార్టీ అధినేత
పరిణతితో ఓటేయండి..
నేడు జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగర ఓటరు గొప్ప పరిణతితో ఓటెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్‌ను విధ్వంస కేంద్రంగా చూడాలనుకుంటున్న పార్టీలకు, వంత పాడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. 19 నెలల్లో గాలి మేడలు తప్ప, వాస్తవ పనులేమీ చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం మా కూటమికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా.
- జి.కిషన్‌రెడ్డి ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రజాస్వామ్య రక్షణకు ఓటే కీలకం
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశాం. నగరంలో ఓటు హక్కు ఉన్న వారంతా విధిగా దాన్ని వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఎంతో కీలకమని గుర్తుంచుకోవాలి. మంగళవారం ఉదయం 8 గంటలకు కుందన్‌బాగ్‌లోని చిన్మయ విద్యాలయంలో నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నా. ఇలాగే ప్రతి ఒక్కరూ తమతమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలి. - ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ కొత్వాల్
నేను వేశా.. మీరూ వేయండి
ఓటు అనేది రాజ్యాంగం మనకు ప్రసాదించిన అమూల్యమైన హక్కు. ప్రపంచంలో చాలా దేశాల ప్రజలకు లేని వరం మనకు లభించింది. మన పాలకులను మనమే ఎన్నుకునే అవకాశం ఈ హక్కు కల్పిస్తోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాలి. అందుకు అవసరమైన, అనువైన వాతావరణాన్ని మేం కల్పిస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నా. మీరూ ఓటు అవకాశాన్ని స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
మీరు సిద్ధమా..
నేను బేగంపేట చిన్మయి స్కూల్‌లో ఉదయం 7 గంటలకే ఓటేస్తున్నా. మరి మీరూ ఓటుహక్కును వినియోగించుకునేందుకు రెడీ అవ్వండి. అన్ని వర్గాలవారూ ఓటేసి పోలింగ్ శాతాన్ని పెంచండి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలలోపు మీకు కేటాయించిన పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటెయ్యండి. - జనార్దన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్
నేను జూబ్లీహిల్స్‌లో ఓటేస్తున్నా..
ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఆ హక్కును వినియోగించుకోవాలి. ఓటు కోసం కచ్చితంగా సమయం కేటాయించండి. ఎన్నిక ఏదైనా ఓటు ఒక్కటే. అది అసెంబ్లీనా.. లోక్‌సభనా.. జీహెచ్‌ఎంసీనా అనేది కాదు. ఓటు హక్కు వినియోగించుకుని తీరాలి. మీరు ఓటు వేయకుంటే ఎవరో ఒకరు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. నేను జూబ్లీహిల్స్‌లో ఓటేస్తున్నా. మీరూ కదలిరండి ప్రజాస్వామాన్ని కాపాడుదాం. - బ్రహ్మాజీ, సినీనటుడు
సెంటిమెంట్ పాలనకు తెరదించండి
ఏడాదిన్నర పాలన అంతా సెంటిమెంట్‌పైనే సాగింది. హైదరాబాద్ అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పనులను తాము చేసినట్టుగా చూపెట్టి, నగర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం టీఆర్‌ఎస్ చేస్తోంది. తన కుటుంబాన్ని ప్రమోట్ చేసుకునేందుకు కేసీఆర్ ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు. విజ్ఞులైన నగర ప్రజలు.. చేతల మనుషులు ఎవరు, మాటల మనుషులు ఎవరన్న అంశాన్ని గమనించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.- ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీపీసీ అధ్యక్షుడు
గ్రేటర్‌లో గట్టి పోటీ..
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరుగుతున్న ఈ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి గట్టి పోటీనివ్వడం ఖాయం. ప్రచార కార్యక్రమాన్ని సాధారణ ప్రజలకు చేరాలా చేశాం. పేదలకు ఏ కష్టమొచ్చినా వారి పక్షాన నిలిచి పోరాడేది మేమే. నగర ఓటర్లు రాజకీయ విలువలు పెంపొందించే పార్టీలకే పట్టం కట్టాలని కోరుతున్నా. పన్నెండు నియోజకవర్గాల పరిధిలోని 50-60 సీట్లలో ఇతర పార్టీల గెలుపు, ఓటమిని వన్ హైదరాబాద్ కూటమి నిర్ణయిస్తుంది. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ప్రశ్నించే బలాన్నివ్వండి..
గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులను బలపరిచి, కేసీఆర్ పాలనలో తప్పులను ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వాలని నగర ప్రజలను కోరుతున్నా. ఇష్టం వచ్చిన రీతిలో పాలన సాగించాలని భావిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని అదుపులో పెట్టాలంటే హైదరాబాద్ ఓటరు ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మాటలు తప్ప, చేతలు చేయని ఈ సర్కారుకు సరైన గుణపాఠం చెప్పే అవకాశం ఇదే. - ఎ. రేవంత్‌రెడ్డి, టీటీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు