డబ్బు కట్టాం.. సీట్లు ఇవ్వాల్సిందే | Panchayat of Engineering Colleges affiliated to Council of Higher Education | Sakshi
Sakshi News home page

డబ్బు కట్టాం.. సీట్లు ఇవ్వాల్సిందే

Published Wed, Aug 28 2024 4:57 AM | Last Updated on Wed, Aug 28 2024 4:57 AM

Panchayat of Engineering Colleges affiliated to Council of Higher Education

కొత్త సీట్లు వస్తాయన్న ఇంజనీరింగ్‌ కాలేజీల మాట నమ్మి ముందే డబ్బు చెల్లించిన విద్యార్థులు 

ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో చేతులెత్తేసిన కాలేజీలు.. కట్టిన సొమ్ము తిరిగిచ్చేస్తామని హామీ.. 

సీట్ల కోసమే పట్టుబడుతున్న విద్యార్థులు 

ఉన్నత విద్యామండలికి చేరిన పంచాయితీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల మధ్య సీట్ల పంచాయితీ ముదురుతోంది. డిమాండ్‌ లేని కోర్సులను రద్దు చేసుకున్న కాలేజీలు వాటి స్థానంలో కొత్త సీట్లు వస్తాయని భావించి యాజమాన్య కోటా కింద విద్యార్థుల నుంచి ముందే డబ్బు దండుకున్నాయి. 

కానీ కొత్త సీట్లకు ప్రభుత్వం అనుమతించకపోవడం, దీనిపై హైకోర్టుకెక్కినా కాలేజీలకు ఊరట లభించకపోవడంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. వివిధ కాలేజీల్లో దాదాపు 5 వేల మందికి ఈ తరహాలో సీట్లు ఇస్తామని యాజమాన్యాలు ఆశలు రేపాయి. అందులో టాప్‌ కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి. 

దాదాపు అన్ని బ్రాంచీల్లో సీట్లు భర్తీ అయినందున ఇప్పుడు సీట్లు లేవని చెబుతున్న కాలేజీలు.. కావాలంటే కట్టిన సొమ్మును తిరిగిచ్చేస్తామని అంటున్నాయి. కానీ దీనికి విద్యార్థులు ఒప్పుకోవట్లేదు. ఇంజనీరింగ్‌ ప్రవేశాలు దాదాపు పూర్తికావడంతో ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలని ప్రశి్నస్తున్నారు. ఏదో ఒక బ్రాంచీలో తమకు సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. 

మండలి వద్ద గందరగోళం
ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద మంగళవారం గందరగోళ పరిస్థితి కనిపించింది. ప్రైవేటు కాలేజీలు మోసం చేశాయని విద్యార్థులు అధికారులకు మొర పెట్టుకున్నారు. విద్యాసంవత్సరం నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. 

కొందరు ఆవేశంతో మాట్లాడుతూ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో అధికారులు అవాక్కయ్యారు. యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడేందుకు విఫలయత్నం చేశారు. సీట్లు లేనప్పుడు ఎలా ఇవ్వగలమని కాలేజీల నుంచి సమాధానం రావడంతో నిస్సహాయత వ్యక్తం చేశారు. 

స్పాట్‌ షురూ 
స్లైడింగ్‌ తర్వాత 11 వేల పైచిలుకు ఇంజనీరింగ్‌ సీట్లు మిగిలాయి. వాటికి స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టేందుకు వీలుగా సాంకేతిక విద్యామండలి మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. కాలేజీకి వచి్చన వారిలో ర్యాంకు ప్రకారం సీట్లు ఇవ్వాలని సూచించింది. బుధవారం నుంచి స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది. 

బుధ, గురువారాల్లో కాలేజీలవారీగా ఖాళీగా ఉన్న సీట్లను పత్రికల ద్వారా వెల్లడించాలని, ఈ నెల 30 నుంచి సెపె్టంబర్‌ 2 వరకు స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టాలని తెలిపింది. వచ్చే నెల 3న స్పాట్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలను కాలేజీలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

అన్ని డాక్యుమెంట్లను సాంకేతిక విద్య విభాగానికి వచ్చే నెల 4లోగా కాలేజీలు అందజేయాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే యాజమాన్య కోటా కింద భర్తీ చేసిన సీట్లకు సెపె్టంబర్‌ 5 నుంచి ర్యాటిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. సీట్ల కేటాయింపును అన్ని డాక్యుమెంట్లతో వచ్చే నెల 10లోగా అప్‌లోడ్‌ చేయాలని సూచించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement