మలికిపురం/సఖినేటిపల్లి: విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్‌లో ఇద్దరు గల్లంతయ్యారు. వీరిలో యువతి మృతదేహం లభ్యం కాగా, బాలుడి ఆచూకీ తెలియ రాలేదు. ఇందుకు సంబంధించిన వివరాలివీ.. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన సాలా ఏసురాజు నూతన గృహం నిర్మించుకున్నాడు. గృహప్రవేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన 15 మంది బంధువులు శుక్రవారం అంతర్వేది సాగర సంగమం వద్దకు విహార యాత్రకు వెళ్లారు. ఎగసి పడుతున్న సాగర కెరటాలను చూసిన ఉత్సాహంలో.. ఏసురాజు కుమారుడు రాజీవ్‌కుమార్ (5) పరుగు పరుగున అక్కడకు వెళ్లాడు.
వేగంగా నీటిలో దిగడంతో ఒక్కసారిగా మునిగిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన ఏసురాజు సోదరి, పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరుకు చెందిన బెల్లపుకొండ జ్యోతి (20) ఒక్క ఉదుటన పరుగెత్తుకుని వెళ్లి, ఆ బాలుడిని రక్షించబోయింది. ఈ క్రమంలో అలల ధృతికి ఆమె కూడా సముద్రంలోకి కొట్టుకుపోయింది. కాసేపటికి జ్యోతి మృతదేహం లభ్యమైంది. బాలుని ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు.
బంధుమిత్రులందరితో కలిసి సందడిగా గృహప్రవేశం చేసుకున్నామన్న ఆనందం ఆ కుటుంబానికి ఒక్క రోజు కూడా నిలవలేదు. కన్న కొడుకు గల్లంతవ్వడం, సోదరి జ్యోతి మృతి చెందడంతో ఏసురాజు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సఖినేటిపల్లి ఎస్సై ఎస్.రాము సందర్శించారు. బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment