సాగర మధనం... సాగేదెలా? | Hussensagar corner cleansing tasks | Sakshi
Sakshi News home page

సాగర మధనం... సాగేదెలా?

Published Sun, Jun 12 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

సాగర మధనం... సాగేదెలా?

సాగర మధనం... సాగేదెలా?

హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు మూలకు
ఘన వ్యర్థాల తొలగింపుపై నిర్లక్ష్యం
ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో {పక్షాళన అవసరం
కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనుల పూర్తితో గరళ జలాల నుంచి విముక్తి
ఘన వ్యర్థాలను హెచ్‌డీపీఈ పైపుల్లో నింపేందుకు అవకాశం

 

నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్ సాగర్ సుందర తటాకంగా మారడం కలేనా...? తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన సాగర్ ప్రక్షాళన పనులు అటకెక్కినట్టేనా...? కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేయడం అసాధ్యమేనా....అంటే... ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. తెలంగాణ ప్రభుత్వం తొలుత చేసిన ప్రకటనలు చూసి.. మన సాగరం ఇక ఆస్ట్రియా దేశంలోని ‘డాన్యుబ్ నది’లా మారుతుందని నగరవాసులు ఆశించారు. ముక్కు మూసుకోకుండా స్వేచ్ఛగా...స్వచ్ఛమైన జలాల్లో విహరించొచ్చని భావించారు. విశ్వనగరి కాబోతున్న భాగ్యనగరికి హుస్సేన్ సాగర్ తలమానికమవుతుందని ఆనందించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రక్షాళన పర్వంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పనులపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో సాగర్ ప్రక్షాళన ఇప్పట్లే లేనట్లే అని భావించాల్సి వస్తోంది.

 

 

సిటీబ్యూరో: ఒకప్పుడు స్వచ్ఛమైన తాగునీటితో మహానగర దాహార్తిని తీర్చిన హుస్సేన్ సాగరం.. దశాబ్దాలుగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక ఘన వ్యర్థాలను తన గర్భంలో దాచుకొని కాలుష్య కాసారంలా మారింది. ఈ సాగరానికి పూర్వపు వైభవం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లక్రితం ఆర్భాటంగా ప్రకటించింది. ఈ కృషిలో భాగంగా కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులను ఇటీవలే పూర్తిచేయడంతో పారిశ్రామిక వ్యర్థాలు సాగరంలోకి చేరకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా..సాగరం అట్టడుగున పేరుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపుపై మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ వ్యర్థాలను తొలగించేందుకు ఆస్ట్రియాదేశంలోని డాన్యుబ్ నదిని ప్రక్షాళన చేసిన తరహాలోనే ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది ఆస్ట్రియా నిపుణుల బృందం సాగరాన్ని పరిశీలించి అందులోని నీటిని తొలగించకుండానే అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు తమ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని ప్రభుత్వానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. కానీ ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సాగర్ ప్రక్షాళన నీటిమీద రాతలా మారింది.

 
ఆస్ట్రియాలో డాన్యుబ్ నది ప్రక్షాళన ఇలా...

ఆస్ట్రియా దేశంలోని డాన్యుబ్ నది ఒకప్పుడు గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాల నుంచి వెలువడిన ఘన,ద్రవ,పారిశ్రామిక వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నదిని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించింది. ఈపనులను 2015 చివరి నాటికి పూర్తిచేశారు. నదిలోని నీటిని తొలగించకుండానే అడుగున గడ్డకట్టుకుపోయిన వ్యర్థాలను ప్రత్యేకమైన యంత్రాలతో తొలగించి వీటిని జియోటెక్స్‌టైల్(మందమైన హెచ్‌డీపీఈ పైపులు)పైపుల్లో నింపి నది చుట్టూ కట్టలా ఏర్పాటు చేశారు. ఇక నదిలోకి మురుగు వ్యర్థాలు ప్రవేశిస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ మురుగు జలాలను శుద్ధి చేసే ఎస్టీపీలు, హానికారక రసాయనాలను తొలగించే ఈటీపీ(ఎఫ్లుయెంట్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసిన అనంతరమే నదిలోకి వదులుతున్నారు. దీంతో ఒకప్పుడు దుర్గంధాన్ని వెదజల్లిన ఈ నది ఇపుడు మంచినీటి సాగరంలా మారింది. అంతేకాదు ఈ నది వద్ద ఏర్పాటు చేసిన ఈతకొలను ఇపుడు పర్యాటకులకు స్వర్గధామంలా మారింది. ఒకప్పుడు ఈ నది చెంతకు రావాలంటేనే భయపడిన స్థానికులు ఇపుడు ఇక్కడి ఆహ్లాద పరిస్థితుల్లో సేదదీరుదుతుండడం విశేషం.

 
హుస్సేన్ సాగర్ శుద్ధీ సాధ్యమే..!

సుమారు 900 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన హుస్సేన్‌సాగర గర్భంలో దశాబ్దాలుగా సుమారు 40 లక్షల టన్నుల ఘనవ్యర్థాలు పోగుపడి నట్లు అంచనా. ఘనవ్యర్థాలన్నీ గడ్డకట్టుకుపోయి గుట్టలా పేరుకుపోయాయి. ప్రభుత్వం గత రెండేళ్లుగా సాగరంలోకి పికెట్, బంజారా, కూకట్‌పల్లి, బుల్కాపూర్ నాలాల నీరు చేరుతున్న ప్రాంతాల్లో వ్యర్థాల తొలగింపు పనులు చేపట్టింది. సుమారు 5 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించినట్లు సమాచారం. తొలగించిన వ్యర్థాలను సైతం పర్యావరణ సమస్యలు తలెత్తకుండా పీసీబీ అనుమతితో ఇక్కడి నుంచి తరలించి గాజులరామారంలోని క్వారీ గుంతల్లో నింపారు. మిగిలిన 35 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు సాగర గర్భంలోనే మిగిలి పోవడంతో ప్రక్షాళన పర్వం ప్రహసనంగా మారింది. ఈ ఘన వ్యర్థాలను కూడా డాన్యుబ్ నది తరహాలో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించి మందమైన హెచ్‌డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ కట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేని పక్షంలో సాగరం మధ్యలో ఐల్యాండ్(దీవి)మాదిరిగా వ్యర్థాలు నింపిన పైపులను ఏర్పాటు చేయవచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రి యా నిపుణుల సహకారం, సాంకేతికతతో మాత్రమే ఈ పనులు చేయగలుగుతారని..ప్రస్తుతం మన వద్ద అందుబాటులో ఉన్న విధానాలతో అట్టడుగున ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేస్తుండడం గమనార్హం.

 
విషం నుంచి విముక్తి ఇలా..

బాలానగర్, జీడిమెట్ల, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడల నుంచి రోజువారీగా 500 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలు హుస్సేన్‌సాగర్‌లో చేరకుండా ఇటీవలే కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తిచేశారు. సుమారు రూ.53 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ప్రకాశ్‌నగర్ ఐఅండ్‌డీ(ఇంటర్ సెప్టార్ అండ్ డైవర్షన్)నుంచి మారియట్ హోటల్ దిగువ వరకు ఈ పనులను చేపట్టారు. ఈ మార్గంలో 2200 డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్‌స్టీల్ పైపులైను ఏర్పాటు చేసి మారియట్‌హోటల్ అవతల ఉన్న హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్‌నాలా వరకు పారిశ్రామిక వ్యర్థ జలాలను సాగర్‌లోకి చేరకుండా దారి మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి ప్రకాశ్‌నగర్, గోల్నాక, అంబర్‌పేట్  మీదుగా మూసీలోకి ప్రవేశించే ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యంలో అంబర్‌పేట్ మురుగుశుద్ధి కేంద్రం వద్ద ఈ పారిశ్రామిక వ్యర్థజలాల్లో ఉన్న ఘన వ్యర్థాలను తొలగించి మూసీలోకి వదులుతున్నారు.

 

 

మిషన్ హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో మిగిలిన పనులివే..
{పధానంగా కలుస్తోన్న నాలాలు: పికెట్, బుల్కాపూర్, బంజారా నాలాలు
జలాశయం నీటి నాణ్యత మెరుగుపరచడం, జలాశయంలోకి ఘనవ్యర్థాలు చేరకుండా చూడడం
మిగిలిన మూడు నాలాల నుంచి చేరుతున్న మురుగునీటిని దారి మళ్లించడం
జలాశయంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం
జలాశయం నీటిని ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ అవసరాలకు వాడుకునేలా శుద్ధిచేయడం
పికెట్‌నాలా వద్ద నీటి శుద్ధికి 30 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగుశుద్ధి కేంద్రం నిర్మాణం
హుస్సేన్‌సాగర్ వద్దనున్న 20 ఎంఎల్‌డీ ఎస్టీపీ అధునికీకరణ
హుస్సేన్‌సాగర్ చుట్టూ రింగ్‌సీవర్ మెయిన్స్ నిర్మించి మురుగునీరు చేరకుండా చూడడం
రంగధాముని చెరువు వద్ద 5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మినీ ఎస్టీపీ నిర్మాణం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ట్రంక్‌సీవర్ మెయిన్స్ నిర్మాణం
శుద్ధిచేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు
జలాశయం అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా తొలగింపు
జలాశయంలో ఆక్సీజన్ శాతం పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థ ఏర్పాటు
జలాశయంలో నేరుగా పూజా సామాగ్రిని పడవేయకుండా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
హుస్సేన్‌సాగర్‌కు ఆనుకొని ఉన్న 22 మురికివాడలను ఎన్‌జీఓల సహకారంతో అభివృద్ధి
సమీప బస్తీలు,కాలనీల్లో టాయిలెట్స్ నిర్మాణం.
జలాశయంలో ఘన వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక యంత్రాంగం నెలకొల్పడం.
మిషన్ హుస్సేన్‌సాగర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యం పెంచడం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement