సాగర్..డేంజర్
హుస్సేన్ సాగర్‌లో మరింత పెరిగిన కాలుష్యం
పీసీబీ తాజా పరిశీలనలో వెల్లడి
రూ.310 కోట్లు ఖర్చు చేసినా ఫలితం నిల్
తాజాగా నిధులు లేవని ప్రక్షాళన పనులకు ఫుల్‌స్టాప్
జలాశయంలో ఆక్సిజన్ స్థాయి సున్నాగా నమోదు
సిటీబ్యూరో: చారిత్రక హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనను సర్కారు విభాగాలు అటకెక్కించడంతో రోజురోజుకూ జలాశయం గరళాన్ని తలపిస్తోంది. సాగర గర్భంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఘన వ్యర్థాలను తొలగించకపోవడం, కూకట్‌పల్లి నాలా నుంచి వచ్చి చేరుతున్న పారిశ్రామిక వ్యర్థ రసాయనాలతో జలాశయం రోజురోజుకూ మురుగుకూపంగా మారుతోంది. సాగర్ జలాల్లో ఆక్సిజన్ స్థాయి సున్నాగా నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. గతంలో జైకా బ్యాంకు మంజూరుచేసిన రూ.310 కోట్ల నిధులను మహానగరాభివృద్ధి సంస్థ గతేడాది జూలై నాటికే హారతి కర్పూరంలా ఖర్చుచేసింది. తాజాగా నిధుల లేమిని సాకుగా చూపి ప్రక్షాళన విషయంలో హెచ్‌ఎండీఏ చేతులెత్తేయడంతో జలాశయంలో హానికారక బ్యాక్టీరియా వృద్ధిచెందుతుందని..నీటి నాణ్యత దెబ్బతింటోందని కాలుష్యనియంత్రణమండలి తాజా పరిశీలనలో తేలింది. రాబోయే వేసవిలో నీటిమట్టాలు మరింత తగ్గి హానికారక రసాయనాల కారణంగా జలాశయం నీటి నుంచి విపరీతమైన దుర్గంధం వెలువడే ప్రమాదం పొంచిఉన్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గరళసాగరం ఇలా...
2016 సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి కూకట్‌పల్లి, బుల్కాపూర్ తదితర నాలాల నుంచి భారీగా వరద నీరు చేరింది. ఈ వరదనీటిలో బల్క్, డ్రగ్ ఫార్మా కంపెనీలు విడుదలచేసిన హానికారక రసాయనాలున్నాయి. జలాశయం అడుగున సుమారు 40 లక్షల టన్నుల ఘన, రసాయన వ్యర్థాలు గుట్టలా పోగుపడినట్లు అంచనావేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 5 లక్షల టన్నులే తొలగించారు. మిగతాది సాగరగర్భంలో పేరుకుపోవడంతో గరళం నుంచి విముక్తి లభించడంలేదు. అమీర్‌పేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్న ఏ మెయిన్ మురుగు పైప్‌లైన్‌కు ఎన్టీఆర్‌గార్డెన్ వద్ద గండి పడడంతో తాజాగా ఈమురుగునీరంతా హుస్సేన్‌సాగర్‌లో చేరుతోంది. మురుగునీటిలోని పాథోజెన్స్, హానికారక రసాయనాలతో కలిసి యుట్రిఫికేషన్ చర్య జరిగి ఇ.కోలి, సూడోమోనాస్, సెఫైలోకోకస్, ఎర్గినోసా, షిగెల్లా, సాల్మొనెల్లా, క్విబెల్లా వంటి హానికారక బ్యాక్టీరియా జాతులు వృద్ధిచెందుతున్నాయి.ఈ బ్యాక్టీరియాకు యాంటీబయాటిక్స్ నిరోధకత కూడా అధికమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మురుగు కారణంగా జలాశయంలో డెంగ్యూ, మలేరియాకు కారణమయ్యే దోమల సంతతి వృద్ధి చెందుతోంది. ఈ పరిణామం సమీప ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జలాశయంలో వృక్ష, జంతుజాలం మనుగడకు అవసరమైన ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గింది.జలాశయంలో భారీగా ఫైటోప్లాంక్టన్, ఆల్గే, గుర్రపుడెక్క తదితరాల ఉధృతి భారీగా పెరిగింది.నీటిలో హైడ్రోజన్‌సల్ఫైడ్ తీవ్రత క్రమంగా పెరిగి రాబోయే వేసవిలో నీటి నుంచి దుర్గంధం భారీగా వెలువడే ప్రమాదం పొంచిఉంది.ఈ జలాశయం పరిసరాల్లో ఎక్కువసేపు గడిపితే కళ్ల మంటలు, దురద, కళ్లలో ఏర్రటి జీరలు ఏర్పడడం తథ్యమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు.
జలాశయం నుంచి వెలువడే గాలి కారణంగా శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏటా గణేశ్ నిమజ్జనంతో జలాశయంలోకి సుమారు 30 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 40 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగరంలో కలుస్తున్నాయి. జలాశయం నీటిలో బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) తాజాగా ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఇది 35 నుంచి 40 పీపీఎం మించరాదు. సాగర్ నీటిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడీ) 200 పీపీఎంకు మించడం గమనార్హం. సాధారణంగా ఇది 80–100 పీపీఎం మించదు. జలాశయం నీటిలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోయింది. ఇది ప్రతి లీటరు నీటిలో ’సున్న’గా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.