కాలువలో నుంచి వెలికి తీసిన చిన్నారి తౌసిఫ్ మృతదేహం ,చిన్నారి తౌసిఫ్ (ఫైల్)
వాళ్లు అభం శుభం తెలియని చిన్నారులు.. ఏది ప్రమాదమో.. ఏది ప్రమాదం కాదో తెలియని పసి వయసు వారిది.తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. కడప నగరంలో ఓ నాలుగేళ్ల బాలుడు ఆడుకునేందుకు వెళ్లి డ్రైనేజీ కాలువలో శవమై తేలాడు.. పెనగలూరు మండలంలో మరో బాలుడు ఆడుకునేందుకు వెళ్లి చెరువులో పడి ప్రాణాలు వదిలాడు. ఈ రెండు సంఘటనలు మృతుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి.
కడప అర్బన్ : అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడికి నాలుగేళ్ల వయస్సులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. తన సహచర చిన్నారులతో కలిసి రెండు రోజుల క్రితం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలుడు డ్రైనేజీ కాలువలో శవమై తేలడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. కడప అర్బన్ సీఐ దారెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప సాయిపేటకు చెందిన మహబూబ్ హుసేన్, సర్తాజ్‌బేగం దంపతుల కుమారుడు షేక్ మహమ్మద్ తౌసిఫ్ హుసేన్ (4) ఈనెల 5వ తేది సాయంత్రం తన సహచర చిన్నారులతో కలిసి ఆడుకునేందుకు బయటికి వెళ్లాడు. తర్వాత కనిపించలేదు. దీంతో కంగారు పడిన తౌసిఫ్ తల్లిదండ్రులు, బంధువులు అన్నిచోట్ల వెతికి పోలీసులను ఆశ్రయించారు.
వారు ఈనెల 6వ తేదీ రాత్రి కేసు నమోదు చేశారు. తర్వాత దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం స్థానికులు డ్రైనేజీ కాలువలో ఇరుక్కుపోయిన బాలుడి మృతదేహాన్ని గమనించి బయటికి తీశారు. అప్పటికే శరీరమంతా ఉబ్బిపోయి తీవ్ర దుర్వాసనతో ఉంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. చిన్నారి తౌసిఫ్ మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకు వెళతామని, పోస్టుమార్టం అవసరం లేదని బంధువులు పోలీసులను కోరారు. అయితే కేసు నమోదు చేసిన తర్వాత బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల ని, అప్పుడే మరణానికి కారణం తెలుస్తుందని చెప్పి రిమ్స్ మార్చురీకి తరలించారు.
మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
సంఘటన గురించి తెలుసుకున్న కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా రిమ్స్ మార్చురీలో ఉన్న తౌసిఫ్ మృతదేహాన్ని సందర్శించారు. అక్కడున్న బాలుడి తల్లిదండ్రులను ఓదార్చారు. డ్రైనేజీ కాలువలో పడి మృతి చెందడం దురదృష్టకరమన్నారు. డ్రైనేజీ కాలువలో పూడికలు తీయాలని, చిన్నారులు తిరిగే ప్రాంతంలో ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తే మంచిదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment