* పిల్ల కాల్వల వ్యవస్థకు బదులుగా ఏర్పాటుకు సర్కారు నిర్ణయం
* భూసేకరణను తగ్గించడం, నీటి వృథాను అరికట్టడమే లక్ష్యం
* పైప్‌లైన్ వల్ల నిర్మాణ వ్యయం కూడా బాగా తగ్గే అవకాశం
* పైలట్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21లో అమలు
* టీఎంసీ నీటిని కాల్వలతో 10 వేల ఎకరాలకు ఇవ్వొచ్చన్న అధికారులు
* పైప్‌లైన్‌తో అయితే అదేనీరు 20 వేల ఎకరాలకు సరిపోతుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్
భూసేకరణ సమస్యను తప్పించడం, నీటి వృథాను అరికట్టడమే లక్ష్యంగా.. కాల్వలకు బదులు పైప్‌లైన్లతో సాగునీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పిల్ల కాల్వల వ్యవస్థ (డిస్ట్రిబ్యూటరీలు)ను పైప్‌లైన్ల ద్వారానే ఏర్పాటు చేయనుంది. కాల్వలతో పోలిస్తే పైప్‌లైన్ నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అవకాశంతోపాటు నీటి వృథా తగ్గే అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని తొలుత పైలట్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21లో అమలు చేయనున్నారు. దీనికి సీఎం కేసీఆర్ ఇప్పటికే ఓకే చెప్పగా... పనులు మొదలు పెట్టేందుకు కాంట్రాక్టు సంస్థ సిద్ధమవుతోంది.
విస్తృత ప్రయోజనం: నిజానికి కాల్వల నిర్మాణానికి ఖర్చు ఎకరాకు రూ.25వేల వరకు ఉంటే... పైప్‌లైన్ వ్యవస్థకు రూ.23,500 వరకే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక కాల్వల ద్వారా ఒక టీఎంసీ నీటిని 10వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉండగా... పైప్‌లైన్‌తో 20వేల ఎకరాలకు అందజేయవచ్చని పేర్కొంటున్నారు. దీంతోపాటు పైప్‌లైన్ నిర్మాణానికి భూసేకరణ అవసరం తక్కువగా ఉంటుందని, అన్ని ప్రాంతాలకు సమానమైన నీటిని పంపిణీ చేసే అవకాశముంటుందని చెబుతున్నారు. నిర్వహణ ఖర్చు సైతం భారీగా తగ్గుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఇప్పటికే ఇలా పైప్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్న ఓంకారేశ్వర డ్యామ్‌ను మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు ఇంజనీర్ల బృందం పరిశీలించి... ఈ విధానం అమలుకు ఓకే చెప్పింది. పాలమూరు, డిండి, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలో ఈ పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో లక్ష్యంగా ఉన్న 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే... పిల్ల కాల్వల నిర్మాణానికే 1.5 లక్షల ఎకరాల భూమి అవసరం. దీనికి రూ.7,500కోట్ల దాకా ఖర్చవుతుంది. అదే పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అయితే రూ.6వేల కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ప్రయోజనాల దృష్ట్యానే పైప్‌లైన్ వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్యాకేజీ–21లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. రూ.1,143 కోట్ల విలువైన ఈ ప్యాకేజీలో 1.70 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. సాధారణంగా పిల్ల కాల్వల నిర్మాణం కోసం ప్రతి లక్ష ఎకరాలకు 4 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది.
ఈ లెక్కన ప్యాకేజీ–21 కోసం సుమారు 7వేల ఎకరాలు అవసరం అవుతుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం అక్కడ ఎకరానికి రూ.7లక్షల నుంచి రూ.8లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే కాల్వల కోసం భూసేకరణకే రూ.320కోట్లు అవసరం. అదే పైప్‌లైన్ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తారు. తద్వారా పైన యథావిధిగా వ్యవసాయం చేసుకునే అవకాశముంది. ఇక కాల్వల ద్వారా నీటి వృథా దాదాపు 30శాతం వరకు ఉండగా... పైప్‌లైన్‌తో వృథా అతి తక్కువ. దీంతోపాటు పైప్‌లైన్‌తో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. నిర్ణీత ఆయకట్టులో రెండో పంటకు సైతం నీరు అందించవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.
'కాళేశ్వరం'లో పైప్‌లైన్లు
Published Fri, May 13 2016 2:17 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Advertisement