వరద గూ(గో)డు
తుంగభద్ర ఉగ్రరూపం ఇప్పటికీ గుర్తే. ఆ దృశ్యాలు చెరిగిపోని చేదు జ్ఞాపకాలు. తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడొస్తుంది. ఊరూవాడా కొట్టుకుపోగా.. కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబాలు కోకొల్లలు. ప్రాణమైతే మిగిలింది కానీ.. ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేందుకు పడిన కష్టం అంతాఇంతా కాదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదిగో.. ఇదిగో అంటూ సరిపెట్టింది. అత్తెసరు సాయంతో మూతి పొడిచింది. గూడు పేరిట.. మొండి గోడలతో సరిపెట్టింది. ఆ నిర్లక్ష్యం ఇప్పటికీ వరద బాధితులను వెక్కిరిస్తోంది.
కర్నూలు(రూరల్): ఐదేళ్లు గడిచినా వరద బాధితులకు గూడు కరువైంది. నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. నిర్మాణంలోని ఇళ్లను పూర్తి చేస్తామని.. తక్కినవి బాధితులే కట్టుకుంటే పరిహారం ఇస్తామనే హామీతో బాధ్యత నుంచి తప్పుకుంది. 2009లో వరదలు బీభత్సం సృష్టించగా.. ఆరు నెలల్లోపు బాధితులందరికీ పునరావాసం కల్పిస్తామని నమ్మబలికిన నేతలు ఆ తర్వాత మొహం చాటేశారు. ఇప్పుడిక కొత్త ప్రభుత్వం చుట్టూ వీరి ఆశల ‘పందిరి’ అల్లుకుంటోంది. కర్నూలు మండల పరిధిలోని సుంకేసుల, జి.శింగవరం, నిడ్జూరు, మునగాలపాడు, మామిదాలపాడు గ్రామాలను వరదలు తుడిచిపెట్టేశాయి.
సుంకేసుల గ్రామంలో పునరావాస కాలనీలో 576 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 100 పూర్తి కాగా.. మిగతా ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. కాలనీలో మంచినీటి పైపులైన్లు, అంతర్గత రోడ్ల ఊసే కరువైంది. జి.శింగవరంలో 1039 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా 692 పూర్తయ్యాయి. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంతర్గత రోడ్లు నిర్మించకపోవడం.. వీధి లైట్లు.. పైపులైన్లు ఏర్పాటు చేయకపోవడంతో వరద బాధితుల్లో ఇళ్లలో కాపురం ఉండేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అంతర్గత రోడ్లకు రూ.80 లక్షలు మంజూరైనా పనులు చేపట్టకపోవడం గమనార్హం.
నిడ్జూరుకు 966 ఇళ్లు మంజూరు కాగా 654 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 200 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా.. మిగతా ఇళ్లకు సంబంధించి ఇప్పటికీ భూ సేకరణ కూడా చేపట్టకపోవడం వరద బాధితుల దుస్థితికి నిదర్శనం. ఇక్కడా పైపులైన్లు, అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని గాలికొదిలేశారు. మామిదాలపాడులో 459 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా 2011లో ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, అప్పటి కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ భూమి పూజ చేశారు. ఆ తర్వాత 22 ఇళ్లకు మాత్రమే పునాది పడినా ఇప్పటికీ నిర్మాణం ఒక్క అడుగు కూడా కదలకపోవడం నేతల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
పైకప్పు ఏసినారంతే..
సెంటు భూమి లేదు. కూలికి పోతేనే పూట గడిచేది. 2009లో వచ్చిన వరదల్లో ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన తడికెలతో తాత్కాలికంగా గుడిసె వేసుకున్నాం. వానలకు అది కూడ కూలిపాయ. ఇప్పుడు చెట్ల కింద బతుకుతున్నాం. ఐదుగురు కూతుళ్ల పెండ్లిళ్లు సేయనీక శానా కష్టపడిన. ఇల్లు కట్టిస్తామని సెప్పిన సారోల్లు పైకప్పు ఏసి వదిలేసినారు. సిమెంట్ సేయలేదు. పేదలంటే అందరికీ లోకువే. కాలనీల ఉండలేకపోతున్నాం.- ఉసేనమ్మ, నిడ్జూరు
ఇళ్ల మధ్య కంప సెట్లు
వరదల్లో కట్టుబట్టలతో మిగిలినం. అప్పులు సేసి ఏసుకున్న రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నాం. ఇద్దరు కొడుకులున్నారు. కూలి పనికి పోతేనే పూట గడుస్తాది. మాలెక్కటోల్లకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తాదంటే సంతోషించిన. పనులైతే మొదలు పెట్టినారు కానీ సరిగ జరుగుతలేవు. కరెంటు, నీళ్లు, రోడ్లు లేక రేత్రిల్లు శానా ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్ల మధ్య కంప సెట్లు పెరిగినాయి. యా సారూ మా బాధలు పట్టించుకోల్యా. మా బతుకులింతే.- మల్లికార్జునయ్య, జి.శింగవరం