గ్రేటర్ ప్రక్షాళన
టౌన్‌ప్లానింగ్ ఏసీపీల బదిలీ
కొత్తగా ఐదుగురికి పోస్టింగ్‌లు..
వెంటనే రిలీవ్ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు
‘సాక్షి’ కథనాలకు స్పందన
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో పారదర్శకత కోసం సమూల ప్రక్షాళన చేట్టారు. ఒకే చోట దీర్ఘకాలంగా పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్‌లోని అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ)లను బదిలీ చేశారు. వీరితోపాటు అవినీతి ఆరోపణలున్న వారికి సైతం స్థానచలనం కల్పించారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’లో వెలువడిన కథనాలతో గ్రేటర్ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్‌రెడ్డి ప్రక్షాళన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు నెలల క్రితం సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేయగా, తాజాగా వారి పైస్థాయిలోని ఏసీపీలను బదిలీ చేశారు. టౌన్‌ప్లానింగ్‌లో కీలకపాత్ర వీరిదే. భవన నిర్మాణ అనుమతుల్లో సాంకేతికంగా వీరిదే అధికారం కావడంతో వీరిపై భారీయెత్తున అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో 10 మంది ఏసీపీలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. డీటీసీపీ నుంచి వచ్చిన ఐదుగురికి కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు.
గతంలోనూ ఇదే స్టైల్..
జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మరోమారు తనదైన శైలిలో బదిలీలకు శ్రీకారం చుట్టారు. బదిలీ అయిన వారు పైరవీలు చేసుకోకుండా వరుస సెలవుల రోజుల్లో ఏసీపీలకు స్థానచలనం కలిగించారు. పోస్టింగ్‌లు, బదిలీ ఉత్తర్వులు అందినవారు వెంటనే విధుల్లో చేరేలా వారిపై అధికారులు వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. గతంలో రవాణా విభాగంలో దీర్ఘకాలంగా పని చేస్తున్నవారిని బదిలీ చేసినప్పుడూ ఇదే సూత్రం పాటించారు. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను ఆగమేఘాల మీద బదిలీ, మాతృ సంస్థలకు సరెండర్ చేయడం తెలిసిందే.
సీనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్‌లు..
బిల్‌కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి 2014 నవంబర్‌లో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చారు. అయితే వారిని ఇంతవరకు పాత పోస్టుల్లోనే కొనసాగిస్తున్నారు. జనగణన, ఎన్నికలు, ఓటర్ల తొల గింపు.. ఇలా వరుస కార్యక్రమాలు వస్తుండటంతో వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం అలాంటి వారందరికీ సీనియర్ అసిస్టెంట్లుగా పోస్టింగ్ లిచ్చారు. ఇలా మొత్తం 320 మందిని సీనియర్ అసిస్టెంట్లుగా ప్రధాన కార్యాలయం, వివిధ జోన్లలో నియమించారు. ఈస్ట్‌జోన్‌లో 58 మందికి, సౌత్‌జోన్‌లో 50 మం దికి సెంట్రల్ జోన్‌లో 63 మందికి, వెస్ట్‌జోన్‌లో 48 మందికి, నార్త్‌జోన్‌లో 49 మందికి, ప్రధాన కార్యాలయంలో 52 మందికి పోస్టింగ్ వేశారు. అయితే ఈ పోస్టింగ్స్‌లో భారీగా పైరవీలు సాగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదోన్నతులు పొందిన మొత్తం 320 మందిలో 160 మందికి పైగా రెవెన్యూ విభాగంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ఖాళీ చేసిన స్థానాలను భర్తీ చేసేందుకు దిగువ స్థాయిలో పనిచేస్తున్న వారికి త్వరలో పదోన్నతులిచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.