పానీ పట్టు యుద్ధం! | Battle of the grip! | Sakshi
Sakshi News home page

పానీ పట్టు యుద్ధం!

Published Mon, Jun 2 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM

పానీ పట్టు యుద్ధం!

పానీ పట్టు యుద్ధం!

 పరిశుభ్రతపై అనుమానమే..
 నగర పాలక సంస్థ సరఫరా చేసే నీరు కలుషితమై వస్తోంది. నీటిలో నల్లటి నలకలు, పాచి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈద్గామిట్ట, తూకుమానుమిట్ట, శ్రీనివాసపురం, జ్ఞానమ్మతోట, కామాక్షినగర్ ప్రాంతాల్లో నీరు ఎర్రగా ఉండి వాసన వస్తోంది. నీరు కూడా దుర్వాసన కూడా వస్తున్నాయని స్థానికులు తెలిపారు. అదేవిధంగా మన్సూర్‌నగర్, వాకర్స్‌రోడ్డు ప్రాంతాల్లో పైప్‌లైన్లకు లీకులున్నాయి. లీకుల ద్వారా వ్యర్ధాలన్నీ పైప్‌లైన్లలోకి చేరుతున్నాయి.కోటమిట్ట ప్రాంతంలో పదిహేను రోజులుగా నీరు నల్లగా వస్తోంది. సుమారు అరగంట పాటు నల్లగా వ చ్చి తర్వాత మామూలుగా వస్తాయని స్థానికులు తెలిపారు.
 
 సీఆర్‌పీ డొంకలో కుళాయిల్లో కలుషిత నీరు వస్తోంది. దీంతో కుళాయిలకు వస్త్రాన్ని చుట్టేసి నీటిని పట్టుకుంటున్నారు. అప్రమత్తంగా లేకపోతే బిందెల్లోకి అపరిశుభ్రమైన నీరు రావడం ఖాయం.
 
 హరనాథపురం ప్రాంతంలో కూడా తాగునీరు కలుషితమవుతోంది. పైప్‌లైన్లలో వ్యర్థాలు కొట్టుకుని వస్తున్నాయి. స్కవర్‌వాల్వ్‌లు తిప్పకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటున్నట్లు సమాచారం. రెండు రోజులకోసారి స్కవర్‌వాల్వ్‌లు తిప్పుతుంటే వ్యర్ధాలన్నీ బయటకు కొట్టుకుపోయి పైప్‌లైన్లన్నీ శుభ్రమవుతుంటాయి. స్కవర్‌వాల్వ్‌ల గురించి పట్టించుకోకపోవడంతో కలుషిత నీరు వస్తున్నట్లు తెలిసింది.
 
 నెల్లూరు(అర్బన్), న్యూస్‌లైన్: నగరంలో జనరల్ కుళాయి కనెక్షన్లు 24,538, బీపీఎల్ కుళాయి కనెక్షన్లు 9759, మీటర్ కనెక్షన్లు 637, ఓవైటీ 3446 కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలి. అయితే అనేక ప్రాంతాల్లో తాగునీరు సక్రమంగా సరఫరా కావడంలేదు. నీరు 20నిమిషాల కన్నా ఎక్కువగా కుళాయిల నుంచి రావు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలో ఉన్న బోర్లు, క్యాన్లను కొనుగోలు చేసి నీటిని ఉపయోగించుకుంటున్నారు. అయితే పెన్నకు అవతల ప్రాంతాలైన వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డి కాలనీ ప్రాంతాలకు తాగునీటి ఎద్దడి ముంచుకొచ్చింది. ఆ ప్రాంతంలో బోర్లు, బావులు ఎండిపోవడంతో ప్రజలకు మున్సిపాలిటీ సరఫరా చేసే నీరే దిక్కవుతోంది. అయితే ఇక్కడ కుళాయిల్లో రెండు, మూడురోజులకోసారి కూడా నీరు రావడంలేదు. నగర పాలక సంస్థ ఈ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తోంది. ఈ నీరు అందరికీ చేరడంలేదు. కండబలమున్న వారి ఇళ్ల వద్దే ట్యాంకరు నిలుపుతున్నారు. దీంతో అందరికీ సక్రమంగా నీరు అందడంలేదు. కొన్ని ప్రాంతాలకు అసలు ట్యాంకర్లు కూడా పోవడంలేదు. ఉదాహరణకు సీపీఎం కార్యాలయం వెనుక ఉన్న కింది ప్రాంతానికి నీరే చేరడంలేదు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న పేదలు కుళాయి నీటి మీదనే ఆధారపడి ఉన్నారు. ఈ నీరు రెండు, మూడురోజులకు కూడా రావు. వచ్చినా ఐదారు బిందెలు పట్టేసరికి ఆగిపోతాయి. ఇక వీరి బాధలు వర్ణనాతీతం.
 
 బిందెలు తీసుకుని రైల్వేట్రాక్ అవతల వైపునకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. రైల్వేట్రాక్ అవతల వైపు నుంచి నీరు తెచ్చుకోవడం వీరికి ప్రాణాంతకమవుతోంది. ఇస్లాంపేట ప్రాంతంలో నీటికోసం ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆటోల్లో డ్రమ్ములు, క్యాన్లు వేసుకుని ఇనమడుగు సెంటరుకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. తమకు నీటి నిల్వలు తగ్గిపోతాయని, ఇక్కడికి రావద్దంటూ ఆ ప్రాంత వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఇస్లాంపేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి నీరు సరఫరా చేసేందుకు మూడు ట్యాంకర్లు కేటాయించారు. అయితే ఆ నీరు సరిపోవడంలేదు.
 
 ప్రజలు ఒక్కసారిగా వచ్చి బిందెలుతో ట్యాంకరు చుట్టూ మూగుతుండటంతో సిబ్బందికి ఇబ్బందులు తప్పడంలేదు. ఈ క్రమంలో తరచూ వివాదాలు రేగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పబ్లిక్‌హెల్త్ విభాగం పైప్‌లైన్ పనుల్లో జాప్యం ఈ ప్రాంత వాసులకు శాపంలా మారింది. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో పైప్‌లైన్లకు చిన్నచిన్న మరమ్మతులు చేస్తే నీటికోసం ఇక్కట్లు తగ్గుతాయి. అయితే అధికారులు దీనిపై దృష్టి సారించడంలేదు. మరోవైపు నగరంలోని పలు ట్యాంకుల్లో పైకప్పులు ధ్వంసమయ్యాయి. దీంతో కోతులు స్వైర విహారం చేస్తూ నీటిని కలుషితం చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement