
హత్యకు గురైన గుర్తు తెలియని మహిళ మృతదేహం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని జిల్లా కోర్టు భవనాల సముదాయం ఎదుట డ్రైనేజీలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహిళ మృతదేహాన్ని గుర్తించిన ఆటోడ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ రితిరాజ్, కరీంనగర్ టౌన్ ఏసీపీ అశోక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
మృతదేహాన్ని బయటకు తీయించి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం లభ్యమైన చోట సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఉరి వేసి హత్య చేసినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. టూటౌన్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహిళ వివరాలు తెలియకపోవడంతో ఫొటోలు, గుర్తులు సోషల్‌మీడియాలో పోస్టు చేసి ఆరా తీస్తున్నారు.
ఘటనలో ఇద్దరి పాత్ర..?
జిల్లా జడ్జి భవనం ప్రాంగణం ఎదుట గల సీసీ కెమెరాల్లో మంగళవారం వేకువజామున 5గంటల ప్రాంతంలో మృతురాలు రోడ్డుపై తిరిగినట్లు రికార్డయినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి బైక్‌పై మరోవ్యక్తిని దించి వెళ్లడం, ఆ వ్యక్తి మహిళ వద్దకు వెళ్లడం సీసీ పుటేజీల్లో నమోదైంది. దీని ఆధారంగా మహిళ మృతిలో ఇద్దరి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం కోర్టు ఎదురుగా ఉన్న దుకాణాల్లో సీసీ పుటేజీలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment