
‘ఇంజనీరింగ్’ ప్రక్షాళన
దేశంలో ప్రపంచీకరణ విధానాల అమలు మొదలయ్యాక అంతక్రితం లేని ఆక ర్షణను సంతరించుకున్న ఇంజనీరింగ్ విద్యకు చాలా త్వరగానే గ్రహణం పట్టింది. పట్టుమని పాతికేళ్లు గడవకుండానే అదిప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇంజనీరింగ్ విద్యకు అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళిక, వర్తమాన అవసరాల స్పృహ, భవిష్యత్తులో అది ఎదిగే క్రమం ఎలా ఉంటుందన్న అంశాల్లో ఇంజనీరింగ్ కళాశాలలకుగానీ, వాటి పర్యవేక్షణను చూసే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కుగానీ అవగాహన కొరవడుతున్నదని అర్ధమవుతోంది. ప్రమాణాలు పతనం కావడానికీ...పట్టా తీసుకుని బయటికొస్తున్నవారిలో అత్యధి కులు నిరుద్యోగులుగా మిగిలిపోవడానికీ ఇదే కారణం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధన తీరుతెన్నులపై మంగళవారంనాటి ‘సాక్షి’లో వెలు వడిన కథనం ఈ దయనీయ స్థితిని వెల్లడిస్తోంది. తమ పిల్లలు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని ఆశించే తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదువుల కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వాలు ఎగ్గొడుతున్నా వారు వెనక్కు తగ్గడంలేదు. అలాంటివారంతా చివరకు దగాపడుతున్నారు.
మన దేశంలో ఒక విచిత్రమైన స్థితి నెలకొని ఉంది. పరిశ్రమల్లో అయితేనేమి, వివిధ రంగాల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అయితేనేమి నిపుణుల అవసరం ఎంతగానో ఉంది. అటు ఏటా ఆరు లక్షలమంది ఇంజనీరింగ్ గ్రాడ్యు యేట్‌లు బయటికొస్తున్నారు. కానీ వారిలో 80 శాతంమందికి ఆయా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం ఏమాత్రం లేదని మొన్న జనవరిలో విడుదలైన ‘యాస్పై రింగ్ మైండ్స్’ సంస్థ నివేదిక వెల్లడించింది. వీరికి తాము చదువుకున్న కోర్సుల్లో అవగాహన మాట అటుంచి, కనీసం తమ గురించి తాము చెప్పుకోవడానికి అవసరమైన ఇంగ్లిష్ భాషా నైపుణ్యం కూడా లేదని ఆ నివేదిక వివరించింది. ఐటీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 25 శాతంమంది మాత్రమే కొలువుకు పని కొస్తారని ఐటీ సంస్థల సమాఖ్య నాస్‌కాం నిరుడు ప్రకటించింది.
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాల్లో 33,706మంది అధ్యాపకులు అవసరం కాగా కేవలం 25,000మంది మాత్రమే ఉన్నారని ‘సాక్షి’ కథనం వెల్లడిస్తోంది. ఇందులో సగం మందికిపైగా బీటెక్ చదివినవారే! ఇక ప్రొఫెసర్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లోనూ తగిన అర్హతలున్నవారు తక్కువే. ఒకపక్క విద్యార్థులనుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ తాత్కాలిక అధ్యాపకులతో, నామమాత్ర వనరులతో మెజారిటీ ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్నాయి. వేరే కళాశాలలో బోధించే అధ్యాపకులనే తమ కళాశాల అధ్యాపకులుగా చూపడం వంటి చేష్టలు మితిమీరాయి. అధ్యాపకులకు వేతనాలు సరిగా చెల్లించకపోవడం, చివరకు విసుగు చెంది వారు తప్పుకోవాలని నిర్ణయించినప్పుడు బకాయిలు ఎగ్గొట్టడం వంటి ధోరణులు పెరిగాయి. తప్పుడు లెక్కలతో అటు విద్యార్థులనూ, ఇటు ప్రభు త్వాలనూ బోల్తా కొట్టించడం అలవాటుగా మారింది. 90వ దశకంలో దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమయ్యాక సాంకేతిక రంగానికి ఊతమివ్వాలని, ఆ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందింపజేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పెరిగిన గిరాకీకి అనుగుణంగా భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి నివ్వాలని కూడా నిర్ణయించింది. ఫలితంగా వ్యాపార ధోరణులు కట్టలు తెంచు కున్నాయి. తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని సంపన్నులు, రాజకీయ నాయకులు కళాశాలలకు అనుమతులు తెచ్చుకున్నారు. ఏఐసీటీఈ దీనికంతకూ వంతపాడింది. ఎడాపెడా గుర్తింపులిచ్చింది. వీటన్నిటి పర్యవసానంగానే ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్య ఇలా అఘోరించింది.
ఇప్పుడు ఏఐసీటీఈలో కదలిక వచ్చింది. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాల, యూనివర్సిటీల వైఖరి కూడా మారింది. ఇంజనీరింగ్ కళా శాలల్లో జరుగుతున్నదేమిటో తెలుసుకునే ప్రయత్నం మొదలైంది. మరోపక్క ఇంజనీరింగ్ విద్యవైపు మొగ్గు కూడా క్రమేపీ తగ్గింది. 2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కన్వీనర్ కోటాలో 73,000 సీట్లు మిగిలిపోగా, నిరుడు అది 84,000కు చేరుకుంది. తెలంగాణలో నిబంధనలు పాటించని అనేక కళాశాలలను కౌన్సెలింగ్‌కు దూరం చేయగా...కొన్ని కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసు కోవడమే మానుకున్నాయి. ఇది ఒక రకంగా మంచి పరిణామం. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్యతోపాటు ఇప్పుడున్న దాదాపు 17 లక్షల సీట్లను పది లక్షలకు తగ్గించేందుకు చర్యలు ప్రారంభించామని ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్ర బుధే ఆమధ్య ప్రకటించారు.
ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన నియంత్రణను చూసే ఏఐసీటీఈకి ఇంకా చాలా వ్యాపకాలున్నాయి. అది ఇంజనీరింగ్ విద్యతో పాటు ఫార్మాస్యూటికల్, ఆర్కిటెక్చర్, అర్బన్ ప్లానింగ్, టూరిజం, మేనేజ్‌మెంట్ కోర్సుల వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తుంది. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య వైపు మొగ్గు చూపడం ప్రారంభించాక, నాణ్యతా ప్రమాణాలపై ఫిర్యాదులందడం మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం మేల్కొనవలసింది. ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించే వ్యవస్థ అవసరం ఉన్నదని గుర్తించవలసింది. ఆ పని జరగలేదు.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన చర్యలన్నీ ప్రారంభించాలి. ఇంజనీరింగ్ కళాశాలలకు నిర్దిష్టమైన ప్రమాణాలను నిర్దేశించి వాటిని తప్పనిసరిగా పాటించేలా చూడాలి. వాటి ఆధారంగా ర్యాంక్‌లను నిర్ణయించి...జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఏ కళాశాల స్థాయి ఏమిటో ఏటా తేల్చాలి. ఏ అంశంలో వెనకబడి ఉన్నా వెనువెంటనే సరిదిద్దుకోమని హెచ్చరించాలి. తగిన సమయమిచ్చి చూసి మారకపోతే గుర్తింపును కూడా రద్దు చేయాలి. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా సాగాలి. అప్పుడే ఇంజనీరింగ్ విద్యకు గత వైభవం సాధ్యమవుతుంది.