వృద్ధులే లక్ష్యంగా దోపిడీలు
పలు జిల్లాల్లో చోరీలు
చివరికి కటకటాలపాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వృద్ధులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ లేడీని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. దీనిపై సోమవారం రాజమహేంద్రవరంలో తూర్పు మండల ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్.భవ్యకిశోర్, అనపర్తి సీఐ శివగణేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా.. కోనసీమ జిల్లా అంగర గ్రామానికి చెందిన నడిపిల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబకు వివాహమైనా భర్తను వదిలి ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో నివాసం ఉంటోంది. గతంలో ఆమె పలు చోరీలకు పాల్పడి 16 నేరాలు చేసింది. ఇందులో 10 కేసులకు సంబంధించి జైలుశిక్ష అనుభవించి 2021లో విడుదలైంది. అయినా తన ప్రవర్తన మార్చుకోలేదు. నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతోంది.
నేరాలు చేసేది ఇలా..
తాను ముందుగా ఎంచుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తుంది. ఒంటరి వృద్ధులు నివసిస్తున్న ఇంటిని ఎంచుకుంటుంది. మర్నాడు వారి ఇంటికి వెళ్లి పేరంటమంటూ బొట్టు పెట్టి పిలుస్తుంది. సమీపంలోనే నా ఇల్లు రండంటూ ఆహ్వానించి మాట కలుపుతోంది. తాను తెచ్చిన ప్రసాదం వారికి పెట్టి స్పృహ కోల్పోయేలా చేసి వారి ఒంటిపై బంగారం దోచుకుంటుంది. ఇంకో ఘటనలో ముందుగా ఎంచుకున్న వృద్ధుల ఇంటికి వెళ్లి తాను ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చానని చెబుతోంది. పని ఉంటే చేస్తానని నమ్మబలుకుతుంది. మంచి రోజు చూసుకుని పనికి వస్తానని చెబుతుంది.
ఈ రోజు తన పిల్లవాడి పుట్టిన రోజు అని చెప్పి కేకు తినమని, లేదా జ్యూస్ తాగమని మత్తుమందు కలిపి ఇస్తుంది. అది తిన్నాక ఆ వృద్ధులు స్పృహ కోల్పోయాక వారిని నిలువు దోపిడీ చేసి పత్తా లేకుండా పోతోంది. మరో ఘటనలో.. ఒంటరి వృద్ధులను ఎంచుకుని వారికి ఆసరాగా ఉంటానని తక్కువ జీతానికే పనికి కుదురుతుంది. వారికి అన్నం వండి పెడుతున్నట్లు నటిస్తూ మత్తు మందు కలిపి ఇస్తుంది. వారి ఒంటిపై ఆభరణాలే కాకుండా ఇల్లు మొత్తం దోచుకుని పరారవుతుంది. ఇలా కాకినాడ జిల్లా కాకినాడ, పెదపూడి, గండేపల్లి, కరప, పశ్చిమ గోదావరి జిల్లా పరిధి తణుకు, తాడేపల్లిగూడెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, బిక్కవోలు, రాజానగరం, అనపర్తి ప్రాంతాల్లో వృద్ధుల వద్ద సొత్తు దోచుకుంది.
పట్టుబడింది ఇలా..
ఇటీవల అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నేరంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ నరసింహకిశోర్ పర్యవేక్షణలో డీఎస్పీ భవ్యకిశోర్ ఆధ్వర్యంలో అనపర్తి సీఐ శివగణేష్ దర్యాప్తు చేశారు. గతంలో ఇదే తరహా నేరాలు చేసిన మహిళల వివరాలు తీసుకుని వారిపై నిఘా పెట్టారు. బొమ్మూరులో నివసిస్తున్న నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ ఈ నేరాలు చేసినట్టుగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు.
ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయట పెట్టింది. ఆమె నుంచి 6 కేసులకు సంబంధించి 34 కాసుల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో 12 కేసులకు సంబంధించిన దోచుకున్న బంగారం ప్రైవేట్ బ్యాంకుల్లో కుదువ పెట్టి ఉండటంతో వాటిని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఐతో పాటు కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అనపర్తి ఎస్సై కె.రామారావు, హెచ్‌సీ కె.సురేష్, కానిస్టేబుళ్లు తమ్మారావు, తిరుమలయాదవ్, జి.వెంకటేష్, మహిళా కానిస్టేబుల్ వెంకటలక్ష్మిలను ఎస్సీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment