బీటెక్‌లో ‘లోటెక్’ బోధన! | poor education qualities in engineering colleges | Sakshi
Sakshi News home page

బీటెక్‌లో ‘లోటెక్’ బోధన!

Published Tue, May 17 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

బీటెక్‌లో ‘లోటెక్’ బోధన!

బీటెక్‌లో ‘లోటెక్’ బోధన!

రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న ఐదున్నర లక్షల మందిలో 32,729 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు! ఎంటెక్ చేసిన వారు 1,836!
 
గ్రూపు-2కు దరఖాస్తు చేసిన వారిలో బీటెక్ పట్టభద్రులు 9,204. ఎంటెక్ చేసిన వారు 2 వేల మంది!!
 
టీఎస్‌పీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న బీటెక్ గ్రాడ్యుయేట్లు 2,49,061 మంది. ఏ నోటిఫికేషనొచ్చినా రాసేందుకు రెడీగా ఉన్నారు.

 

- సరైన అర్హతలు లేకుండానే అధ్యాపకుల పాఠాలు
- రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 33 వేల మంది అధ్యాపకులు అవసరం
- కానీ ఉన్నది 25 వేలే.. అందులో సగం మందికి కేవలం బీటెక్ అర్హత
- 16 వేల మంది పీహెచ్‌డీ సిబ్బంది ఉండాలి.. ఉన్నది కేవలం 1,500
- బీటెక్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పాఠాలు చెబుతున్నవారెందరో..
- తప్పుడు లెక్కలతో మసిపూసి మారేడు కాయ చేస్తున్న యాజమాన్యాలు
- నాణ్యమైన విద్యకు దూరమవుతున్న విద్యార్థులు

 
 
సాక్షి, హైదరాబాద్

అరకొర  నైపుణ్యాలతో పట్టాలు పుచ్చుకొని కాలేజీల నుంచి వస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు చివరకు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధన ప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చదివిన రంగంలో ముందుకు సాగ లేక.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకోలేక.. ఏదోలా గట్టెక్కిన డిగ్రీతో ఇతర రంగాల వైపు చూస్తున్నారు. విద్యార్థుల ఈ స్థితికి ప్రధాన కారణం బోధన సమస్యలే! కాలేజీల్లో నాణ్యమైన బోధన లేక, అర్హులైన అధ్యాపకుల్లేక ఇంజనీరింగ్ విద్య అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది.

అర్హులైన అధ్యాపకులేరి?
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1,26,468 ఇంజనీరింగ్ సీట్లకు గాను 33,706 మంది అధ్యాపకులు అవసరం. కానీ రాష్ట్రంలోని 246 ఇంజనీరింగ్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య 25 వేలు మాత్రమే. అందులో సగం మంది బీటెక్ పూర్తి చేసినవారే ఉన్నారు. ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్‌డీ కలిగి, బోధనలో కనీసం ఐదేళ్లు అనుభవం ఉన్న వారు అర్హులు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు కూడా పీహెచ్‌డీ ఉండాలి.

రాష్ట్రంలోని బీటెక్, ఎంటెక్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 16,667 మంది అవసరం. కానీ ప్రస్తుతం ఉన్నది కేవలం 1,500 మంది. అందులోనూ సగం మంది రిటైర్ అయిన వారే ఉన్నట్లు అంచనా. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఎంటెక్ పూర్తి చేసి, బోధనలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. కానీ చాలా కాలేజీల్లో బీటెక్ అర్హత గలవారే పాఠాలు బోధిస్తున్నారు. నిబంధన ప్రకారం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1:2:6 నిష్పత్తిలో ఉండాలి. ఈ లెక్కల రాష్ట్రంలో 33,706 మంది బోధనా సిబ్బంది అవసరం. అందులో 22,470 మంది ఎంటెక్ అర్హత కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 11,236 మంది డాక్టరేట్ అర్హత కలిగిన అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కావాలి. కానీ డాక్టరేట్ అర్హత కలిగినవారు 1500 మాత్రమే ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలోని 171 ఎంటెక్ కాలేజీల్లో 22,470 మంది అధ్యాపకులు అవసరం ఉన్నా 15,152 మందితోనే నడుస్తున్నాయి.

తప్పుడు లెక్కలతో మాయాజాలం
కొన్ని కాలేజీల యాజమాన్యాలు అధ్యాపకుల తప్పుడు లెక్కలతో విద్యార్థులు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయి. ఒక కాలేజీలో బోధించే వారినే మరో కాలేజీలో బోధిస్తున్నట్లు లెక్కలు చూపాయి. దీన్ని గ్రహించిన జేఎన్‌టీయూహెచ్ ఇటీవల 903 మంది అధ్యాపకులను బ్లాక్‌లిస్టులో పెట్టింది. వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. నకిలీ పీహెచ్‌డీ సర్టిఫికెట్లతో అధ్యాపకులుగా కొనసాగుతున్న ఏడుగురిని కూడా బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఇలా తప్పుడు లెక్కలతో పేపర్‌పైనే అర్హులైన అధ్యాపకులు ఉన్నట్లు చూపడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వమే కాదు ప్రైవేటు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ‘యాస్పైరింగ్ మైండ్స్’ సంస్థ చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన వేల మంది విద్యార్థులకు కనీసం ఇంగ్లిషు మాట్లాడే నైపుణ్యం లేదని తేలింది.

నాణ్యత ప్రమాణాలపైనే సర్కారు దృష్టి..
రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యలో ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేస్తోంది. మౌలిక సదుపాయాలతోపాటు అధ్యాపకుల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తోంది. పక్కాగా అన్ని రకాల సదుపాయాలు ఉన్న కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్ చర్యలు తీసుకుంటోంది. దీంతో 2016-17 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య మొత్తంగా 40 వేల వరకు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోని 58 కాలేజీల్లో దాదాపు 10 వేల సీట్లు తగ్గిపోనున్నాయి.

మరోవైపు 46 ఎంటెక్, బీటెక్ కాలేజీల విజ్ఞప్తి మేరకు ఆ కాలేజీల్లోని పలు కోర్సులకు ఏఐసీటీఈ ఈసారి గుర్తింపును రద్దు చేసింది. వాటిల్లో 10 వేల వరకు సీట్లకు కోత పడే అవకాశం ఉంది. మరో 7 కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేయగా ఏఐసీటీఈ ఓకే చెప్పింది. వాటిల్లో 5 వేలకు పైగా సీట్లు తగ్గిపోనున్నాయి. ఇక గతేడాది అందుబాటులో ఉంచిన 1,26 లక్షల సీట్లలో కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ అయినవి కేవలం 75 వేలే! ఈ నేపథ్యంలో ఈసారి అనుబంధ గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా చేస్తుండడంతో మరో 15 వేల సీట్లకు కోత పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement