‘టౌన్‌ప్లానింగ్’ సంస్కరణలు
సాంకేతిక వినియోగంతో కొత్త విధానం
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అనగానే గుర్తుకు వచ్చేది అవినీతి... ఫైలు కదలాల న్నా... ఫైలు చూడాలన్నా పైసలు. మనీ లేనిదే ఏపనీ జరగదనేది బహిరంగ రహస్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆన్‌లైన్ ద్వారానే భవ న నిర్మాణ అనుమతులిచ్చేందుకు సిద్ధమైన ఉన్నతాధికారులు.. ఇదేతరుణంలో సాంకేతిక వినియోగంతో సిబ్బం దిలోని లంచావతారులకు చెక్ పెట్టాలని నిర్ణయించా రు. ప్రస్తుతం ఏ ప్రాంతంలోని భవన నిర్మాణ అనుమతులు ఎవరు చూస్తారో.. ఎవరు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారో తెలియడంతో వారిని కలిసి చేతులు తడిపితేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితి లేకుండా ఉండేందుకు భవన నిర్మాణ అనుమతి కోసం ఒక దరఖాస్తు ఆన్‌లైన్‌లో నమోదు కాగానే.. దానిని ఎవరు పరిశీలించాలనేది కంప్యూటరే నిర్ణయిం చేలా ఏర్పాట్లు చేశారు. ఉదాహరణకు ఇప్పటి వరకు ఒక సర్కిల్‌లో ఏయే ప్రాంతాలను.. ఏయే సెక్షన్ ఆఫీసర్లు చూస్తారో తెలిసి నిర్మాణదారులు తమ పనులు కావడం కోసం వారితో చేతులు కలిపేవారు. దరఖాస్తు చేయడానికి ముందే వారితో మాట్లాడుకుంటేనే పనులయ్యేలా సంబంధిత అధికారులు వ్యవహరించేవారు.
‘ర్యాండమైజేషన్’తో చెక్..
కాగా, కొత్తగా అమల్లోకి తెస్తున్న ‘ర్యాండమైజేషన్’ విధానంతో తమ దరఖాస్తు ఎవరికి వెళ్తుందో నిర్మాణదారులకు తెలియదు కనుక వారు ముందుగానే సదరు అధికారితో మాట్లాడుకోవడానికి ఉండదు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలి కనుక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే విధానాన్ని ప్రధాన కార్యాలయం స్థాయిలో ఏసీపీలకు వర్తింపచేయనున్నారు. తద్వారా ఏ ప్రాంతంలోని పనికి ఎవరికి ముడుపులు చెల్లించాలో నిర్మాణదారులకు తెలియదు. అంతేకాదు.. ఒక దరఖాస్తు ఆన్‌లైన్‌లో అందాక నిర్ణీత వ్యవధిలో పరిశీలించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ముడుపుల కోసం లేనిపోని సాకులతో దరఖాస్తును పెండింగ్‌లో ఉంచేందుకూ వీల్లేదు. క్షేత్రస్థాయి పరిశీలన ముగిశాక గరిష్టంగా 48 గంటల్లో ఫైల్ ను అప్‌లోడ్‌చేయాలి. ఈ విధానంలో సెక్షన్ ఆఫీసర్లకు కానీ, క్లర్కులకు కానీ, ఇతరత్రా ఎవరికీ ఎలాంటి లంచా లు ఇవ్వాల్సిన అవసరం రాదు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లే తేదీ నిర్మాణ దారుకు ఎస్‌ఎంఎస్ ద్వారా వెళ్తుంది. అంతేకాదు.. ప్రస్తుతం మాదిరిగా అనుమతి ఇచ్చేంతవరకు ఒకసారి, ఫీజు చెల్లించాక మరోసారి వివిధ స్థాయిల్లోని వారి వద్దకు ఫైలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకేసారి అనుమతి పొందగానే ఫీజు కడితే వెంటనే అనుమతినిచ్చేలా విధానాలు రూపొందించారు. దీన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నారు.