పరిపుష్ట పంచాయతీరాజ్
వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పంచాయతీరాజ్ శాఖను పరిపుష్ట స్థాయికి తీసుకొచ్చామని ఆ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గత ఏడాది కాలంగా పంచాయతీరాజ్ వ్యవస్థ సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించిన వార్షిక నివేదికను బుధవారం ఆయన సచివాలయంలో విడుదల చేశారు.
రాష్ట్రంలోని మొత్తం 8,600 గ్రామాలకు గాను 2,700 గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయగలగడం రికార్డుగా మంత్రి పేర్కొన్నారు.
పుష్కలంగా ‘ఆసరా’ పింఛన్లు..
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు తెలంగాణలో 29 లక్షల మందికే పింఛన్లు ఇచ్చారని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 36 లక్షలమందికి ఆసరా పింఛన్లు అందిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో కేవలం రూ.800 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుతం రూ.4,000 కోట్లు పింఛన్ల కోసం కేటాయించామన్నారు. అలాగే.. గ్రామాల్లో రూ.5,470 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
రూ.1,800 కోట్లతో తారురోడ్ల పునరుద్ధరణ, రూ.2,200 కోట్లతో కొత్తరోడ్లు, రూ.250 కోట్లతో బ్రిడ్జీల నిర్మాణం, రూ.600 కోట్లతో మట్టిరోడ్ల నిర్మాణం.. తదితర కార్యక్రమాలను చేపట్టామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ రహదారులకు ఇరువైపులా సుమారు 36 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని కూడా గ్రామీణాభివృద్ధి విభాగం చేపట్టిందన్నారు.
ఇంటింటికీ నల్లా కనెక్షన్
వాటర్‌గ్రిడ్‌తో ఇంటింటికీ మంచినీటి నల్లా ఇచ్చి.. సీఎం ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 17 ఇంటేక్ వెల్స్ రక్షితస్థాయికి వచ్చాయన్నారు. సుమారు లక్ష కిలోమీటర్ల మేర కొత్తగా పైప్‌లైన్ వే స్తామన్నారు. తొలిదశ పనుల నిమిత్తం ఇప్పటికే రూ.15,600 కోట్లకు పరిపాలన అనుమతి ఇచ్చామని, మరో రూ.8 వేల కోట్లకు వారంలోగా అనుమతి మంజూరు చేస్తామన్నారు.
పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఈ-పంచాయత్‌ల ఏర్పాటు మినహా గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ చేరుకోగలిగామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో మురళి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.
తైవాన్‌కు కేటీఆర్
రెండు రోజుల పర్యటనకు కేటీఆర్ బుధవారం రాత్రి తైవాన్‌కు బయల్దేరి వెళ్లారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు తైవాన్‌లోని ఐ టీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ప్రతినిధులతో ఆయ న సమావేశమవుతారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇండియా-తైవాన్ బిజినెస్ కో-ఆపరేటివ్ ఫోరమ్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి పారిశ్రామిక పార్కులు సందర్శిస్తారు.