చుక్క చుక్కకూ లెక్క!
- ఇంటింటికీ నల్లా కనెక్షన్.. మీటర్
- పట్టణ ‘వాటర్ గ్రిడ్’లో భాగంగా ప్రతిపాదనలు
- 24 గంటల సరఫరాపై ‘నియంత్రణ’కే
- పట్టణ ‘గ్రిడ్’ పనులకు రూ. 3,038 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్‌గ్రిడ్ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌తోపాటు మీటర్‌ను సైతం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటి వినియోగంపై నియంత్రణ కోసం మీటర్లు బిగించాల్సిందేనని భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్ పనుల కోసం రూ. 3,038 కోట్ల అంచనా వ్యయంతో ‘ప్రజారోగ్య ఇం జనీరింగ్ విభాగం’ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
నీటి శుద్ధీకరణ ప్లాంట్లు, ప్రధాన పైప్‌లైన్లు, సర్వీసు రిజర్వాయర్లు, అంతర్గత సరఫరా వ్యవస్థ, ఇళ్లకు నల్లా కనెక్షన్లు, మీటర్ల కోసం ఈ మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. నల్లా మీటర్ల కొనుగోలుకే రూ. 170.32 కోట్ల నిధులు కావాలని ఈ ప్రతిపాదనల్లో కోరింది. నీటి వృథాను అరికట్టడం, వినియోగం ఆధారంగా నీటి బిల్లులు వసూలు చేసేందుకు మీటర్లు తప్పనిసరి అని అధికారులు పేర్కొంటున్నారు.
రూ. 3 వేల కోట్లతో పట్టణ ‘గ్రిడ్’
హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాల పరిధిలో ఉన్న 67 నగరాలు, పట్టణ ప్రాంతాలకు ‘వాటర్ గ్రిడ్’ కింద నీటి సరఫరా కోసం రూ.3,038 కోట్ల అంచనా వ్యయంతో వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉందని ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం తేల్చింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మూడు వేర్వేరు రకాల పనులను ప్రతిపాదించింది.
అందుబాటులో సరిపడ నీళ్లున్నా.. సరఫరా వ్యవస్థ (డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్) లేక చాలా ప్రాంతాలకు నీటి సరఫరా జరగట్లేదు. ఈ నేపథ్యం లో 10 పట్టణాల్లో నీటి సరఫరా పనుల కోసం రూ.657.43 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది.
నీటి సరఫరా నియమావళి ప్రకారం పట్టణ ప్రాం తాల్లో రోజూ ప్రతి వ్యక్తికి 135 లీటర్ల సరఫరాకు స్థానికంగా సరిపడ నీటి లభ్యత లేదు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న 24 పట్టణాల్లో రూ.717.51 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది.
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలతోపాటు కొన్ని పాత మున్సిపాలిటీల్లో ముడి నీటి సరఫరా మెయిన్ పైప్‌లైన్లు, నీటి శుద్ధీకరణ వ్యవస్థ, ఓవర్ హెడ్ ట్యాంకులు, సరఫరా వ్యవస్థ అందుబాటులో లేవు. రాష్ట్రంలోని 33 పట్టణాల్లో ఈ పనులకు రూ.1662.67 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది.
భవిష్యత్తు జనాభా అవసరాలకు..
వాటర్ గ్రిడ్ పథకం కింద 2050 నాటికి పెరగనున్న జనాభ అవసరాలను తీర్చేలా రాష్ట్రంలో నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధిపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా పట్టణ నీటి సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు మరో రూ. 2,276.09 కోట్లు అవసరమని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం సర్కారుకు సమర్పించిన నివేదికలో తెలిపింది.