ఈ ఐదుగురు చావుకు ఎవరు బాధ్యులు? | Five Sewage Workers Died In New Delhi | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 11 2018 7:23 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Five Sewage Workers Died In New Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ : వీధుల్లోని, కాలనీల్లోని, గహ సముదాయాల్లోని మురుగునీరు కాల్వలను శుభ్రం చేయడం కోసం మ్యాన్‌ హోల్లోకి దిగి అర్ధంతరంగా మరణిస్తున్నా పారిశుద్ధ్య పనివాళ్ల ప్రాణాలకు ఏ మాత్రం విలువ లేకుండా పోయింది. వీరి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ మార్గదర్శకాలను జారీ చేసి దాదాపు 16 ఏళ్లు గడుస్తున్నా వాటిని ప్రభుత్వ పాలకులుగానీ, కాంట్రాక్టర్లుగానీ పట్టించుకుంటున్న పాపన పోవడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఆదివారం రాత్రి మురుగు నీరు ట్యాంక్‌ను శుభ్రం చేయడం కోసం మ్యాన్‌ హోల్లోకి దిగి ఐదుగురు కూలీలు మరణించడం పట్ల ఢిల్లీ బీజేపీ, ఆప్‌ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయిగానీ జరిగిన ఘోరం పట్ల ఏ పార్టీ అంత చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. అయితే జరిగిన దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తానని హామీ ఇచ్చిన అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కేసులో ఓ సూపర్‌వైజర్‌ను మాత్రమే అరెస్ట్‌ చేసింది.

ఇదేమీ మారుమూల జరిగిన మామూలు దుర్ఘటన ఎంతమాత్రం కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన డీఎల్‌ఎఫ్‌ కాపిటల్‌ గ్రీన్స్‌ రెసిడెన్షియల్‌ ఫేస్‌–2 సెక్షన్‌ (మోతీ నగర్‌)లో జరిగింది. చనిపోయిన కార్మికులంతా హౌజ్‌ కీపింగ్‌ సిబ్బందిని సరఫరా చేసే జేఎల్‌ఎల్‌ సంస్థకు చెందిన వారు. వారిలో ఒక కార్మికుడు ఇంతవరకు ఒక్కసారి కూడా పారిశుద్ధ్యం పనిచేసి ఎరగడని అతని సోదరి తెలియజేసింది. మరణించిన మిగతా నలుగురి కార్మికులకు కూడా మురుగునీరును శుభ్రం చేసిన అనుభవం అంతగా లేదని కాలనీవాసులు చెబుతున్నారు. పైగా పారిశుద్ధ్యం పనిలోకి దిగే ముందు వారు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. గత ఐదేళ్ల కాలంలో ఢిల్లీలో 2,403 మంది పారిశుద్ధ్య కార్మికులు ఇలా మరణించారంటే పాలకులు, అధికారులు, కాంట్రాక్టర్లకు కార్మికుల ప్రాణాల పట్ల ఉన్న పట్టింపు ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. 

అనుసరించాల్సిన మార్గదర్శకాలు 
డ్రైనేజీ చాంబర్ల వద్ద, సెప్టిక్‌ ట్యాంకుల్లో, మాన్‌హోల్స్‌ వద్ద యాంత్రిక వెంటీ లేటర్లు ఏర్పాటు చేయాలి. 
కార్మికుల ప్రాణాలకు పూర్తి భద్రత ఉన్నట్లు వారికి సైట్‌ మేనేజర్లు కచ్చితంగా సర్టిఫికెట్‌ జారీ చేయాలి. అయినప్పటికీ ప్రమాదం సంభవించి ప్రాణాలు పోయినా, గాయపడిన వారికి పూర్తి నష్టపరిహారం సైట్‌ మేనేజర్లు, యజమానులే చెల్లించాలి. 
సుశిక్షితులైన కార్మికులను మాత్రమే ఈ పనిలోకి తీసుకోవాలి. 
వారికి భద్రత కల్పించే యూనిఫామ్, తగిన కళ్లజోళ్లు, ప్రాణవాయువు సిలిండర్లు కల్పించాలి. 
వారికి తగిన శిక్షణ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు స్థానిక మున్సిపాలిటీలు మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలి. 
శుభ్రం చేయాల్సిన ట్యాంక్‌ నుంచి విష వాయువులు వెలువడుతున్నాయా, లేదా అంశాన్ని నిర్ధారించేందుకు కచ్చితంగా ఓ నిపుణుడు పనివేళలో అక్కడే ఉండాలి. కాగితాలు అంటించి సెఫ్టిక్‌ ట్యాంకుల్లో పడేయడం ద్వారా విషవాయువులను తెలుసుకోవచ్చు. అవి త్వరగా మండుతాయి. 
థానేలోని మీరా భయాండర్‌ మున్సిపాలిటీలో ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మరణించడంతో స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ 2013, జూలైలో ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఢిల్లీలో ఆదివారం జరిగిన ప్రమాదం ఘటనలో ఇందులో ఏ ఒక్కటి పాటించలేదు. అయినప్పటికీ పోలీసు అధికారులు సూపర్‌ వైజర్‌ను మాత్రమే అరెస్ట్‌ చేశారు. ఉద్యోగులను సరఫరా చేసిన కాంట్రాక్టర్‌ను, డీఎల్‌ఎఫ్‌ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్‌ చేయాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సూచించినట్లు వారి నుంచి నష్ట పరిహారం వసూలు చేయడంతోపాటు వారిని చట్టపరంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు కూడా తీసుకరావాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement