దాహం.. దాహం! | The difficulties of drinking water | Sakshi
Sakshi News home page

దాహం.. దాహం!

Published Fri, Feb 12 2016 11:23 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

దాహం.. దాహం! - Sakshi

దాహం.. దాహం!

అప్పుడే మొదలైన తాగునీటి కష్టాలు
 పట్టణ వాసులకు కలుషిత నీరే గతి
 కాలం చెల్లిన పైపులైన్లు.. లీకేజీలు
 మురుగు కాల్వల్లో కలిసి.. నీరు కలుషితం
 అవసరం ఎక్కువ.. సరఫరా తక్కువ

 
తప్పు పట్టిన పైపులైన్లు కొన్నిచోట్ల.. మురుగు కాల్వల్లోంచి వెళ్లే లైన్లు మరికొన్ని చోట్ల.. తాగునీటిని కలుషితం చేస్తున్నాయి.. ఇంకా చెప్పాలంటే పురుగులమయం చేస్తుంటే.. చాలా ప్రాంతాల్లో గంట, ముప్పావుగంట సరఫరా అవుతున్న నీరు ప్రజల గొంతు తడపలేకపోతోంది. కొండవాలు, శివారు ప్రాంతాల్లో నిత్యం నీటిగండమే. విశాఖ మహానగరంలోనే ఈ పరిస్థితి ఉంటే.. జిల్లాలోని భీమిలి, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి పట్టాణాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నర్సీపట్నంలో అయితే రోజు విడిచి రోజు నీరు అందిస్తున్నారు. వేసవి   ప్రారంభంలోనే దాహంతో అల్లాడిపోతున్న పట్టణ ప్రజల కష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ‘సాక్షి’ అందిస్తున్న సమగ్ర కథనం..
 
విశాఖపట్నం: జిల్లా జనాభా 44 లక్షలు కాగా.. ఇందులో సగానికి పైగా జనాభా విశాఖ మహానగరం(జీవీఎంసీ), నర్సీపట్నం, యలమంచలి మున్సిపాలిటీల్లోనే ఉంటున్నారు.  జీవీఎంసీ జనాభా 22.50 లక్షల పైమాటే. నగరంలో తాగునీటి డిమాండ్ రోజుకు 85 మిలియన్ల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 68 మిలియన్ల గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. నగర పరిధిలో పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన ప్రాజెక్టుల్లో ఏలేరు ప్రధానమైనది. ఆ తర్వాత రైవాడ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి, గంభీరం, గోస్తని, ముడసర్లోవ రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో నీటినిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయి. ఏలేరు నుంచి 130 ఎంజీడీల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం 60 ఎంజీడీలు మాత్రమే విశాఖకు చేరుతోంది. దిగువ మధ్యతరగతి, సామాన్య, నిరుపేదలు పూర్తిగా కుళాయిల నుంచి వచ్చే ఈ బురద నీటినే తాగుతుంటే.. ఎగువ మధ్య తరగతి.. ఉన్నతవర్గాల వారు ఆర్వో ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసే వాటర్ టిన్‌లపై ఆధారపడుతున్నారు. జిల్లాలోని పట్టణాల  వారీగా పరిస్థితి ఎలా ఉందంటే..

ప్రతిపాదనలకే పరిమితం
ఏలేరు పైపులైన్ల పనులకు రూ.1905 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అనకాపల్లి నీటి సరఫరా వ్యవస్థను రూ.85 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదన ఉంది. వేసవి నీటి నిల్వ ట్యాంకులు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద 170 ఎంజీడీల నీటిని నిల్వ ఉంచొచ్చు. పాతపైపులైన్లను మార్చాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. ఏటా నీటి ట్యాంకర్లు, పంపింగ్ మోటార్లు, పైపులైన్ల మరమ్మతుల కోసం రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నా శాశ్వత పరిష్కారం దిశగా అడుగు పడడం లేదు.
 
నర్సీపట్నం.. రోజు విడిచి రోజు
నర్సీపట్నంలో రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రెండు రోజులకోసారి ఇస్తున్నారు. ఇస్తున్న నీరు రంగు మారడంతో పాటు కుళాయిల నుంచి పురుగులు వస్తుండడంతో గుడ్డకట్టి నీటిని పట్టుకుంటున్నారు. పలు చోట్ల కుళాయిలకు హెడ్‌లు లేక నీరు వృథా అవుతోంది.    మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డుల్లో 60 వేల మంది జనాభా ఉంది. రోజుకు సగటున మనిషికి 80 లీటర్ల నీటిని అందించాల్సి ఉంది. ప్రస్తుతం 45 లీటర్ల నీటిని అందిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవంగా 30 లీటర్ల కంటే తక్కువే  ఇస్తున్నారు. దుగ్గాడ వద్ద వరహా నదిలో పంపుహౌస్ ఏర్పాటు చేసినా పెరిగిన జనాభా అవసరాలకు తగిన విధంగా తాగునీరు సరఫరా చేయటం లేదు. మరోవైపు కాలం చెల్లిన పైపులైన్లకు ఎక్కడికక్కడ లీకేజీలు ఏర్పడి తాగునీరు వృథా అవుతోంది. నిత్యం మరమ్మతులు చేసినప్పటికీ లీకేజీలను అరికట్టలేకపోతున్నారు. పైపులైన్లు మురుగు కాల్వల్లో ఉండటం వల్ల లీకేజీల ద్వారా తాగునీరు కలుషిత
 మవుతోంది.
 
యలమంచిలి.. బోప్‌వెల్స్ నీరే గతి

యలమంచలి పట్టణ శివారువాసులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రాంనగర్, వేణుగోపాలస్వామి గుడి ప్రాంతం, పాతవీధి, కాశీవాని వీధిలకు పూర్తి స్థాయిలో రక్షిత నీరు అందించేందుకు రూ.76 కోట్లతో డీపీఆర్‌కు పంపించారు. లక్ష జనాభా ఉన్న మున్సిపాల్టీలకే మంజూరు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఈ ప్రాజెక్టుపై ఆశలు ఆవిరైపోయాయి. ప్రస్తుతం ఎస్.రాయవరం మండలం సోమిదేవిపల్లి వద్ద వరహా నదిపై ఏర్పాటుచేసిన బోర్‌వెల్స్ పథకం ద్వారా యలమంచలి పట్టణానికి నీటి సరఫరా జరుగుతోంది. రోజుకు ఉదయం ఆరు నుంచి ఏడుగంటల వరకుమాత్రం ఇస్తారు. వాటర్‌ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement