గోదావరి ప్రక్షాళనకు నిధులివ్వాలి
బోట్‌క్లబ్ (కాకినాడ) : దక్షిణగంగగా పేరుగాంచిన గోదావరి నది ప్రక్షాళనకు కేంద్రం నిధులు కేటాయించాలని కాకినాడ ఎంపీ, టీడీపీ లోక్‌సభ పక్షనేత తోట నరసింహం కోరారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ ఏర్పాటు చేసి పవిత్ర గంగానది ప్రక్షాళనకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో గోదావరిపాటు కృష్ణానది ప్రక్షాళనకు కూడా కేంద్రం నిధులు కేటాయించి పవిత్రతను కాపాడాలని కోరారు. మహారాష్ట్ర నాసిక్ వద్ద పుట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా సుమారు 1,465 కిలోమీటర్లు ప్రవహిస్తున్న గోదావరి నేడు.. నదీ జలాల కాలుష్యంతో పాటు డ్రైనేజీ వ్యర్థాలను ఇష్టానుసారంగా నదిలోకి వదలడం వల్ల చెత్తాచెదారం, మురుగునీరుతో నిండిపోయిందన్నారు. గత ఏడాది జరిగిన పుష్కరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి ప్రక్షాళనకు నిధులు కేటాయించినా సరిపోలేదన్నారు.