
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల ప్రక్షాళన మొదలైంది. అరకొర వసతులు, అత్తెసరు బోధనా సిబ్బందితో నెట్టుకొస్తున్న వాటిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ఫిర్యాదుల ఆధారంగా ప్రైవేటు ఐటీఐల్లో తనిఖీలు నిర్వహించేవారు. తాజాగా రాష్ట్రంలోని ప్రతి ప్రైవేటు ఐటీఐని పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని కార్మిక, ఉపాధి కల్పన శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి జిల్లాకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రైవేటు ఐటీఐల్లోని మౌలిక వసతులు, మిషనరీ, బోధనాసిబ్బంది వంటి అంశాలను ప్రాధాన్యతాక్రమంలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 291 పారిశ్రామిక శిక్షణ సంస్థలున్నాయి. వీటిల్లో 65 ప్రభుత్వ, 226 ప్రైవేటు ఐటీఐలున్నాయి. నిర్వహణలోపాలు, వనతుల కొరత, మిషనరీ లేకుండా తరగతులు నిర్వహిస్తున్న 12 ఐటీఐలపై ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈనేపథ్యంలో ఉమ్మడి నల్లగొండలో 6, ఉమ్మడి వరంగల్‌లో ఆరింటిని తనిఖీ చేసిన అధికారులు వాటి అనుమతులు రద్దు చేయాలని కేంద్రానికి సిఫారసు చేశారు. నివేదికలు పరిశీలించిన కేంద్ర కార్మిక శిక్షణ ఉపాధి కల్పన శాఖ డైరెక్టర్ జనరల్ వరంగల్ పరిధిలోని 6 ఐటీఐల అనుమతులు రద్దు చేశారు. నల్లగొండ జిల్లా పరిధిలోని 6 ఐటీఐల అనుమతులు సైతం రద్దయ్యే అవకాశం ఉందని రాష్ట్ర కార్మిక శిక్షణ, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కేవై నాయక్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment