ప్రక్షాళన ఫలించేనా!
ప్రక్షాళన ఫలించేనా!
Published Tue, Apr 25 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
భీమవరం : డెల్టా కేంద్రమైన భీమవరం పట్టణం, పరిసర గ్రామాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన పనులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో చేపడుతుందా.. ఆ డ్రెయిన్‌ను కాలుష్య కాసారంగా మార్చేసిన ప్రజాప్రతినిధులు, బడాబాబుల ఒత్తిడికి తలొగ్గకుండా పారదర్శకంగా పనులు చేస్తారా లేక తూతూమంత్రంగా కానిచ్చేసి చేతులు దులిపేసుకుంటారా.. ఇలాంటి అనుమానాలెన్నో డెల్టా వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ పనులను నిలిపివేయాలంటూ మూడేళ్లుగా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో యనమదుర్రు డ్రెయిన్ పక్షాళన అంశం తెరపైకి వచ్చింది. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం పూర్తయితే యనమదుర్రు డ్రెయిన్ మాదిరిగానే గొంతేరు డ్రెయిన్ కూడా కాలుష్య కాసారంగా మారి ప్రజా జీవనానికి ముప్పు తెస్తుందనే ఆందోళన వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భీమవరంలోని విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కీలకంగా ఉంటాయా లేదా అనేది చర్చనీయాంశమైంది.
పర్యావరణానికి.. ప్రజారోగ్యానికి సవాల్
డెల్టాలోని ప్రధాన డ్రెయిన్లు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి పెనుసవాల్ విసురుతున్నాయి. ఇప్పటికే యనమదుర్రు డ్రెయిన్ కాలుష్య కాసారం కాగా.. గొంతేరు డ్రెయిన్ సైతం రొయ్యల చెరువుల నుంచి రసాయనాలు,, మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్ వ్యర్థాలు చేరటం వల్ల కలుషితమైంది. ఈ పరిస్థితుల్లో తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయితే గొంతేరు డ్రెయిన్ యనమదుర్రు డ్రెయిన్‌ను తలదన్నేలా కలుషితమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. డెల్టాకు తాగు, సాగునీటిని అందించిన యనమదుర్రు కాలువలోకి తణుకు ప్రాంతం నుంచి మొదలుకొని భీమవరం వరకు పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలు, చెత్త కలుస్తుండటంతో కాలువ డ్రెయిన్‌గా రూపాం తరం చెందింది. ఒకప్పుడు యనమదుర్రులో గోదావరి నదిని తలదన్నే విధంగా మత్స్య సంపద ఉండేది. ఎక్కడికక్కడ వలకట్లు, గరికట్లు ఉండేవి. దిగువ గ్రామాలకు జలరవాణా వ్యవస్థ ఉండేది. ఇందులోకి విష రసాయనాలు, కాలుష్యం పెద్దఎత్తున చేరడంతో యనమదుర్రు కాలువ హైదరాబాద్‌లోని మూసీ నదిని తలపిస్తోంది. మత్స్య సంపద పూర్తిగా కనుమరుగైంది. కాలుష్య నియంత్రణ చట్టం ఉన్నా అమలులో చిత్తశుద్ధి కరువైంది. తణుకు, వేండ్ర ప్రాంతాల్లోని పరిశ్రమలు.. వాటికి దిగువన గొల్లలకోడేరు తదితర ప్రాంతాల్లో వెలసిన ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి నిత్యం టన్నులకొద్దీ కాలుష్యం యనమదుర్రు డ్రెయిన్‌లోకి చేరుతోంది. పరిశ్రమలు కామన్ ఎఫిలెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)లను ఏర్పాటు చేసుకుని వ్యర్థ, మురుగు జలాలను శుద్ధిచేసిన అనంతరం బయటకు విడుదల చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా నేరుగా యనమదుర్రు డ్రెయిన్‌లోకి వదిలేస్తున్నారు. భీమవరం పట్టణ, పరిసర ప్రాంతాల్లో యనమదుర్రు డ్రెయిన్ గట్టు వెంబడి ప్రయాణించాలంటే ముక్కు మూసుకోవాలి్సన దుస్థితి ఉంది. డ్రెయిన్ గట్ల వెంబడి నివసించే వారంతా అనారోగ్యం బారిన పడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు.
ఆక్రమణలకు అంతేలేదు
ఎంతో విశాలమైన యనమదుర్రు గట్లు ఆక్రమణల కారణంగా డ్రెయిన్ కుచించుకుపోయింది. డ్రెయిన్ గట్ల వెంబడి కొందరు పక్కా భవనాలు నిర్మించుకోగా.. మరికొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో ఒక ఆక్వా ప్లాంట్ డ్రెయిన్ గట్టు వెంబడి ఎకరాలకొద్దీ ఆక్రమించి రొయ్యల ప్రాసెసింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భీమవరం–గరగపర్రు ప్రధాన రహదారి పక్కనే ఈ ఆక్రమణ కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆక్రమణదారులు ప్రజాప్రతినిధుల అండతో అధికారులకు ముడుపులు ముట్టచెప్పి తమకు అడ్డులేకుండా చూసుకుంటున్నారు. డ్రెయిన్‌ను ఆక్రమించుకుంటున్న, కాలుష్య కాసారంగా చేస్తున్న వారిలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ పరిస్థితుల నడుమ డ్రెయిన్ ప్రక్షాళన అంశంపై మంగళవారం భీమవరంలో నిర్వహించే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారిం ది. వేండ్రలోని డెల్టా పేపర్ మిల్లు కాలుష్యం యనమదుర్రు డ్రెయిన్‌లో కలుస్తోంది. ఇది నరసాపురం ఎంపీ గోకరాజు గంగారాజు అధీనంలో ఉంది. పలు ఆక్వా ప్లాంట్ల యజమానులు కూడా టీడీపీ నేతలకు వెన్నుదన్నుగా ఉన్నవారే. ఈ నేపథ్యంలో సమావేశం కానున్న ప్రజాప్రతినిధుల స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.
Advertisement